భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు

రీటా

ఫొటో సోర్స్, PIANO PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, రీటా
    • రచయిత, రోనాల్డ్ అవిలా-క్లాడియో,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జూన్ 8, 1983న పోలీసులు ఓ చర్చి వద్దకు వచ్చారు. మురికి బట్టలు, నలిగిన పాదాలు, అయోమయంగా కనిపిస్తున్న ఆ మహిళ, పోలీసులకు అర్థం కాని మాటలేవో మాట్లాడారు. పోలీసులు ఆమెను ఆంగ్లంలో విచారించారు, కానీ ఆమెకు అర్థం కాలేదు. ఒకరికొకరు ఏం చెబుతున్నారో అర్థం కాక, వారి మధ్య సంభాషణ సాధ్యం కాలేదు. ఆమె ఏం చెప్పిందో ఎవరికీ తెలియదు, ఫలితంగా ఆమె 12 సంవత్సరాలు తన స్వేచ్ఛను కోల్పోయారు.

ఆమె పేరు రీటా పాటినో క్వింటెరో, ఉత్తర మెక్సికోలోని చివావా రాష్ట్రానికి చెందిన స్థానిక రారామూరి తెగకు చెందిన మహిళ.

ఆ రోజు ఆమె అమెరికాలోని పశ్చిమ కాన్సాస్‌లోని మాంటర్ నగరంలో ఉన్న మెథడిస్ట్ చర్చ్ బేస్‌మెంట్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

పోలీసులు రాక ముందు, రీటాను ఒక గొర్రెల కాపరి చూశాడు.

ఆమె మెక్సికన్ భూభాగం నుంచి అక్కడికి నడుచుకుంటూ వచ్చినట్లు పోలీసులు ఊహించారు.

రారామూరి తెగ సియెర్రా తారాహుమారా వాలు ప్రాంతాలలో నివసిస్తారు. అక్కడి సంక్లిష్టమైన పరిస్థితుల కారణంగా వాళ్లు బలంగా ఉంటారు.

పోలీసులు రీటాను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె తనను శుభ్రం చేయడానికి ప్రయత్నించిన అధికారిని కొట్టింది అని చిత్రనిర్మాత శాంటియాగో ఎస్టీనో చెప్పారు.

ఆయన ఏప్రిల్ 2024లో "ది ఉమన్ ఆఫ్ స్టార్స్ అండ్ మౌంటైన్స్" అనే డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఆయన రీటా కథను లోతుగా పరిశోధించారు.

"పోలీసులు ఒక అనువాదకుడిని తీసుకువచ్చారు, ఆమె ఏదో లాటిన్ అమెరికా దేశం నుంచి వచ్చి ఉంటుందని ఆ అనువాదకుడు చెప్పాడు. ఆమె చెప్పేది ఆయనకు అర్థం కాకపోగా, ఆమె అర్థం లేకుండా మాట్లాడుతోందని అన్నాడు. పోలీసులు ఆమెను కోర్టు ముందుంచారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని తేల్చారు. వాళ్లు ఆమెను మానసిక ఆసుపత్రికి తీసుకెళ్లారు" అని ఎస్టీనో బీబీసీకి వివరించారు.

రీటా మాతృభాష రారామూరి. కాన్సాస్ కోర్టులో, ఆమెకు సహాయం చేసే అనువాదకులు ఎవరూ లేరు.

ఆమె చట్టపరమైన ప్రక్రియను అర్థం చేసుకోలేకపోయారు.

తను ఎక్కడ ఉందో, తనను ఎక్కడికి తీసుకెళ్లారో ఆమెకు తెలియదు.

ఆ తర్వాత ఆమె అమెరికాలో ఉన్నంత కాలం ఒంటరితనం, హింసతో కూడిన వైద్యం, సంస్థాగతమైన బ్యూరోక్రసీ కారణంగా బాధలు అనుభవించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
రీటా

ఫొటో సోర్స్, PIANO PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, రీటా గొర్రెల కాపరి, మూలికల గురించి తెలిసిన మనిషి,

రీటా ఎవరు?

రీటా ఒక గొర్రెల కాపరి, కాన్పులు చేసే మహిళ, మూలికల గురించి తెలిసిన మనిషి, హస్తకళాకారురాలు. ఎస్టీనో డాక్యుమెంటరీ ప్రకారం.. రీటా చాలా పనులు చేసేవారు.

రీటా వదిన, మేనకోడలు, ఆమె యువతిగా ఉన్నప్పుడు పరిచయం ఉన్న అనేకమంది ఎస్టీనో డాక్యుమెంటరీలో కనిపిస్తారు.

కానీ 1930లో జన్మించిన రీటా గురించి దర్శకుడు చెప్పిన విషయం ఏమిటంటే, ఆమె కొంచెం తిరుగుబాటుతత్వం కలిగిన వ్యక్తి.

పిడ్రాస్ వెర్డెస్‌కు చెందిన ఆమె, తరువాత సెరోకాహుయ్ ప్రాంతానికి సమీపంలో, యురిక్ మునిసిపాలిటీలోని ఒక పట్టణంలో నివసించేవారు.

ఆమెది దృఢమైన వ్యక్తిత్వం. ఈ పనిని ఇలాగే చేయాలన్న విధానాన్ని ఆమె అనుసరించేవారు కాదు.

ఆమెకు జీవిత భాగస్వామి, ఒక కొడుకు ఉన్నారు.

ఆమెకు ఒక పెద్ద గొర్రెల మంద ఉండేది.

ఆమె అందరికీ సహాయం చేసేవారు, చుట్టుపక్కల వాళ్లకు జున్ను ఇచ్చేవారు.

కానీ ఒక రోజులో అంతా మారిపోయింది, రీటా స్థానికుల దృష్టిలో దుర్మార్గురాలు అయిపోయారు.

ఆమె గొర్రెల మందను ఎవరో దొంగిలించారని, ఆమె తన భర్తను హత్య చేసిందని ఇరుగు పొరుగు వాళ్లంతా ఆరోపించారు, కానీ ఇవేవీ నిరూపణ కాలేదు.

"ఆమె చాలా మంచి వ్యక్తి. కానీ ఇరుగు పొరుగు వాళ్లు ఆమెతో చెడుగా ప్రవర్తించారు. ఆమె తన భర్తతో పోట్లాడిందని, ఆమె అతణ్ని చంపిందని చెప్పుకొంటారు" అని ప్రోకోపియో మాన్సినాస్ చెప్పారు. ఆయన రీటా ఇంటికి సమీపంలో ఉంటారు.

"రీటా జెరోనిమో రెంటెరియాస్‌ను చంపలేదు. ఎవరో ఆమె గొర్రెలు,మేకలు, దుప్పట్లను దొంగిలించారు." అని ఆయన తెలిపారు.

ఉమెన్ ఆఫ్ స్టార్స్ డాక్యుమెంటరీ దర్శకుడు

ఫొటో సోర్స్, SCREENSHOT DOCUMENTARY THE WOMAN OF STARS AND MOUNTAINS

ఫొటో క్యాప్షన్, రీటాను ఇరుగుపొరుగువారు భయంతో చూసేవారని డాక్యుమెంటరీలో మాట్లాడిన వారు చెప్పారు.

కాన్సాస్‌కు రాక వెనుక రహస్యం

స్థానికంగా దొరికే ఒక మత్తు పానీయాన్ని తాగినప్పటి నుంచి రీటాకు మాట్లాడడంలో సమస్యలు తలెత్తాయి.

ఆమె స్పష్టంగా మాట్లాడలేకపోయేవాళ్లు.

"రీటా సరిగా మాట్లాడలేకపోయేది. ఆమె తనలో తానే మాట్లాడుకునేది. అది నయం కాదు, ఆమె అలాగే చనిపోతుంది అని నేను నా భర్తతో అన్నాను’’ అని ఈ డాక్యుమెంటరీలో ప్రోకోపియో బంధువైన సోలెడాడ్ మాన్సినాస్ అంటారు.

అయితే ఎలాగోలా కోలుకున్న రీటా, తన కొడుకు తోడుగా తిరగడం ప్రారంభించారు. చుట్టుపక్కల వాళ్లు ఆమెను భయంతో చూసేవాళ్లు.

"ఆమె వచ్చినప్పుడు వాళ్లు తలుపులు మూసేసేవాళ్లు. ఆమె తమను చంపాలనుకుంటోందని వాళ్లు ఆరోపించేవాళ్లు. కానీ అది అది నిజం కాదు. ఆకలిగా ఉన్న ఆమె ఆహారం కావాలనుకుంది," అని ప్రోకోపియో మాన్సినాస్ చెప్పారు.

నిజానికి, రీటా తన చుట్టూ ఉన్న వాళ్లకు అర్థం కాని వైకల్యంతో బాధపడుతూ ఉండొచ్చని ఎస్టీనో అభిప్రాయపడ్డారు.

ఆమె మెక్సికోను ఎందుకు వదిలిపెట్టి వచ్చారు, ఆమె కాన్సాస్‌కు ఎలా చేరుకున్నారు అనేది ఒక రహస్యం అని ఎస్టీనో చెప్పారు.

కుటుంబంతో గడిపిన రీటా

ఫొటో సోర్స్, PIANO PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, రీటా విడుదలయ్యాక తన మేనకోడలి కుటుంబంతో కలిసి జీవించారు

ఎట్టకేలకు స్వేచ్ఛ

మొదట, కోర్టు ఆమెను మూడు నెలల పాటు కాన్సాస్‌లోని లార్నెడ్ స్టేట్ సైకియాట్రిక్ హాస్పిటల్‌కు పంపాలని ఆదేశించింది.

ఆ వ్యవధి ముగిశాక ఆమె పరిస్థితిని, అలాగే ఆమె అమెరికాలో ఉండాలా, వద్దా అన్నది మళ్లీ అంచనా వేయాలని నిర్ణయించారు.

కానీ ఆమెకు కేటాయించిన పబ్లిక్ డిఫెండర్ ఎప్పుడూ న్యాయమూర్తుల ఎదుట హాజరు కాలేదు.

అదీ కాకుండా, అనువాదకుల కొరత కారణంగా ఆమె తన సమస్యను కోర్టుకు వివరించలేకపోయారు.

అదే సమయంలో వైద్య సిబ్బంది రోగి మూలాలు తమకు తెలియవన్నారు.

ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించడం పెద్ద సమస్యగా మారింది.

నెలలు గడిచి ఏళ్లుగా మారాయి.

రీటా తన సంస్కృతికి, తన మాతృభూమికి దూరంగా, ఒంటరిగా గడిపారు.

భాషాపరమైన అవరోధాల కారణంగా నిర్దిష్ట రోగ నిర్ధారణ లేకుండా మందులు వాడారు.

"నేను రీటా విషయంలో అనేక రకాల వివక్షను, హింసను చూశాను. ఆమె ఎవరికీ అర్థం కాని భాష మాట్లాడే మహిళ, పేదరాలు, వలస వచ్చారు. ఆమెకు బహుశా కొంత మానసిక వైకల్యం ఉండొచ్చు," అన్నారు ఎస్టీనో.

పదేళ్ల తర్వాత కానీ ఆమె పరిస్థితి మలుపు తిరిగి, ఆమె ఆసుపత్రిలో చేరడానికి సంబంధించిన సంస్థాగత వైఫల్యాలు బయట పడలేదు.

ప్రస్తుతం కాన్సాస్‌లోని డిజెబిలిటీ రైట్స్ సెంటర్‌గా పిలిచే కాన్సాస్ అడ్వకసీ అండ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ అనే సంస్థ, 1994లో ఐదు సంవత్సరాలకు పైగా ఆసుపత్రిలో ఉన్న రోగుల కేసులను సమీక్షించాలని నిర్ణయించింది.

రీటా కోసం ఈ సంస్థ న్యాయవాది టోరియా మ్రోజ్‌ను కేటాయించింది.

"మేం చేసిన మొదటి పని ఆమె వైద్య రికార్డులను చూడటం. ఆ రికార్డులలో ఆమె చివావాకు, తారాహుమారా తెగకు చెందినది అని సూచించడాన్ని గుర్తించాం," అని మ్రోజ్ డాక్యుమెంటరీలో చెప్పారు.

"10 సంవత్సరాలు గడిచినా, ఆమె అక్కడే ఉన్నారు. 'ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో లేదా ఆమె ఏ భాష మాట్లాడుతుందో మాకు తెలియదు' అని వాళ్లు చెబుతూనే ఉన్నారు.’’ అని ఆయన చెప్పారు.

అంతే కాదు, ఒక సామాజిక కార్యకర్త సాల్ట్ లేక్ సిటీ, ఉటా, కాన్సాస్‌లోని మెక్సికన్ కాన్సులేట్‌ సిబ్బందికి రీటా ఆసుపత్రిలో ఉన్నట్లు తెలియజేసిన ఆధారాలూ ఉన్నాయి. అయితే వాళ్లూ ఆమె విషయంలో ఏ చర్యా తీసుకోలేదు.

రీటా కథ

ఫొటో సోర్స్, PIANO PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, రీటా కథలో ఆమె జాతి, లింగం వంటి అనేక వివక్షలు కనిపిస్తాయని ఎస్టీనో చెప్పారు

నష్ట పరిహారం

డిజెబిలిటీ రైట్స్ సెంటర్‌ న్యాయవాదుల బృందం ఆసుపత్రి, అక్కడి సిబ్బందిపై రూ. 80 కోట్ల రూపాయల(భారతీయ కరెన్సీ ప్రకారం) నష్ట పరిహారం కోసం దావా వేసింది.

అయితే చట్టపరమైన ప్రక్రియ సవాలుగా మారింది, ప్రత్యేకించి రీటా కోర్టులో వాంగ్మూలం ఇవ్వలేకపోయారు.

అమెరికాలో ఆమె భాషను అర్థం చేసుకోగల ఒకే ఒక్క సైకియాట్రిస్టు ఉన్నారని ఎస్టీనో చెప్పారు.

ఎట్టకేలకు రీటా డిశ్చార్జ్ అయి 1995లో మెక్సికో చేరుకున్నారు.

కానీ ఆమె కేసు 1996 నుంచి 2001 వరకు సాగింది.

న్యాయవాదులు కోరిన దాని కంటే చాలా తక్కువ నష్ట పరిహారం లభించింది.

ఆ 12 సంవత్సరాలలో ఆమె అనుభవించిన బాధలకు సుమారు రూ. 75 లక్షలు(భారతీయ కరెన్సీ ప్రకారం) నష్టపరిహారంగా నిర్ణయించారు, కానీ అందులో ఆమె మూడో వంతు న్యాయసహాయం చేసిన స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది.

రీటా తన స్వదేశానికి తిరిగి వచ్చారు.

అయితే ఆమెకు మిగిలిన డబ్బు గురించి చెప్పాలంటే, అది మరో కథ.

డబ్బు కొట్టేసిన నిర్వాహకురాలు

డాక్యుమెంటరీలో రీటా మెక్సికో చేరుకున్నాక ఒక చోట కూర్చుని దూరాన కొండల వైపు చూస్తుంటారు. ఆమె జుట్టు మొత్తం తెల్లగా, ఆమె చర్మం ముడతలు పడి ఉంటుంది.

ఆ డాక్యుమెంటరీలో ఎట్టకేలకు స్వేచ్చగా ఉన్న స్త్రీ తన సొంత కంఠంలో రారామూరి భాషలో మాట్లాడడం మనం వినొచ్చు.

దర్శకుడు 2016లో చిత్రీకరణ ప్రారంభించినా, ఈ చిత్రం 2022కు కానీ పూర్తి కాలేదు.

ఆ సమయంలో రీటా బాగోగులను ఆమె మేనకోడలు జువానిటా చూసుకునేది.

ఆమె తన మాతృభూమిలో సంతృప్తిగా జీవిస్తూ, తనకు లభించిన పరిహారం మెక్సికోలో గణనీయమైన మొత్తంలో ఉన్నప్పటికీ, తాను పేదరికంలో ఎలా జీవించాల్సి వచ్చిందో ఎస్టీనోకు వివరంగా తెలిపారు.

"కోర్టు ఒక ట్రస్ట్‌ను సృష్టించి, డిజెబిలిటీ రైట్స్ సెంటర్‌ సంస్థ ఎంపిక చేసిన బీట్రిజ్ జపాటా అనే వ్యక్తిని రీటా ఆస్తుల నిర్వాహకురాలిగా నియమించింది. సుమారు రెండు సంవత్సరాల పాటు, ఈ జపాటా ఆమెకు నెలకు సుమారు రూ.25 వేలు ఇచ్చేది. ఆ తర్వాత ఒకేసారి ఆమెకు రూ.5 లక్షలు ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె డబ్బుతో అదృశ్యం అయింది" అని ఎస్టీనో వివరించారు.

చాలా సంవత్సరాల తర్వాత, న్యాయస్థానం జపాటా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది, ఎందుకంటే ఆమె రీటాకు చెల్లింపుల గురించి కోర్టుకు రిపోర్ట్ చేయడం మానేసింది.

అప్పుడే ఆమె చాలా డబ్బును తానే ఖర్చు చేసిందని గుర్తించారు. ఆమె తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించినా, జపాటా కేవలం రూ.8.6 లక్షలు మాత్రం జమ చేసింది.

కోర్టు తర్వాత ఇద్దరు కొత్త నిర్వాహకులను నియమించింది.

ట్రస్ట్‌ను నిర్వహించినందుకు ప్రతి సంవత్సరం వాళ్లకు రూ.83 వేలను ఇవ్వాలని ఆదేశించింది.

అయితే పదేళ్ల తర్వాత రీటా ఆచూకీ దొరకలేదని వాళ్లిద్దరూ కోర్టుకు తెలిపారు. ఈలోగా నిర్వహణ ఖర్చుల కింద డబ్బంతా అయిపోయింది.

మెక్సికోలో ఆమె ఉన్న సమయంలో ఆమె పాడటం, డ్యాన్స్ చేయడం అలవాటు చేసుకున్నా, రీటా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవారని ఎస్టీనో చెప్పారు.

ఆమె 2018లో మరణించినప్పుడు, ఆమె తరపు వాళ్లు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)