ఇబ్న్ బతూతా: తుగ్లక్ రాయబారిగా భారత్ నుంచి చైనాకు వెళ్లిన ఈ ట్రావెలర్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వలీద్ బద్రాన్
- హోదా, బీబీసీ అరబిక్ సర్వీస్
మొరాకోకు చెందిన అబు అబ్దుల్లా మహమ్మద్ ఇబ్న్ బతూతా అనే యువకుడు 1325 జూన్ 13న తన ఇంటి నుంచి చారిత్రక యాత్రకు బయలుదేరారు. ఆ తర్వాత మూడు దశాబ్దాల్లో ఆయన ఉత్తర ఆఫ్రికా నుంచి భారత్, చైనా వరకూ ఎన్నో అద్భుత ప్రయాణాలు చేశారు.
ఈ ప్రయాణాల గురించి ఆయన రాసిన విషయాలు 14వ శతాబ్దానికి సంబంధించిన ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి.
ఇబ్న్ బతూతా తన యాత్ర అనుభవాలను 'తుహ్ఫత్ అన్ నాజర్ ఫగ్రైబ్ ఇల్ - అంసార్' పుస్తకంలో రాశారు. ఇది 'ది ట్రావెల్స్ ఆఫ్ ఇబ్న్ బతూతా' పేరుతో ఆంగ్లంలోకి అనువాదమైంది.
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, ఇబ్న్ బతూతా 1304 ఫిబ్రవరి 24న మొరాకోలో జన్మించారు.
ఈయన్ను మధ్యయుగం నాటి గొప్ప సంచారి (ట్రావెలర్) అని పిలుస్తారు.
ఇబ్న్ బతూతా 1,20,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. చివరలో తన యాత్రల అనుభవాలను ఆయన రాశారు.


ప్రయాణం ఎలా మొదలైంది?
ఇబ్న్ బతూతా మొరాకోలోని టాంజియర్‌లో ఇస్లామిక్ స్కాలర్స్ కుటుంబంలో జన్మించారు.
మొదట్లో ఈయనకు ఇస్లామిక్ చట్టం, ఖురాన్ నేర్పించారు. కానీ, ఇబ్న్ బతూతా ఒకేచోట ఉండడానికి ఇష్టపడలేదు. తన జీవిత లక్ష్యాన్ని వెతుక్కునే పనిలో పడ్డారు.
21 ఏళ్ల వయసులో హజ్ యాత్రకు వెళ్లేందుకు తన సొంతూరు టాంజియర్ నుంచి బయలుదేరారు. తన జీవితం ప్రయాణాలతోనే గడిచిపోతుందని అప్పుడాయనకు తెలియదు.
ఆయన తొలి ప్రయాణం మక్కాకే అయినప్పటికీ, ఆయనలోని మతవిశ్వాసం, సాహిత్య అభిరుచి ఆయన్ను మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఉత్తర ఆఫ్రికాలో బతూతా ప్రయాణం ప్రమాదకరంగా సాగింది. అక్కడ ఎడారితో పాటు బందిపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈజిప్ట్ వెళ్లినప్పుడు, పురాతన కాలం నుంచి అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటైన కైరోను చూసి ఆశ్యర్యపోయారు. అక్కడి మామ్లూక్ రాజ్యంలోని గొప్ప మసీదులు, రద్దీ మార్కెట్లు, విద్యాసంస్థలను సందర్శించారు. అలెగ్జాండ్రియాను కూడా బతూతా సందర్శించారు.
బతూతా తొలుత హజ్ యాత్ర మాత్రమే చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్స్‌ను, ఈజిస్ట్, సిరియా, హిజాజ్‌కు చెందిన సూఫీ సెయింట్లను కలవాలనుకున్నారు.
ఇస్లాంను లోతుగా అధ్యయనం చేశారు. అందులో ప్రావీణ్యం సాధించడంతో ఖాజీ స్థానానికి అర్హత పొందారు. ఇస్లామిక్ స్టడీస్ విద్యార్థి కావడం వల్ల ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆయన ప్రపంచంలోని అనేక మంది పాలకుల కోర్టుల్లో గౌరవ అతిథిగా ఉండేవారు.
ఈజిప్ట్‌లో ఉన్న సమయంలోనే ఆయనకు ట్రావెల్‌పై మరింత ఆసక్తి పెరిగింది. అప్పుడే ఆయన ప్రపంచాన్ని చుట్టి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో ప్రజలు వ్యాపారం, తీర్థయాత్రలు, విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. కానీ, ఇబ్న్ బతూతా మాత్రం కొత్త దేశాలు, కొత్త వ్యక్తులను కలవాలనే ఆసక్తితో ఉండేవారు.
ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన రాజులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అలాగే, ఆయన ప్రయాణాన్ని కొనసాగించేందుకు అవసరమైన సాయం కూడా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
హజ్ తర్వాత దూరప్రయాణాలు
ఇబ్న్ బతూతా కైరో నుంచి యాత్రికుల సమూహంతో కలిసి మక్కాకు బయలుదేరారు.
1326లో హజ్ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఇరాక్ వెళ్లారు. అబ్బాసిద్ ఖలీఫాల కోట అయిన బాగ్దాద్‌ను సందర్శించారు. ఆ తర్వాత ఇరాన్‌లో, మంగోల్ గవర్నర్ అబూ సయీద్‌ను కలిశారు.
ఇరాన్ నగరాలు ఇస్ఫహాన్, షిరాజ్‌ను సందర్శించారు. అక్కడి సంస్కృతి, సాహిత్యపరమైన జీవనం ఆయన్ను చాలా ఆకట్టుకున్నాయి.
బతూతా 1327 నుంచి 1330 వరకూ మక్కా, మదీనాలో ఉన్నారు. హజ్ ఆయనకు ఆధ్యాత్మిక యాత్ర. ఈ సమయంలో ఆయన ఇస్లామిక్ ప్రపంచంలోని విభిన్న సంస్కృతులను చూశారు. అనేక మందిని కలిశారు. యాత్రలపై ఆయనకున్న ఆసక్తికి ఇవి కూడా ఒక కారణం.
అనంతరం జెడ్డాలో ఓడ ఎక్కారు. ఎర్ర సముద్రం మీదుగా యెమెన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి అదన్‌కు బయలుదేరారు. అనంతరం ఆఫ్రికా తూర్పు తీరప్రాంతంలో పర్యటించారు.
ఈ పర్యటనల అనంతరం ఆయన మక్కాకు తిరిగి వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు రాక
మక్కాలో ఉన్నప్పుడు దిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్, అక్కడి ఇస్లామిక్ స్కాలర్స్ దాతృత్వం గురించి కథలు కథలుగా విన్నారు. దీంతో దిల్లీ కోర్టులోనూ అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఓడలో ఈజిప్ట్, సిరియా మీదుగా ఆసియా మైనర్ (అనటోలియా)కు చేరుకున్నారు.
సెల్జుక్ సామ్రాజ్య పతనం గురించి, ఒట్టోమాన్ సామ్రాజ్య ఆవిర్భావం గురించి చరిత్రకారులకు నమ్మదగిన ఆధారం ఇబ్న్ బతూతా.
స్థానిక పాలకులందరూ బతూతాకు స్వాగతం పలికారు.
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, బైజాంటైన్ సామ్రాజ్య రాజధాని గురించి ఇబ్న్ బతూతా వివరణ స్పష్టంగా, కచ్చితంగా ఉంది.
ఆయన కాన్స్టాంటినోపుల్ నుంచి తిరిగి వచ్చిన తరువాత భారత్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు.
మార్గం మధ్యలో ఆయన మధ్య ఆసియాలోని పురాతన నగరాలు బుఖారా, సమర్‌కంద్, బాల్ఖ్‌ల మీదుగా వచ్చారు. హిందూ కుష్ పర్వత శ్రేణిని దాటి భారత్‌కు, దిల్లీ సామ్రాజ్యానికి చేరుకున్నారు.
దిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ముందు నిలిచారు. సుల్తాన్ ఆయన్ను ఖాజీగా నియమించారు.
బతూతా భారత్‌లో చాలా ఏళ్లు గడిపారు. ఇక్కడి సమాజంలోని సంక్లిష్టతను, పరిపాలన వ్యవస్థను, వివిధ మత సంప్రదాయాలు, వారి మధ్య సంబంధాలను అర్థం చేసుకున్నారు.
అయితే, భారత్‌లో తన స్థానానికి ఎలాంటి ఢోకా లేదని అనుకోవడానికి వీల్లేదని బతూతా గ్రహించారు. దాతృత్వంతో పాటు క్రూరత్వం కలగలిసిన అసాధారణ లక్షణాల మిశ్రమం సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ప్రజలతో (ముస్లింలు, హిందువులు) కఠినంగా వ్యవహరించడం ద్వారా భారత్‌లోని చాలా భాగాన్ని సుల్తాన్ తన నియంత్రణలో ఉంచుకున్నారు.
రాజకీయాల కారణంగా చాలా మంది స్నేహితులు కోర్టులో బాధితులుగా మారడం బతూతా చూశారు. వాటన్నింటినీ చూసి ఆయన చాలా భయపడ్డారు.
తుగ్లక్ గురించి రాసేప్పుడు, తుగ్లక్ వ్యక్తిత్వం గురించి ఆయన రాశారు. 1342లో తుగ్లక్ తన రాయబారిగా బతూతాను చైనా పాలకుడి దగ్గరికి పంపించారు.
దీంతో దిల్లీని విడిచి వెళ్లిపోయేందుకు బతూతా ఎలాంటి ఆలస్యం చేయలేదు.
అయితే, చైనా పర్యటన మరింత ప్రమాదకరంగా మారింది. అక్కడికి వెళ్లడానికి ముందు, దిల్లీలోని ఆయన రహస్య స్థావరంపై సుల్తాన్ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఆ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
భారత్ నైరుతి దిశలోని మలబార్ తీరానికి చేరుకున్న ఆయన అనేక యుద్ధాలను చూశారు.
ఆయన ఓడ కాలికట్ (ప్రస్తుతం కోజికోడ్) సమీపంలో ధ్వంసమైంది. సుల్తాన్‌కు భయపడి బతూతా మాల్దీవులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ సుమారు రెండేళ్లు ఖాజీగా కాలం గడిపారు.
మాల్దీవుల నుంచి శ్రీలంక వెళ్లిన బతూతా, అక్కడి పచ్చని ప్రకృతి దృశ్యాలను, బౌద్ధ దేవాలయాలనూ సందర్శించారు. ఆ తర్వాత బెంగాల్, అస్సాం ప్రాంతాలకు వెళ్లారు. అస్సాం చేరుకున్న తర్వాత తన చైనా పర్యటనను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి సుమత్రా వైపు బయలుదేరారు.
సుమత్రా ముస్లిం సుల్తాన్ ఆయనకు ఒక కొత్త ఓడను ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన చైనా వైపు బయలుదేరారు. ఇబ్న్ బతూతా ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలను, అక్కడి సంస్కృతిని అధ్యయనం చేసేవారు.

ఫొటో సోర్స్, FACEBOOK
చైనా పర్యటన, తిరుగు ప్రయాణం
ఇబ్న్ బతూతా ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనది చైనా పర్యటన. ఆయన 1345లో చైనాలో అత్యంత సందడిగా ఉండే వాణిజ్య కేంద్రమైన క్వాన్‌జౌ చేరుకున్నారు. చైనా గురించి బతూతా వివరణ, గతంలో కొందరు యూరోపియన్లు, అరబ్బులు ఇంతకుముందు చూసిన, లేదా విన్న వాటికి నిదర్శనంగా నిలుస్తుంది.
బీజింగ్‌లోని ఇంపీరియల్ కోర్టు వైభవం, చైనీస్ నాగరికత అభివృద్ధి, పాలనా శైలిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అక్కడి విస్తృతమైన వాణిజ్య నెట్‌వర్క్‌ను తన వివరణల్లో ఆయన వివరించారు.
బతూతా చైనా పర్యటన మధ్యయుగంలో వాణిజ్యం, దౌత్య సంబంధాల గురించి వివరిస్తుంది.
తూర్పు ఆసియా వైపు సుదూర ప్రాంతాల్లో పర్యటించిన ఇబ్న్ బతూతా 1346లో సుమత్రా, మలబార్, గల్ఫ్ దేశాల మీదుగా మొరాకోకు తిరుగుప్రయాణం ప్రారంభించారు.
సిరియాలో ఉన్నప్పుడు, ఈయన 1348లో బ్లాక్ డెత్ (సామూహిక మరణాలను) చూశారు. అదే ఏడాది మక్కా వెళ్లి తన చివరి హజ్ చేశారు. అక్కడి నుంచి ఈజిప్ట్, అలెగ్జాండ్రియా, ట్యునీషియా, సార్డినియా, అల్జీరియాలకు వెళ్లారు.

1349 నవంబర్‌లో మొరాకోలోని ఫెజ్ నగరానికి చేరుకున్నారు.
ఇంత సుదీర్ఘ ప్రయాణాల తర్వాత కూడా ఆయనకు తెలియని రెండు ముస్లిం దేశాలు ఉన్నాయి. రెండేళ్ల తర్వాత (1352లో) ఆయన పశ్చిమ సూడాన్‌కి బయలుదేరారు. సహారా ఎడారి దాటిన తర్వాత, మాలి సామ్రాజ్యంలో ఏడాది సమయం గడిపారు. అదే సమయంలో, ఆ సామ్రాజ్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
బతూతా 1353 చివరిలో మొరాకోకు తిరిగివచ్చారు. అక్కడి సుల్తాన్ అభ్యర్థన మేరకు, తన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు.
అనంతరం ఇబ్న్ బతూతా కనిపించకుండా పోయారు. మరణానికి ముందు ఆయన మొరాకోలోని ఒక నగరంలో ఖాజీగా పనిచేశారని చెబుతారు.
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, ఆయన 1368, 1369 లేదా 1377లో మరణించి ఉండొచ్చు. ఆయన స్వస్థలం టాంజియర్‌లోనే ఆయన్ను ఖననం చేశారు.
ఇవి కూడా చదవండి:
- రక్త పిశాచాలు ఉన్నాయా? లేవా?
- పుతిన్‌కు ఘనస్వాగతం పలికిన కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఉత్తర కొరియాకు పుతిన్ ఎందుకు వెళ్లారు? 3 ప్రశ్నలు, సమాధానాలు
- ఒకే ఐఎంఈఐ నంబర్‌తో 1.5 లక్షల ఫోన్లు, ఈ మోసం ఎలా చేశారు?
- పన్నెండు రోజుల్లో 1,000 కిలోమీటర్లు పరుగెత్తిన 52 ఏళ్ల మహిళ, ఇంత సాహసం ఎందుకంటే...
- టీ20: పాకిస్తాన్ జట్టు ఇది వరల్డ్ కప్ అన్న విషయం అర్థం చేసుకోలేకపోయిందా?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














