ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఖద్దరుపై మనసు పడుతున్న కలెక్టర్లు

EVM

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మొన్నటి వరకు ఆ ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో ఫైళ్లతో కుస్తీ పడుతుండేవారు. ఇప్పుడు కర్నూలు నగర వీధుల్లో తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

మరో అధికారి కూడా అంతే, ఏడెనిమిది నెలల కిందటి వరకు ప్రణాళిక శాఖలో కీలక బాధ్యతలు చూసిన ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లో తిరగడం ప్రారంభించారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసి సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పెద్ద సంఖ్యలో సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు.

వీరిలో కొందరికి ఇప్పటికే ఎన్నికలలో పోటీ చేసిన అనుభవం, గెలిచి పదవులు చేపట్టిన అనుభవం ఉండగా మరికొందరికి మాత్రం ఇవే తొలి ఎన్నికలు.

ఈ ఎన్నికలలో అందరి నోళ్లలో నానుతున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఏఎండీ ఇంతియాజ్, జీఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్. ఇద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులే. ఇద్దరూ ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారు.

ఇంతియాజ్ ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు.

మరో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రిటైర్మెంట్ తరువాత కూడా కీలక పదవిలో కొనసాగినప్పటికీ గత ఏడాది జులైలో ఆ పదవికి రాజీనామా చేసి ఎన్నికల రాజకీయాలలోకి అడుగుపెట్టారు.

వీరిద్దరే కాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పలువురు మాజీ ఉన్నతాధికారులు పోటీపడుతున్నారు.

పాలనలో అత్యంత కీలకమైన కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు రెండూ ప్రజాసేవకు ఉద్దేశించినవే.

కానీ, ఈ మాజీ ఉన్నతాధికారులు ఇప్పుడు శాసన వ్యవస్థపై గురి పెడుతున్నారు.

ఇంతియాజ్ అహ్మద్

ఫొటో సోర్స్, A.md.imtiaz

ఫొటో క్యాప్షన్, ఇంతియాజ్ అహ్మద్

2 రూపాయల డాక్టర్‌కు అల్లుడిగా

ఇంతియాజ్ ఏపీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు కమిషనర్(సీసీఎల్ఏ)గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని రాజకీయాలలోకి వచ్చారు. అంతకుముందు ఆయన మైనారిటీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీగా, సెర్ప్ సీఈఓగా, కృష్ణా జిల్లా కలెక్టరుగా, ఇంకా ఏపీ ప్రభుత్వంలో అనేక ఇతర హోదాలలోనూ పనిచేశారు.

నిజానికి ఇంతియాజ్ సివిల్ సర్వీసెస్ నుంచి నేరుగా ఐఏఎస్ అయిన అధికారి కాదు.గ్రూప్ -1 పరీక్షలు పాసై కమర్షియల్ టాక్స్ అధికారిగా పనిచేస్తూ 2009లో ఐఏఎస్ హోదా పొందారు.

తాజాగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి ముందు తమ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు.

కర్నూలు జిల్లాలో రెండు రూపాయల డాక్టరుగా పాపులర్ అయిన కేఎం ఇస్మాయిల్‌కు ఇంతియాజ్ అల్లుడు.

కర్నూలు సిటింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు ఈసారి టికెట్ ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరిన ఇంతియాజ్‌కు జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు.

vijay kumar

ఫొటో సోర్స్, Liberation Congress/facebook

ఫొటో క్యాప్షన్, విజయ్ కుమార్

పరిటాలను ‘కట్టడి చేసిన’ అధికారిగా

ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్ 2023 జులై 22న ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓ పదవికి రాజీనామా చేశారు.

అంతకుముందే రిటైరైన ఆయన్ను జగన్ ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా నియమించింది.

దళిత వర్గానికి చెందిన విజయ్ కుమార్‌కు ప్రకాశం సహా వివిధ జిల్లాలలో కలెక్టర్‌గా, అనంతపురం జిల్లాలో సబ్ కలెక్టరుగా పనిచేసిన అనుభవం ఉంది.

అనంతపురం జిల్లాలో ఆయన సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ ఎన్నికలలో పరిటాల రవి ఎన్నికల అక్రమాలకు పాల్పడితే సమర్థంగా అడ్డుకున్నానని, 73 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరిగేలా చేసి ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగేలా చేశానని విజయ్ కుమార్ గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు.

దీంతో పరిటాల రవిని ఎదిరించిన అధికారిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. విజయ్ కుమార్ గత ఏడాది తన పదవికి రాజీనామా చేసిన తరువాత తిరుపతి జిల్లా తడ నుంచి కాకినాడ జిల్లా తుని వరకు 142 రోజుల పాటు పాదయాత్ర చేశారు.

12 జిల్లాల్లోని 65 నియోజకవర్గాలలో సుమారు 2,700 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర సాగింది. యాత్ర సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమయ్యానంటూ ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు.

ఆ పార్టీ తరఫున తిరుపతి(ఎస్సీ) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తొలి రోజున ఏప్రిల్ 18న ఈయన నామినేషన్ కూడా వేశారు.

జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలలో పనిచేసిన విజయ్ కుమార్‌ను వలంటీర్ వ్యవస్థ రూపకల్పనలోనూ కీలక వ్యక్తిగా చెప్తారు.

ఉద్యోగానికి రాజీనామా తరువాత ఆయన వైసీపీ నుంచి ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ సొంతంగా పార్టీ స్థాపించి పోటీ చేస్తున్నారు.

తిరుపతి లోక్‌సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిటింగ్ ఎంపీ గురుమూర్తి పోటీ చేస్తుండగా ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాద్ పోటీ చేస్తున్నారు.

V. V. Lakshmi Narayana

ఫొటో సోర్స్, V. V. Lakshmi Narayana (JD)/facebook

సీబీఐ మాజీ జేడీ సొంత పార్టీ

జేడీ లక్ష్మీనారాయణగా పాపులర్ అయిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నారు. 2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అనంతరం జనసేనకు రాజీనామా చేసి 2023 చివర్లో ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.

‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ అనే నినాదంతో ఆయన ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ ఈసారి విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మారుస్తామంటూ ఇప్పటికే ఒక మేనిఫెస్టోను కూడా ఆయన ప్రకటించారు.

1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ సీబీఐలో పనిచేస్తున్న సమయంలో అనేక కీలక కేసుల విచారణలో పాలుపంచుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటి కీలక కేసుల విచారణతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా లక్ష్మీనారాయణ ప్రస్తుతం పోటీ చేస్తున్న విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కె.కన్నపరాజు పోటీ చేస్తుండగా ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు.

కన్నపరాజు 2019 ఎన్నికలలో అప్పటి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో 1419 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కొప్పుల రాజు

ఫొటో సోర్స్, congress

రాహుల్ గాంధీ కోర్ టీం నుంచి నెల్లూరు బరిలోకి..

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాల నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

1981 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన కొప్పుల రాజు 2013లో నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్‌గా ఉంటూ తన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ టీంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగానూ ఉన్న కొప్పుల రాజు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి.

నామినేషన్ల స్వీకరణ తొలి రోజైన ఏప్రిల్ 18న ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.

కాగా నెల్లూరు లోక్‌సభ సీటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగుదేశం నుంచి వైసీపీ మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే హైప్రొఫైల్ నియోజకవర్గంగా మారిన నెల్లూరులో కొప్పుల రాజు ఎంతవరకు ప్రభావం చూపుతారనేది చూడాలి.

Velagapalli Varaprasad Rao

ఫొటో సోర్స్, Velagapalli Varaprasad Rao

ఫొటో క్యాప్షన్, వెలగపల్లి వరప్రసాదరావు

పుట్టింది కృష్ణా జిల్లా, పనిచేసింది తమిళనాడు, పాలిటిక్స్ తిరుపతిలో..

ఎస్సీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానం తిరుపతిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వెలగపల్లి వరప్రసాద రావు కూడా మాజీ ఐఏఎస్ అధికారే.

వరప్రసాదరావు 1983 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆ రాష్ట్రంలో ఆయన కీలక పదవులు నిర్వహించారు.

2009లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని ప్రజారాజ్యం పార్టీలో చేరి తిరుపతి నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు.

అనంతరం 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తిరుపతి ఎంపీగా గెలిచిన ఆయన 2019లో గూడూరు(ఎస్సీ) అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి గెలుపొందారు.

అయితే, ఈ ఎన్నికలలో ఆయనకు టికెట్ రాకపోవడంతో కొద్ది రోజుల కిందటే బీజేపీలో చేరి తిరుపతి టికెట్ సాధించుకున్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన వరప్రసాదరావు రాజకీయంగా సొంత జిల్లాలో కాకుండా దక్షిణ ఆంధ్రలో కెరీర్ వెతుక్కున్నారు.

Krishna Prasad Tenneti

ఫొటో సోర్స్, Krishna Prasad Tenneti/facebook

ఫొటో క్యాప్షన్, కృష్ణప్రసాద్

తెలంగాణలో ట్రై చేసి ఆంధ్రలో టికెట్ సాధించి

బాపట్ల (ఎస్సీ) లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి.కృష్ణప్రసాద్ 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణలో డీజీ హోదాలో ఆయన రిటైరయ్యారు.

అనంతరం బీజేపీ నుంచి వరంగల్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ఏపీలోని బాపట్ల నుంచి అవకాశం దక్కించుకున్నారు.

కృష్ణ ప్రసాద్ గతంలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా, వరంగల్‌, విశాఖ రేంజ్‌లలో డీఐజీగా పనిచేశారు. నెల్లూరు, విశాఖపట్నం, మెదక్‌, గుంటూరు జిల్లాలలో ఎస్పీగానూ పనిచేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండడం ఇప్పుడు టికెట్ తెచ్చుకోవడంలో కలిసొచ్చింది.

శింగనమల నియోజకవర్గంలో గతంలో గెలిచిన తల్లీకూతుళ్లు శమంతకమణి, యామినీబాలలు కృష్ణప్రసాద్‌కు సమీప బంధువులు.

బాపట్లలో వైసీపీ నుంచి సిటింగ్ ఎంపీ నందిగం సురేశ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఇక్కడ పోటీ చేస్తున్నారు.

జేడీ శీలం కూడా ఒకప్పుడు ఐఏఎస్ అధికారే. ఆయన కర్ణాటక క్యాడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ రాజకీయాలలోకి వచ్చారు.

ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన జేడీ శీలం తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ ఆయన్ను 2004లో రాజ్యసభకు పంపించింది. అప్పటి యూపీయే ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

deva varaprasad

ఫొటో సోర్స్, janasena party

ఫొటో క్యాప్షన్, దేవ వరప్రసాద్

జనసేన నుంచి రిటైర్డ్ ఐఏఎస్

2019 ఎన్నికలలో జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ అనంతరం వైసీపీలో చేరిపోయారు.

ప్రస్తుత ఎన్నికలలో జనసేన పార్టీ ఈ సీట్లో దేవ వరప్రసాద్‌కు టికెట్ కేటాయించింది.

వరప్రసాద్‌ది రాజోలు నియోజకవర్గంలోని దిండి గ్రామం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆయన సివిల్ సప్లయ్స్ సెక్రటరీగా, కమిషనర్‌గా, లేబర్ కమిషనర్‌గా పనిచేశారు.

రాజోలులో ప్రస్తుత ఎన్నికలలో వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తున్నారు.

Katikala Siva Bhagya Rao

ఫొటో సోర్స్, Katikala Siva Bhagya Rao/facebook

ఫొటో క్యాప్షన్, కటికల శివభాగ్యరావు

కొందరు మాజీ ఐఆర్ఎస్ అధికారులూ ఏపీ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఎస్సీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానం చిత్తూరులో తెలుగుదేశం పార్టీ ఐఆర్ఎస్ మాజీ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావును పోటీ చేయిస్తోంది.

మరో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తాను స్థాపించిన ఉత్తరాంధ్ర ప్రజాపార్టీ నుంచి పోటీలో ఉన్నారు.

2019లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో జనసేన తరఫున పోటీ చేసిన రామారావు అనంతరం ఉత్తరాంధ్ర ప్రజాపార్టీ పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు.

ఆల్ తెలుగు ప్రజా పార్టీ పేరిట కొత్త పార్టీ పెట్టిన మరో ఐఆర్ఎస్ అధికారి కటికల శివభాగ్యరావు కూడా ఈ ఎన్నికలలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు.

వీరే కాకుండా తమిళనాడుకు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌ ఐఏఎస్ అధికారి పేరు కూడా ఒక దశలో వినిపించింది.

వైసీపీ నుంచి ఏపీలో పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)