ఆంధ్రప్రదేశ్: బీబీసీ కథనం తర్వాత వీళ్లకు ఓటు హక్కు వచ్చింది.. తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తొలిసారి ఓటు వేసిన ఆదివాసీలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి తాజా ఎన్నికల్లో ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గిరిజనాపురం గ్రామం పరిస్థితి గురించి ఈ ఏడాది మార్చి 6న బీబీసీ ప్రత్యేక కథనం పబ్లిష్ చేసింది.

గోకవరం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామంలో సుమారు 50 మంది నివసిస్తున్నారు. వీరిలో 19 మందికి తొలిసారి ఓటు హక్కు వచ్చింది. బీబీసీ కథనం తరువాత వాళ్లకు ఓటరు గుర్తింపు కార్డులు కూడా లభించాయి.

గ్రామస్తులకు ఓటు హక్కు రావడంతో ఆ ఊరికి రాజకీయ పార్టీలు సైతం వచ్చాయి.

ఆ ఊరి ప్రజలు 2024 మార్చిలో బీబీసీతో మాట్లాడుతూ.. అంతకుముందు ఎన్నడూ తమ ఊరికి రాజకీయ పార్టీలు రాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ ఊర్లోని గుడిసెలకు పార్టీల జెండాలు కనిపిస్తున్నాయి.

నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో కూడా తమకు తెలియదని చెప్పిన ఈ గ్రామస్తులు, మే 13న జరిగిన ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే, కాకినాడ ఎంపీలను ఎన్నుకునేందుకు ఓటు వేశారు.

12 కుటుంబాలకు చెందిన 19 మంది ఓటర్లు కొండ దిగువన 4 కిలోమీటర్ల దూరంలోని వేములపాలెం పోలింగు బూతుకు వెళ్లి ఓటు వేశారు.

పోడు భూములపై హక్కులు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు కట్టించి తమ ఊరికి రోడ్డు వేయాలని వారు కోరుకుంటున్నారు. అంగన్ వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు.

వీడియో క్యాప్షన్, గిరిజనాపురం: బీబీసీ కథనంతో వీరికి ఓటు హక్కు వచ్చింది
కాకినాడలో మొదటిసారి ఆదివాసీల ఓటు

'ఓటేయడమూ రాదు'

గిరిజనాపురంలోని ఆదివాసీలు అంతా కొండదొర తెగకు చెందిన వారు. పోడు వ్యవసాయం, కట్టెలు కొట్టడం, బొగ్గులు అమ్ముకోవడం వీరి ప్రధాన జీవనాధారం. ఆ గ్రామంలో మాతే, ఉల్లి అనే ఇంటిపేర్లు ఉన్న వారు మాత్రమే నివసిస్తున్నారు.

"బీబీసీ వచ్చిన తర్వాతే మాకు ఓటర్ గుర్తింపు కార్డులు వచ్చాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మా గ్రామానికి వస్తున్నాయి. ఓటు అంటే తెలియని మేమంతా తొలిసారి ఓటు వేశాం. ఆ మిషన్లలో ఓటు ఎలా వేయాలో కూడా మాకు తెలియదు. అక్కడ ఉన్నవారు చెప్పడంతో ఓటు వేయగలిగాం" అంటూ గిరిజనాపురానికి చెందిన మాతే కుమారి చెప్పారు.

దశాబ్దాల తరబడి తమకు ఓటు హక్కు, సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో అందరికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆ ఊరి ప్రజలు తెలిపారు.

కాకినాడలో మొదటిసారి ఆదివాసీల ఓటు

"ఉపాధి హామీ పథకం అమలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రేషన్ బియ్యం మాత్రమే వస్తోంది. ఆరుగురికి వృద్ధాప్య పింఛన్లు, ముగ్గురికి వికలాంగ పింఛన్లు వస్తున్నాయి. వాటి కోసం నెలనెలా కొండ దిగాల్సి వస్తోంది. మా ఊరికి రోడ్డు వేయాలి. కొండ కొంత భాగం సరిచేశారు. మిగిలినది కూడా చేస్తే కనీసం మోటార్ సైకిళ్లయినా వస్తాయి. కరెంటు కూడా సరిగా ఉండదు. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. విద్యుత్ సదుపాయం కూడా మెరుగుపరచాలి" అని గ్రామానికి చెందిన మాతే వరలక్ష్మి కోరుతున్నారు.

ఈ గ్రామంలో మాతే కుమారితో పాటుగా వరలక్ష్మి అనే మరో వివాహిత మాత్రమే కాస్త చదువుకున్నవారు. వారిద్దరు కూడా ఈ గ్రామానికి కోడళ్లుగా వచ్చారు. వారిద్దరూ తమ సొంత ఊళ్లలో ప్రాథమిక విద్య అభ్యసించారు. గిరిజనాపురంలో బడి లేకపోవడంతో ఎవరూ చదువుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తే తమకు ఎంతో కొంత మేలు కలుగుతుందని వరలక్ష్మి తెలిపారు. ఓటు వేయడంతో ఈసారి అలాంటివన్నీ దక్కుతాయన్న నమ్మకం కలుగుతోందని అన్నారు.

కాకినాడలో మొదటిసారి ఆదివాసీల ఓటు

‘‘మొదటిసారి గ్రామానికి రాజకీయ పార్టీలు’’

చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి నుంచి గిరిజనాపురం గ్రామం కొండపైకి సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేవలం ఒక కొండ ఎక్కితే గ్రామానికి చేరుకోవచ్చు.

ఈసారి గ్రామంలో 19 మందికి ఓటు హక్కు రావడంతో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఆ గ్రామానికి వచ్చి ప్రచారం చేసినట్లు ఊళ్లో వాళ్లు తెలిపారు.

అయితే, రాజకీయ పార్టీలు, గుర్తులు, పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా తెలియవని వాళ్ల మాటల ద్వారా తెలుస్తోంది. పోలింగ్ ముందు రోజు అధికారులు వచ్చి స్లిప్పులు ఇవ్వడంతోపాటు ఎక్కడికి వచ్చి ఓటు వేయాలో చెప్పారని ఊళ్లో వాళ్లు తెలిపారు.

"ఓట్లు కోసం నాయకులు వచ్చారు. ఓటరు కార్డు అందించడానికి అధికారులు కూడా వచ్చారు. కాబట్టి ఇక అధికారులు మా గ్రామానికి కూడా నిత్యం వస్తూ ఉంటే మా రోడ్డు కూడా బాగుపడుతుంది. మా ఊరు బాగుపడుతుంది. మా పోడు భూములకు పట్టాలు, మాకు పక్కా ఇళ్లు అందించాలని కోరుతున్నాం. అవి దక్కితే మాకు స్థిరత్వం వస్తుంది. మా పిల్లల కోసం కనీసం అంగన్‌వాడీ కేంద్రమైనా నడపాలి" అని గిరిజనాపురం గ్రామస్థుడు మాతే బుజ్జిబాబు కోరారు.

ఊరిలో తాగేందుకు నీటి సదుపాయం లేక చలమల్లోని ఊట నీరు తాగుతున్నామని ఆయన తెలిపారు. మంచినీటి సదుపాయం కూడా కల్పించేందుకు బోరు ఏర్పాటు చేయాలని బుజ్జిబాబు కోరుతున్నారు.

కాకినాడలో మొదటిసారి ఆదివాసీల ఓటు

‘వారి సమస్యలన్నీ పరిష్కరిస్తాం..’

తూర్పు కనుమల వెంబడి ఉన్న అనేక గ్రామాల్లో గిరిజనాపురం ఒకటి. మార్చిలో ఈ గ్రామానికి వెళ్లినప్పుడు వారు అనేక సమస్యలను బీబీసీ దృష్టికి తీసుకొచ్చారు. గిరిజనాపురం గ్రామస్థులు వెల్లడించిన సమస్యలను బీబీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ తెలిపారు.

"గిరిజనాపురం వాసుల సమస్యలు మీడియా ద్వారా మా దృష్టికి వచ్చాయి. అధికారులకు సూచనలు చేశాం. వృద్ధులు కొండ దిగి రావడం కష్టం కాబట్టి వారికి పింఛన్లు గ్రామంలోనే అందించే ఏర్పాటు చేస్తాం. వారి పోడు భూములు, నివాస స్థలాల సమస్యలు కూడా పరిష్కరిస్తున్నాం. అటవీహక్కుల చట్టాన్ని అనుసరించి వారికి సదుపాయాలు మెరుగుపరుస్తాం. తాగునీటి సదుపాయం కల్పిస్తాం. అక్కడ పిల్లలు ఎంత మంది ఉన్నారనేదాన్ని బట్టి అంగన్ వాడీ కేంద్రం ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నాం. సబ్ ప్లాన్ ఏరియాలో నివసిస్తున్న ఈ గిరిజన తెగ వారందరికీ తగు సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం" అని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ వి. శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు

ఈ గ్రామస్థులకు ఇంతకాలం ఓటు హక్కు ఎందుకు లేదని బీబీసీ అడిగినప్పుడు, అందుకు కారణాలు తెలియదని అధికారులు తెలిపారు.

‘‘అసలు వారికి ఇన్నేళ్ల పాటు ఓటు హక్కు ఎందుకు దక్కలేదన్నది మాకు తెలియదు. కొందరికి ఆధార్ కార్డులు కూడా లేకపోవడం, వారికి సమాచార సదుపాయాలు కూడా లేకపోవడంతోనే అలా జరిగిందని భావిస్తున్నాం’’ అని డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)