ఆంధ్రప్రదేశ్: అనంతపురం అరటి సాగులో బెంగాలీ కూలీల పాత్ర కీలకమా?

బెంగాలీ వలస కూలీలు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

షాహీన్‌కు పెళ్లయి ఆరు నెలలు అవుతోంది. ఉపాధి కోసం కుటుంబాన్ని, తన సొంతూరు జలాల్పుర్ (పశ్చిమ బెంగాల్)ను వదిలేసి, సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురానికి వచ్చారు.

తల్లిదండ్రులను, భార్యను వదిలి ఇంత దూరం రావడం కష్టంగా లేదా? అని ప్రశ్నిస్తే, ఇంట్లో వాళ్ల పొట్ట నింపాలంటే తప్పదు అని షాహీన్ నిట్టూర్చారు.

షాహీన్ మాదిరిగా ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వలస వస్తున్న కూలీలు లక్షల్లోనే ఉన్నారు. వరి నాట్లు, అరటి గెలల ప్యాకింగ్ వంటి పనుల్లో ఎక్కువగా వీరు కనిపిస్తుంటారు.

బెంగాలీ వలస కూలీలు

ఏడాదికి సుమారు 4 లక్షల మంది

తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనుల కూలీల కొరత ఉంది. మెరుగైన జీవనం కోసం ప్రజలు పట్టణాలకు వలస పోతుండటం, ఇతర రంగాల్లో మంచి వేతనాలు లభిస్తుండటం, శారీరక శ్రమ చేసేవారి సంఖ్య తగ్గుతుండటం వంటి కారణాలతో స్థానికంగా పెద్దగా కూలీలు దొరకడం లేదు.

ఈ కొరతను పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు పూరిస్తున్నారు. ఎక్కువ పని చేయడం, ఎంతటి శారీరక శ్రమకైనా వెనుకాడకపోవడం వంటి కారణాలతో వారికి డిమాండ్ పెరుగుతోంది.

స్థానిక వ్యవసాయ కూలీలు ఎక్కువ కూలీ డిమాండ్ చేస్తుండటంతో ఎక్కువ మంది రైతులు, కాంట్రాక్టు పద్ధతిలో బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి కూలీలను పిలిపించుకుంటున్నారు.

గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వరి నాట్ల కోసం బెంగాలీ కార్మికులు వస్తుంటారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రావడం సీజన్ అయిపోగానే తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. అనంతపురం వంటి ప్రాంతాల్లో అరటి గెలలు కోయడం, వాటిని ప్యాకింగ్ చేయడం వంటి పనుల్లో ఎక్కువగా ఉన్నారు.

బెంగాలీ వలస కార్మికులకు సంబంధించి కచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ ఏడాదికి సుమారు 4 లక్షల మంది వివిధ రకాల పనుల కోసం వస్తారని అంచనా.

తెలంగాణలోనూ హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో నిర్మాణ రంగంలో ఎక్కువగా బెంగాలీ కూలీలు పని చేస్తున్నారు. తెలంగాణలో సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు పని చేస్తుండగా వారిలో 26 శాతం మంది బెంగాలీలు ఉంటారని అంచనా.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముషీరాబాద్, 24 పరగణాలు వంటి జిల్లాల నుంచి ఎక్కువ మంది కార్మికులు వస్తుంటారు.

బెంగాలీ కూలీలు

రేకుల షెడ్డుల్లోనే నివాసం

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం సుమారు 9,000 మంది బెంగాలీ కూలీలు పని చేస్తున్నారు. కడవకల్లు, అనంతపురం, తాడిపత్రి, కొండాపురం, నార్పల వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు.

అరటి కాయల్ని కోయడం, ప్యాక్ చేయడం వీరి పని. ఉదయం 7 గంటలకు పనికోసం వెళ్లి, సాయంత్రం 6-7 గంటలకు తిరిగి ఇళ్లకు వస్తారు.

ఈ కూలీలు బృందాలుగా ఉంటారు. ఒక్కో టీంలో సుమారు 20 మంది ఉంటారు. వీళ్లలో ఒకరు, మిగతావారికి వంట చేసి పెడతారు. రేకుల షెడ్లలో నివసిస్తారు.

బెంగాలీ కూలీలు

మధ్యవర్తుల పాత్ర

బెంగాలీ కార్మికులను ఇక్కడకు తీసుకొచ్చేందుకు కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుంటారు. వీరిని సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. కూలీలను ఇక్కడకు తీసుకురావడం, తిరిగి వారిని సొంత ఊళ్లకు చేర్చడం వరకూ అంతా వీళ్లే చూసుకుంటారు.

‘‘మేం కంపెనీలకు, కూలీలకు మధ్య సర్వీస్ ప్రొవైడర్లుగా పని చేస్తుంటాం. వాళ్లను అక్కడ రైలు ఎక్కించి, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. వాళ్ల కోసం ప్రతీ గ్రామంలో షెల్టర్లు, తాగు నీరు, కరెంట్ వంటి సదుపాయలు కల్పిస్తాం. ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ల వద్దకు తీసుకెళ్తాం. వలస కూలీల వల్లే అనంతపురం జిల్లాలో సాగు చేయగలుగుతున్నాం. ఈ వ్యవస్థ అంతా వాళ్ల మీదనే ఆధారపడి ఉంది. బెంగాలీ కూలీలకు ఎగుమతి ప్యాకింగులో నైపుణ్యం ఉంది. 2017-18 ప్రాంతంలో 500 మంది వరకు కూలీలు వచ్చేవారు. అరటి పంట విస్తీర్ణం పెరగడం, ఎగుమతులకు తగినట్లుగా కూలీల సంఖ్య ప్రస్తుతం 9 వేల వరకు చేరింది. అరటి ప్యాకింగ్ అనేది నైపుణ్యంతో కూడిన పని. కటింగ్ దగ్గర నుంచి బాక్స్ ప్యాకింగ్ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నిష్ణాతులై ఉంటారు. గతంలో రోజుకు 6-7 టన్నులు ప్యాకింగ్ చేసే వాళ్లు. ఇప్పుడు పనితనం పెరిగి 12 టన్నుల వరకు చేస్తున్నారు’’ అని మధ్యవర్తి ప్రభాకర్ రెడ్డి వివరించారు.

అనంతపురం జిల్లాలో ఏటా సెప్టెంబరులో అరటి ప్యాకింగ్ ఎగుమతులు మొదలవుతాయి. అందుకే వీళ్లను ఆగస్టులో రాష్ట్రానికి తీసుకువస్తారు. దాదాపు ఏడు నెలలకు పైగా సాగే ఈ అరటి గెలల పనుల్లో అరటి ప్యాకింగ్ పనులే దాదాపు అయిదు నెలలపాటు సాగుతాయి. రెండు నెలలపాటు మాత్రం అరటి పంట జాగ్రత్తల కోసం తీసుకునే పనుల్లో పాల్గొంటారు.

అనంతపురం జిల్లా నుంచి ఈ సీజన్‌లో దాదాపు 60 వేల టన్నుల అరటి, విదేశాలకు ఎగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. సగటున ఈ ఏడాదికి లక్ష టన్నుల వరకు ఎగుమతి జరుగుతుందని అంచనా.

అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 2022-23లో 56.84 లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేసింది.

బెంగాలీ కూలీలు

దక్షిణాది రాష్ట్రాలకు అధిక వలస

‘‘బెంగాలీ మైగ్రంట్ వర్కర్స్ ఇన్ సౌత్ ఇండియా’’ అనే పేరుతో 2022లో కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.

ఆ అధ్యయనం ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలకు వలస రావడానికి ప్రధాన కారణాలు:

  • వెస్ట్ బెంగాల్‌లో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూలీ తక్కువగా ఇవ్వడం
  • బెంగాలీలు ఎక్కువగా వలస పోయే ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాలలో సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.
  • అప్పుల భారం
  • ఆర్థికాభివృద్ధిలో ముందు ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటం.
  • దక్షిణ భారత రాష్ట్రాలు అధిక వేతనాలు ఇస్తుండటం.

ఒకప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు ఎక్కువగా కార్మికులు వలస వచ్చేవారు. కానీ, గత 20-30ఏళ్లలో ఉపాధి కోసం బెంగాలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం పెరిగింది.

2011 జనాభా లెక్కల ప్రకారం వలస కార్మికులు ఎక్కువగా వచ్చే దక్షిణ భారత రాష్ట్రాలు:

బెంగాలీ కూలీలు
ఫొటో క్యాప్షన్, ఆధారం: 2011 జనాభా లెక్కలు

జిల్లాలో నైపుణ్యం ఉన్న లేబర్ తక్కువ కావడంతో వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆ పని అందరూ చేయలేరని రైతు ఆదినారాయణరెడ్డి అన్నారు.

‘‘ఇక్కడ కూలీల కొరత ఉంది. పైగా ఈ పని మన వాళ్ల వల్ల కాదు. అందుకే బెంగాలీ కూలీల మీద ఆధారపడుతున్నాం. ఈ పని వాళ్లు మాత్రమే చేయగలుగుతారు. ఇందులో చాలా ఓపిక ఉన్నవాళ్లే బాగా చేయగలుగుతారు. పైగా వీళ్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ వెళ్తారు’’ అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

బెంగాలీ వలస కూలీలు

‘‘తిండికిపోను కొంత మిగులుతుందనే ఆశతో’’

అనంతపురంలో పని చేస్తున్న బెంగాలీ కూలీల్లో జాకీర్ హుస్సేన్ ఒకరు. ఆయనది పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర చండీపూర్. రెండు మూడు నెలలుగా ఇక్కడ పని చేస్తున్నారు .

ఏడాదిలో సొంత ఊళ్లో ఉండేది మూడు నాలుగు నెలలే అని జాకీర్ హుస్సేన్ అంటున్నారు. మిగతా 9 నెలలు పని కోసం వలస వెళ్తామని చెప్పారు.

‘‘మా ఊళ్లో రోజూ పని దొరకదు. అక్కడ రోజూ కూలీ రూ. 300 ఉంటుంది. ఇక్కడైతే తిండికి పోను రూ. 600-700 మిగులుతాయి’’ అని జాకీర్ హుస్సేన్ అన్నారు.

ఎక్కడైనా పని ఉందని తెలియగానే ఈ కూలీలంతా ఒక బృందంగా ఏర్పడతారు. ఒక చోట పని అయిపోయిన తర్వాత మరొక చోట పని ఉందని తెలిస్తే అక్కడకు వెళ్లిపోతుంటారు.

మరో నెలలో అనంతపురం జిల్లాలో పనులు ముగిసేలా ఉండటంతో పని కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు వెళ్లే ఆలోచనలో జాకీర్ హుస్సేన్, ఆయన మిత్రులు ఉన్నారు.

జాకీర్ హుస్సేన్‌కు తండ్రి లేడు. ఇంట్లో అమ్మ, అన్న-వదిన వారి పిల్లలు ఉంటారు. తన ఖర్చులు పోను మిగిలిన డబ్బును కుటుంబానికి పంపిస్తానని ఆయన చెప్పారు.

‘‘నేను పదో తరగతి వరకు చదివాను. కాలేజీ చదువుకు డబ్బుల్లేక ఆపేశాను. మాది పేద కుటుంబం. ప్రభుత్వం చదువుకోడానికి సాయం చేసినా, ఇంట్లో పరిస్థితి చూస్తే చదువు మీదకు ధ్యాస వెళ్లదు. మేం చదివినా, చదవకపోయినా పనికి పోవాల్సిందే. రోజు కూలీ రూ. 1,000 ఇస్తారు. నెలకు రూ. 15-20 వేలు వస్తాయి. ఒక్కోసారి 25,000 వరకు సంపాదిస్తా. నా ఖర్చుల కోసం రూ. 2 వేలు ఉంచుకొని మిగతాదంతా ఇంటికే పంపించేస్తా’’ అని జాకీర్ అన్నారు.

బెంగాలీ కూలీలు

‘‘పెళ్లయి ఆర్నెళ్లు, వలస రాక తప్పలేదు’’

18 ఏళ్ల షాహీన్ స్వగ్రామం మాల్దా జిల్లాలోని జలాల్పూర్. కడవకల్లు దగ్గరే వలస కూలీగా పనిచేస్తున్నారు.

‘‘నాకు పెళ్లయి ఆర్నెళ్లు అయింది. ఇంట్లో అమ్మానాన్న, తమ్ముళ్లు, చెల్లి ఉన్నారు. ఇంట్లో నేనే పెద్దవాడిని. అందుకే ఇక్కడికి రాక తప్పలేదు. నేను తప్ప ఇంట్లో సంపాదించేవాళ్లు ఎవరూ లేరు. వాళ్లను చూడాలనిపించినపుడు వీడియో కాల్ చేసి అందరితో మాట్లాడుతుంటా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారో టెన్షన్ ఉంటుంది. ఎప్పుడొస్తారు? అని నా భార్య అడుగుతుంటుంది. సీజన్ అయిపోగానే వచ్చేస్తానని చెబుతా’’ అని షాహీన్ అన్నారు.

షాహీన్ 9వ తరగతి వరకు చదివారు. తన తండ్రి పని చేయగలిగే స్థితిలో లేరని షాహీన్ చెప్పారు.

ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతో కొంత సాయం అందినా అది సరిపోవడం లేదని అన్నారు.

‘‘నా ఇద్దరు తమ్ముళ్లూ చదువుకుంటున్నారు. చిన్న తమ్ముడు హాస్టల్లోనే ఉన్నాడు. మా అమ్మ బీడీలు చుట్టే పనిచేస్తూ ఇంటికి కాస్త సాయంగా ఉంటుంది. నా వయస్సు 18 ఏళ్లు. ఆర్నెళ్ల క్రితమే పెళ్లయింది. నా భార్య ఇల్లు, వంట పనులు చూసుకుంటుంది. మైనారిటీ పథకం కింద మాకు ఏడాదికి రెండు సార్లు రూ.1200 రూపాయలు ఇస్తారు. వర్షాకాలంలో చాలా సమస్యలు ఉంటాయి. వర్షం పడితే ఇల్లు కారుతుంది. డబ్బు సంపాదించి చిన్న ఇల్లు కట్టుకోవాలనేది నా కోరిక’’ అని షాహీన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)