ఔరంగజేబు: తండ్రిని జైలులో పెట్టి, సోదరులకు మరణశిక్ష వేసి, కొడుకును దేశం నుంచి బహిష్కరించిన ఈ మొగల్ చక్రవర్తి పాలన ఎలా ఉండేది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మొగల్ సామ్రాజ్యాన్ని దాదాపు 50 ఏళ్ల పాటు పాలించిన చక్రవర్తి ఔరంగజేబుకు చరిత్రలో వివాదాస్పద వ్యక్తిగా పేరుంది.
మొగల్ సామ్రాజ్య శక్తిమంతమైన పాలకులలో చివరి చక్రవర్తిగా ఔరంగజేబును పరిగణిస్తుంటారు.
ఆయన 1658 నుంచి 1707 వరకు రాజ్యాన్ని పాలించారు. ఔరంగజేబు తర్వాత మొగల్ సామ్రాజ్యం క్రమంగా తన బలాన్ని కోల్పోవడం ప్రారంభించింది.
ఔరంగజేబు పాలనలో భారత్‌లోని రాజ్యాలు ఆయనకు కీలకంగా ఉండేవి.
ఔరంగజేబు సుదీర్ఘ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనను వివాదాస్పద వ్యక్తిగా చరిత్రకెక్కించాయి.
ఇంతకీ, ఔరంగజేబు పాలనలో ఏం జరిగింది? ఆయన తీసుకున్న నిర్ణయాలేంటి? సోదరుల మృతికి ఔరంగజేబు ఎందుకు కారణమయ్యారు?


ఫొటో సోర్స్, Getty Images
సింహాసనం కోసం పోటీ
గుజరాత్‌లోని దోహాద్‌లో మొగల్ యువరాజు ఖుర్రం (షాజహాన్), ముంతాజ్ మహల్ దంపతులకు ఔరంగజేబు 1618 నవంబర్ 3న జన్మించారు.
అప్పటికి షాజహాన్ ఇంకా అధికారంలోకి రాలేదు, జహంగీర్ పాలన కొనసాగుతోంది.
షాజహాన్‌కు ఔరంగజేబు మూడో కుమారుడు. ఆయన కంటే ముందు షాజహాన్‌కు ఇద్దరు కుమారులు జన్మించారు.
వారి పేర్లు దారా షికోహ్, షా షుజా. ఔరంగజేబు తరువాత మరో కుమారుడు జన్మించారు, ఆయన పేరు మురాద్.
షాజహాన్ తరువాత సింహాసనం కోసం ఈ యువరాజుల మధ్య పోటీ చిన్న వయస్సులోనే ప్రారంభమైంది.
''కుటుంబంలోని అందరు పురుషులకు రాజకీయ అధికారంపై సమానంగా హక్కు ఉండటం" అనే మధ్య ఆసియా ఆచారాన్ని మొగలులు అనుసరించారు'' అని 'ఔరంగజేబు: ది మ్యాన్ అండ్ ది మిత్' పుస్తకంలో రచయిత ఆడ్రీ ట్రష్కే తెలిపారు.
అయితే, అక్బర్ పాలనలో ఈ వారసత్వం కొడుకులకు మాత్రమే పరిమితం చేశారు.
అయితే, షాజహాన్ తన పెద్ద కుమారుడు దారా చక్రవర్తి కావాలని కోరుకున్నారు. దీంతో, 1633లో దారా వివాహం మొగల్ చరిత్రలోనే ముందెన్నడూ లేనంత ఘనంగా నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఔరంగజేబు భవిష్యత్తును మార్చిన ఏనుగుల పోరాటం
కానీ, ఆడ్రీ పుస్తకం ప్రకారం.. దారాకు వివాహమైన కొన్నినెలల తర్వాత జరిగిన ఒక సంఘటన ఔరంగజేబు భవిష్యత్తును మార్చివేసింది.
ఒకసారి షాజహాన్ ఏనుగుల పోరాటాన్ని ఏర్పాటు చేశారు. రాజు తన యువరాజులతో కలిసి ఆ పోరాటాన్ని చూస్తున్నారు. ఆ సమయంలో ఒక ఏనుగు ఔరంగజేబు వైపు తిరిగింది. దీంతో, ఔరంగజేబు తన ఈటెతో దానిని అదుపు చేయడానికి ప్రయత్నించారు.
ఆ ఏనుగు మరింత కోపంగా ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించింది, దీంతో ఔరంగజేబు గుర్రం నుంచి పడిపోయారు. ఔరంగజేబు సోదరుడు షా షుజా, రాజా జై సింగ్‌లు జోక్యం చేసుకుని ఏనుగును దారి మళ్లించారు. ఈ గందరగోళంలో దారా ఎక్కడా కనిపించలేదు. ఆ క్షణం నుంచి షాజహాన్ చూపు ఔరంగజేబుపై పడింది.
16 సంవత్సరాల వయసులోనే ఔరంగజేబును ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొనేలా చేయడం ప్రారంభించారు షాజహాన్. 1635 నుంచి 1657 వరకు ఆయన అనేక యుద్ధాలలో పాల్గొన్నారు, గుజరాత్, ముల్తాన్, దక్కన్ పాలనలో భాగమయ్యారు.
ఈ కాలంలో దిల్లీ నుంచి వచ్చిన కొన్ని ఆదేశాలు ఔరంగజేబు బలాన్ని తగ్గించే ఉద్దేశంతో ఉన్నాయని ఆడ్రీ తన పుస్తకంలో చెప్పారు. ఉదాహరణకు, 1650లలో దక్కన్ యుద్ధాలలో విజయం సమీపిస్తున్నప్పుడు, యుద్ధాన్ని నిలిపివేయాలని షాజహాన్ ఆదేశించారు. ఇది దారా సలహా మేరకు జరిగిందని పుస్తకంలో తెలిపారు.
జైలులో షాజహాన్
1657 సెప్టెంబర్‌లో షాజహాన్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఇక కోలుకోలేరని భావించి, నలుగురు కొడుకులు సింహాసనం కోసం పోటీ పడ్డారు. వరుస యుద్ధాల తర్వాత, ఔరంగజేబు విజయం సాధించడంతో ఆయనకు 1658,1659లలో(రెండుసార్లు) పట్టాభిషేకం జరిగింది.
కొన్నినెలల తర్వాత సోదరులు దారా, మురాద్‌లకు మరణశిక్ష విధించారు ఔరంగజేబు. కోలుకుంటున్న షాజహాన్‌ను ఆగ్రా ప్యాలస్‌లో ఖైదు చేశారు.
మొగల్ సోదరులు సింహాసనం కోసం పోరాడటం సాధారణమైనప్పటికీ, చక్రవర్తిగా పాలించిన తండ్రిని జైలులో పెట్టడం అరుదైనది.
చాలామంది నుంచి విమర్శలు వచ్చినప్పటికీ ఔరంగజేబు పట్టించుకోలేదు. దాదాపు ఏడున్నర సంవత్సరాల తర్వాత ఆగ్రా ప్యాలస్‌లో మరణించారు షాజహాన్.
తిరుగుబాట్లను అణచివేయడం, యుద్ధానికి దిగి సామ్రాజ్యాన్ని విస్తరించడం, సంస్కరణలతో ఔరంగజేబు సుదీర్ఘ పాలన గడిచింది. ఔరంగజేబు మొదట తన రాజ్యానికి ముప్పుగా భావించే వారిని దౌత్యం ద్వారా నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అది విఫలమైనప్పుడు సైనిక శక్తి ప్రయోగించేవారు. చాలా సందర్భాలలో క్రూరంగా వ్యవహరించడానికీ ఔరంగజేబు వెనుకాడలేదని ఆడ్రీ తన పుస్తకంలో రాశారు.
1681లో ఔరంగజేబు దక్కన్ వైపు కదలడం ప్రారంభించారు. అక్బర్ కాలంలో మొగలులు దక్షిణాదిలో కొన్ని విజయాలు సాధించినప్పటికీ, ఆ ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకున్నారు ఔరంగజేబు. అందువల్ల, ఔరంగజేబు తన పాలనలోని మిగిలిన కాలాన్ని దక్షిణ భారతదేశంలోనే గడిపారు.
1680లలో బీజాపూర్, గోల్కొండలను స్వాధీనం చేసుకున్న తర్వాత, తమిళనాడు వైపు వెళ్లారు ఔరంగజేబు. తమిళనాడు ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు ఈ మొగల్ చక్రవర్తి.

ఫొటో సోర్స్, PENGUIN INDIA
పతనం ఇలా..
‘తన పాలన తొలి దశాబ్దంలో మునుపటి మొగల్ చక్రవర్తుల పద్ధతులనే అనుసరించిన ఔరంగజేబు, తరువాత వాటి నుంచి కొంచెం దూరంగా ఉన్నారు. హిందూ మతపరమైన ఆస్థాన ఆచారాలను ఆయన నిలిపివేశారు.
సంగీతానికి మద్దతు ఇవ్వలేదు. ఆస్థాన చరిత్రకారుడిని తొలగించారు. 1669లో ప్రజలకు దర్శనం ఇచ్చే సంప్రదాయానికి ఆయన విముఖత చూపారు. తన పుట్టినరోజున వెండి, బంగారం దానం చేసే ఆచారాన్ని ఔరంగజేబు నిలిపివేశారు.
1679లో దిల్లీని విడిచిపెట్టిన ఔరంగజేబు, తిరిగి అక్కడకు వెళ్లలేదు. పాలనలో తన బంధువులకు పదవులు ఇచ్చినప్పటికీ, వారు బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోతే కనికరం చూపలేదు ఔరంగజేబు. సాధారణ ప్రజలకు విధించే శిక్షల కంటే ఎక్కువే వేసేవారు.
అయితే, 1681లో ఔరంగజేబు కుమారుడు అక్బర్ తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నారు. దీంతో కొడుకును దేశం నుంచి బహిష్కరించారు ఔరంగజేబు. దీంతో అక్బర్ పర్షియాకు పారిపోయి అక్కడే మరణించారు. ఔరంగజేబు తన శత్రువులతో చాలా క్రూరంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. అయితే, అలాంటి శిక్షలకు మతపరమైన కారణాల కంటే వారంతా మొగల్ సామ్రాజ్య వ్యతిరేకులు కావడం కారణం’ అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
‘ఔరంగజేబు పాలనలో ముఖ్యమైన పదవుల్లో హిందువులూ ఉండేవారు. ముఖ్యంగా, షాజహాన్ పాలనలో ఆర్థిక మంత్రిగా ఉన్న రాజా రఘునాథ్ ఔరంగజేబు రాజ్యంలో దివాన్‌గా కొనసాగారు.
ఔరంగజేబు తన రాజ్యంలో మద్యం, నల్లమందు, వ్యభిచారాన్ని నిషేధించారు.
ఔరంగజేబు రాజ్యంలో అనేక హిందూ, జైన దేవాలయాలు ఉండేవి. ఇస్లామిక్ చట్టం ఆధారంగా రక్షణ ఉండేది. ఒక ముస్లింగా, ఆయన హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడనేది సరైనది కాదు’ అని ఆడ్రీ పుస్తకంలో అభిప్రాయపడ్డారు.
ఔరంగజేబు చివరి సంవత్సరాలు యుద్ధాలతోనే గడిచాయి. మొగల్ సామ్రాజ్య భవిష్యత్తు గురించి కూడా ఆయన ఆందోళన చెందారు. చివరి సంవత్సరాల్లో ఔరంగజేబు ముగ్గురు కుమారులు బతికి ఉన్నప్పటికీ, వారిలో ఎవరినీ భవిష్యత్ చక్రవర్తి హోదాకు అర్హులుగా ఆయన భావించలేదు.
ఔరంగజేబు 1707 ప్రారంభంలో అహ్మద్‌నగర్‌లో వృద్ధాప్యంతో మరణించారు. మహారాష్ట్రలోని కుల్దాబాద్‌లో ఆయనను సాధారణ పద్ధతిలో ఖననం చేశారు.
ఔరంగజేబు మరణం తరువాత, ఆయన రెండో కుమారుడు ఆజం షా సింహాసనాన్ని అధిష్టించారు. కానీ, సోదరుడు బహదూర్ షా-1 చేతిలో ఆజం ఓడిపోయారు, దీంతో బహదూర్ షా తదుపరి మొగల్ చక్రవర్తి అయ్యారు.
యుద్ధంలో ఓడిపోయిన ఆజం షా కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయానికే మొగల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. బహదూర్ షా 1712లో మరణించారు. తర్వాత, మొగల్ సామ్రాజ్యం పతనం వేగంగా జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














