ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ ఎందుకు తొలగించింది?

ఫొటో సోర్స్, ANI
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్‌లను తప్పించింది. దీంతో వీరిద్దరని బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి తప్పించనున్నారంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి.
బుధవారం సాయంత్రం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాను విడుదల చేసింది.
ఐపీఎల్ కాంట్రాక్ట్‌తో ఆటగాళ్ళకు ప్రయోజనం ఉండొచ్చు కానీ, బీసీసీఐ కాంట్రాక్ట్‌లో చోటు దక్కకపోవడం కచ్చితంగా పెద్దదెబ్బే కాదు, వారి క్రికెట్ కెరీర్‌కు కూడా ఇబ్బంది కలిగించేదే.
వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఘనత ఇషాన్ కిషాన్ ఖాతాలో ఉంది. మరోపక్క 2023 ఐసీసీ ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.
శ్రేయస్ అయ్యర్ మొత్తం 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 811 పరుగులు చేశాడు. అలాగే 59 వన్డేలు ఆడి 2383 పరుగులు చేశాడు. వన్డేలలో శ్రేయస్ అత్యధిక స్కోరు 128 పరుగులు. అతని సగటు 49గా ఉంది.
అయితే వీరిద్దరూ బీసీసీఐ మార్గదర్శకాలను విస్మరించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.
సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉండే క్రికెటర్లు కేవలం ఐపీఎల్‌కు ప్రాముఖ్యం ఇచ్చి రెడ్ బాల్ క్రికెట్ (రంజీలు, టెస్ట్ మ్యాచ్‌లు) ఆడనంటే కదురదని బీసీసీఐ కార్యదర్శి జేషా కొన్ని వారాల కిందట ఆటగాళ్ళకు ఓ లేఖ రాశారు.

ఫొటో సోర్స్, ANI
బీసీసీఐ కాంట్రాక్ట్‌తో లాభమేంటి?
సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ళు మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అందించే సౌకర్యాలను పొందగలుగుతారు. ఇందులో నేషనల్ క్రికెట్ అకాడమీలో పొందే సౌకర్యాలు కూడా కలిసే ఉంటాయి.
ఎవరైనా ఆటగాడు గాయపడినప్పుడు కోలుకోవడానికి, తిరిగి ఫిట్ నెస్ సాధించడానికి నేషనల్ క్రికెట్ అకాడమీ అనేది అత్యంతక కీలకమైనది.
సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు అందరూ ఇన్సురెన్స్ కూడా పొందుతారు. ప్రస్తుతం గాయపడిన మహమ్మద్ షమీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న కారణంగా అన్ని సౌకర్యాలు పొందగలుగుతున్నాడు. బీసీసీఐ అతని వైద్య ఖర్చులన్నీ భరిస్తోంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని ఆటగాళ్ళు వీరే
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ‘ ఏ గ్రేడ్ ప్లస్ (7 కోట్ల రూపాయలు)లో ఉన్నవారు : రోహిత శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బురమా, రవీంద్ర జడేజా
గ్రేడ్ ఏ (5కోట్లు)లో ఆర్. అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్థిక్ పాండ్యా
గ్రేడ్ బి (3 కోట్లు)లో సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైస్వాల్
గ్రేడ్ సీ(1 కోటి) కింద రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, కెఎస్ భరత్, ప్రిసద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజిత్ పాటీదార్ ఉన్నారు.
ఫాస్ట్ బౌలర్ల కాంట్రాక్ట్ : అకాశ్ దీప్, విజయకుమార్ వైశఆఖ్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్, విద్వత్ కవెరప్ప ఉన్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇషాన్‌కు అవకాశాలు తక్కువే
భారత జట్టుతో గత కొంతకాలంగా ఇషాంత్ కిషాన్ ప్రయాణం సాగింది. కానీ ప్రస్తుతం అతనిని జట్టులో ఎవరైనా ఒకరిద్దరు రెగ్యులర్ ఆటగాళ్ళు అందుబాటులో లేనప్పుడు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ అనిశ్చితి వల్ల ఇషాన్ మానసికంగా ఇబ్బంది పడ్డాడని చెబుతున్నారు.
దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ నుంచి ఇషాన్ కిషాన్ తనంతట తానుగా తప్పుకున్న తరువాతే ఈ చర్చ మొదలైంది. తనకు కొంతకాలం విరామం కావాలని ఇషాన్ బీసీసీఐని అడిగాడు. ఏడాదిగా తీరిక లేని ప్రయాణాల వల్ల తనకు బ్రేక్ అవసరమని బీసీసీఐని కోరాడు.
ఈ విషయంలో జట్టు యాజమాన్యం సెలక్టర్స్‌తో మాట్లాడిన తరువాత ఇషాన్ విన్నపాన్ని అంగీకరించింది. జనవరి 3, 2023 నుంచి ఇషాన్ కిషాన్ భారతజట్టులో భాగంగా ఉన్నాడు. కానీ అతనికి ఆడే అవకాశాలు తక్కువగా లభించాయి. కిందటి ప్రపంచకప్‌లో అతనికి మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే అవకాశం దక్కింది.
డెంగ్యూ నుంచి కోలుకుని శుభ్‌మన్ గిల్ తిరిగొచ్చాక తుది జట్టులో ఇషాన్‌కు చోటులేకుండా పోయింది. కెఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా నూ ఉండటంతో ఇషాన్ కు అవకాశం లేకుండా పోయింది.
దీని తరువాత ఇషాన్ కిషాన్ ఆస్ట్రేలియాలతో జరిగిన టీ -20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.
దక్షిణాఫ్రికాతో టీ -20 సిరీస్‌లో ఇషాన్ కిషాన్ కూడా భాగంగా ఉన్నాడు. కానీ జట్టు యాజమాన్యం మాత్రం జితేష్ శర్మకు ప్రాధాన్యమిచ్చింది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో కూడా ఇషాన్ ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలోనూ ఇషాన్ కిషాన్ అడలేదు. జట్టు యాజమాన్యం కెఎస్ భరత్‌కు అవకాశమిచ్చింది. దీని తరువాత ఇషాన్ కిషన్‌కు
మూడు వన్డే మ్యాచ్‌లలో ఒకదాంట్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎప్పుడూ నిరాశపరచలేదు
ఇషాన్ కిషన్ ఐపీఎల్ సీజన్ మొత్తం ముంబయి ఇండియన్స్‌కు ఆడాడు. 2021 మధ్యలో ఇషాన్ కిషాన్ రంగప్రవేశం చేశాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియాకు రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఇప్పటిదాకా అతనిక కేవలం 27 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది.
అతను వరుసగా మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు అరుదు. జట్టులో అతని పాత్ర కూడా యాజమాన్యం మారుస్తూ వచ్చింది. కొన్నిసార్లు అతనిని బ్యాకప్ ఓపెనర్‌గానూ, మరికొన్నిసార్లు స్పెషలిస్ట్ కీపర్‌గానూ తీసుకునేవారు.
ఏ ఫార్మాట్‌లోనైనా ఇషాన్ కిషాన్ కీపర్‌గా గానీ, ఓపెనర్‌గా గానీ మొదటి ప్రాధాన్యం కాలేదు.
బహుశా ఈ కారణంగానే ఇషాన్ కిషాన్ తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానంటూ విరామం అడిగినట్టున్నాడు.
అయితే ఇషాన్ కిషాన్‌కు ఎప్పుడు అవకాశం వచ్చినా నిరాశపరచలేదు. టీమ్ ఇండియా శిఖర్‌ధవన్ ఓపెనింగ్‌తో కొనసాగుతున్నప్పుడు అతను బంగ్లాదేశ్ పై వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు.
కానీ శిఖర్ ధవన్ స్థానాన్ని ఇషాన్ కిషాన్ ఏనాడూ పొందలేదు. ఈ స్థానానికి శుభ్‌మన్ గిల్ ప్రాధాన్యంగా మారాడు.
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి మధ్యలో బ్రేక్ తీసుకున్న ఇషాన్ కిషాన్ దుబాయ్‌లో పార్టీ చేసుకుంటున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిని క్రమశిక్షణా రాహిత్యంగా భావించారు. కానీ రాహుల్ ద్రవిడ్ దీనిని క్రమశిక్షణారాహిత్యమనడాన్ని ఖండించాడు.
ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియాలతో టీ-20 సిరీస్ ఆడలేనని చెప్పినప్పటికీ బీసీసీఐ అంగీకరించలేదంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
ప్రయాణాలతో అలసిపోయాయని, తన కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన ఇషాన్ కిషన్ దుబాయ్‌లో పార్టీ చేసుకుంటూ కనిపించాడని వార్తలు రాగా, తన సోదరుడి పుట్టినరోజు వేడుకల కోసమే అతను అక్కడకు వెళ్ళాడని వార్తలు కూడా వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- ఫిబ్రవరి 29: లీపు సంవత్సరం అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు?
- జపాన్ మహిళలు న్యూడ్ ఫెస్టివల్లో పాల్గొంటామని ఎందుకు ముందుకు వస్తున్నారు?
- భావప్రాప్తి: కొంతమంది మహిళలకు 'క్లైమాక్స్' అనుభూతి కలగకపోవడానికి 8 కారణాలు...
- ‘సైకాలజీ ఆఫ్ మనీ’: పొదుపు మంత్రంతో ఓ చిరుద్యోగి రిటైరయ్యేనాటికి కోట్లు ఎలా కూడబెట్టాడు... మోర్గన్ హౌసెల్ ఇచ్చిన మెసేజ్ ఏంటి?
- గుడ్ టచ్, బ్యాడ్ టచ్: పిల్లలకు ఈ విషయం ఎలా చెప్పాలి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















