మాస్టర్‌మైండ్ లలిత్ ఝా: పిల్లలకు పాఠాలు చెప్పే ఈయన పార్లమెంట్‌‌లో అలజడికి ఎందుకు ప్రయత్నించారు?

లలిత్ ఝా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లలిత్ ఝా

పార్లమెంట్ లోపల, పరిసర ప్రాంతాల్లో పొగగొట్టాలతో నలుగురు నిరసనకారులు బుధవారం కలకలం సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపిన ఈ ఘటనకు మాస్టర్‌మైండ్‌గా లలిత్ ఝాను పేర్కొంటున్నారు.

లలిత్ ఝా తనకు తానుగా గురువారం పోలీసు స్టేషన్‌కు వెళ్లి, లొంగిపోయారు. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఆరో వ్యక్తి లలిత్ ఝా. ఇప్పటి వరకు ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్లమెంట్‌లో బుధవారం జీరో అవర్ జరుగుతున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి హాల్‌లోకి దూకారు. చిన్న క్యానిస్టర్ నుంచి పసుపు రంగు పొగ వదులుతూ అలజడి రేపారు. దీంతో పాటు వారు నినాదాలు కూడా చేశారు.

పార్లమెంట్ లోపల ఈ ఘటన జరుగుతున్నప్పుడు.. బయట కూడా ఇదే రకమైన పరిస్థితి తలెత్తింది. అమోల్ షిండే, నీలమ్ అనే ఇద్దరు నిరసనకారులు పార్లమెంట్ వెలుపల పసుపు రంగు పొగను వదులుతూ.. ‘‘నిరంకుశత్వం నశించాలి’’ అనే నినాదాలు చేశారు.

ఈ నలుగురు వ్యక్తుల్ని ఘటనా ప్రదేశంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఈ కుట్ర వెనుకున్న మాస్టర్‌మైండ్‌ లలిత్ ఝాను మాత్రం గురువారం రాత్రి లొంగిపోయారు.

ఎన్‌డీటీవీ రిపోర్టు ప్రకారం.. 32 ఏళ్ల లలిత్ ఝా బిహార్‌కు చెందిన వ్యక్తి. కానీ, ఈయన కోల్‌కతాలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

స్వాతంత్య్ర ఉద్యమకారుడు భగత్ సింగ్ నుంచి లలిత్ ఝా స్ఫూర్తి పొందారని పోలీసులు చెప్పారు.

ఒక ఎన్‌జీఓకు చెందిన నీలాక్ష్ ఆయిచ్ అనే వ్యక్తితో ఝాకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది.

బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసనకారులు పసుపు రంగు పొగను వదిలిన ఘటనను వీడియో తీసిన లలిత్ ఝా, దాన్ని ఆ ఎన్‌జీఓ ఫౌండర్ నీలాక్ష్‌కు పంపారు. ‘‘వారు సేఫ్’’ అనే మెసేజ్‌ను కూడా వీడియోకు జత చేశారు.

వీడియో క్యాప్షన్, లలిత్ ఝా: పిల్లలకు పాఠాలు చెప్పే ఈయన పార్లమెంట్‌‌లో అలజడికి ఎందుకు ప్రయత్నించారు?

‘ఆయన ప్రశాంతంగా ఉండే వ్యక్తి ’

లలిత్ ఝా గురించి వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన చుట్టుపక్కల వారు.. కోల్‌కతాలోని బారాబజార్‌లో లలిత్ ఝా స్థానిక పిల్లలకు పాఠాలు బోధించేవారని చెప్పారు.

‘‘లలిత్ ఝా ఎప్పుడూ కూల్‌గా ఉండేవారు. తన పనేదో తను చూసుకునే వాడు. రెండేళ్ల క్రితమే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు’’ అని చుట్టుపక్కల వారు తెలిపారు.

‘‘ఆయన ఉపాధ్యాయుడిగా మాకు తెలుసు. కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. ఒకరే ఉంటూ పాఠాలు చెప్పేవారు. ఎప్పుడో ఒకసారి ఇతరులతో మాట్లాడేవారు’’ అని మరో వ్యక్తి చెప్పారు.

‘‘టీ తాగేందుకు కొన్నిసార్లు నా షాపుకు వచ్చేవారు. ఆయన గురించి పెద్దగా ఎవరికీ చెప్పేవారు కాదు. ఒకరోజు అకస్మాత్తుగా ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాలేదు’’ అని మరో వ్యక్తి తెలిపారు.

లలిత్ ఝా తండ్రి ఈ ప్రాంతంలో వాచ్‌మ్యాన్‌గా పనిచేసేవారని స్థానికుడొకరు వార్తా సంస్థ పీటీఐకు తెలిపారు.

నిందితులు

ఫొటో సోర్స్, ANI

లొంగిపోవడానికి ముందే ఆధారాలను నాశనం చేశారు

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు చేసిన కథనం ప్రకారం.. గురువారం లొంగిపోవడానికి ముందు ఈ కేసులో ఆధారాలు అవుతాయనుకున్న వాటిని లలిత్ ఝా ధ్వంసం చేశారు.

పార్లమెంట్ భవనం వద్ద నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో లలిత్ ఝా అక్కడే ఉన్నారు. కానీ, వారికి చిక్కకుండా తప్పించుకున్నారు.

‘‘అర్థరాత్రి సుమారు 11.30 ప్రాంతంలో బస్సులో రాజస్థాన్‌లోని కుచమన్ నగరానికి వెళ్లారు. అక్కడే తన సన్నిహితుడు మహేష్‌ను కలిశారు. మహేష్ కూడా ఈ ఘటనలో పాలుపంచుకోవాలనుకున్నారు. కానీ, తల్లి ఆపడంతో మహేష్ వెళ్లలేదు. మహేష్ ‘భగత్ సింగ్ ఫ్యాన్ పేజీ’తో లలిత్ ఝా, ఇతరులు కూడా కనెక్ట్ అయ్యారు’’ అని పోలీసు వర్గాలు చెప్పినట్లు వార్తా పత్రిక రాసింది.

‘‘మహేష్, ఆయన కజిన్ కైలాష్ కలిసి లలిత్ ఝాను ఒక దాబాకు తీసుకెళ్లారు. దాబా యజమాని నుంచి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. దాబా యజమానికి మహేష్ తెలుసు. అలా గది అద్దెకు దొరికింది’’ అని విచారణలో తేలినట్లు తెలిసింది.

ఆ తర్వాత మహేష్, లలిత్ ఝాలు కైలాష్‌ను అక్కడే వదిలేసి లొంగిపోయేందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

తరువాత కైలాష్ ఫోన్ నెంబరును గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా లలిత్, మహేష్ జైపూరుకు బస్సులో వెళుతున్నారని, అక్కడి నుంచి దిల్లీకి వెళతారని తెలుసుకున్నారు.

దీని తరువాత పోలీసులు అనేక ప్రాంతాలలో దాడులు చేశారు. చివరకు లలిత్, మహేష్‌లు కర్తవ్యపథ్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

పటియాలా హౌస్ కోర్టుకు నిందితులు

ఫొటో సోర్స్, ANI

కోర్టులో ఏం జరిగింది?

చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద ఈ ఘటనలో పాలుపంచుకున్న వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పటియాలా హౌస్ కోర్టు గురువారం ఈ నిందితులను ఏడు రోజులు పోలీసు కస్టడీకి పంపింది.

పోలీసు కస్టడీకి వారిని అప్పజెప్పే ముందు....నిందితులకు ఒక న్యాయవాదిని కేటాయించినట్లు ది హిందూ కథనం నివేదించింది. ఎందుకంటే, వారి తరఫున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు.

అరెస్ట్ అయినప్పటి నుంచి తన కుటుంబంతో మాట్లాడలేదని నిందితుల్లో ఒకరు కోర్టుకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

సాగర్ తల్లి రాణి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సాగర్ తల్లి రాణి

ఆందోళనకారుల బంధువులు ఏం చెబుతున్నారు?

ప్రేక్షకుల గ్యాలరీ నుంచి పార్లమెంట్ హాల్‌లోకి దూకిన వ్యక్తుల్లో సాగర్ శర్మ ఒకరు. ఆయన లఖ్‌నవూకు చెందిన వ్యక్తి.

దిల్లీలో జరిగే ఆందోళనల్లో పాల్గొనేందుకు కొన్ని రోజుల కిందటే ఇల్లు విడిచి వచ్చినట్లు సాగర్ కుటుంబ సభ్యులు పీటీఐ వార్తాసంస్థకి తెలిపారు.

సాగర్ కుటుంబం అసలు ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన వారని పోలీసులు చెప్పారు. ఇటీవలే సాగర్ బెంగళూరు నుంచి లఖ్‌నవూకు వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు.

‘‘నా సోదరుడు ఈ-రిక్షా తోలుకునేవాడు. అంతకుముందు బెంగళూరులో పనిచేశాడు’’ అని సాగర్ సోదరి చెప్పారు.

రెండు రోజుల కిందటే తన కొడుకు ఇల్లు విడిచి వెళ్లాడని, పని కోసం స్నేహితులతో కలిసి దిల్లీ వెళ్తున్నట్లు చెప్పాడని సాగర్ తల్లి రాణి తెలిపారు.

గ్యాలరీ నుంచి లోక్‌సభ హాల్‌లోకి దిగిన మరో వ్యక్తి మనోరంజన్ డీ. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నియోజకవర్గం మైసూరుకు చెందిన వ్యక్తి ఇతను.

పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు అవసరమయ్యే పాస్‌ను నిందితుల్లో ఒకరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ధ్రువీకరణ పత్రం ద్వారానే పొందినట్లు తెలిసింది.

తన కొడుకు చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మనోరంజన్ తండ్రి దేవరాజు గౌడ బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషికి చెప్పారు.

తమది వ్యవసాయ కుటుంబమని, తన కొడుకును ఇంజనీరింగ్ చదివించినట్లు తెలిపారు. హసన్ జిల్లాలో తమ ఊరిలో ఉన్న పొలంలో మనోరంజన్ వ్యవసాయం చేసే వాడని చెప్పారు.

‘‘వివేకానంద పుస్తకాలు బాగా చదివేవాడు. సమాజం, వెనుకబడిన వర్గం కోసం ఏదైనా మంచి చేయాలని అనుకునేవాడు. మనోరంజన్ అప్పుడప్పుడు దిల్లీ వెళ్లే వాడు. కానీ, అక్కడ ఏం చేస్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో ఎప్పుడు చెప్పలేదు’’ అని దేవరాజు గౌడ తెలిపారు.

నీలమ్ తల్లి సరస్వతి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నీలమ్ తల్లి సరస్వతి

తన కూతురికి ఉద్యోగం రాకపోతుండటంతో చాలా నిరాశలో ఉండేదని ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు నీలమ్ తల్లి సరస్వతి.

‘‘నా సోదరి బీఏ, ఎంఏ, బీఎడ్, ఎంఎడ్, సీటెట్, ఎంఫిల్, నెట్‌లో ఉత్తీర్ణత సాధించింది. చాలా సార్లు నిరుద్యోగ సమస్యపై పోరాడింది. రైతుల ఉద్యమంలో కూడా పాలుపంచుకుంది’’ అని నీలమ్ సోదరుడు చెప్పారు.

‘‘నేనేమీ పశ్చాత్తాపం చెందడం లేదు. నీలమ్ చేసింది, తన విషయంలో సరైనదే. ఆమె నిరుద్యోగి. ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. ఉపాధి లేక ఎంతో మంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరిపైనా కూడా ఆమె క్రూరమైన దాడి చేయలేదు. ఉపాధి విషయంలో ఆమె చాలా ఆందోళన చెందేది. కుటుంబానికి భారంగా మారుతున్నానని అనుకునేది. ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదని చాలాసార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించే దాన్ని. ఆమెను మేమెప్పుడూ భారంగా భావించలేదు. ఉద్యోగం గురించి చాలా ఆందోళన చెందేది. ఉద్యోగం రాకపోతే చనిపోతానని ఒకటి రెండుసార్లు చెప్పింది కూడా’’ అని నీలమ్ తల్లి సరస్వతి చెప్పారు.

‘‘మా ప్రయత్నం ఏంటంటే.. ఆమెకు ఉద్యోగమివ్వాలి. మేం క్షమాపణ కోరతాం. ఎవరికీ హాని చేయలేదు. దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఆపాదిస్తున్నారు’’ అని అన్నారు.

పార్లమెంట్ వెలుపల నీలమ్‌తో పాటు నిరసనలు చేస్తూ పట్టుబడ్డ మరో వ్యక్తి అమోల్ షిండే. ఈయన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన వ్యక్తి.

బుధవారం పలు పోలీసు బృందాలు షిండే గ్రామానికి చేరుకున్నాయి. ఆయన ఇంటిని తనిఖీ చేశాయి.

అమోల్ షిండే గత కొన్నేళ్లుగా పోలీసు పరీక్షలకు హాజరవుతున్నాడని, కానీ ఎంతకీ పాస్ కావడం లేదని పోలీసులు తెలిపారు.

తమ కొడుకు ఏం చేశాడో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెప్పారు. అమోల్, ఆయన కుటుంబం గురించి మరింత సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)