వయసు పెరుగుతున్నకొద్దీ సెక్స్ కోరికలు ఎవరిలో పెరుగుతాయి? దీనికి ఎలాంటి పరిస్థితులు కావాలి.....

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, లౌరా ప్లిట్
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
మీరు ఇప్పుడే ఎంత నవ్వగలరో అంతా నవ్వండి. భవిష్యత్తులో మీరు కూడా ఓ అనివార్యతలో చిక్కుకుంటారు.
ఆ అనివార్యతే వృద్ధాప్యం.
వయసు మళ్ళిన కొద్దీ మీ ముఖంలో మార్పులొస్తాయి. కళ్ళు, పెదాల చుట్టూ సన్నపాటి ముడతలు ఏర్పడతాయి. తరువాత ఆ ముడతలు చాలా మందంగా స్పష్టంగా కంటికి కనిపించేలా మారతాయి. కొన్నిచోట్ల వెంట్రుకలు పెరిగి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. అక్కడక్కడ ఒకటో అరో మొలిచిన తెల్లవెంట్రుకలు మీ మనో ధైర్యాన్ని దెబ్బతీస్తుంటాయి.
వృద్ధాప్యానికి స్వాగతం..
సమాజంలో యవ్వనానికి ఆదరణ ఎక్కువ. ఇక, 35, 40 సంవత్సరాలు దాటారంటే అదో పెద్ద నేరమైపోయినట్టే.
‘‘వృద్ధాప్యం ఓ అనివార్య వయో ప్రక్రియ. అయితే సమాజంలో వృద్ధాప్యంపై అనేక వివక్షలు ఉన్నాయి. దీనికి సంబంధించిన తప్పుడు భావనలను చాలామంది త్వరగా అంగీకరించేస్తుంటారు’’ అని లండన్‌లోని సెంటర్ ఫర్ ఏజింగ్ బెటర్ అనే ఎన్జీఓలో డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ రీసెర్చ్ గా ఉన్న జెమ్మా మౌలాండ్ చెప్పారు.
"నిజానికి , వృద్ధాప్యాన్ని సుసంపన్నం చేసే ప్రక్రియగా చూడాలి , కొత్త అభిరుచులు ఆసక్తులను పెంపొందించుకోవడానికి, కొత్త సాహసాన్ని ప్రారంభించడానికి లేదా మీ సొంత కమ్యూనిటీకి దోహదపడటానికి కొత్త అవకాశాలను ఇది సృష్టిస్తుంది’’ అంటారు జెమ్మా మౌలాండ్.
వయసును మనం ఒక సూచికగా పరిగణించాలి. మన చరమాంకాన్ని మనమెక్కడ జీవించాలి, మన ఆర్థిక సామాజిక స్థితిగతులు, మన జాతి ఇత్యాదివి ప్రభావితం చేస్తాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వృద్ధాప్యంపై దిగులెందుకు?
50 ఏళ్లు దాటిన వ్యక్తిగా, వృద్ధాప్యానికి సంబంధించిన దిగులును పూర్తిగా పాతబడిన ఆలోచనగానూ, కాలదోషం పట్టినదిగా గట్టిగా చెప్పగలను.
ప్రకృతి తెలివైనదని నేనూ నమ్ముతున్నాను. ముడతలు పెరిగితే వాటిని తీక్షణంగా చూడటం తగ్గించండి. బరువు పెరిగారా, మీ బట్టలు టైట్ అవుతున్నాయా,. ఇలాంటి విషయాలు పట్టించుకోకండి.
మీ శరీరాకృతి ఎలా మారింది, మీరెలాంటి బట్టలు వేసుకుంటున్నారనే విషయాలలో ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని క్రమంగా మీరూ పట్టించుకోవడం మానేస్తారు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతుంది.
ఇవే కాదు, వయసుతోపాటు ఇతర అంశాలు కూడా మెరుగుపడతాయి. కొన్ని అంశాలు అనుకున్నంతగా క్షీణించవు. కొన్ని నైపుణ్యాలు యౌవనంలోకంటే వృద్ధాప్యంలో ఉత్తమంగా మారతాయి. 20లలో, 30లలో సాధించలేని నైపుణ్యాలు వయసు పెరిగాకా మెరుగవుతాయి.
2020లో జరిగిన ఓ అధ్యయనం మేరకు మహిళలకు 40 నుంచి 44 ఏళ్ళ మధ్యన, పురుషులకు 45 నుంచి 49 ఏళ్ళ మధ్యన వారి నైపుణ్యాలు ఉత్తమంగా ఉంటాయి.
గతంలో 20 ఏళ్ళ వయసులో మెదడు పూర్తిస్థాయిలో పనిచేస్తుందని, మధ్యవయసులో స్థిరంగా ఉంటుందని, ఆ తరువాత క్రమంగా క్షీణిస్తుందని భావించేవారు.
కానీ ఇప్పుడు మెదడులో మార్పులనేవి మన జీవితాంతం జరుగుతూనే ఉంటాయని తెలుస్తోంది. వయసుతోపాటు గుర్తుపట్టడానికి సంబంధించిన ప్రక్రియలలో మార్పులు వస్తాయి. మెదడులో తాత్కాలికంగా సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే అంశాలు మెరుగుపడతాయి.
మెదడు పనితీరుకు సంబంధించి రెండు కీలక అంశాలు వయసుతో పాటు మెరుగుపడతాయని ఓ అధ్యయనం తెలిపింది. అమెరికాలోని జార్జిటౌన్ యూనివర్సిటీలో న్యూరోసైన్సు విభాగంలో ప్రొఫెసర్‌గానూ, బ్రెయిన్ అండ్ లాంగ్వేజ్ డైరక్టర్‌గానూ పనిచేస్తున్న మైకేల్ టీ. ఉల్‌మాన్, పోర్చుగల్‌లోని లిస్బన్‌లోని యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ హ్యుమనిటీస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జోయోవెరిస్మో ఈ అధ్యయనాన్ని చేశారు.
వీటిల్లో ఒకటి ఓరియంటింగ్‌గా పిలిచే ఏకాగ్రత. ఇది మెదడు వనరులను ఒక నిర్దిష్ట ప్రదేశానికి మార్చడం మరొకటి ఎగ్జిక్యూటివ్ ఇన్హిబిషన్ , ఇది అపసవ్య లేదా విరుద్ధమైన సమాచారాన్ని నిరోధిస్తుంది. ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టేలా చేస్తుంది.
‘‘ఏదైతే క్షీణిస్తోందనుకుంటున్నామో అది మెరుగుపడిందని మేం చెపుతున్నాము’’ అని ఉల్‌మాన్ బీబీసీకి చెప్పారు. దీంతోపాటు భాషా జ్ఞానం, భావోద్వేగాల నియంత్రణ మెరుగవుతాయి. ఇవ్వన్నీ అనుభవంతో వస్తాయి’’ అంటారీ పరిశోధకులు .
ఉల్ మాన్ తన సొంత అనుభవాలనే వివరించారు. ‘‘నాకు 61 సంవత్సరాలు. క్లిష్టమైన విషయాలలో చాలా మెరుగుపడుతున్నాను. శాస్త్రీయ పత్రాలు రాయడంతోపాటు పరిశోధనలు కూడా చేయగలుగుతున్నాను. పది పదేహేనేళ్ళలో నేను ఈ విషయంలో కీలకదశకు చేరుకోగలను అనుకుంటున్నాను. ఐదేళ్ళ కిందటితో పోల్చుకున్నప్పుడు ఇప్పుడీ పనులన్నీ నెమ్మదిగా అవుతున్నా మెరుగ్గా ఉన్నాయి’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అలర్జీలూ తగ్గుతాయా?
సాధారణంగా వయసు పెరుగతున్న కొద్దీ శక్తి కూడా తగ్గుతుంది. మన శరీరంలో కొన్ని తెల్ల రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. కానీ వాటి సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
మన మెదడులోని జ్ఞాపకశక్తికి సమానమైన రీతిలో పనిచేసే రోగనిరోధక వ్యవస్థ జ్ఞాపకశక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి.
“మొదటిసారి మన శరీరం ఒక నిర్దిష్ట రకమైన ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొన్నప్పుడు, అది జబ్బుగా మారుతుంది. కానీ ఇదే ఇన్ఫెక్షన్ పదేపదే వస్తే దానిని ఎదుర్కోవడంలో శరీరం సమర్థవంతంగా తయారవుతుంది. దీంతో ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని ప్రభావం చాలా స్వల్పంగా ఉండేలా మన రోగనిరోధక వ్యవస్థ తయారవుతుంది’’ అని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలోని రెస్పిరేటరీ మెడిసిన్ ప్రొఫెసర్ జాన్ ఉపామ్ బీబీసీకి వివరించారు.
"రోగనిరోధక జ్ఞాపకశక్తి జీవితం తొలినాళ్లలో సరిగ్గా ఉండదు. "ఇది బాల్యం, యుక్తవయస్సు మధ్యవయస్సు అంతటా మెరుగ్గా ఉంటుంది. బహుశా 60, 70ల ప్రారంభం వరకు ఇది బాగా పని చేస్తూనే ఉంటుంది" అని ఆయన చెప్పారు.
60 లేదా 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు పిల్లల కంటే తక్కువ అలర్జీని కలిగి ఉంటారని ఉపమ్ తెలిపారు.
‘‘వృద్ధులకు కొత్త అలర్జీలు రావు. లేదంటే ఉన్నవి పోతాయి. లేదా బాగా తగ్గిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థ బలంగా స్పందించకపోవడమే దీనికి కారణం కావచ్చు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆనందం లెక్కలేంటి?
సంతోషాన్ని లెక్కించడం చాలా కష్టమైన పని. కానీ దీనిని కనిపెట్టడానికి 90వ దశకం నుంచే సైన్స్ ప్రయత్నిస్తూనే ఉంది.
సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం మొదలైన అంశాలు జీవితాన్ని ఆస్వాదించగల మన సామర్థ్యాన్నిప్రభావితం చేయవచ్చు. అయితే ఇటువంటి కారణాలు, లేదా జనంతో సంబంధం లేకుండా సంతోషానికి ఓ నమూనా ఉందని, అది U-ఆకారంలో ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
దీని ప్రకారం ప్రజలు యుక్తవయస్సులోకి సంతోషంగా ప్రవేశిస్తారు, వయసు పెరుగుతున్న కొద్దీ సంతోషమనే భావన క్షీణిస్తుంది ( మధ్య వయసు సంక్షోభం గురించి తెలుసు కదా) ఆపై మళ్లీ 70 ఏళ్ల నుంచి సంతోషం అనే భావన ఎక్కువవడం మొదలవుతుంది.
యూకేలోని వార్విక్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్తలు ఆండ్రూ ఓస్వాల్డ్ అమెరికాలోని డార్ట్‌మౌత్ కాలేజీకి చెందిన డేవిడ్ బ్లాంచ్‌ఫ్లవర్ పశ్చిమ ఐరోపాలోని ఐదులక్షల మంది నుంచి సేకరించిన డేటాను ఉపయోగించి సంతోషం నమూనాను పరిశీలించారు. మధ్యవయస్సులో దీని క్షీణతను గమనించారు.
తరువాత ఆసియా, దక్షిణ అమెరికా తూర్పు ఐరోపాలో సేకరించిన సమాచారం, అలాగే 72 అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో సర్వేలు, అదే నమూనాను నిర్ధరించాయి.
వయసు పెరిగే కొద్దీ జీవితాన్ని ఆస్వాదించే సామర్థ్యం తిరిగి ఎందుకు పెరుగుతుంది?యువతరం కంటే వృద్ధులు ఎందుకు సంతోషంగా లేదా సానుకూలంగా ఉన్నారో అనేక సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వవిద్యాలయంలో సామాజిక వృద్ధాప్య శాస్త్రవేత్త డానా రోసెన్‌ఫెల్డ్, “వృద్ధుల కంటే యువకులు ఎక్కువ ఒత్తిడితో కూడిన సంఘటనలకు గురవుతారు” (వేతనాల్లో తగ్గింపులు లేదా నిరుద్యోగం). వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధులు సానుకూల సమాచారంపై దృష్టిపెట్టడం పెరుగుతుంది. భావోద్వేగాలను నియంత్రించడంలో మెరుగ్గా ఉంటారు" అని ఆయన చెప్పారు.
తాము కాటికి కాళ్ళు చాచామని వృద్ధులకు తెలుసుగనక ఉన్న కొద్ది సమయంలో మెరుగ్గా జీవించడం నేర్చుకుంటారని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్ లారా కార్ల్‌స్టెన్ తెలిపారు. అందుకే వృద్ధులు ముఖ్యమైన వాటిపైనే దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలను పెద్దగా పట్టించుకోరని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వృద్ధులలో లైంగికాస్వాదనకు కారణమేంటి?
చాలామంది ఊహించిన దానికి విరుద్ధంగా, వృద్ధులకు లైంగిక సంతృప్తి ఎక్కువగా ఉంటుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉదాహరణకు అమెరికాలో వృద్ధ స్త్రీలలో లైంగిక కార్యకలాపాలు, సంతృప్తిపై జరిపిన ఒక అధ్యయనంలో, 80 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో సగం మంది ప్రతిసారీ, లేదా ఎక్కువసార్లు సంభోగం సమయంలో భావప్రాప్తి పొందుతున్నట్టు తేలింది.
వయస్సుతో పాటు సెక్స్ ఆహ్లాదకరంగా ఎందుకు మారుతుంది?
వృద్ధాప్యంలో లైంగికాసక్తులు కలగడానికి ఓ ప్రధాన కారణం. వారికి బోలెడు ఖాళీ సమయం ఉండటం, ఒత్తిడికి గురయ్యే పనులు లేకపోవడం కారణాలని వృద్ధుల లైంగికత విషయంలో విస్తృతమైన అనుభవం ఉన్న థెరపిస్టు, సామాజిక కార్యకర్త నటాలీ విల్టన్ చెప్పారు. ..
‘‘మీరు నడివయస్కుల గురించి ఆలోచిస్తే వారికి పిల్లలు, ఉద్యోగం, తల్లిదండ్రులను చూసుకోవడం ఇలా చాలా పనులతో బిజీగా ఉంటారు. ఇవేవీ వృద్ధులకు ఉండవు. దీంతో వయసుతోపాటు సెక్స్ కు కూడా అవకాశం పెరుగుతుంది’’ అని తెలిపారు.
అయితే ఇది కేవలం వృద్ధాప్యంలోకి రావడం వల్ల జరిగే మ్యాజిక్ కాదు.
లైంగిక సంతృప్తి అనేది, మీరు దానిపట్ల కలిగే ఉండే వైఖరిని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు 50, 60 లేదా 70 ఏళ్లకు చేరుకునే ముందు మీ లైంగిక జీవితం బాగా లేకుంటే, అది అకస్మాత్తుగా మెరుగుపడదు" అని ఆయన స్పష్టం చేశారు.
వృద్ధాప్యమనేది దీర్ఘకాలిక వ్యాధులు, ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో యోని క్షీణత, పురుషులలో అంగస్తంభన సమస్యలను తెచ్చిపెడుతుందనేది నిజమే అయినప్పటికీ , ఇవి అధిగమించగల ఇబ్బందులని విల్టన్ లాసిన్ అంటారు.
“అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు వాడే మందులు మీ లైంగిక జీవితంపై ఏవైనా దుష్ప్రభావాలు కలిగి ఉన్నాయా లేదా అని విశ్లేషించడానికి మీ భాగస్వామితోనూ, మీకు మందులు ఇస్తున్న ఆరోగ్య నిపుణులతోనూ ఎటువంటి అరమరికలు లేకుండా మాట్లాడటం మంచిది’’ అని విల్టన్ చెప్పారు.
ఉద్రేకం, ఆనందాన్ని పెంచడానికి పని చేసే అనేక నిరూపితమైన వ్యూహాలు (లూబ్రికెంట్ ఉపయోగించడం నుండి సెక్స్ టాయ్స్ వరకు) ఉన్నాయని లాసిన్ చెప్పారు.
లైంగిక సంతృప్తి అనేది ఎన్నిసార్లు సెక్సులో పాల్గొన్నారు, ఎంతసేపు సెక్స్ చేస్తారనే విషయాలు పరస్పర సంబంధం కలిగి ఉండవు. మీ శరీరంతో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, మీ భాగస్వామితో ఎలా కనెక్ట్ అవ్వాలని ఎంచుకునే మార్గంపైనే ఈ సంతృప్తి ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ..మీ తలపై మొదటి తెల్ల వెంట్రుక కనిపిస్తున్నా, బంధువులు, స్నేహితుల పుట్టిన రోజు తేదీలు ఇప్పటికే మీరు మరిచిపోతుంటే, నిరాశ చెందకండి. ఈ కొత్త దశను అంగీకరించండి. వృద్ధాప్యంలో చక్కని జీవితాన్ని గడపండి.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభలో హైటెన్షన్.. సభలోకి దూకిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు, భద్రతపై వెల్లువెత్తిన విమర్శలు
- చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మానవులను సృష్టించే దారుణ ప్రయోగం.... దీన్ని ఎవరు, ఎలా చేశారు?
- మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి..
- ఓషో: కట్టుబాట్లు లేని సెక్స్‌తోపాటు రజనీష్ ఆశ్రమంలో ఇంకా ఏం జరిగేది?
- హాదియా: ఏడేళ్ళ కిందటి ‘లవ్ జిహాద్’ కేసుపై మళ్ళీ ఎందుకు చర్చ జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














