ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, ఈ కేసు పూర్తి వివరాలివీ...

జీఎన్ సాయిబాబా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుచిత్ర కె.మొహంతి
    • హోదా, బీబీసీ లీగల్ ప్రతినిధి

మావోయిస్టులతో సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పు ఇచ్చిందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెంజెస్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసుకొనే వరకు రూ. 50,000 పూచీకత్తుతో నిందితులను బెయి‌ల్‌పై విడుదల చేయవచ్చని తీర్పు చెప్పింది.

ఆయనపై కేసు ఏంటి?

జి.ఎన్. సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మే నెలలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు.

తనపై వచ్చిన ఆరోపణలను సాయిబాబా ఖండించారు.

కేసును విచారించిన మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం-యూఏపీఏలోని 13, 18, 20, 39 సెక్షన్ల కింద సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేలుస్తూ 2017లో తీర్పు చెప్పింది. వారికి జీవిత ఖైదు విధించింది.

అయితే, 2022 అక్టోబర్ 14న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాపై కేసును కొట్టివేసింది. నిందితులను విడుదల చేయాలంటూ తీర్పునిచ్చింది.

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసి, నిందితుల విడుదలపై స్టే విధించింది. అనంతరం దీనిపై మరోసారి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది.

ఇపుడు హైకోర్టు ధర్మాసనం మరోసారి గడ్చిరోలి సెషన్స్ కోర్టు తీర్పును మంగళవారం కొట్టివేసింది.

ఈ తీర్పుపై ప్రాసిక్యూషన్ ఎలాంటి స్టే కోరలేదు. ప్రస్తుతం సాయిబాబా నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు.

సాయిబాబా

ఇకనైనా విడుదల చేయండి: సహచరి వసంత

తాజా తీర్పుపై సాయిబాబా సహచరి వసంత బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ- ‘‘కోర్టు కేసు కొట్టివేసినట్లు మీడియాలో చూసే తెలుసుకున్నా. కేసు కొట్టివేయడంపై నేను, నా కూతురు మంజీర చాలా సంతోషంగా ఉన్నాం" అని చెప్పారు.

గత పదేళ్లుగా ఆయనను అన్యాయంగా జైల్లో ఉంచారని చెప్పిన వసంత, "ఆరోగ్య సమస్యలున్నా ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. ఇకనైనా ప్రభుత్వం అడ్డు తగలకుండా త్వరగా ఆయన విడుదలయ్యేలా చూడాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.

ఈ కేసులో ఇతర నిందితులకు కూడా న్యాయం జరగాలని కోరుకొంటున్నానని వసంత తెలిపారు.

సాయిబాబా

ఫొటో సోర్స్, AS VASANTHA

ఫొటో క్యాప్షన్, సహచరి వసంతతో సాయిబాబా (ఫైల్)

'నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు?' - అడ్వకేట్ ఇందిరా జైసింగ్

న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఇందిరా జై సింగ్ స్పందిస్తూ, సాయిబాబా ఆరోగ్యాన్ని ఎవరు తిరిగి అందిస్తారని ప్రశ్నించారు.

నాగ్‌పూర్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఇందిర ఎక్స్‌ (ట్విటర్)లో, “సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించారు. కానీ, ఎంత కాలానికి వచ్చిందీ తీర్పు? ఆరోగ్య పరంగా ఆయనకు కలిగిన నష్టానికి బాధ్యులెవరు? న్యాయస్థానాలా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇంకా ఎంతమంది ఇలా బెయిల్ కోసం ఎదురుచూడాలి? వారి స్వేచ్ఛను హరించడం వల్ల కలిగిన నష్టానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు?” అని ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?

దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌.

వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు.

2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కొంత కాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేస్లుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది.

పోలీసులు సాయిబాబాను అరెస్టు చేయడంతో ఆయనను దిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.

తాజాగా బాంబే హైకోర్టు ఈ కేసులో తీర్పు చెబుతూ సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ కేసులో ఎప్పుడు, ఏం జరిగింది?

  • 2013లో హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీలను అరెస్ట్ చేశారు.
  • హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహీలు మావోయిస్ట్‌ నేతలతో భేటీ కానున్నారని, ఆ భేటీ ఏర్పాటులో ప్రొఫెసర్ సాయిబాబా ప్రమేయం ఉందని పోలీసులు చెప్పారు.
  • ఆ ఘటన తరువాత 2013లో గడ్చిరోలీ, దిల్లీ పోలీసు బృందాలు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఇంటిపై దాడులు చేశారు.
  • దాడుల్లో పోలీసులు తన ల్యాప్‌టాప్, నాలుగు పెన్‌డ్రైవ్‌లు, నాలుగు హార్డ్‌డిస్క్‌లు, కొన్ని పుస్తకాలు తీసుకున్నారని ప్రొఫెసర్ సాయిబాబా తెలిపారు.
  • 2014లో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను దిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లి, అరెస్ట్ చేశారు.
  • అనంతరం ఆయన్ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు.
  • మహారాష్ట్రలోని గడ్చిరోలీ న్యాయస్థానం ప్రొఫెసర్ సాయిబాబాను యూఏపీఏలోని 13, 18, 20, 39 సెక్షన్లలో దోషిగా తేల్చింది.
  • సుప్రీం కోర్టు జోక్యంతో 2015 జులైలో ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది.
  • హైకోర్టు సాయిబాబాకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసి, సరెండర్‌ కావాలని సూచించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)