రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ మళ్లీ మళ్లీ ఎలా గెలుస్తున్నారు?

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి అధ్యక్షుడవుతారనేది ఎప్పుడో ఖాయమైంది. ఎందుకంటే పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులూ క్రెమ్లిన్ (రష్యన్ ప్రభుత్వం) నామినేట్ చేసిన వ్యక్తులే.

పోలైన ఓట్లలో 87 శాతం ఓట్లు సాధించానని తెలిశాక, అనేక పశ్చిమ దేశాల కంటే రష్యా ప్రజాస్వామ్యం బలంగా ఉందని పుతిన్ వ్యాఖ్యానించారు.

పుతిన్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష నేతలెవరినీ ఎన్నికలలో పోటీ చేయనీయలేదు. పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మద్దతుదారులు దీనిపై నిరసన వ్యక్తంచేశారు కూడా.

రష్యాలో 'నూన్ ఎగైనెస్ట్ పుతిన్' క్యాంపెయిన్‌ నడిచింది. దీనిలో భాగంగా రష్యాలో మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌తో సహా పలు నగరాలలో, ప్రపంచవ్యాప్తంగా కొన్ని రష్యన్ ఎంబసీ కార్యాలయాల ముందు ఓటర్లు గుమిగూడి నిరసన తెలిపారు. దీనిని 'ప్రోటెస్ట్ ఓటింగ్' అని పిలుస్తారు. అయితే, ఈ ప్రదర్శనలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు.

రష్యాలో కనీసం 80 మందిని అరెస్టు చేసినట్లు మానిటరింగ్ గ్రూప్ ఓవీడీ-ఇన్ఫో తెలిపింది. శుక్రవారం కూడా కొన్ని పోలింగ్ బూత్‌లపై దాడులు జరిగినట్లు సమాచారం.

పాశ్చాత్య దేశాలు రష్యా ఎన్నికల తీరును ఖండించాయి. "ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదు" అని ఆరోపించాయి.

ఈ ఎన్నికలు సెన్సార్‌షిప్, అణచివేత, హింస మధ్య జరిగిన "మాక్ ఎలక్షన్" అని జర్మనీ పేర్కొంది.

యుక్రెయిన్ భూభాగంలో చట్టవిరుద్ధంగా ఎన్నికలు జరిగాయని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ ఆరోపించారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్ స్కీ "రష్యన్ నియంత మరో పారదర్శకత లేని ఎన్నికను నిర్వహిస్తున్నారు" అని అన్నారు.

లిథువేనియాలో ఆశ్రయం పొందుతున్న నావల్నీ సహోద్యోగి లియోనిడ్ వోల్కాఫ్‌ను వారం క్రితం సుత్తితో దారుణంగా కొట్టారు.

ఈ ఎన్నికలపై ఆయన స్పందిస్తూ.. పుతిన్‌కు వచ్చిన ఓట్ల శాతానికి వాస్తవికతకు ఏ మాత్రం దగ్గరగా లేవని ఆరోపించారు.

రష్యా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

బ్యాలెట్ బాక్సులతో ఇళ్లకు

రష్యాలో మూడు రోజుల పాటు ఎన్నికలు జరిగాయి, రష్యా ఆక్రమిత యుక్రేనియన్ ప్రాంతాలలోనూ కొనసాగాయి.

ప్రజలను వారి ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి ఎన్నికల్లో పాల్గొనేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆదివారం రష్యా ఆక్రమిత నగరం బెర్డియాన్స్క్‌లో ఎన్నికల కమిషన్ అధికారి మృతి చెందారనే వార్త వెలుగులోకి వచ్చింది.

రష్యా మద్దతుదారులు, ఆర్మీ సిబ్బందితో కలిసి బ్యాలెట్ బాక్సులతో ప్రజల ఇళ్లకు వెళ్లి ఓట్లు వేయించుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఫలితాల అనంతరం రష్యా టీవీ ఛానెళ్లు పుతిన్ విజయాన్ని భారీ విజయంగా ప్రకటించాయి.

ఒక రష్యన్ ఛానెల్‌లోని జర్నలిస్ట్ "ఇది వ్లాదిమిర్ పుతిన్‌కు పెద్ద మద్దతు, పాశ్చాత్య దేశాలకు సందేశం" అని అన్నారు.

ఎన్నికల్లో విజయం తర్వాత పుతిన్ పాత్రికేయులతో మాట్లాడారు. రష్యా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రశంసించారు, ఇది అమెరికా కంటే మెరుగైనదని పుతిన్ అన్నారు.

రష్యా ఆన్‌లైన్ ఓటింగ్ విధానం అనుసరించింది. ఈ ప్రక్రియలో పుతిన్‌కు 80 లక్షల ఓట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

“ఇది పారదర్శకం, కచ్చితమైనది. అమెరికా మాదిరి కాదు'' అని పుతిన్ ఆరోపించారు.

స్వతంత్ర వాచ్‌డాగ్ సంస్థ గోలోజ్‌ను ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షించకుండా నిరోధించారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి.

ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలింగ్‌ బూత్‌ లేదా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా ఓటు వేయాలని ఒత్తిడి చేశారని కూడా చెప్పాయి.

నావల్నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ ఆర్కిటిక్ జైల్లో మరణించారు.

పుతిన్ నోట నావల్నీ పేరు

ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థులను పుతిన్ ప్రశంసించారు, వారు ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించారని చెప్పారు.

ఆర్కిటిక్ జైల్లో మరణించిన తర్వాత మొదటిసారి అలెక్సీ నావల్నీ గురించి పుతిన్ మాట్లాడారు. నావల్నీని హత్య చేయించాననే ఆరోపణలపై ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

నావల్నీని విదేశాలకు అప్పగించి పాశ్చాత్య దేశాలలో ఉన్న ఎవరైనా రష్యన్ ఖైదీని తీసుకురావడం, అంతేకాకుండా నావల్నీ తిరిగి రష్యాకు రాకూడదనే షరతులపై చర్చలు జరిగాయనే వార్తలను పుతిన్ ధృవీకరించారు.

“నేను ఆ ప్రతిపాదనకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను, కానీ దురదృష్టవశాత్తు.. జరిగిందేదో జరిగింది. ఏం చేయగలం. ఇది జీవితం'' అని అన్నారు పుతిన్.

రష్యా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెలుపల యులియా నవెల్నాయ ప్రొటెస్ట్ ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ప్రొటెస్ట్ ఓటింగ్‌

యులియా నవెల్నాయ బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెలుపల ఆరు గంటల పాటు నిలబడి ప్రొటెస్ట్ ఓటింగ్‌లో పాల్గొన్నారు.

తన బ్యాలెట్ పేపర్‌పై భర్త నావల్నీ పేరు రాసుకున్నాననీ ఆమె చెప్పారు.

నిరసనలో చేరడానికి వచ్చిన ప్రజలను యులియా ప్రశంసిస్తూ "ఇది అన్నింటినీ కోల్పోలేదనే ఆశను కలిగిస్తోంది" అన్నారు.

లండన్‌లో ఓటు వేయడానికి ఏడు గంటలకు పైగా క్యూలో నిలబడ్డానని ఒక ప్రొటెస్ట్ ఓటరు చెప్పారు.

''ఈ ప్రొటెస్ట్ ఓట్లు క్రెమ్లిన్ ఫలితాలలో ప్రతిబింబించవు. కానీ ఇది ఐక్యతకు చిహ్నం, చాలా ముఖ్యమైనది'' అని వాషింగ్టన్ డీసీలో హక్కుల కార్యకర్త, న్యాయవాది లియుబోవ్ సోబోల్ అన్నారు.

రష్యా ఎన్నికలు అందరికీ సమాన అవకాశాలు వచ్చేలా జరగడం లేదు. అక్కడి మీడియా, రాజకీయాలను క్రెమ్లిన్ అదుపులో ఉంచుకుంది.

బలమైన ప్రత్యర్థి లేని ఎన్నిక

కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ 4 శాతం కంటే కొంచెం ఎక్కువ ఓట్లు పొందారు, అతని తోటి అభ్యర్థులకు అంతకంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

ముగ్గురు అభ్యర్థులు అంత సీరియస్‌గా లేరు, ఇక ఖరిటోనోవ్ అయితే తన ప్రచారంలో ఏకంగా పుతిన్‌ను ప్రశంసించారు.

"పుతిన్ దేశాన్ని ఏకీకృతం చేయడానికి, అన్ని రంగాలలో విజయం సాధించడానికి కృషి చేస్తున్నారు" అని ఖరిటోనోవ్ అన్నారు.

దీంతో తమకు ప్రత్యామ్నాయం లేనందున లక్షలాది మంది పుతిన్‌కు ఓటు వేసి, ఐదో సారి గెలిపించారు.

దీనికి ముఖ్య కారణం ఏంటంటే క్రెమ్లిన్ ఎటువంటి విశ్వసనీయ ప్రత్యర్థిని రాజకీయంగా దరిదాపుల్లో ఉండనివ్వలేదు.

పుతిన్ ప్రత్యర్థులను జైలులో పెట్టేశారు, కొందరు వివిధ దేశాలలో బతుకుతున్నారు.

యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకుడు బోరిస్ నదేజ్డిన్‌కు ఎన్నికలలో నిలబడటానికి అనుమతి దక్కొచ్చని కొన్ని వారాలుగా వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఆయనకు మద్దతు కూడా పెరిగింది. అయితే గత నెలలో ఎన్నికల సంఘం ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)