మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్: బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికపై అందరూ ఎందుకు షాక్ అవుతున్నారు?

బీజేపీ

ఫొటో సోర్స్, T. NARAYAN/BLOOMBERG VIA GETTY IMAGES

    • రచయిత, సల్మాన్ రావి, త్రిభువన్, అలోక్ ప్రకాశ్ పుతుల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ, ముఖ్యమంత్రుల ప్రకటనలో అందరి అంచనాలను తలకిందులు చేసింది.

బీసీల ప్రభావం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌ను, గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయ్‌ని, బ్రాహ్మణులు కీలక పాత్ర పోషించే రాజస్థాన్‌లో బ్రాహ్మణ నేత భజన్ లాల్ శర్మకు సీఎం పదవిని అప్పగించింది.

సామాజిక, రాజకీయ పరమైన కోణాలతో పాటు సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ మూలాలను కూడా భాజపా పరిగణలోకి తీసుకుంది.

మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, ANI

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉజ్జయిని (దక్షిణ) ఎమ్మెల్యే మోహన్ యాదవ్ పేరును ప్రకటించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అందర్నీ ఆశ్చర్యపరిచింది.

భోపాల్‌లో జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఉపముఖ్యమంత్రులుగా దళిత నాయకుడు జగదీశ్ దేవడా, రాజేంద్ర శుక్లా పేర్లను ప్రకటించింది.

మోహన్ యాదవ్, జగదీశ్ దేవడాలు ఇద్దరూ మాల్వా ప్రాంతానికి చెందినవారు.

మధ్యప్రదేశ్ రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారంతా రాష్ట్రంలోని మాల్వా ప్రాంతాన్ని హిందుత్వ పాత ప్రయోగశాలగా అభివర్ణిస్తారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకు గాను బీజేపీ 163 స్థానాల్లో గెలిచింది.

ఎన్నికలకు ముందు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏ నాయకుడి పేరును బీజేపీ ముందుకు తీసుకురాలేదు.

మోహన్ యాదవ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన పేరు ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో నిలిచింది.

మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఉజ్జయిని ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

శివరాజ్ సింగ్ ప్రతిపాదన

శాసనసభా పక్ష సమావేశంలో మోహన్ యాదవ్ పేరును మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ప్రతిపాదించినట్లు, సభ్యులు దీనికి ఆమోదించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

దీనికంటే ముందు సీఎం పదవి రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్ వంటి బీజేపీ నేతల పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

2013లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ యాదవ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌కు సన్నిహితుడిగా భావిస్తారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)తో కూడా ఆయనకు అనుబంధం ఉంది. ఆయన మధ్యప్రదేశ్ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు కూడా.

‘‘బీజేపీకి ఇది మామూలే’’

ముఖ్యమంత్రి విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఆశ్చర్యపరిచేదే అని బీబీసీతో మాల్వా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రవీణ్ ఖరీవాల్ చెప్పారు.

‘‘ఇది షాకింగ్ నిర్ణయమే. కానీ, ఊహించనిది కాదు. బీజేపీని తరచి చూసేవారికి ఈ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. గుజరాత్‌తో పాటు ఉత్తరాఖండ్, హరియాణాల్లో కూడా పార్టీ ఇలాగే చేసింది. బీజేపీ షాకింగ్ ట్రెండ్‌ను కొనసాగించింది’’ అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఉపముఖ్యమంత్రిగా జగదీశ్ దేవడా నియామకం భారత్‌ను హిందూ దేశంగా మార్చాలనే సంఘ్ దృక్పథాన్ని చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొత్త తరానికి నాందిగా చూడాలని మధ్యప్రదేశ్‌కు చెందిన మరో జర్నలిస్ట్ శ్రీమాలి అన్నారు.

‘‘బీజేపీలో తరం మార్పు ప్రక్రియ జరుగుతుండేది. కానీ, శివరాజ్ సింగ్ చౌహాన్ 18 ఏళ్ల పదవీకాలంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది” అని చెప్పారు.

రాజస్థాన్

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC

రాజస్థాన్

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎంపికలో కొనసాగించిన సంప్రదాయాన్నే బీజేపీ రాజస్థాన్‌లోనూ కొనసాగించింది.

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్ శర్మకు రాజస్థాన్ పగ్గాలు అప్పగించింది.

డిసెంబర్ 12న జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , దియాకుమారి, అర్జున్ మేఘ్‌వల్, ఓం బిర్లా వంటి పేర్లు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లు వినిపించాయి.

బ్రాహ్మణ నేత భజన్‌లాల్ శర్మ పేరు ఈ రేసులో ఎక్కడా వినిపించలేదు. ఎవరూ ఊహించలేదు కూడా. అయితే, మొదటిసారి ఎమ్మెల్యే అయిన భజన్‌లాల్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ ఎన్నికల్లో సంగనేరు నియోజకవర్గం నుంచి భజన్‌లాల్‌కు టిక్కెట్‌ దక్కడంతో తొలిసారిగా ఆయన పేరు బయటకు వచ్చింది.

సంగనేరు ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు అశోక్ లహోటి, ఆయన మద్దతుదారులు భజన్‌లాల్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

రాజస్థాన్

ఫొటో సోర్స్, Getty Images

మతలబు ఏంటి?

భజన్‌లాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి కారణం ఏమిటి?

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ పెద్ద సందేశం ఇవ్వాలనుకుంటోందని, ఈ నిర్ణయంతో అది జరిగిందని బీజేపీలోని అంతర్గత వ్యక్తులు నమ్ముతున్నారు.

సాధారణ కార్యకర్తలకు సులభంగా అందుబాటులో ఉండే, ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న నాయకుడితో ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడే వీలు కల్పించే వ్యక్తి చేతుల్లో రాజస్థాన్‌ నాయకత్వం ఉండాలని సంఘ్ నిర్ణయించుకున్నట్లు పార్టీలోని కొందరు నేతలు అంటున్నారు.

ప్రజల మనిషిగా కనిపించే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో

ఈసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే కొత్త నాయకులపై సంఘ్ దృష్టి సారించిందని సంఘ్‌లోని కొందరు అంటున్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌లకు కూడా భజన్‌లాల్ అత్యంత సన్నిహితుడు. ఈ ఎన్నికల్లో బీజేపీ సునామీ విజయానికి కారణమైన వారిలో యాదవ్‌ను ఒకరిగా పరిగణిస్తారు.

ఒక సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగలరనే సందేశాన్ని కూడా బీజేపీ ఈ నియామకం ద్వారా ఇవ్వాలనుకుంది.

ప్రస్తుతం బీజేపీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జోక్యం బాగా పెరిగిందని, అందుకే ఆ పార్టీ సంప్రదాయ రాజకీయాల్లో పూర్తిగా మార్పు వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, CG KHABAR

ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎంపికయ్యారు.

గిరిజన నాయకుడు అయిన ఆయనను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను కాదని ఈసారి పార్టీ అధిష్ఠానం విష్ణుదేవ్ వైపు మొగ్గింది.

సర్గుజా డివిజన్‌లోని కుంకూరి నియోజకవర్గం నుంచి విష్ణుదేవ్ గెలుపొందారు.

ఛత్తీస్‌గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 54 సీట్లలో విజయం సాధించడంతో రమణ్‌సింగ్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు.

అయితే, ఈసారి ముఖ్యమంత్రిగా షాకింగ్ పేరు ముందుకు వస్తుందని బీజేపీ ఇన్‌ఛార్జ్ ఓం మాథుర్ చాలాసార్లు చెప్పారు.

ఆదివారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో శాసనసభా పక్ష నేతగా విష్ణుదేవ్ పేరును రమణ్ సింగ్ ప్రతిపాదించాల్సి వచ్చింది.

రమణ్‌సింగ్‌కు బీజేపీ అసెంబ్లీ స్పీకర్‌ బాధ్యతలు అప్పగించింది.

రమణ్ సింగ్ మాట్లాడుతూ, "పార్టీలో ప్రతీ ఒక్కరికి వివిధ బాధ్యతలు ఉంటాయి. నాకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తాను’’ అని అన్నారు.

రాబోయే ఒడిశా, జార్ఖండ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక గిరిజనుడిని ముఖ్యమంత్రిగా పార్టీ ఎంపిక చేసిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు అన్నారు.

అంతే కాకుండా గిరిజన, దళిత వ్యతిరేకి అనే ఆరోపణలకు కూడా సమాధానంగా ఈ నిర్ణయాన్ని చూడవచ్చని చెప్పారు.

‘‘త్వరలో కుల గణన అంశం కూడా మన ముందుకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓబీసీ, గిరిజనుల ఆధిపత్యం ఉన్న రాష్ట్రంలో అగ్రవర్ణాలకు అధికారం కట్టబెట్టడం మెరుగైన నిర్ణయం కాబోదు. గిరిజన ముఖ్యమంత్రి కావాలన్న ప్రజల ఏళ్ల నిరీక్షణను మేం నెరవేర్చాం’’ అని బీబీసీతో ఆయన అన్నారు.

2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కారణాలతో రమణ్ సింగ్ దాదాపు నిష్క్రియంగా మారిపోయాని సీనియర్ హిందీ జర్నలిస్ట్ దివాకర్ ముక్తిబోధ్ అన్నారు.

‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకోవడంలో అర్థం లేదని రమణ్‌సింగ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలను బీజేపీ హైకమాండ్ ఆమోదించలేకపోయింది. బీజేపీ అలా చేస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజేలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండేది’’ అని ఆయన వివరించారు.

మిజోరం

ఫొటో సోర్స్, Getty Images

మిజోరం

మిజోరం ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జడ్‌పీఎం) పార్టీ అధినేత లాల్‌దుహోవా ఎంపికయ్యారు.

1989లో రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి మిజో నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్‌లే పాలించిన మిజోరాంలో తొలిసారి జడ్‌పీఎం అధికారం చేపట్టింది.

మాజీ ఐపీఎస్ అధికారి అయిన లాల్‌దుహోమా ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)