క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ: ‘నేను గర్భవతినని బిడ్డను కనడానికి నెల రోజుల ముందు వరకు నాకు తెలియలేదు’

తవానా

ఫొటో సోర్స్, Tawana Musvaburi

ఫొటో క్యాప్షన్, తన కడుపులో బిడ్డ ఉన్నాడనే విషయం తవానాకు మొదట్లో తెలియలేదు.

21 ఏళ్లకే బిడ్డను కనాలని తవానా అనుకోలేదు. పార్టీలు, స్నేహితులు అంటూ సరదాగా గడిపేది. ఆమె మాటల్లో చెప్పాలంటే, ‘జీవితాన్ని చాలా ఆనందంగా, ఉల్లాసంగా గడిపేదాన్ని.’

ఒకరోజు ఉన్నట్టుండి కుప్పకూలి, ఆసుపత్రిలో చేరేవరకూ ఆమె జీవితం అలాగే సాగేది.

తనకు ఏం జరిగిందో అప్పుడుగానీ ఆమెకు అర్థం కాలేదు. నాలుగు వారాల్లో బిడ్డ పుడుతుందని డాక్టర్లు చెప్పారు.

"నాలో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి." అని తవానా బీబీసీ రిలయబుల్ సాస్ పాడ్‌కాస్ట్‌తో చెప్పారు. ఆ వార్తను ఆమె నమ్మలేకపోయారు.

ఆసుపత్రిలో చేరిన తర్వాత, ఎంఆర్‌ఐ స్కాన్‌కు ముందు గర్భధారణ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు తవానాను కోరారు.

వాళ్ల మాటలను ఆమె నవ్వుతూ కొట్టి పారేశారు. ఎందుకంటే ఆమె గర్భనిరోధకాలను వాడేవారు. అదీ కాకుండా ఆమెలో గర్భవతికి లక్షణాలేవీ లేవు.

పరీక్షా ఫలితం నెగిటివ్ అని తేలడంతో తాను చెప్పింది నిజమేనని ఆమె నమ్మకంగా ఉన్నారు.

కానీ, తవానా గర్భవతి అయ్యుండవచ్చని బలంగా నమ్మిన ఒక నర్సు ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించేలా డాక్టర్‌ను ఒప్పించారు.

‘నువ్వు గర్భవతివి’ అని ఆమెకు చెప్పినప్పుడు అసలు నమ్మలేదని తవానా భర్త ఇమ్మాన్యుయేల్ అన్నారు.

"అది అసలు అర్థం కాని విషయం. అదేదో అద్భుతం జరిగినట్లు అనిపించింది." అని ఆయన అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
తవానా, ఇమ్మాన్యుయేల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ రిలయబుల్ సాస్ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడిన తర్వాత తమ బిడ్డతో తవానా, ఇమ్మాన్యుయేల్

వాంతులు, కడుపు ఎత్తుగా ఉండడం వంటి సాధారణ లక్షణాలు ఏవీ లేకుండా గర్భం దాల్చడాన్ని 'క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ' - అంటే నిగూఢ గర్భం అంటారు.

ఇది చాలా అరుదు. కానీ "నల్లజాతి ప్రజలలో ఇది చాలా సాధారణం." అని వైద్యులు తనకు చెప్పారని తవానా అన్నారు.

"మా తుంటి, ఎముకల నిర్మాణం కారణంగా ఇలా జరుగుతుందని నాకు వివరించారు. ఇక్కడ శిశువు బయటికి కాకుండా, లోపలికి పెరుగుతుంది, దాని వల్ల కాన్పు కష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది." అని ఆమె చెప్పారు.

"అందువల్ల నేను ప్రసవించే సమయం వచ్చినప్పుడు, బిడ్డ తల్లకిందులుగా ఉంటుందేమో అని ఆందోళన చెందాను." అన్నారామె.

క్రిప్టిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించి కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. అయితే, లండన్ సౌత్ బ్యాంక్ యూనివర్సిటీలోని హెల్త్‌కేర్ ప్రొఫెసర్ అలిసన్ లియరీ దీని గురించి మాట్లాడుతూ, ‘‘మైనారిటీలైన కొన్ని జాతుల మహిళల ప్రసూతి సంరక్షణలో అసమానతలు ఉన్నాయని సూచించే విస్తృతమైన డేటా ఉంది.’’ అని అన్నారు.

"గర్భం, ప్రసవపరంగా మహిళలు, ముఖ్యంగా నల్లజాతి మహిళల విషయంలో ఫలితాలు చాలా నిరుత్సాహకరంగా ఉన్నాయని చూపించే చాలా అధ్యయనాలు ఉన్నాయి." అని ఆమె బీబీసీ న్యూస్‌బీట్‌తో చెప్పారు.

నిగూఢ గర్భాల నిర్దిష్ట సమస్యపై మరింత పరిశోధన జరగాలని, ఆ సమాచారం అందుబాటులో ఉండాలని ఆమె భావిస్తున్నారు.

"అందుకే [ఇది] చాలా ముఖ్యమైన సమస్య అయినప్పటికీ, తక్కువమందిని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మంచి ప్రసూతి సంరక్షణ, ప్రసవపూర్వ సంరక్షణ అందకపోతే, దాని వల్ల ఇలాంటి నిరుత్సాహకరమైన ఫలితాలే ఉండే అవకాశం ఉంది." అన్నారామె.

ఆమె గర్భంతో ఉందని తెలిసిన నాలుగు వారాల, నాలుగు రోజుల తర్వాత తవానా బేబీ షవర్ పార్టీ (సీమంతం) అనంతరం కొడుకుకు జన్మనిచ్చారు.

ప్రసవానంతర డిప్రెషన్‌తో ఆ తర్వాత తాను చాలా ఇబ్బందిపడ్డానని, ఇంత తక్కువ సమయంలో తల్లిగా మారడంపై సలహాల కోసం తాను టిక్‌టాక్‌ని చూశానని ఆమె చెప్పారు.

అయితే, అమెరికాలో ఒక మహిళ మినహాయించి, తనలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారెవరూ కనిపించలేదని ఆమె అన్నారు.

"నాకు ఎవరూ సలహా ఇచ్చేవాళ్లు లేరు. బాగా నిరాశకు గురయ్యా. ఇదేంటి, దీని గురించి ఎవరూ చెప్పడం లేదు అనుకున్నా. ఆపై ఒక వీడియో చూశా. దానిలో ఈ విషయం గురించి అమెరికాలోని ఒక అమ్మాయి మాట్లాడింది. దానికి 100 వ్యూస్ వచ్చాయి.’’ అన్నారామె.

"ఆమె అచ్చం నాకే సలహా ఇస్తున్నట్లు అనిపించింది." అని తవాన చెప్పారు.

ఆ తర్వాత తవానా తన అనుభవాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు, అప్పటి నుంచి ఆమె వీడియోకు దాదాపు 400,000 లైక్‌లు వచ్చాయి.

ఆమె మిగతా తల్లులతో సంభాషించే ఒక పాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించారు.

తన కథనాన్ని ఇతరులకు కూడా చెప్పాలని, చివరి నిమిషంలో తాము గర్భవతి అని తెలుసుకునే తల్లులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తవానా చెప్పారు.

తనకు తల్లి నుంచి ఆర్థిక సహాయం లభించడం తన అదృష్టమని ఆమె భావిస్తున్నారు. అయితే ఇతరులకూ అంత అదృష్టం ఉండకపోవచ్చని ఆమెకు తెలుసు.

అందుకే ఇప్పుడు ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

"మీకెవరూ సహాయం చేయరు. అలాంటప్పుడు మీకు ఏదైనా జరిగితే ఎలా నెగ్గుకొస్తారు?" అంటారామె.

క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

నిగూఢ గర్భం అంటే ఏమిటి?

స్త్రీ తాను గర్భవతినని తెలుసుకోలేని సందర్భాన్ని క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ లేదా నిగూఢ గర్భం అంటున్నారు. ప్రసవ వేదన పడేంతవరకు ఈ విషయం తమకు తెలియలేదని ఇలాంటి గర్భం పొందిన మహిళలు చెబుతున్నారు.

ప్రతి 2,500 జననాలలో ఒకటి క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అయ్యుంటుందని అంచనా. యూకేలో సంవత్సరానికి ఇలాంటి 300 జననాలు సంభవిస్తాయి.

మూలం: హెలెన్ చెయిన్, మిడ్‌వైఫరీ ప్రొఫెసర్, స్టిర్లింగ్ విశ్వవిద్యాలయం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)