దిల్లీ అల్లర్లు: నాలుగేళ్లలో వందలాది ఎఫ్ఐఆర్‌లు, అరెస్టులు... ఎంతమందికి న్యాయం దక్కింది?

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, ఉమంగ్ పొద్దర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలో నాలుగేళ్ళ కిందట జరిగిన అల్లర్లు గుర్తున్నాయా? 2020 ఫిబ్రవరి 23 నుంచి 26 మధ్యన ఈశాన్య దిల్లీ అట్టుడికిపోయింది.

ఈ అల్లర్లలో 53 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఎంతో మంది ఇళ్ళు, షాపులు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

అల్లర్లలో మరణించినవారిలో 40మంది ముస్లింలు, 13 మంది హిందువులు ఉన్నట్టు దిల్లీ పోలీసుల లెక్కలు చెబుతున్నాయి.

ఈ అల్లర్లు జరిగి నాలుగేళ్ళయినా న్యాయం కోసం బాధితుల పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇలా న్యాయం కోసం ఎదురుచూస్తున్న కొన్ని కుటుంబాలను బీబీసీ ప్రతినిధులు కలిశారు. వారి పోరాటం ఎంతదాకా వచ్చిందో తెలుసుకున్నారు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES/ANADOLU AGENCY

‘స్టేట్‌మెంట్ మార్చమని పోలీసుల ఒత్తిడి’

ముందుగా బీబీసీ ఈశాన్య దిల్లీకి సమీపంలోని కర్దాంపురికి వెళ్ళింది. అల్లర్ల సందర్భంగా అప్పట్లో ఈ ప్రాంతం నుంచి ఒక వీడియో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో పోలీసు యూనిఫామ్‌లో ఉన్న కొంతమంది ఐదుగురు పిల్లలను కర్రలతో కొడుతున్నట్టు కనిపిస్తోంది. యూనిఫామ్‌లో ఉన్నవారు ఆ పిల్లలను ‘జనగణమన’, ‘వందేమాతరం’ పాడమని అడుగుతున్నట్టుగా ఉంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది.

ఈ సంఘటన దిల్లీ పోలీసుల పాత్రను పెద్ద ఎత్తున ప్రశ్నించింది. ఈ వీడియోలో కనిపించిన ఐదుగురు పిల్లల్లో ఫైజాన్ ఒకరు. ఫిబ్రవరి 26, 2020న ఫైజాన్ మరణించారు.

కర్దాంపురిలోని ఇరుకుకైన ప్రాంతాల నుంచి మేం ఫైజాన్ ఇంటికి చేరుకున్నాం.

అదృష్టవశాత్తూ ఫైజాన్ తల్లి కిస్మాతూన్ ఇంటివద్దే ఉన్నారు. ఆమె ఇంటి పరిస్థితిని వివరించారు. ఫైజాన్ సంపాదనపైనే ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారమని చెప్పారు.

తన బిడ్డ తన్నులు తిన్నాడని చెబుతున్న ప్రదేశానికి ఆమె మమ్మల్ని తీసుకువెళ్ళారు.

ఫైజాన్ ఎలా చనిపోయాడు, ఆ కేసు ఎక్కడిదాకా వచ్చిందనే ప్రశ్నకు కిస్మాతూన్ మాట్లాడుతూ ‘‘ఇప్పటికి నాలుగేళ్ళు గడిచిపోయింది. కానీ ఏమీ జరగలేదు. ఈ బాధతో నా ఆరోగ్యం క్షీణిస్తోంది. ఒకరోజు పోలీసులు నాదగ్గరకు వచ్చి నా స్టేట్‌మెంట్‌ను మార్చుకోవాలని అడిగారు.

ముందు పోలీసులు ఫైజాన్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తరువాత అతనిని జ్యోతి నగర్ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి ఆ రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయాన్నే ఫైజాన్‌ను తీసుకువెళ్ళాలని పోలీసులు కుటుంబసభ్యులకు చెప్పారు. ఫైజాన్ ఫిబ్రవరి 26న మరణించారు.

ఈ ఘటనపై పోలీసులు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ‘ఫైజాన్‌ను బానే చూసుకున్నాం. ఆయన స్వచ్ఛందంగానే పోలీసు స్టేషన్‌లో ఉన్నారు’’ అని తెలిపారు.

నాలుగేళ్ళు గడిచిన తరువాత కూడా పోలీసులు ఈ కేసులో విచారణ పూర్తి చేయలేదు.

తన కొడుకు మృతిలో న్యాయం దక్కడం లేదని గ్రహించిన కిస్మాతూన్ 2020లోనే దిల్లీ హైకోర్టు తలుపు తట్టారు.

తన కొడుకు కేసులో నేరస్తులకు శిక్ష పడాలన్నదే తన కోరిక అని ఆమె తెలిపారు.

దిల్లీ హైకోర్టులో న్యాయవాది వృందా గ్రోవర్ ఈ కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కనీసం నిందితులెవరో కూడా గుర్తించలేదని చెప్పారు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

దిల్లీ పోలీసుల వైఖరి ఎలా ఉంది

‘‘భారత్‌లో పోలీసుల తీరు ఎలా ఉంటుందంటే ముందు అనుమానంతో అరెస్ట్ చేస్తారు. తరువాత కోర్టులో కష్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెబుతారు. ఈ కేసు నీరుగారుతున్నట్టు కనిపిస్తోంది. ప్రతిసారీ కోర్టుకు కొత్తకథ వినిపిస్తున్నారు’’ అని వృందా గ్రోవర్ చెప్పారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి పోలీసుస్టేషన్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆరోజు పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాలో పనిచేయలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు అని వృందా తెలిపారు.

ఫైజాన్ ఇంటికి కొద్ది దూరంలోనే కౌసర్ అలీ ఇల్లు ఉంది. కౌసర్ అలీ కూడా దెబ్బలు తిన్న ఐదుగురిలో ఒకరు. ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటే ఇప్పటికి తనకు వణుకు పుడుతుందని ఆయన చెప్పారు.

‘‘ఆ రోజు జరిగింది తలుచుకుంటే ఇప్పటికీ నాకు పోలీసులంటే భయం కలుగుతోంది. వారు మరోసారి నన్ను తీసుకువెళతారమోనని అనిపిస్తుంటుంది. ఈ కేసులో నిజమైన నేరస్తులకు శిక్ష పడాలి’’అన్నారు.

ఫైజర్, కౌసర్‌ను కొడుతున్న వీడియోలొ ఉన్నది పోలీసులు కారనే విషయాన్ని ఇప్పటిదాకా దిల్లీ పోలీసులు కూడా ఖండించలేదు. పైగా వీడియోలో ఉన్న పోలీసులను గుర్తించే పనిలో ఉన్నామని వారు దిల్లీ హైకోర్టుకు చెప్పారు.

కోర్టులో ఇప్పటికే బాధితుల పక్షాన వాదనలు పూర్తయ్యాయి. ఇక పోలీసుల తరపున వాదనలు వినిపించాల్సి ఉంది.

ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని కనుక్కోవడానికి మేం దిల్లీ పోలీసులను సంప్రందించాం.

దిల్లీ అల్లర్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు నేతృత్వం వహించిన ఐపీఎస్ ఆఫీసర్ రాజేష్ దేబ్ కేసు కోర్టులో ఉందంటూ మాట్లాడటానికి తిరస్కరించారు.

అల్లర్లకు సంబంధించి దిల్లీ పోలీసుల లెక్కలు ఏం చెబుతున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం.

దిల్లీ అల్లర్లు

పోలీసుల లెక్కలు ఏం చెబుతున్నాయి?

దిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు మొత్తం 758 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు దిల్లీ పోలీసులవర్గాల నుంచి బీబీసీకి సమాచారం అందింది.

ఇప్పటిదాకా 2619 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వారిలో 2094 మంది బెయిల్‌పై బయటకు వచ్చారు.

ఇప్పటిదాకా న్యాయస్థానం 47 మంది దోషులుగా తేల్చింది. 183 మందికి ఈ కేసుల నుంచి విముక్తి కల్పించింది.

సరైన ఆధారాలు లేని కారణంగా 75 మంది పై కోర్టు కేసులు కొట్టివేసింది.

దిల్లీ అల్లర్లలో 53మంది చనిపోయిన కేసులలో ఇంకా 14 కేసులలో విచారణ కొనసాగుతోందని ‘ది ప్రింట్’ న్యూస్ వెబ్‌సైట్ కథనం పేర్కొంది.

కేసులలోని బాధితుల కుటుంబాలను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ ఇంకా ఎన్ని కేసులలో విచారణ జరుగుతోందనే విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్థరించలేకపోయింది.

ఈశాన్య దిల్లీలోని ఖురాజ్ ప్రాంతంలోని ఉమ్మడి పౌరస్మృతి ఆందోళనా శిబిరం వద్ద పోలీసు యూనిఫామ్‌లో ఉన్న కొందరు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

మరి ఈ కేసులో సంబంధిత పోలీసులపై చర్యలు ఏమైనా తీసుకున్నారా?

దిల్లీ అల్లర్లలో అనేక కేసులలో బాధితుల పక్షాన వాదిస్తున్న మహ్మద్ ప్రచా ఈ విషయంపై మాట్లాడుతూ ‘‘ఈ కేసులలో దిల్లీ పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సంబంధిత పోలీసు పేరు స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలేవీ తీసుకోలేదు.’’ అని చెప్పారు.

ఈ విషయంలో కూడా బీబీసీ దిల్లీ పోలీసుల స్పందన కోసం ప్రయత్నించింది. కానీ పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, DHEERAJ BARI

ఫొటో క్యాప్షన్, భార్య పూనమ్, పిల్లలతో రతన్ లాల్

రతన్ లాల్ – అంకిత్ శర్మ కేసులో ఏమైంది?

దిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులలో పోలీసుల విచారణా వేగం ఒకేలా లేదు. అల్లర్లలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కేసులో పోలీసులు 24మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 10మంది బెయిల్ పై విడుదలయ్యారు.

రతన్ లాల్ కేసులో కిందటేడాది బెంగళూరు, మణిపూర్‌లో ఒకొక్కరిని అరెస్ట్ చేసినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈకేసుకు సంబంధించి పోలీసులు ఐదు చార్జీషీట్లు దాఖలు చేశారు. కానీ ఈ కేసులో కూడా విచారణ ఇంకా ప్రారంభం కాలేదు.

ఇంటలిజెన్స్ బ్యూరోలో పనిచేసే అంకిత్ శర్మ హత్య కేసులో 11మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 26, 2020న చాంద్‌బాగ్‌లో ఓ డ్రైనేజీలో అంకిత్ శర్మ శవం కనిపించింది. చార్జిషీటులో పేర్కొన్న ప్రకారం అంకిత్ శర్మ శరీరంపై 51 గాయాలు ఉన్నాయి.

అక్టోబరు 2022లో ఈ కేసుకు సంబంధించి తెలంగాణకు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

కిందటేడాది మార్చిలో నిందితుడిపై కోర్టులో అభియోగాలు నమోదు కాగా, ఇప్పుడు ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉంది.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఉమర్ ఖలీద్ - ఎఫ్ఐఆర్ నంబర్ 59

దిల్లీ అల్లర్ల వెనుక తీవ్రమైన కుట్ర కోణం ఉందని, ఈ అల్లర్లకు పునాది 2019లో జరిగిన సీఏఏ, ఎన్ఆర్ఏ ఆందోళన సమయంలోనే పడిందని ఈ కేసును విచారిస్తున్న దిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ పేర్కొంది.

ఈ కుట్ర గురించి ఎఫ్ఐఆర్ నెంబర్ 59/2020లో పేర్కొంది. ఈ కేసును కూడా క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్లే విచారిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం 209లో పౌరసత్వ చట్టానికి సవరణ చేసింది. దీని ప్రకారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని ఆరు మైనార్టీ మతాలకు ( హిందు, బౌద్ధం, పార్సీ, క్రిస్టియన్, సిక్కు) చెందిన వారికి భారత పౌరసత్వం ఇస్తామని పేర్కొంది.

దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎఫ్ఐఆర్ 59లో మొత్తం 18మందిని అరెస్ట్ చేశారు.

వీరిలో ప్రస్తుతం ఆరుగురు బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసులో విచారణ ఇంకా మొదలుకాలేదు.

దిల్లీ అల్లర్ల వెనుక సూత్రధారి జెఎన్‌యు విద్యార్థి ఉమర్ ఖలీద్ గా పోలీసులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2020 నుంచి ఉమర్ ఖలీద్ జైల్లోనే ఉన్నారు. ఈయననపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అభియోగాలు మోపారు. ‘ఉపా’ కింద బెయిల్ పొందడం అంత తేలికైన విషయం కాదు.

ఇప్పటికి రెండు సార్లు ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్ న్యాయస్థానాలలో తిరస్కరణకు గురైంది.

సుప్రీం కోర్టులో ఈయన బెయిల్ పిటిషన్ మే 2023 నుంచి జనవరి 2024వరకు పెండింగ్‌లో ఉంది. కానీ ఒక్కసారిగా కూడా ఈ కేసుపై వాదనలు జరగలేదు.

ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని, విచారణా కోర్టుకే వెళ్ళాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.

ఉమర్ ఖలీద్ తండ్రి సయ్యద్ ఖాసీమ్ రసూల్ తన కుమారుడితో 15,20 రోజుల కిందట మాట్లాడినట్టు చెప్పారు.

‘‘మూడున్నర సంవత్సరాలు ఎటువంటి విచారణ జరగకుండా గడిచిపోవడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దీనిని వేధింపు కాకపోతే మరేమనాలి? కింద కోర్టులో ఏడాదిన్నరపాటు బెయిల్ పై వాదోపవాదాలు సాగాయి. తరువాత మేం హైకోర్టుకు వెళ్ళాం.

‘‘బెయిల్ పిటిషన్ పై ఆరునెలలు వాదోపవాదాలు జరిగాయి. ఆ తరువాత తీర్పును ఓ నాలుగునెలలపాటు రిజర్వ్‌లో ఉంచారు. మే 2023 నుంచి సుప్రీం కోర్టులో ఈ కేసు లిస్టవుతోంది. మొత్తం 14 సార్లు లిస్ట్‌లోకి వచ్చింది. కానీ ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చింది. ఈ కేసు మొత్తం కట్టుకథలా కనిపిస్తోంది. మరి ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు దీని గురించి ఏం చెబుతారో తెలియదు’’ అని ఆయన చెప్పారు.

ఏదేమైనా ఈ దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన చెప్పారు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

కోర్టు కామెంట్స్

ఈ నాలుగేళ్ళలో అనేక సందర్భాలలో కోర్టు దిల్లీ అల్లర్లలో పోలీసుల వ్యవహారశైలి, వారి విచారణా తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాయి.

దయాల్‌పురా పోలీసుస్టేషన్ ఎఫ్ఐఆర్ నెంబర్ 71/20లో ముగ్గురుని అరెస్ట్ చేసిన కేసులో ఆగస్టు 2023లో కార్కదుమ కోర్టులో వాాదనలు వింటూ న్యాయమూర్తి పులస్త్య ప్రంచల ‘‘ఈ సంఘటలను పూర్తిగా విచారించాలి. వీటిని పరిశీలించినట్టు లేదు. చార్జిషీటులో విషయాలు పక్షపాతంతో, తప్పులను దాచిపెట్టేవిగా ఉన్నాయి’’ అన్నారు.

ఈ ముగ్గురిపై రాళ్ళు విసరడం, వాహనాలను దగ్థం చేయడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అభియోగాలు మోపారు.

సెప్టెంబర్ 2021లో కర్కార్ ‌దుమ్ కోర్టు న్యాయవాది వినోద్ యాదవ్ ముగ్గురు నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత దారుణమైన మతహింసను దిల్లీనగరంలో జరగడాన్ని చరిత్ర గమనిస్తుంటే, ప్రజాస్వామ్య మద్దతు దారులు విచారణా ఏజెన్సీల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నారు. విచారణ సంస్థలు శాస్త్రీయ విధానాలను విచారణలో ఉపయోగించుకోలేక విఫలమయ్యాయి’’ అని వ్యాఖ్యానించారు.

2022లో నలుగురు మాజీ జడ్జీలు, మాజీ హోం సెక్రటరీ దిల్లీ అల్లర్లపై ఓ నిజ నిర్థరణ నివేదికను ప్రచురించాయి.

ఈ నివేదికలో దిల్లీ పోలీసుల విచారణ తీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. దీతోపాటు కేంద్ర హోం మంత్రి, దిల్లీ ప్రభుత్వం, మీడియా తీరుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

పాట్నా హైకోర్టు మాజీ జడ్జి, సుప్రీం కోర్టు న్యాయవాది, ఈ నిజనిర్థరణ నివేదిక సహరచయిత అయిన అంజనా ప్రకాష్ మాట్లాడుతూ ‘‘ పోలీసులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఆలస్యంగా నమోదు చేశారు. ఇప్పుడు దిల్లీ పోలీసులు నిందితుల వాంగ్మూలాలతో వాటిని పోల్చే పనిచేస్తున్నారు. సాలెగూడును పద్ధతిగా ఉంచడం చాలా కస్టం. గూడులో ఓ మూల తెగినా మొత్తం సాలె గూడే కూలిపోతుంది’’ ఇది కూడా అలాగే ఉందని చెప్పారు.

ఇదే నిజ నిర్థరణ నివేదికలో కపిల్ మిశ్రా లాంటి బీజేపీ నాయకులు ఇచ్చిన ప్రసంగాల గురించి కూడా మాట్లాడుతూ వారు ప్రజలను , హింసను ప్రేరేపించారని పేర్కొన్నారు.

కానీ బీజేపీ నేత కపిల్ మిశ్రా పై ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

సామాజిక కార్యకర్తల హర్షమందిర్ కపిల్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దిల్లీ పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది.

కపిల్ మిశ్రా, ఇతర బీజేపీ నాయకులు ప్రజలను హింసకు ప్రేరేపించేలా ప్రసంగాలు చేశారనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు జులై 2020లో కోర్టుకు తెలిపారు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పోలీసుల పాత్రపై ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి

దిల్లీ పోలీసులు ఏం చెబుతున్నారు?

దిల్లీ పోలీసులపై వస్తున్న ఆరోపణలు, అల్లర్ల కేసుల పరిస్థితి తెలుసుకోవడానికి బీబీసీ దిల్లీ పోలీసులతో మాట్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది.

‘‘చట్ట ప్రకారమే ఇప్పటిదాకా విచారణ సాగించాం. అనేక కేసులలో తుది నివేదికలను కోర్టులో సమర్పించాం. ఈ కేసుల హియరింగ్ కోర్టుల్లో ఇంకా కొనసాగుతోంది. ఇవ్వన్నీ కోర్టుల పరిధిలోకి వస్తాయి. విచారణ పూర్తి చేయాల్సిన కేసులను ముగించి తుది నివేదికను సమర్పిస్తాం. నేరస్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం, వారు ఎంతటివారనేదాంతో సంబంధం లేకుండా చర్యలు ఉంటాయి’’ అని దిల్లీ పోలీసు అదనపు ప్రజా సంబంధాల అధికారి రంజయ్ ఆత్రిస్య చెప్పారు.

దిల్లీ అల్లర్ల కారణంగా ఎందరి బతుకులో చిధ్రమయ్యాయి. ఏళ్ళు గడిచిపోతున్నా బాధితులకు న్యాయం దక్కడం లేదు.

అసలింతకీ దిల్లీ అల్లర్లు ఎలా చెలరేగాయి? ఎవరు కారణం

అల్లర్ల సందర్భంగానూ, తరువాత విచారణలోనూ పోలీసుల పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, దిల్లీ పోలీసులు వాటి గురించి ఏం చేస్తున్నారు, ఏం చెబుతారు... ఇలాంటి ప్రశ్నలు ఎన్నో... కానీ ఇప్పటిదాకా వాటికి సమాధానాలు వెల్లడి కావడం లేదు.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)