ఎన్నికల కోడ్ అంటే ఏంటి? ఇది అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడ్ ఆఫ్ కండక్ట్) లేదా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఏప్రిల్ 19నుంచి జూన్ 1వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ జూన్ 6 లోపు పూర్తవుతుందని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలతోపాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశాలో నాలుగు దశల్లో, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లో ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
వీటితో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలతోనే వీటిని కూడా నిర్వహిస్తారు.
ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను ప్రకటించడంతో దేశంలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఏంటి? దీన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థులకు వర్తించే నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికలకు ఎన్నిరోజుల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది?
ఎన్నికల సంఘం, అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది.
ఎన్నికల ప్రచారాన్ని ఇది ప్రభావితం చేస్తుందా?
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలనే ‘‘మోడల్ ఆఫ్ కండక్ట్’’ అని అంటారు.
ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే, ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవచ్చు.
ఈ నియమాలను ఉల్లంఘించినవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి చర్యలు తీసుకుంటారు. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసును దాఖలు చేయవచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.
ఎన్నికల కోడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రవర్తన, ఎన్నికల సభ, ర్యాలీ, ఊరేగింపు, రోడ్ షోలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు ఉంటాయి. వీటితో పాటుగా ఓటింగ్ రోజున పార్టీలు, వాటి అభ్యర్థుల ప్రవర్తన, పోలింగ్ బూత్ క్రమశిక్షణ, ఎన్నిక సమయంలో పరిశీలకుల పాత్ర, అధికార పార్టీ పాత్రల గురించి ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల కోడ్‌లోని ప్రముఖ నిబంధనలు
- ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ ప్రకటనలు, పథకాల ప్రకటన, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాలు చేపట్టకూడదు.
- ప్రభుత్వానికి చెందిన వాహనాలు, విమానాలు లేదా బంగ్లాలను ఎన్నికల ప్రచారానికి వాడరాదు.
- ఏదైనా పార్టీ తమ అభ్యర్థికి మద్దతుగా ర్యాలీ, ఊరేగింపులు, ఎన్నికల సభ నిర్వహించాలంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి.
- ఏ రాజకీయ పార్టీ కూడా కులం, మతం ఆధారంగా ఓటర్లను ఓట్లు అడగకూడదు. కులమత విభేదాలు, ఉద్రిక్తతలకు కారణమయ్యే ఏ పనిలోనూ రాజకీయ పార్టీలు పాల్గొనకూడదు.
- రాజకీయ పార్టీలపై విమర్శలు చేసేటప్పుడు ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత రికార్డులకే పరిమితం కావాలి. అంతేగానీ వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదు.
- అనుమతి లేకుండా ఎవరి ఇళ్లు, పరిసరాలు, గోడల మీద పార్టీ జెండాలు, బ్యానర్లు పెట్టకూడదు.
- పోలింగ్ రోజున మద్యం దుకాణాలు మూసి ఉంటాయి. ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేయడం నిషేధం.
- ఓటింగ్ సమయంలో, పోలింగ్ బూత్‌ల దగ్గర రాజకీయ పార్టీలు, అభ్యర్థుల క్యాంపుల్లో జనాలు గుమిగూడకుండా చూసుకోవాలి.
- రాజకీయ పార్టీల శిబిరాల వద్ద ఎలాంటి ఆహార పదార్థాలను పంచకూడదు. ఎలాంటి ప్రచార సామగ్రి ఉండకూడదు.
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నేరాల పరిధిలోకి వచ్చే అన్ని కార్యకలాపాలకు రాజకీయ పార్టీలన్నీ, అభ్యర్థులందరూ దూరంగా ఉండాలి. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, ఓటర్లను భయపెట్టడం, నకిలీ ఓట్లు వేయించడం, పోలింగ్ స్టేషన్‌లకు 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయడం, ఓటర్లను పోలింగ్ స్టేషన్‌కు సొంత వాహనాల్లో తరలించడం వంటివి నేర కార్యకలాపాల పరిధిలోకి వస్తాయి.
- రాజకీయ కార్యక్రమాలపై నిఘా ఉంచేందుకు పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుంది.
- ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిని బదిలీ చేయడానికి వీల్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల కోడ్ అమలులో ఎన్నికల సంఘం పాత్ర ఏంటి?
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సక్రమంగా అమలు చేసేందుకు ఎన్నికల సంఘం, పరిశీలకుల సహాయం తీసుకుంటుంది.
ఇందుకోసం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారుల సహాయం తీసుకుంటారు.
వీరితో పాటుగా ఈ సర్వీసుల నుంచి రిటైర్ అయిన అధికారులను కూడా పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమిస్తుంది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా మొదలైంది?
1960 కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ మొదలైంది. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి అంగీకారం తెలిపిన తర్వాతే ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేశారు.
ఇందులో ఎలాంటి నిబంధనల్ని పాటించాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్ణయించుకున్నారు.
1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత, 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవర్తనా నియమావళిని అనుసరించారు. తర్వాత దీనికి మరిన్ని నిబంధనలు జోడించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనేది ఏ చట్టంలోనూ భాగం కాదు. అయితే, ఎన్నికల కోడ్‌లోని కొన్ని నిబంధనలు, ఐపీసీ సెక్షన్ల ఆధారంగా అమలు అవుతాయి.
ఎన్నికల కోడ్‌ను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో ప్రతీ ఎన్నికల్లోవాటి ఉల్లంఘనకు సంబంధించిన ఉదాహరణలు వెలుగులోకి వస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల కోడ్ ఎలా మారుతూ వచ్చింది?
ఎన్నికల సంఘం 1979 సెప్టెంబర్‌లో రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవర్తనా నియమావళిని సవరించింది. 1979 అక్టోబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీటిని అమలు చేసింది.
1991 సాధారణ ఎన్నికలు, ఎన్నికల కోడ్ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. అప్పుడే ప్రవర్తనా నియమావళిని విస్తరించారు.
అదే ఏడాది, తేదీలు ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేశారు. కానీ, నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.
ఈ అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు.
పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ విషయంలో స్పష్టత వచ్చింది.
ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తేదీ నుంచే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తీసుకురావాలన్న ఎన్నికల సంఘం చర్యకు 1997 మే నెలలో హైకోర్టు సమర్థించింది.
దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.
చివరకు 2001 ఏప్రిల్ 16న ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన భేటీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి తీసుకురావడానికి అంగీకరించారు.
ఇవి కూడా చదవండి:
- గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది...' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- సుద్ద పొడికి కవర్ చుట్టి, బ్రాండ్ వేసి, ట్యాబ్లెట్లుగా అమ్మేస్తున్నారు..
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- స్కార్లెట్ ఫీవర్: ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకమా? లక్షణాలు, చికిత్స ఏమిటి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














