కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?

కరోనావైరస్ పరీక్షలు

ఫొటో సోర్స్, ANI

కేరళలో కరోనావైరస్ కొత్త సబ్ వేరియంట్ (జేఎన్1) వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీంతో కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి పాటించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తూ, సోమవారం తాజా మార్గదర్శకాలు జారీచేసింది.

పండుగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇన్ ఫ్లుయేంజా తరహా కేసులను జిల్లాల స్థాయిలోనే నమోదు చేసి, వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని, వేరియంట్ తెలుసునేందుకు జీనోమ్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొత్త కేసులపై నిఘా ఉంచాలని సూచించింది.

కరోనా కొత్త వేరియంట్

ఫొటో సోర్స్, GETTY IMAGES

కేరళలో కోవిడ్-19 సబ్‌వేరియంట్ అయిన జేఎన్.1 బయటపడిన తరువాత కేసులు పెరగడం మొదలైంది. ఇంతకుముందు ఈ వేరియంట్‌ను అమెరికా, చైనా సహా అనేక దేశాలలో కనుగొన్నారు.

జెఎన్.1ను ఎదుర్కోవడానికి కోవిడ్‌కు అనుమతించిన అన్నిరకాల వ్యాక్సిన్‌లు వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రస్తుతం కేరళళో 1,324 కోవిడ్ 19 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో నలుగురు మరణించారు. అయితే పరీక్షలు ఎక్కువగా చేస్తుండటం వలన ఇన్ని కేసులు బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ కేసులలో ఎంత మంది జెఎన్.1 బారిన పడ్డారనేది స్పష్టంగా తెలియడం లేదు. వైరస్‌లోని వివిధ రకాల వేరియంట్‌లను తెలుసుకోవడానికి పరిమిత సంఖ్యలో మాత్రమే జీనోమ్ సీక్వెన్స్ చేపడుతున్నారు.

‘‘భయపడాల్సిన పనేమీ లేదు, పరిస్థితి అదుపులోనే ఉంది’’ అని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు.

ఈ నెల మొదట్లో జెఎన్.1 సబ్ వేరియంట్‌ను ఓ ఆర్టీపీసీఆర్ పరీక్షలో కనుగొన్నట్టు అధికారులు తెలిపారు.

భారత్‌లో కోవిడ్ 19ను గమనిస్తున్న లాబోరేటరీల నెట్‌వర్క్ ఐఎన్ఏసీఓజీ తన సాధారణ పరీక్షల్లో భాగంగా ఈ వైరస్ సబ్ వేరియంట్‌ను కనుగొన్నట్టు వారు చెప్పారు.

తిరువనంతపురంలోని కారాకుళంలో 79 ఏళ్ళ వృద్ధురాలి నుంచి సేకరించిన ఆర్టీపీసీఆర్ నమూనా నుంచి డిసెంబరు 8న ఈ నమూనాలోని జెఎన్1 సబ్‌వేరియంట్‌ను పై నెట్‌వర్క్ కనుగొంది. ఈమెకు నవంబర్ 18న జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చింది. ఆమె స్వల్పంగా ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్య (ఐఐఎల్) లక్షణాలతో బాధపడుతున్నారు. తరువాత ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నారు.

దేశంలోని ఇంతర ప్రాంతాలలోనూ ఈ వేరియంట్ ఉన్నట్టు వీణా జార్జి చెప్పారు.

‘కొన్ని నెలల కిందట సింగపూర్ విమానాశ్రయంలో జరిపిన స్క్రీనింగ్ లో కొంత మంది భారతీయులలో ఈ వేరియంట్ ఉన్నట్టు బయటపడింది’’ అని ఆమె విలేఖరులకు తెలిపారు.

పెరుగుతున్న కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు కేరళ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు చెప్పాయి.

కోవిడ్ కేసులు హఠాత్తుగా పెరిగితే ఎదుర్కోవడానికి తగినంత సన్నద్ధంగా ఉండే విషయంపై భారత ఆరోగ్యశాఖ వివిధ ఆస్పత్రులలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఈ మాక్ డ్రిల్ జెఎన్.1 సబ్ వేరియంట్ కోసమా, కాదా అనే విషయం అధికారులు చెప్పడంలేదు.

కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కూడా గమనించింది.

‘‘గడిచిన కొన్నివారాలుగా కేరళలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా తరహా లక్షణాలతో బాధపడుతున్నవారికి పరీక్షలు చేయగా ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి’’ ఐసీఎంఆర్ డైరెక్టర్ రాజీవ్ భల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)