ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటు, ఒక శాతం ఓటు కూడా లేని బీజేపీతో స్నేహం కోసం ప్రధాన పార్టీలు ఎందుకు ఆరాటపడుతున్నాయి

చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, facebook

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

తెలుగుదేశం పార్టీతో కలిసి సాగేందుకు జనసేన సన్నాహాలు చేసుకుంటోంది. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఉమ్మడి మ్యానిఫెస్టో, సీట్ల సర్థుబాటు వరకు చర్చలు వచ్చేశాయి.

అటు టీడీపీ అధినేత ఇంటికి జనసేన అధ్యక్షుడు వెళ్లి వచ్చారు. తాజాగా జనసేన చీఫ్ ఇంట్లో టీడీపీ అధ్యక్షుడు ప్రత్యక్షమయ్యారు.

అదే సమయంలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెబుతూ వస్తున్నారు.

మరోవైపు టీడీపీతో కలిసేందుకు సుముఖంగా లేమని అదే బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అంటున్నారు.

పరస్పర విరుద్ధమైన ఈ ప్రకటనల కారణంగా బీజేపీ మనసులో ఏముందనే చర్చకు ముగింపు దొరకడం లేదు.

టీడీపీతో కలిసి సాగుతున్న జనసేనతో బీజేపీ స్నేహం కొనసాగుతుందా? లేదంటే వారి బంధానికి బ్రేకులు పడతాయా అన్నదీ ఆసక్తికర అంశంగా మారింది.

narendramodi

ఫొటో సోర్స్, facebook/narendramodi

బీజేపీ మనసులో ఏముందో..

ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలని టీడీపీ, జనసేన ఆశిస్తున్నాయి. అప్పటిలా బీజేపీతో కలిసి మరోసారి ఎన్నికలకు వెళ్లాలని కోరుకుంటున్నాయి.

ఇప్పటికే పవన్ కల్యాణ్ ఈ మాటను చాలా సార్లు చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఉండేందుకు బీజేపీ తమతో కలిసి రావాలని ఆయన కోరుతున్నారు.

టీడీపీ కూడా దాదాపు అదే ఆశిస్తోంది. కానీ ఆ మాటను బహిరంగంగా చెప్పడం లేదు.

మరోవైపు బీజేపీలో కొందరు నాయకులు టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. కానీ బీజేపీ అధిష్ఠానం మనసులో ఏముందన్నది అంతుబట్టకపోవడంతో నేతలంతా ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

బీజేపీతో స్నేహం కోసం చేయిచాచిన తర్వాత వారు తిరస్కరిస్తే ఏమవుతుందోననే ఆందోళన టీడీపీలో ఉంది. మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లపై ప్రభావం పడుతుందేమో అన్న సంశయం కొందరు టీడీపీ నేతల్లో ఉంది.

జగన్, మోదీ

ఫొటో సోర్స్, ysrcp

కేంద్రంలో బీజేపీ విషయంలో వైసీపి ‘మోర్ లాయల్ దాన్ కింగ్’ అన్న రీతిలో వ్యవహరిస్తూ వస్తోంది.

ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం వంటి ఏపీ ప్రయోజనాలు ఏవీ పూర్తి కాకపోయినా కూడా బలవంతుడితో నాకెందుకు అన్న తరహాలో వైసీపీ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో అనుకూలంగా ఉంటోంది.

అయితే, ఆ పార్టీ కూడా ఎన్నడూ బీజేపీతో బహిరంగంగా మితృత్వం ప్రకటించదు. పొత్తు దిశగానూ అడుగులు వేయలేదు.

మరోవైపు తెలుగుదేశం కూడా గత ఎన్నికల సమయంలో బీజేపీ నేతలపై ఒంటి కాలిమీద లేచి తప్పు చేశామేమో అన్నభావనలో ఉంది. కాబట్టి బీజేపీ విషయంలో ఆ పార్టీకి స్పష్టత కొరవడుతోంది.

నిజానికి టీడీపీ, వైసీపీలతో పోల్చినప్పుడు బీజేపీకి ఏపీలో ఓటుబ్యాంకు చాలా తక్కువ. కానీ కేంద్రంలో అధికారం ఉండడం, ఎన్నికల సమయంలో ఆ అధికారం కీలకం అని మిగతా పార్టీలు భావిస్తుండడం వంటి అంశాల కారణంగా ఏపీలోని అన్ని ప్రధాన పార్టీలూ బీజేపీ స్నేహం కోసం ఆశపడుతున్నాయి.

పవన్ కల్యాణ్ అయితే మొహమాటం లేకుండా బీజేపీతో తన బంధాన్ని పదేపదే చాటుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Facebook/ChandraBabuNaidu

2014 ఎన్నికలలో ఏమైందంటే..

2014 ఎన్నికలకు ముందు జనసేన బీజేపీకి జై కొట్టింది. టీడీపీ కూడా అప్పుడు ఎన్డీయేలో భాగస్వామిగా మారింది.

ఆ ఎన్నికలలో జనసేన పోటీకి దూరంగా ఉండి టీడీపీ- బీజేపీ కూటమికి మద్దతు పలికింది. నాలుగు ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాల్లో అప్పుడు బీజేపీ పోటీ చేసింది. విశాఖ, నరసాపురం ఎంపీ సీట్లతో పాటు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ దక్కించుకుంది.

టీడీపీ 102 అసెంబ్లీ సీట్లు, 14 పార్లమెంట్ స్థానాలు తన ఖాతాలో వేసుకుని బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చింది.

కేంద్రంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో క్యాబినెట్‌లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు.

2018 తర్వాత ఈ కూటమి బీటలు వారింది. ఎన్టీయే నుంచి టీడీపీ బయటకు రావడం, చంద్రబాబు క్యాబినెట్ నుంచి బీజేపీ మంత్రులు వైదొలగడం జరిగిపోయాయి.

ఆ తరువాత 2019 ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ ఒంటరిగా పోటీ చేశాయి. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నేతలైన రాహుల్ గాంధీ వంటివారితో కలిసి ప్రచార సభలలో పాల్గొన్నారు.

జనసేన మాత్రం వామపక్షాలు, బీఎస్పీతో కలిసి తొలిసారి ఎన్నికల బరిలో దిగింది. కేవలం ఒకే ఒక్క సీటును గెలుచుకుంది.

టీడీపీకి 23 సీట్లు మాత్రమే రాగా బీజేపీ బోణీ చేయలేకపోవడమే కాకుండా ఒక్క శాతం ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Facebook/Janasena

2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు సునాయాసంగా జరిగింది. ఓట్ల బదిలీ కూడా జరిగింది. రెండు పార్టీలు లాభపడ్డాయి.

కానీ ఇప్పుడు జనసేన పోటీలో ఉండబోతోంది. దాంతో అదే కూటమి అంటే జనసేనకు పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అనివార్యం అవుతుంది. గతంలో మాదిరిగా రెండు ఎంపీ సీట్లు, ఆరేడు ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి కేటాయించినా, జనసేన అంతకుమించి కోరొచ్చు.

ఆ క్రమంలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కీలకం అవుతుంది. తదుపరి ఓట్ల బదిలీ కూడా ప్రాధాన్యాంశం అవుతుంది.

మిత్రపక్షాలకు నాలుగైదు పార్లమెంట్ సీట్లు, 30 వరకూ అసెంబ్లీ స్థానాలు ఇవ్వాల్సి వస్తే టీడీపీలో సర్దుబాటు సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ప్రధానంగా 2014లో విశాఖ నార్త్, రాజమహేంద్రవరం సిటీ, తాడేపల్లిగూడెం, కైకలూరు అసెంబ్లీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఆయా సీట్లలో ప్రస్తుతం జనసేన, టీడీపీ నుంచి ఆశావాహులు ఉన్నారు.

వారిని సంతృప్తి పరిచి బీజేపీకి సీట్లు కట్టబెట్టడం ఇరు పార్టీల అధినేతలకు కత్తిమీద సాములా మారుతుంది. అయినప్పటికీ రాజకీయాల్లో సీట్ల సర్దుబాటు సమస్యను అధినేతలు కొలిక్కి తెచ్చినా ఓట్ల బదిలీ దగ్గర కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి.

గిడుగు రుద్రరాజు

ఫొటో సోర్స్, andhrapradesh congress

ఫొటో క్యాప్షన్, గిడుగు రుద్రరాజు(చిత్రంలో ఎడమవైపు)

కాంగ్రెస్‌కు ఒంటరి పోరు తప్పదా

తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకుంటామని ఆశిస్తోంది. జగన్‌కు అడ్డుకట్ట వేసేది తామేనంటూ ఏపీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు.

2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగింది.

2014లో బొత్స, కోట్ల కుటుంబాలు కాంగ్రెస్‌లో ఉండగా వారికి పట్టున్న స్థానాల్లో కొంత చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు దక్కాయి.

కానీ 2019 నాటికి కీలక నేతలంతా దూరం కావడంతో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపినప్పటికీ 1.17 శాతం ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు బహిరంగంగానే మద్దతు పలికాయి. ఈసారి కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండనుందనేది కీలకమే.

జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటులో జరిగితే ఏపీలో కూడా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య కొంత అవగాహన వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

అయితే ఏపీలో ఆ పార్టీల కలయిక పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: సీఎం వస్తున్నారని చెట్లు కొట్టేశారు, ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు

తమిళనాడుని తలపించేలా..!

జాతీయ స్థాయిలో అధికారం కోసం పోటీ పడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏపీలో ప్రభావం చూపగల స్థితిలో లేవు.

అయితే కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ వైపు టీడీపీ, జనసేన వంటి పార్టీలు చూస్తున్నాయి. కానీ కాంగ్రెస్ గురించి చర్చించిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు.

“తమిళనాడు తరహాలోనే ఏపీ రాజకీయాలున్నాయి. దీర్ఘకాలం అలానే ఉంటాయని చెప్పలేం. కానీ ప్రస్తుతం జాతీయ పార్టీలు కనీసం తమ ఉనికి చాటుకోవాలన్నా, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో జతగట్టాల్సిందే. ఒంటరిగా బరిలో దిగితే డిపాజిట్లు కూడా అనుమానమే. అందుకే బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్‌ ఆతృత పడుతున్నప్పటికీ బీజేపీ పెద్దలు మాత్రం ఆచితూచి వ్యవహరించడానికి కారణమదే. చివరి నిమిషంలో ఎవరితో చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. అదే సమయంలో ఒంటరి పోరాటానికైనా మొగ్గు చూపొచ్చు” అంటూ సీనియర్ జర్నలిస్ట్ కె.పార్థసారధి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌తో కలిసొచ్చే మిత్రులు గానీ, ఉమ్మడిగా పోరాటం చేసి ప్రభావం చూపగల అవకాశాలు కానీ ఈసారి ఎన్నికల్లో స్వల్పమేనని ఆయన అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)