యూపీఐ పేమెంట్స్: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా, 4 గంటల్లో తిరిగి పొందొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
కొన్నేళ్ల క్రితం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) అంటే చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ, ఇప్పుడు మాత్రం యూపీఐ అన్న పదం దాదాపు దిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ పరిచయమే.
2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు (డీమానిటైజేషన్) ప్రకటించాక డిజిటల్ చెల్లింపుల విప్లవం మొదలైందని చెప్పొచ్చు.
ఈరోజున చిన్న చిన్న దుకాణాలు, టీ స్టాళ్ల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనూ ప్రజలు యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారతీయుల దైనందిన జీవితాల్లోనూ భాగమైయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వివరాల ప్రకారం 2023 నవంబర్ నెలలో 17 ట్రిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.
తాము సాధించిన విజయాల్లో యూపీఐ పేమెంట్స్ కూడా ఒకటని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో దిల్లీలో జరిగిన జీ20 సదస్సుల్లో కూడా ప్రకటించుకుంది.
జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నాయకులు భారత్‌లో బ్యాంక్ అకౌంట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు జరిపేందుకు వీలుగా యూపీఐ వన్ వరల్డ్, ఈ-రూపీ విధానం కూడా ప్రవేశపెట్టారు.
యూపీఐ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది నుంచి (01 జనవరి 2024) ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి.
వీటి వల్ల యూపీఐ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వినియోగదారులు ఏమేం తెలుసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
5 ముఖ్యమైన నిబంధనలు..
కొత్త ఏడాది నుంచి అమలులోకి వచ్చిన నిబంధనలు..
1.యూపీఐ ఐడీలు వినియోగంలో లేకపోతే?
ఏడాదికన్నా ఎక్కువ కాలం పాటు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాల్సిందిగా బ్యాంకులు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లకు ఎన్‌పీసీఐ ఆదేశాలు ఇచ్చింది.
ఆ ఫలితంగా 12 నెలల అంతకన్నా ఎక్కువ కాలంలో ఎలాంటి లావాదేవీలు జరగని యూపీఐ ఐడీలు, వాటితో అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్ల వివరాలను పరిశీలించిన సంబంధిత యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయనున్నారు.
నిష్క్రియంగా మారిన అకౌంట్ల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున్న ఈ నిబంధనలు అమలు చేస్తోంది ఎన్‌పీసీఐ
2.పరిమితి పెంపు
గతేడాది డిసెంబర్ 8వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిమితుల పెంపు ఈ ఏడాది అమలులోకి వచ్చింది.
3.బదిలీ ఛార్జ్‌లు
ఆన్‌లైన్ వాలెట్స్ వంటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ)ల ద్వారా రూ.2 వేలు అంతకన్నా ఎక్కువ మొత్తంలో నిర్వహించే లావాదేవీల్లో 1.1 % బదిలీ చార్జ్ కూడా అమలులోకి వచ్చింది.
అయితే, సాధారణ ప్రజలకు ఇది వర్తించదని, వాణిజ్యపరమైన వాటికే వర్తిస్తుందని ఎన్‌పీసీఐ పేర్కొంది.
జీ20 సదస్సు నేపథ్యంలో అమలులోకి తీసుకుని వచ్చిన యూపీఐ వన్ వరల్డ్ సదుపాయం కూడా అటువంటిదే.
త్వరలోనే ట్యాప్ అండ్ పే విధానాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని ఎన్‌పీసీఐ తెలిపింది. ఆ విధానం గనుక అమలులోకి వస్తే, లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
4.యూపీఐ ఏటీఎం
సాధారణ ఏటీఎంల మాదిరిగానే యూపీఐ ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలు కనిపించనున్నాయి. ఎలాగైతే డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేస్తామో, అలానే మన మొబైల్‌తో యూపీఐ ఏటీఎం పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా స్కాన్ చేసి నగదును విత్ డ్రా చేయొచ్చు.
5.పొరపాటున వేరే యూజర్‌కు డబ్బు పంపితే?
ఇప్పటివరకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన మరో నిబంధన ఉపయుక్తంగా మారనుంది.
అదేంటంటే, కొత్త యూజర్ల మధ్య మొదటి సారి నగదు బదిలీ సమయంలో రూ.2000 కన్నా ఎక్కువ పంపేందుకు నాలుగుగంటలపాటు వేచి ఉండాల్సి ఉంటుంది.
ఒకవేళ పొరపాటున గనుక వేరే యూజర్‌కు నగదు బదిలీ చేస్తే గనుక, ఈ నాలుగు గంటల సమయం లోగా వాటిని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలను కట్టడి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్‌పీసీఐ చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భద్రత సంగతేంటి?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుగుతున్న నేపథ్యంలో అమలులోకి వచ్చిన నిబంధనలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి నిపుణుల నుంచి అభిప్రాయం తీసుకుంది బీబీసీ.
ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఫెడరేషన్ మాజీ జనరల్ సెక్రటరీ థామస్ ప్రాంగ్ మాట్లాడుతూ, “ప్రభుత్వం యూపీఐ లావాదేవీలను ప్రోత్సహిస్తునే ఉంది, కానీ యూపీఐ సంబంధిత మోసాలను నిరోధించేలా ఆన్‌లైన్ భద్రతా ఫీచర్లలో మాత్రం మెరుగుదల కనిపించలేదు. ముందుగా దీనిపై దృష్టి సారించకుండా, ప్రజల్ని యూపీఐవైపు ప్రోత్సహించడమెందుకు?” అని ప్రశ్నించారు.
“గతంలో బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగేటప్పుడు, డబ్బు ఏ అకౌంట్‌కు చేరిందో ట్రాక్ చేయడానికి వీలుండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈమధ్యనే ఎంపీ దయానిధి మారన్ అకౌంట్ నుంచి రూ.1 లక్ష చోరీకి గురైంది. దాని గురించి వార్తలు కూడా వచ్చాయి. ఆయన కానీ, ఆయన భార్యగానీ ఎవరికీ వారి బ్యాంకు వివరాలు ఇవ్వలేదు. ఆ విషయంపై బ్యాంకు అధికారులు జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించారు. అయితే, ఎంతమంది సాధారణ ప్రజలకు ఎంపీ విషయంలో జరిగినట్లుగా వెంటనే న్యాయం జరుగుతుంది? దీనిపై ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి” అని ఆయన అన్నారు.
“నాకు తెలిసిన కాలేజీ ప్రొఫెసర్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.1.5 లక్షలు పోయాయి. ఆయన ఎలాంటి లింక్ క్లిక్ చేయలేదు. ఓటీపీ వంటి వివరాలను కూడా ఎవరితోనూ పంచుకోలేదు. మరి ఆ ఘటన ఎలా జరిగింది? దీనిని బట్టి చూస్తే యూపీఐ లావాదేవీల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'అది కాగితపు డబ్బు అని మర్చిపోవద్దు'
ఆర్థికవేత్త సోమ వలియప్పన్ మాట్లాడుతూ, “దేశం అభివృద్ధి చెందాలంటే డిజిటల్ లావాదేవీలు కూడా ముఖ్యమే, వాటిని ఆపలేం కూడా. మొదట పెద్ద నగదు లావాదేవీలపై పర్యవేక్షణ కోసం డిజిటల్ విధానాన్ని అమలులోకి తెచ్చినా, ఇప్పుడు సాధారణ ప్రజలే యూపీఐను విరివిగా వాడుతున్నారు” అన్నారు.
“భారత్ వంటి అధిక జనాభా దేశాల్లో యూపీఐ చెల్లింపులు చాలా ఉపయోగకరమైన విధానం, దీని వల్ల ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడాల్సిన పనిలేదు” అని వలియప్పన్ అభిప్రాయపడ్డారు.
“ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ లేదంటే, ఇంటర్నెట్ అందుబాటులోనే ఉంది. కాబట్టి వారు డిజిటల్ వైపు మొగ్గు చూపడంలో తప్పులేదు. ఇప్పుడు అది అవసరం కూడా” అన్నారాయన.
“సమస్యల గురించి మాట్లాడాలంటే, చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే, ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించి, ఇంటర్నెట్, కరెంట్ సదుపాయాలకు అంతరాయం కలిగితే గనుక, మన చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్నా ఏమీ చేయలేం. ఒక్కోసారి శక్తివంతమైన దేశాల్లోనూ వరదలు, తుపానులు వంటివి సంభవించినప్పుడు ఇంటర్నెట్, విద్యుత్ వంటివి ఉండవు. దీనిని బట్టి ఏమర్థమైందంటే, మనం కాగితపు కరెన్సీని మాత్రం మర్చిపోకూడదు’’ అని వలియప్పన్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
- మహాత్మ జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలే స్థాపించిన తొలి బాలికల పాఠశాల ఏడాదిలోనే ఎందుకు మూతపడింది, ఆ తర్వాత ఏమైంది?
- 2024: సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? దీని ప్రభావంతో భారత్‌లో ఈ ఏడాది కరవు తప్పదా
- సద్దాం హుస్సేన్: ‘నల్ల ముసుగు కప్పకుండానే నన్ను ఉరి తీయండి... నా ధైర్యాన్ని మీరు చూడలేరా?’
- అయోధ్య: సోనియా గాంధీకి ఆహ్వానంపై వీహెచ్‌పీ వాదన ఏమిటి?
- పిల్లల భవిష్యత్తు కోసం వారితోనే పొదుపు చేయించే మూడు చిట్కాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















