‘సైకాలజీ ఆఫ్ మనీ’: పొదుపు మంత్రంతో ఓ చిరుద్యోగి రిటైరయ్యేనాటికి కోట్లు ఎలా కూడబెట్టాడు... మోర్గన్ హౌసెల్ ఇచ్చిన మెసేజ్ ఏంటి?

సేవింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

పర్సనల్ ఫైనాన్స్ రచనలు ఎక్కువగా మదుపు సూత్రాలు లేదా స్టాక్ మార్కెట్ స్థితిగతులను ఎలా బేరీజు వేసుకోవాలనే అంశాల మీద ఉంటాయి. ఇంకొన్ని పుస్తకాలు కొందరు ప్రముఖ మదుపుదారుల అనుభవాల సమాహారంగా వారు తమ జీవితాన్నుంచి నేర్చుకున్న పాఠాలతో ప్రజల ముందుకు వచ్చాయి. కానీ, అతి కొద్ది రచనలు మాత్రమే డబ్బు లేదా సంపదతో మనిషి ఆలోచనా విధానానికి ఉన్న సంబంధాన్ని వివరించాయి. ఈ సంబంధాన్ని ఇటీవల కాలంలో బిహేవిరియల్ ఫైనాన్స్ అంటున్నారు.

అలాంటి కోవలోకి వచ్చే పుస్తకమే మోర్గన్ హౌసెల్ రచించిన సైకాలజీ ఆఫ్ మనీ. ఒక మధ్య తరగతి అమెరికన్ కుటుంబం నుంచి వచ్చిన హౌసెల్ ప్రస్తుతం 250 మిలియన్ డాలర్ల వ్యాపారం చేసే సంస్థలో కీలకమైన పదవిని నిర్వహిస్తున్నారు.

పేరులో చెప్పినట్టుగా సంపదతో మనిషికున్న బంధం గురించి చర్చించడమే ఈ పుస్తకం ప్రధాన ధ్యేయం. ఆర్థిక పరమైన విషయాలలో అతి సహజంగా జరిగే 20 తప్పుల గురించి హౌసెల్ 2018లో ఒక వ్యాసం రాశారు. ఈ పుస్తకంలో కూడా అదే విషయాన్ని మరింత విపులంగా ఎన్నో ఉదాహరణలు జోడిస్తూ వివరించారు.

ఈ పుస్తకం ఉపోద్ఘాతంలోనే సంపాదన మీద గౌరవం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎలా దివాలా తీశారనే విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు కొన్ని దశాబ్దాల పాటు పొదుపు చేసిన చిరుద్యోగి రిటైర్మెంట్ సమయానికి ఒక మల్టీ మిలియనీర్ ఎలా అయ్యాడో చెప్పారు.

ఈ రెండు మనస్తత్వాలను విశ్లేషించి ఆదాయం కంటే మన ఆలోచనలు, అలవాట్లు... ఆర్థిక లక్ష్యాలను ప్రభావితం చేస్తాయనే సందేశాన్ని ఇచ్చారు.

డబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

ఆసక్తికర ఉదాహరణలతో మొదటి అధ్యాయం

హేతుబద్ధంగా ఆలోచిస్తే నష్టం కలుగుతుంది అనుకున్న పనులు కూడా మనుషులు ఎందుకు చేస్తారనే అంశాన్ని కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో మొదటి అధ్యాయంలో వివరించారు.

అమెరికాలో లాటరీ టికెట్లు కొనే వాళ్ళల్లో ఎక్కువ మంది దిగువ మధ్య తరగతి లేదా పేదవారిగా గుర్తింపు పొందినవారు.

ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఉన్నపళంగా 400 డాలర్లు ఖర్చు పెట్టలేని వ్యక్తులు ఏడాదికి సగటున 412 డాలర్లు లాటరీ టికెట్ల మీద ఖర్చు పెడుతున్నారు.

ఈ పరిణామాన్ని వివరిస్తూ మనిషి ఆలోచనా విధానం గురించి రచయిత చేసిన విశ్లేషణ సమాజంలో జరిగే అనేక ఇతర సంఘటనలకు కూడా వర్తిస్తుంది.

రెండో అధ్యాయమంతా అదృష్టం - దురదృష్టం

సాధారణంగా పర్సనల్ ఫైనాన్స్ సాహిత్యంలో అదృష్టం దురదృష్టాలకు స్థానం లేదు. కానీ రెండవ అధ్యాయం మొత్తం కూడా అదృష్టం లేదా దురదృష్టం గురించి పేర్కొన్నారు. బహుశా ఇలా చర్చిన పుస్తకం ఇది మాత్రమే కావచ్చు.

మదుపుదారుల ప్రయాణంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాంటి ఆటుపోట్లకు తగినట్టుగా ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం.

రిటైర్‌మెంట్ ప్లాన్

ఫొటో సోర్స్, Getty Images

మూడవ అధ్యాయంలో సంపదతో తృప్తి పడే అంశంపై వివరణ

మూడవ అధ్యాయం పూర్తిగా ఉన్న సంపదతో తృప్తిపడటం అనే విషయం మీద ఉంటుంది. భారతీయ అమెరికన్లు రజత్ గుప్తా, రాజారత్నం, అమెరికన్ స్టాక్ మార్కెట్ బ్రోకర్ బెర్నీ మాడాఫ్ గురించి ప్రస్తావించారు.

వంద మిలియన్ డాలర్ల సంపద కలిగిన రజత్ గుప్తా అమితమైన ధనకాంక్షకు లోనై జైలు పాలు కావడం మనకు తెలిసిందే.

అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బెర్నీ మాడాఫ్ తర్వాతి కాలంలో ఆర్థిక నేరాలు కేసులో దోషిగా తేలారు.

వయసు, హోదాతో పాటు మారుతున్న పెరుగుతున్న ఆర్థిక అవసరాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఈ ఉదాహరణలతో చాలా చక్కగా వివరించారు.

దీర్ఘకాలిక దృక్పథం, పెట్టుబడి రక్షణ, పోర్టుఫోలియోపై మూడు అధ్యాయాలు

తర్వాత మూడు అధ్యాయాలలో దీర్ఘకాలిక దృక్పథం, పెట్టుబడి రక్షణ, పోర్ట్ ఫోలియోలో వివిధ మదుపుమార్గాలకు స్థానం కల్పించడం ఎంత ముఖ్యమో వివరించారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారెన్ బఫెట్ కంటే మూడు రెట్లు అధిక వడ్డీ సంపాదించిన వ్యక్తి బఫెట్ ఆదాయంలో 2% మాత్రమే సంపాదన కలిగి ఉండటం ఎలా జరిగిందో చెబుతూ దీర్ఘకాలం మదుపు చేసే ప్రాముఖ్యతను తెలియజేశారు.

పర్సనల్ ఫైనాన్స్ మూలసూత్రమైన దీర్ఘకాలిక దృక్పథం గురించి ఉదాహరణలతో చెప్పడం ఔత్సాహిక మదుపరులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరోవైపు వివిధ మదుపు మార్గాలలో ఇన్వెస్ట్ చేయడం పెట్టుబడిదారులకు నష్టభయాన్ని ఎలా తగ్గిస్తుందో వివరించారు.

పొదుపు గురించి ఆలోచన

ఫొటో సోర్స్, Getty Images

అంతిమ లక్ష్యం ఆర్థిక స్వావలంబనే

ఏడవ అధ్యాయం మొత్తం ఆర్థిక స్వావలంబన గురించి చర్చిస్తుంది. పర్సనల్ ఫైనాన్స్ విషయంలో అంతిమ లక్ష్యంగా పరిగణించే ఆర్థిక స్వావలంబన అంశాల గురించి రచయిత భావాలు ఆలోచింపజేస్తాయి.

రచయిత ప్రస్తావించిన ఉదాహరణలు కూడా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కావడం రచయిత వాదనకు మరింత బలాన్ని ఇచ్చింది.

ఎనిమిది, తొమ్మిది అధ్యాయాలలో మన సమాజంలో హోదా అనే ఊహాజనితమైన విషయం మన ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని వివరించారు.

ఆ తర్వాత ఆధ్యాయాలలో ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో అనేక కోణాలలో వివిధ ఉదాహరణల ద్వారా చెప్పారు. మదుపరులందరూ సహజంగా చేసే ఎన్నో తప్పులను ఎత్తి చూపుతూ అవి చేయకపోతే వచ్చే లాభాలను ప్రస్తావించారు.

చివరి అధ్యాయాలలో రచయిత తన వ్యక్తిగత జీవితాన్ని, అలవాట్లను పాఠకులకు తెలియజేశారు. ఒక దిగువ మధ్యతరగతి స్థాయి నుంచి మొదలైన తన ప్రస్థానం సరైన ఆర్థిక లక్ష్యాలు, సానుకూల దృక్పథంతో ఎలా గడిచిందో చాలా చక్కగా వివరించారు.

సైకాలజీ ఆఫ్ మనీ

ఫొటో సోర్స్, The Psychology of Money

ప్రముఖుల జీవితాలలో జరిగిన సంఘటనల ప్రస్తావన

అనేక ఇతర పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలాగా ఈ పుస్తకంలో కూడా వారెన్ బఫెట్, చార్లీ ముంగర్, బెంజమిన్ గ్రహం లాంటి ప్రముఖుల జీవితాలలో జరిగిన సంఘటనలను వారి ఆలోచనలను ప్రస్తావించారు.

అంతేకాక ఇప్పటిదాకా తెలియని చాలా సంఘటనలను ఉదాహరణలుగా చెప్పడం ఈ పుస్తకంలోని విలక్షణమైన అంశం.

బిల్ గేట్స్ ప్రాణ మిత్రుడు గేట్స్ లాగే కంప్యూటర్ కోడింగ్ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న సహాధ్యాయి ప్రమాదవశాత్తు చిన్నవయసులో దుర్మరణం పాలయ్యాడని చాలామందికి తెలియదు. బఫెట్, ముంగర్లతో పాటూ బెర్క్ షైర్ కంపెనీలో అధికవాటా కలిగిన మూడవ భాగస్వామి తన వాటాను బఫెట్‌కు ఎందుకు తక్కువ ధరకు అమ్మాడు అనే విషయానికి కూడా పెద్దగా ప్రచారం లభించలేదు.

వీటితో పాటు 1929 ఆర్థిక మాంద్యం నుంచి 2008 సబ్ ప్రైమ్ సంక్షోభం వరకూ జరిగిన ముఖ్యమైన ఘటనలతో మదుపుదారులు నేర్చుకోవలసిన పాఠాలను రచయిత వెలికితీసిన విధానం ప్రశంసనీయం.

రచయిత అనేకసార్లు ప్రస్తావించిన దురాశ ప్రస్తుతం జరుగుతున్న స్కాములకు కూడా వర్తిస్తుంది. కేవలం దురాశతో నేరస్తులకు వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తున్న బాధితులెందరో మన చుట్టూ ఉన్నారు.

ఆ నేరస్తుడి ప్రధాన బలం బాధితుడి దురాశ. సులభంగా వచ్చే లాభాల కోసం వెంపర్లాడే వ్యక్తులు నేరస్తుల చేతిలో నష్టపోవడం అనేది దశాబ్దాలుగా బహుశా శతాబ్దాలుగా జరుగుతున్న పరిణామం.

ఈ పుస్తక రచయిత హౌసెల్ ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించి పాఠకుల ఆలోచనాధోరణిలో మార్పు తెచ్చే ప్రయత్నం అభినందనీయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)