సుద్ద పొడికి కవర్ చుట్టి, బ్రాండ్ వేసి, ట్యాబ్లె‌ట్లుగా అమ్మేస్తున్నారు..

నకిలీ ఔషధాలు

ఫొటో సోర్స్, DCA Telanagana

    • రచయిత, బళ్ల సతీష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డాక్టర్ రాసిన ట్యాబ్లెట్ కొనే ముందు ఇప్పటి వరకూ ఎక్స్‌పైరీ డేట్ చూడడం మాత్రమే మనకు అలవాటు. ఇకపై ఆ ట్యాబ్లెట్లో మందు ఉందా లేక సుద్ద పొడి ఉందా అని చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది.

తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం అధికారులు హైదరాబాద్ మలక్‌పేటలోని ఒక దుకాణంలో తనిఖీలు చేస్తే ఎంపీఓడీ-200 (Cefpodoxime Proxetil and Lactic Acid Bacillus tablets) అనే యాంటీ బయాటిక్ ట్యాబ్లెట్లు దొరికాయి.

ఒకటీ రెండూ కాదు. ఏకంగా 27 వేల ట్యాబ్లెట్లు దొరికాయి. వాటి ధర ఏడు లక్షల ముప్పై వేలు.

యాంటీ బయాటిక్ ట్యాబ్లెట్లు అమ్మడం తప్పు కాదు. కాకపోతే అవి అసలు ట్యాబ్లెట్లే కాదు. వాటిలో మందులేదు.. వట్టి సుద్దపొడి ఉంది.

వాటిని తయారు చేసిన కంపెనీ పేరు మెగ్ లైఫ్ సెన్సెస్ అని, అది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటుందని వాటిపై పేర్కొన్నారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే.. అసలు ఆ పేరుతో మందుల కంపెనీయే లేదని తేలింది.

మెడిసిన్స్, డ్రగ్స్, ట్యాబ్లెట్స్

ఫొటో సోర్స్, DCA Telanagana

ఫొటో క్యాప్షన్, నకిలీ ట్యాబ్లెట్లు తయారు చేస్తున్న వ్యక్తులతో పోలీసులు

లేని కంపెనీ ‘మందులెలా’ తయారు చేసింది?

మలక్ పేటలో తీగ లాగితే ఉత్తరాఖండ్‌లో డొంక కదిలింది.

ఉత్తరాఖండ్‌లోని ఒక ముఠా ఇలా ఏ ఔషధ గుణమూ లేని, ఏ మూలకాలూ లేని, కేవలం సుద్ద పొడిని ట్యాబ్లెట్లుగా అమ్మేస్తోంది.

సుద్దపొడిని ప్యాక్ చేసి పైన ఇంగ్లీషులో మందు పేరు రాసి అమ్మేస్తుంటే రోగులు వేలకు వేలు పోసి వాటిని కొనేస్తున్నారు.

మలక్ పేట నుంచి ఉత్తరాఖండ్ వెళ్లిన తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం అధికారులు, హైదరాబాద్ నగర పోలీసులకు కళ్లు చెదిరాయి.

ఉత్తరాఖండ్‌లోని నెక్టార్ డ్రగ్స్ అండ్ హెర్బ్స్ అని ఒక చిన్న కంపెనీ పెట్టి అందులో ఇలా సుద్దపొడి ట్యాబ్లెట్లును తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

భూమ్మీద లేని కంపెనీ పేరుతో మందులు తయారు చేస్తే ఒక సమస్య. ఎలాగోలా ఆ కంపెనీ లేదు కదా అని అనుమానం వచ్చి గుర్తించవచ్చు. కానీ చాలా పేరున్న మందుల కంపెనీల ట్యాబ్లెట్లకు కూడా ఇక్కడ నకిలీలు తయారు చేస్తున్నారు.

అరిస్టో ఫార్మా కంపెనీ పేరుతో ఓమ్నీసెఫ్ ఓ 200 అనే ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారు. జీఎస్కే, ఆల్కెమ్, అరిస్టో, సిప్లా కంపెనీలకు చెందిన మందులకు వీరు కల్తీ చేస్తున్నారు.

అదికాక Augmentin – 625, Clavum-625, Omnicef-O 200, Montair-LC వంటి ట్యాబ్లెట్లను పోలి ఉండే అచ్చంగా అదే రంగున్న ప్యాకింగ్, అక్షరాలతో ఉండే నకిలీలను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. సరిగ్గా ఈ ఓమ్నిసెఫ్ ట్యాబ్లెట్ల నకిలీ తయారు చేస్తున్నప్పుడు డ్రగ్ కంట్రోలో అథారిటీ, పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

‘‘వాస్తవానికి ఈ నెక్టార్ డ్రగ్స్ విశాద్ కుమార్ అనే వ్యక్తిది. సచిన్ కుమార్ అనే వ్యక్తి ఈ నెక్టార్ దగ్గర ఉన్న యంత్రాలను వాడుకుని డమ్మీ మందులు తయారు చేయడానికి విశాద్ ఒప్పుకున్నాడు. లక్ష ట్యాబ్లెట్లు తయారు చేసుకోనిస్తే, 35 వేలు ఇచ్చేలా ఒప్పందం. అక్కడి సిబ్బంది సచిన్ కుమార్ అనే వ్యక్తి చెప్పినట్టుగా సుద్దపొడితో డమ్మీ ట్యాబ్లెట్లు తయారు చేసి ఇస్తారు. వాటిని సచిన్, వాట్సప్ ద్వారా దేశవ్యాప్తంగా మార్కెట్ చేస్తుున్నారు. హైదరాబాద్ సహా దేశంలోని పలు చోట్ల చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ నకిలీ మందులు ఆర్డర్ తీసుకుని వాటిని మందుల షాపులకు సరఫరా చేస్తున్నారు.’’ అని చెప్పారు పోలీసులు.

మలక్‌పేటలో సీజ్ చేసినది కాకుండా, ఉత్తరాఖండ్ లో మొత్తం వివిధ రకాలు ట్యాబ్లెట్లు దాదాపు 44 లక్షల రూపాయల ఖరీదువి సీజ్ చేశారు.

అది కాకుండా, ఇతర కంపెనీల లేబుళ్లు, 60 కేజీల నారింజ రంగులోని ట్యాబ్లెట్లు, 30 కేజీల ఇతర ట్యాబ్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తరాఖండ్, నెక్టార్ డ్రగ్స్ అండ్ హెర్బ్స్

ఫొటో సోర్స్, DCA Telanagana

ఫొటో క్యాప్షన్, ఉత్తరాఖండ్‌లోని నెక్టార్ డ్రగ్స్ అండ్ హెర్బ్స్ అనే కంపెనీలో సుద్దపొడి ట్యాబ్లెట్లను తయారుచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు

నకిలీ ఔషధాలను ఎలా గుర్తించాలి?

నిజానికి నకిలీ మందులు గొడవ అంత చిన్నది కాదు. తాజాగా తెలంగాణ పోలీసులు, డీసీఏ వారు పట్టుకున్నదానికంటే తీవ్రమైన సమస్య ఉన్నట్టు వివిధ సంస్థలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి.

2022లో అసోచామ్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 25 శాతం మందులు నకిలీ లేదా, తక్కువ నాణ్యత ఉన్నవే.

2022 తరువాత భారతదేశంలో తయారయిన దగ్గు మందు వల్ల విదేశాల్లో పదుల సంఖ్యలో పిల్లలు చనిపోయిన ఘటనలు వచ్చాయి. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు.

నకిలీ మందుల్లో చాలా రకాలు ఉంటాయి. కలుషితం అయ్యేవి, పెద్ద కంపెనీలను అనుసరించి తయారు చేసేవి, తప్పుడు లేబుల్స్ వేసినవి, అసలు మందే లేకుండా ఏదో పేరుతో అమ్మేసేవి.. ఇలా చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క దాంతో ఒక్కో సమస్య.

చీటీలో రాసిన పేరు, కౌంటర్లో ఇచ్చిన పేరు సరైనదా కాదా చూడాలి.

పాకేజీ, లేబులింగ్, చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేకులు వంటివి జాగ్రత్తగా గమనించాలి.

విడి గోళీలు కొనేప్పుడు కూడా ఈ సమస్య ఉంటుంది. అప్పుడు ఇంకా జాగ్రత్తగా అసలు మందుల షీట్ తో పోల్చి చూడాలి.

ప్యాకేజీలో తేడాలు, లూజుగా పకడ్బందీగా లేకపోవడం గమనిస్తే అనుమానించాలి.

స్పెల్లింగులో చిన్న అక్షరాలు మిస్ అవడం కూడా సమస్యే.

కొన్ని పెద్ద కంపెనీలు మందుల షీట్ మీద క్యూఆర్ కోడ్ ఇస్తున్నాయి. కానీ అన్నిటికీ అందుబాటులో లేదు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, డాక్టర్లు మందుల పేర్లు అర్థమయ్యేలా కేపిటల్ లెటర్స్‌లో ఇవ్వాలి.

కాస్త పేరున్న నమ్మకంగా మందులు అమ్మే దుకాణాల్లో కొనడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

మెగ్ లైఫ్ సైన్సెస్

ఫొటో సోర్స్, DCA Telanagana

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం అధికారుల తనిఖీల్లో దొరికిన నకిలీట్యాబ్లెట్స్

మెగ్ లైఫ్ సైన్సెస్ మందులు వాడవద్దన్న అధికారులు

‘‘వాస్తవానికి భారతదేశంలో చాలా మంది మందుల షాపు దగ్గర పైన చెప్పిన తనిఖీలు చేయలేరు. అందరికీ ఇలా చేయడం సాధ్యపడదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగమే నకిలీలపై కఠినంగా వ్యవహరిస్తే అప్పుడు మాత్రమే ఇవి తగ్గుతాయి. ఎందుకంటే పెద్ద ఫార్మా సంస్థలకు బలమైన నెట్‌వర్క్ ఉంటుంది. వాటిని కాదని ఇవి మార్కెట్లోకి వస్తున్నాయి అంటే అదేమీ రహస్యంగా జరగదు. అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే నకిలీ మందులు కట్టడి అవుతాయి. అంతే తప్ప షాపుల ముందు నుంచుని ఈ మందు అసలుదా నకిలీదా అని తేల్చడం ఎవరి తరమూ కాదు..’’ అని బీబీసీతో అన్నారు ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీలో సైంటిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాస్.

ప్రస్తుతానికి మెగ్ లైఫ్ సైన్సెస్ పేరుతో వచ్చే ఏ మందూ వాడవద్దనీ, ఆ మందుల స్టాక్ ఉంటే తమకు అప్పగించాలనీ డీసీఏ వారు విజ్ఞప్తి చేశారు.

రోగులు ఎవరైనా ఇప్పటికే ఆ కంపెనీ మందులు కొని ఉంటే వాడవద్దని తెలంగాణ డీసీఏ అధికారుల సూచించారు. వారు సీజ్ చేసిన మందుల వివరాలు

• MPOD-200 Tablets (Cefpodoxime Proxetil and Lactic Acid Bacillus tablets) Claimed on the label as manufactured by

• MEXCLAV 625 Tablets (Amoxicillin & Potassium Clavulanate Lactic Acid Bacillus tablets)

• Cefoxim-CV Tablets (Cefpodoxime Proxetil& Potassium Clavulanate Lactic Acid Bacillus tablets)

పైన పేర్కొన్న ట్యాబ్లెట్లు వాడవద్దని తెలంగాణ డ్రగ్ అథారిటీ సూచించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)