అయోధ్య: సోనియా గాంధీకి ఆహ్వానంపై వీహెచ్‌పీ వాదన ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్య రామ మందిరంలో జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ (అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు) అలోక్ కుమార్ చెప్పారు.
రాజకీయాలు ఉండి ఉంటే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఎందుకు ఆహ్వానిస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల కీలక నాయకులను ఆహ్వానించినట్లు అలోక్ కుమార్ చెప్పారని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని శివసేన (యూబీటీ- ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఆహ్వానాల విషయమై రాజకీయ ప్రటనలు కొనసాగుతున్న నేపథ్యంలో, తనకు ఆహ్వానం అవసరం లేదని, ఎప్పుడైనా తాను ఆలయాన్ని దర్శించుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, YEARS
శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధానార్చకుడు ఏమన్నారు?
ఠాక్రే వ్యాఖ్యలపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందిస్తూ- ''శ్రీరాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానాలు పంపించాం'' అన్నారు.
''శ్రీరాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానం పంపాం. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందనడం పూర్తిగా తప్పు. మన ప్రధానమంత్రికి అన్నిచోట్లా గౌరవం దక్కుతోంది. తన పదవీ కాలంలో ఎన్నో పనులు చేశారు. ఇది రాజకీయం కాదు, భక్తి” అని వార్తాసంస్థ ఏఎన్‌ఐతో సత్యేంద్ర దాస్ అన్నారు.
శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్‌పై దాస్ విమర్శలు చేశారు. ఒకప్పుడు రాముడి పేరుతో ఎన్నికల్లో పోటీ చేశాననే విషయం ఆయన మర్చిపోయారని విమర్శించారు.
“సంజయ్ రౌత్ చాలా విచారంలో ఉన్నారు. దానిని ఆయన కనీసం బయటికి వ్యక్తం చేయలేరు. రాముడి పేరుతో ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో వీరంతా ఉన్నారు. ఇప్పుడు రాముడిపై నమ్మకం ఉన్నవారే అధికారంలో ఉన్నారు. ఆయన రాముడిని అవమానిస్తున్నారు'' అని దాస్ అన్నారు.
అయితే, ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు రాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని సంజయ్ రౌత్ ఆరోపిస్తున్నారు.
''ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం అయోధ్యను తమ స్థావరంగా చేసుకుంటోంది. తాము చేసిందేమీ లేక రాముడి పేరుతో ఓట్లు అడుగుతారు'' అన్నారు.

ఫొటో సోర్స్, YEARS
వీహెచ్‌పీ ఏం చెబుతోంది?
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని వీహెచ్‌పీ చెబుతోంది.
''ఒకవేళ రాజకీయాలు ఉండి ఉంటే సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించేవారా? కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆహ్వానించేందుకు నేను స్వయంగా వెళ్లా. వీహెచ్‌పీ సభ్యులు, ట్రస్ట్ అధికారులు వెళ్లి అధిర్ రంజన్ చౌదురికి ఆహ్వానం అందజేశారు. సోనియా గాంధీని ఆహ్వానించేందుకు రామ మందిర కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా వెళ్లారు'' అని తెలిపారు.
''వారు రావాలని మేం కోరుకుంటున్నాం. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినప్పుడు, ప్రధానమంత్రిని ఆహ్వానించడంలో తప్పేముంది'' అన్నారాయన.
''కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డ్ చైర్‌పర్సన్ కాబట్టి సోనియా గాంధీని ఆహ్వానించాం. అందులో ఏమైనా రాజకీయముందా? ఆమె వస్తే, మేం స్వాగతిస్తాం. అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులనూ ఆహ్వానించాం. ఇది దేశం మొత్తానికి సంబంధించిన విషయం. అందరూ ఆహ్వానితులే'' అని అలోక్ అన్నారు.
అయితే, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదురి ఈ కార్యక్రమానికి హాజరవుతారా, లేదా అనే విషయంపై కాంగ్రెస్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, YEARS
7 వేల మందికి ఆహ్వానాలు
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు 7 వేల మంది అతిథులకు ఆహ్వానాలు అందాయి. అందులో 3 వేల మంది వీవీఐపీలు ఉన్నారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం ఇప్పటికే నగరంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గర్భగుడిలో జరిగే పూజా కార్యక్రమాలను ఆయన ప్రారంభించినున్నారు.
2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రామ మందిర ఉద్యమంలో శివసేన
శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేకి రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. అయితే, అయోధ్య రామ మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మొదటిసారి అయోధ్యను సందర్శించిన నాయకుడు ఆయనే. 2019 నవంబర్ 9న ఆయన అయోధ్యకు వెళ్లారు.
అదే నెలలో జరిగిన తన ప్రమాణ స్వీకారోత్సవం రోజున ఆయన కాషాయ దుస్తుల్లో వచ్చారు. అలాగే, తమ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలోనూ ఆయన కాషాయ దస్తులు ధరించారు. అయోధ్యను సందర్శించిన సందర్భంగా రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించారు.
ఉద్ధవ్ ఠాక్రే తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితుడిగానూ ఉన్నారు. అయోధ్య రామ మందిరం కోసం జరిగిన ఉద్యమాల్లో శివ సేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు.
అయోధ్య రామ మందిరం వివాదం నేపథ్యంలో 90లలో హిందూత్వ భావజాలం బలపడుతున్న రోజుల్లో హిందూత్వ రాజకీయాలకు బాల్ ఠాక్రే ముఖచిత్రంగా ఎదిగారు.

ఫొటో సోర్స్, YEARS
ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసినప్పటి నుంచి హిందూత్వ విధానాల విషయంలో వెనకబడిందని శివసేన ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఉద్ధవ్ ఠాక్రే మార్చిలో అయోధ్య సందర్శనకు వచ్చినప్పుడు రాయగఢ్ కోట(ఛత్రపతి శివాజీ మహరాజ్ రాజధాని) నుంచి మట్టిని తీసుకొచ్చారు. అది ఆయన సహచరులకు అసంతృప్తి కలిగించిందని చెబుతారు.
2020లో అయోధ్య రామ మందిర భూమి పూజ కార్యక్రమం జరిగింది. అప్పట్లో కరోనావైరస్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని ఆ ఏడాది జులై చివరి వారంలో శివసేన పత్రిక సామ్నాలో ఠాక్రే కోరారు.
ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఉద్ధవ్ ఠాక్రేను ఆహ్వానించారని చెబుతున్నప్పటికీ, ఆయన మాత్రం ఆహ్వానం ఏదీ అందలేదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు, ఒక శాతం ఓటు కూడా లేని బీజేపీతో స్నేహం కోసం ప్రధాన పార్టీలు ఎందుకు ఆరాటపడుతున్నాయి
- మహువా మొయిత్రా: పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మీదే ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి?
- రేవంత్ రెడ్డి ఎలా గెలిచారు? కేసీఆర్ ఎందుకు హ్యాట్రిక్ మిస్సయ్యారు?
- మోదీ: కర్ణాటక, హిమాచల్‌లలో ఓటమి తర్వాత బీజేపీ వ్యూహాలు ఎలా మార్చుకుంది?
- మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి, మరి ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














