హవానా సిండ్రోమ్: ఈ అంతుచిక్కని ఆరోగ్య సమస్యకూ రష్యా నిఘా వ్యవస్థకూ సంబంధం ఉందా?

హవానా సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2016లో క్యూబాలో హవానా సిండ్రోమ్ తొలి కేసు నమోదైంది.
    • రచయిత, జేమ్స్ ఫిట్జ్‌గెరాల్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఈ మధ్య కాలంలో అమెరికా దౌత్యవేత్తల ఎదుర్కొన్న అంతుచిక్కని ఆరోగ్య సమస్యకు రష్యా ఇంటెలిజెన్స్ యూనిట్‌కూ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికా సిబ్బంది, ఈ ‘హవానా సిండ్రోమ్’ బారిన పడ్డామని, తలతిరగడం, మైకం కమ్మడం లాంటి కచ్చితంగా చెప్పలేని లక్షణాలతో బాధపడ్డామని చెప్పారు.

ది ఇన్‌‌సైడర్, డెర్ స్పీజెల్, సీబీఎస్‌కు చెందిన 60 మినిట్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వెల్లడైన వివరాల ప్రకారం, వారిపై రష్యన్ సోనిక్ ఆయుధాలతో దాడి జరిగింది.

ఈ ఆరోపణల్ని రష్యా ఖండించింది. విదేశీ శక్తులు దీని వెనుక ఉన్నాయని అమెరికా అధికారులు గతంలో చెప్పారు.

అనామలస్ హెల్త్ ఇన్సిడెంట్స్ (ఏహెచ్ఐ-అసాధారణ ఆరోగ్య పరిస్థితుల) పరిశీలన అనంతరం నిరుడు వెల్లడించిన నివేదికలోనూ అందుకు కారణాలపై ప్రత్యామ్నాయ వివరణలేవీ ఇవ్వకపోవడం బాధితులను నిరాశపర్చింది.

ఆ పరిశీలనలో భాగమైన నిఘా సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు అమెరికా అధికారులు కూడా అంగీకరించారు.

ఎఫ్‌బీఐ

ఫొటో సోర్స్, Getty Images

హవానా సిండ్రోమ్ అంటే ఏమిటి?

హవానా సిండ్రోమ్‌కు సంబంధించిన మొదటి కేసు 2016లో క్యూబా రాజధాని హవానాలో నమోదైంది. అయితే, కొత్త నివేదిక చెబుతున్న దాని ప్రకారం తొలి కేసు అంతకన్నా రెండేళ్ల ముందే, జర్మనీలో నమోదైంది.

వాషింగ్టన్‌ మొదలుకొని చైనా వరకు ప్రపంచ వ్యాప్తంగా చాలా కేసులు నమోదయ్యాయి.

నిరుడు అమెరికా రక్షణ శాఖ సీనియర్ అధికారి లిథువేనియాలో నాటో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో హవానా సిండ్రోమ్ లక్షణాల తరహాలోనే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నట్లు, సోమవారం పెంటగాన్ వెల్లడించింది.

వైట్‌హౌస్‌, సీఐఏ, ఎఫ్‌బీఐ సిబ్బంది సహా పలువురు అమెరికా సిబ్బంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. తలనొప్పి, వికారం, ఏకాగ్రత లోపించడం, తలతిరగడం, చెవుల్లో నొప్పిని కలిగించే విపరీతమైన శబ్దాలతో ఇబ్బందులు పడ్డామని వారు ఫిర్యాదు చేశారు.

ఈ అంతుచిక్కని సమస్యకు సంబంధించి వెయ్యికి పైగా ఫిర్యాదులు అందాయి. పదుల కొద్దీ కేసులకు ఇప్పటికీ వివరణలు లభించడం లేదు. అమెరికా ప్రభుత్వం బాధితులకు మద్దతు ఇచ్చేందుకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అయితే, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ గత నెలలో ప్రచురించిన అధ్యయనంలో, ఏహెచ్‌ఐల బారిన పడిన అమెరికా సిబ్బందికి నిర్వహించిన ఎమ్‌ఆర్ఐ స్కాన్‌‌ పరీక్షల్లో ఏ కారణంగా మెదడుకు గాయమైందో, ఆ ఆధారాలేవీ గుర్తించలేకపోయాయని తెలిపింది.

ఆ సిండ్రోమ్ గురించి ఫిర్యాదు చేసిన వారు రహస్య పరికరాల నుంచి డైరెక్టెడ్ ఎనర్జీ లేదా మైక్రోవేవ్ తరంగాల దాడికి గురై ఉండొచ్చని చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయి. గతంలో అమెరికా నిఘా విభాగం విడుదల చేసిన నివేదికలోనూ ఇదే చెప్పారు.

హవానా సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొందరు అమెరికా దౌత్యవేత్తలు తాము ఈ సిండ్రోమ్ బారిన పడినట్లు ఫిర్యాదు చేశారు.

నివేదికలో ఏముంది?

రష్యన్ మిలటరీ ఇంటెలిజెన్స్‌లో 29155 యూనిట్‌‌కు చెందినవారే అమెరికా దౌత్యవేత్తల మెదళ్లను లక్ష్యంగా చేసుకుని ‘డైరెక్టెడ్ వెపన్స్’తో దాడికి పాల్పడినట్లు ప్రస్తుతం వెల్లడైన మీడియా పరిశోధన నివేదిక చెబుతోంది.

ఆ యూనిట్‌కు చెందినవారు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అమెరికా దౌత్యవేత్తలు ఆ రుగ్మత బారిన పడ్డామని చెప్పిన సమయంలో అక్కడే ఉన్నట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక చెబుతోంది.

2018లో యూకేలో సెర్జీ స్క్రిపాల్ అనే మాజీ రష్యన్‌ స్పై‌పై విష ప్రయోగ ఘటనతో సహా, విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్ల కోసం నియమితమైన ఈ రహస్య యూనిట్‌కు, ఈ ఘటనలతో సంబంధం ఉందని నివేదిక తెలిపింది.

ప్రధానంగా రష్యాపై దృష్టిసారించే ది ఇన్‌సైడర్ పత్రిక నిర్వహించిన దర్యాప్తులో 29155 యూనిట్‌కు చెందిన అధికారికి ‘నాన్ లెథల్ అకౌస్టిక్ వెపన్స్’ అభివృద్ధికిగానూ రివార్డ్ పొందినట్లు తెలిపింది.

ఈ సిండ్రోమ్ లక్షణాలను పరిశీలిస్తున్న అమెరికా మిలటరీ పరిశోధకులు 60 మినిట్స్‌తో ఈ సిండ్రోమ్‌ బారిన పడిన బాధితులందరికీ ఒక కామన్ లింక్ ఉందని, అదే ‘రష్యాతో ఉన్న సంబంధం’ అని చెప్పారు.

గ్రెగ్ ఎడ్‌గ్రీన్ దీని గురించి వివరిస్తూ, “రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు, రష్యాపై దృష్టి సారించిన వారు, అత్యుత్తమ పనితీరు కనబర్చిన వారు బాధితుల్లో ఉన్నారు” అని చెప్పారు.

కొన్ని కఠోర వాస్తవాలను అంగీకరించేందుకు తన దేశం సిద్ధంగా లేదని ఆయన అన్నారు. అందుకే, రష్యా ప్రమేయం ఉందని నిరూపించేందుకు “అత్యంత బలమైన సాక్ష్యాధారాలు” కావాలంటోందని అన్నారు.

డిమిత్రీ పెస్కొవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కొవ్

నివేదికపై రష్యా ఏమంది?

ఆ నివేదికపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కొవ్ స్పందిస్తూ, “ఈ నిరాధారమైన ఆరోపణలకు సంబంధించిన బలమైన సాక్ష్యాలను ఇంతవరకు ఎవరూ ఎక్కడా ప్రచురించలేదు. లేదా వ్యక్తం చేయలేదు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలే తప్ప మరేమీ లేదు” అన్నారు.

ఈ సిండ్రోమ్ బారిన ఎఫ్‌బీఐ ఏజెంట్ ‘60 మినిట్స్‌’తో మాట్లాడారు. 2021లో అమెరికాలోని ఫ్లోరిడాలో తన ఇంట్లో ఉన్నసమయంలో బలమైన శక్తి తనపై దాడి చేసినట్లుగా అనిపించిందని ఆమె చెప్పారు.

“ఉన్నట్లుండి నా కుడి చెవిలో విపరీతమైన శబ్దం వినిపించింది. డెంటిస్ట్ డ్రిల్లింగ్ చేస్తుంటే ఎలా ఉంటుందో, అలా అనిపించింది. అది కర్ణభేరిని చేరుతున్నప్పుడు ఆ శబ్దం పది రెట్లు ఎక్కువగా అనిపించింది” అన్నారు.

ఆ సిండ్రోమ్ బారిన పడిన క్యారీ కోలుకున్నప్పటికీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించి సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపారు.

ఆ నివేదికపై అమెరికా అధికారులు బీబీసీ అమెరికా భాగస్వామి అయిన సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ- “ఏహెచ్‌ఐలపై లోతైన పరిశోధనలు కొనసాగుతాయి” అని చెప్పారు. అయితే, “విదేశీ ప్రత్యర్థులే ఇందుకు బాధ్యులు” అంటూ గతంలో అన్న మాటే మళ్లీ అన్నారు.

కానీ, “ఆ సిండ్రోమ్ బారిన పడిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆ నివేదికలో పేర్కొన్న వివరాలు, ఎదురైన అనుభవాల గురించి ప్రశ్నించబోవడం లేదు” అన్నారు అమెరికా అధికారులు. అందుకు కారణం వివరిస్తూ, ప్రాధాన్యాలను బట్టి వ్యవహరిస్తామన్నారు.

అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ మాత్రం, కొత్త ఆరోపణలు “చాలా ఆందోళనను కలిగిస్తున్నాయి” అన్నారు.

ఆయన సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ, “నేను పదవిలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాను. కానీ, ఇప్పటి ప్రభుత్వం అంతగా దృష్టి సారించినట్లు కనిపించడం లేదు” అన్నారు.

రిపబ్లిక్ పార్టీకి చెందిన సెనెటర్ జేడీ వాన్స్ ఆ నివేదికను కొట్టిపారేశారు. “చూస్తుంటే చాలా మంది జర్నలిస్టులకు బుర్ర పనిచేయనట్లుగా అనిపిస్తోంది” అని ‘ఎక్స్‌’లో రాశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)