గజల్ అలఘ్: ప్రెగ్నెన్సీపై ఈమె చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది, విషయం ఏంటంటే..

ఫొటో సోర్స్, GHAZAL ALAGH@LINKEDIN
గజల్ అలఘ్ అనే మహిళ సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ 'మామాఎర్త్' సహ వ్యవస్థాపకురాలు. తాను ఎనిమిది నెలల గర్భంతో ఉన్నప్పుడు కూడా రోజూ 12 గంటలు పని చేశానని ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అది చర్చనీయాంశమైంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇంజనీర్ ప్రకృతి శర్మ ఆమె పోస్ట్‌పై 'నాన్సెన్స్' అంటూ కామెంట్ చేశారు.
ప్రెగ్నెన్సీ సమయంలో తనకు, బిడ్డకు ప్రాధాన్యత ఇవ్వకుండా షూట్‌లలో బిజీగా ఉండటం సరికాదంటూ ఆమె సూచించారు.
అనంతరం చాలామంది ఈ విషయంపై స్పందించారు. గర్భంతో ఉన్న సమయంలో మహిళల పని, విశ్రాంతి గురించి వైద్యులు, నెటిజన్లు చర్చిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
గజల్ అలఘ్ కొన్నిరోజుల కిందట లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్టు పెట్టారు.
"మీరు గర్భవతి అయితే నిదానంగా పనిచేయాలి. 'షార్క్ ట్యాంక్ ఇండియా' అనే ప్రోగ్రాంలో అవకాశం వచ్చినపుడు నా స్నేహితులు, బంధువులు నాకు చెప్పిన మాట ఇది. నేను ఆ అవకాశాన్ని అందుకొని, ఎనిమిది నెలల గర్భవతిని అయి కూడా రోజుకు 12 గంటలు షూట్‌లో పాల్గొన్నాను. నా లక్ష్యం ఇతరులను ప్రేరేపించడమే. గర్భంతో ఉన్న సమయంలో మహిళలు తక్కువ పనిచేస్తారనే అపోహను ముఖ్యంగా పురుషులలో తొలగించడమే నా ఉద్దేశం. ఈ ఏడాది మా ఇన్నోవేషన్ బృందంలో నలుగురు మేనేజర్లు గర్భిణీలు. మేం పిల్లలనే కాదు, నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా డెలివరీ చేయగలం'' అని ఆ పోస్టులో రాశారు.

ఫొటో సోర్స్, LInkedin
ఆమె పోస్ట్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్ ప్రకృతి శర్మ షేర్ చేస్తూ, విమర్శించారు.
"గర్భిణీ తన బిడ్డకు కాకుండా షూటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం పూర్తిగా అర్ధంలేనిదిగా భావిస్తున్నాను. గర్భంతో ఉన్న సమయంలో తనపై తాను మూర్ఖంగా, కఠినంగా ప్రవర్తిస్తూ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడమే కాకుండా దానికి ధృవీకరణ కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంటర్నెట్‌లో ఇలాంటి అర్ధంలేని వాటిని మహిళలు నమ్మవద్దు" అని సూచించారు.

ఫొటో సోర్స్, LINKEDIN
ప్రశంసనీయమే కానీ..
గజల్, ప్రకృతి శర్మల పోస్టులకు సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి.
జెర్మీనా మీనన్ అనే మహిళ గజల్ అలఘ్‌ను ప్రశంసిస్తూ ‘‘మీ ఉద్దేశం, అపోహలను సవాలు చేసే మీ ప్రయత్నం ప్రశంసనీయం’’ అన్నారు.
గర్భం అనేది స్త్రీకి అడ్డంకిగా మారకూడదని అర్నాబ్ గుహా అనే నెటిజన్ చెబుతూ, గర్భిణీగా ఉన్న సమయంలో కష్టమైన పనులకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.
వృత్తిరీత్యా ప్రోస్టోడాంటిస్ట్ అయిన డా. పద్మప్రియ పుప్పాల, గజల్ పోస్టుపై స్పందిస్తూ "ఇది అంత మంచి అభిప్రాయం కాదు. మీకు సాధ్యమైతే అది మీ అదృష్టం, అందరికీ అలా ఉండదు. తొమ్మిది నెలల గర్భిణీగా ఉండి కూడా నేను పనిచేయాల్సి వచ్చింది. అది నేను చేయాలనుకుంది కూడా కాదు" అని చెప్పారు.
"గర్భధారణకు సంబంధించిన ప్రతి సందర్భం భిన్నంగా ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు గర్భిణీ నడుచుకోవాలి. అనవసరంగా ఎక్కువ పని చేసి, ఒత్తిడికి గురికావొద్దు" అని సోనియా సాహ్ని అనే మహిళ సూచించారు.
స్వాతి మిశ్రా అనే మరో నెటిజన్ ''గజల్, ఆమెకు తోడుగా నిలిచే కుటుంబం, మెరుగైన వైద్యులు ఉన్నారనే వాస్తవాన్ని పూర్తిగా విస్మరించారనుకుంటున్నా. అందరి నుంచి అదే ఆశించడం కొంచెం ఎక్కువ" అని కామెంట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- హవానా సిండ్రోమ్: ఈ అంతుచిక్కని ఆరోగ్య సమస్యకూ రష్యా నిఘా వ్యవస్థకూ సంబంధం ఉందా?
- ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాంల 'గీతగోవిందం' మ్యాజిక్ రిపీటయిందా?
- రష్యా: సెక్స్ థీమ్ పార్టీలపై పోలీసులు ఎందుకు దాడి చేస్తున్నారు... అక్కడ అసలేం జరుగుతోంది?
- బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పుడు కొనడం మంచిదా, అమ్మడం మంచిదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














