మదర్సాలను 'మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్'గా మార్చిన అస్సాం ప్రభుత్వం, అసలేంటి వివాదం?

మదర్సాలు

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

    • రచయిత, దిలీప్ కుమార్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం

అస్సాం ప్రభుత్వం 1,281 మదర్సాల పేరును 'మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్'గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ సహాయంతో నడిచే ఎంఈ మదర్సాలను సాధారణ స్కూళ్లుగా మారుస్తున్నట్లు అస్సాం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై అస్సాం విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 1,281 ఎంఈ మదర్సాల పేర్లు 'మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్'గా మారాయని తెలిపారు.

అస్సాంలో అనేక దశాబ్దాలుగా నడుస్తున్న ఈ మదర్సాలలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఈ మదర్సాలను మూసివేయడమంటే అక్కడ చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేయడమేనని 'ఆల్ అస్సాం మదర్సా స్టూడెంట్స్ అసోసియేషన్' అధ్యక్షులు వహిదుజ్జమాన్ అభిప్రాయపడ్డారు.

'హిమంత బిశ్వ శర్మ మారిపోయారు'

"మదర్సాలపై చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, ప్రభుత్వం పాఠశాలలుగా మార్చిన ఈ మదర్సాలలో మతపరమైన విద్యతో పాటు సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్ వంటి సాధారణ సబ్జెక్టులు కూడా బోధిస్తారు" అని వహిదుజ్జమాన్ అంటున్నారు.

మదర్సాలలో చదువుతున్న చాలామంది విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇతర ఉన్నత స్థానాలకు ఎదిగారని ఆయన గుర్తుచేస్తున్నారు.

"రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మదర్సాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. బీజేపీలో చేరిన తర్వాత పూర్తిగా మారిపోయారు" అని ఆరోపించారు వహిదుజ్జమాన్.

కాగా, అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 2020లోనే అన్ని ప్రభుత్వ మదర్సాలను మూసివేయాలని నిర్ణయించింది.

2020 నవంబర్ 13న కేబినేట్ సమావేశాన్ని నిర్వహించి "ప్రోవిన్షియల్" మదర్సాలను సాధారణ ఉన్నత పాఠశాలలుగా మార్చాలని, ఈ మదర్సాలలో మతపరమైన విద్యను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ కేబినెట్‌లో హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు.

తదనంతరం 2021లో రెండు మదర్సా విద్యా సంబంధిత చట్టాలను రద్దు చేయడానికి చట్టం చేసి, అన్ని ప్రభుత్వ, ప్రాంతీయ మదర్సాలను మూసివేసే ప్రక్రియ ప్రారంభించారు.

ఈ ప్రక్రియలో 2021 జనవరి 27న అస్సాం గవర్నర్ సమ్మతితో అస్సాం మదర్సా ఎడ్యుకేషన్ (ప్రొవిన్షియలైజేషన్) చట్టం-1995, అస్సాం మదర్సా ఎడ్యుకేషన్ (ఉపాధ్యాయుల సేవల ప్రొవిన్షలైజేషన్, విద్యాసంస్థల పునర్వ్యవస్థీకరణ) చట్టం- 2018లను రద్దు చేశారు.

మదర్సాలు

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

మదర్సాలతో పాటు సంస్కృత కేంద్రాలు

అస్సాంలో ప్రభుత్వ మదర్సాల మూసివేతకు సంబంధించి రాష్ట్ర శాసన, కార్యనిర్వాహక నిర్ణయాలను సవాలు చేస్తూ గౌహతి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.

కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ది అస్సాం రిపీలింగ్ యాక్ట్ (అస్సాం రద్దు చట్టం)-2020' చెల్లుబాటు అవుతుందని హైకోర్టు పేర్కొంటూ 2022 ఫిబ్రవరి 4న ఆ రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది.

అయితే, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది.

"పాఠశాలలుగా మారిన మదర్సాలు పూర్తిగా మదర్సాలు కావు. వీటిలో హైస్కూల్‌ మాదిరే అన్ని సబ్జెక్టులను అరబిక్ పాఠ్యాంశాలతో పాటు బోధిస్తారు" అని గౌహతి హైకోర్టులో రిట్ పిటిషనర్ల తరపున హాజరైన న్యాయవాది ఏఆర్ భుయాన్ అన్నారు.

"కానీ ప్రభుత్వ డబ్బుతో మతపరమైన విద్య ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణంగా ఈ మదర్సాలు సాధారణ పాఠశాలలుగా మార్చారు" అని ఆయన తెలిపారు.

"ప్రభుత్వం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ముఖ్యంగా ఆర్టికల్స్ 25, 29, 30లను ఉల్లంఘిస్తోంది. మదర్సాలలో బోధించే వాటిని ప్రభుత్వం నియంత్రించలేదు. ఈ కేసు సుప్రీంకోర్టులో దాఖలైంది, మేం విచారణ కోసం వేచి ఉన్నాం" అని అన్నారు.

మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మదర్సాలతో పాటు సంస్కృత కేంద్రాలనూ మూసివేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.

"రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంస్కృత కేంద్రాలను ప్రాచీన అధ్యయనాల విశ్వవిద్యాలయంలోని కుమార్ భాస్కర్ వర్మ సంస్కృత విశ్వవిద్యాలయంలో విలీనం చేసింది. సంస్కృత కేంద్రాల కోర్సు, సిలబస్‌లో పెద్దగా మార్పులు చేయలేదు" అని భుయాన్ చెప్పారు.

మదర్సాలు

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

మదర్సా సమస్య వెనుక రాజకీయం?

అస్సాంలో రెండు రకాల మదర్సాలు ఉన్నాయి. ఒకటి పూర్తిగా ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే గుర్తింపు పొందిన మదర్సా, మరొకటి ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ఖేజీ.

1934లో అస్సాం విద్యా పాఠ్యాంశాల్లో మదర్సా విద్యను చేర్చారు. అదే సంవత్సరంలో రాష్ట్ర మదర్సా బోర్డు కూడా ఏర్పడింది. అయితే, 2021 ఫిబ్రవరి 12న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ కావడంతో ఆ రాష్ట్ర మదర్సా బోర్డు రద్దయింది. 1995లో అప్పటి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మదర్సాలను తమ ఆధీనంలోకి తీసుకుంది.

ప్రభుత్వ నిధులతో నడిచే ఈ మదర్సాలను ప్రీ-సీనియర్, సీనియర్, టైటిల్ మదర్సాలుగా విభజించారు.

ప్రీ-సీనియర్ మదర్సాలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్య అందిస్తారు.

సీనియర్ మదర్సాలో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, టైటిల్ మదర్సాలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో విద్యను అందిస్తారు.

ఇది కాకుండా రాష్ట్రంలో నాలుగు అరబిక్ కళాశాలలు కూడా ఉన్నాయి, వీటిలో ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు విద్యను బోధిస్తున్నారు.

కానీ అస్సాం ప్రభుత్వం 2020లో రద్దు చట్టాన్ని తీసుకురావడం వల్ల ఈ మదర్సాలు, అరబిక్ కళాశాలలపై ప్రభావం పడింది.

ఈ మదర్సాల కోసం ప్రభుత్వం ఏటా దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది.

ప్రస్తుతం అస్సాంలో మొత్తం 2,250 ప్రైవేట్ మదర్సాలు ఏడు బోర్డుల కింద నడుస్తున్నాయి. ఆల్ అస్సాం తంజీమ్ మదారిస్ క్వామియా కింద గరిష్టంగా 1,503 ప్రైవేట్ మదర్సాలు ఉన్నాయి.

"సైన్స్, మ్యాథ్స్ వంటి సాధారణ సబ్జెక్టులను ప్రైవేట్ మదర్సాలలో బోధించాలని ముఖ్యమంత్రి చెబుతూనే, ఆయన ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వారు మూసివేస్తున్న ప్రభుత్వ మదర్సాలలో అరబిక్-ఉర్దూ మినహా అన్ని సాధారణ సబ్జెక్టులూ బోధిస్తున్నారు" అని ఆల్ అస్సాం తంజీమ్ మదర్సిస్ సెక్రటరీ మౌలానా అబ్దుల్ ఖాదిర్ ఖాస్మీ బీబీసీతో అన్నారు.

"ప్రభుత్వం మదర్సాలలో ముల్లాలు, మౌల్వీలను సృష్టించదని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు చాలా బాధగా ఉంది. దేశ విద్య కోసం విధానాలు రూపొందించిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈ దేశానికి తొలి విద్యాశాఖ మంత్రి అని వారికి తెలుసు. మదర్సాలను సమస్యగా మార్చడం వెనుక రాజకీయం ఏమిటో అందరికీ తెలుసు" అని ఖాదిర్ చెప్పారు.

మదర్సాలు

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

కొత్త నిబంధనలు

అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ 2020 నుంచి అనేక కార్యక్రమాలలో మదర్సాల అంశం ప్రస్తావించారు.

ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలోని బెలగావిలో బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో ప్రసంగిస్తూ “నేను 600 మదర్సాలను మూసివేశాను. కానీ మదర్సాలన్నీ మూసేయడమే నా ఉద్దేశం. ఎందుకంటే మనకు మదర్సాలు అవసరం లేదు. వైద్యులు, ఇంజనీర్లను తయారు చేయడానికే మనకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు అవసరం" అని అన్నారు.

ఈ మదర్సాలలో జరుగుతున్న చదువులకు సంబంధించి గతంలో కొన్ని వివాదాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

గత సంవత్సరం అస్సాంలో దేశ వ్యతిరేక, జిహాదీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో నాలుగు మదర్సాలను కూల్చివేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రైవేట్ మదర్సాలు నడుపుతున్న వ్యక్తులతో అస్సాం పోలీస్ డైరెక్టర్ జనరల్ సమావేశం నిర్వహించి, కీలక ఆదేశాలు జారీచేశారు.

ఈ నిబంధనల ప్రకారం 5 కిలోమీటర్ల పరిధిలో ఒక మదర్సా మాత్రమే ఉండాలి. 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న మదర్సాలు సమీపంలోని పెద్ద మదర్సాలో చేరతాయి.

దీంతో పాటు మదర్సాలలో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు సహా ఉపాధ్యాయులందరి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలి.

ప్రమోద్ స్వామి

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

ఫొటో క్యాప్షన్, అస్సాం సీనియర్ బీజేపీ నాయకుడు ప్రమోద్ స్వామి

బీజేపీ ఏం చెబుతోంది?

ప్రభుత్వ గ్రాంట్‌లతో మతపరమైన విద్యను అందించలేమని అస్సాం సీనియర్ బీజేపీ నాయకుడు ప్రమోద్ స్వామి అంటున్నారు.

"ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే మా లక్ష్యం. తద్వారా భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఇతర పిల్లల్లాగే దేశానికి సేవ చేయవచ్చు. మైనారిటీ పిల్లల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది" అని ఆయన అన్నారు.

రాజకీయ విమర్శలపై ఆయన మాట్లాడుతూ "మా పార్టీ ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకోదు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు" అని తెలిపారు.

ప్రైవేట్ మదర్సాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, 'మత విద్య కోసం ప్రైవేట్ మదర్సాలు కొనసాగుతాయి' అని ఆయన అన్నారు.

అస్సాంలోని 19 జిల్లాల్లో ఉన్న 1,281 ప్రభుత్వ మదర్సాలు పాఠశాలలుగా మార్చారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ధుబ్రి జిల్లాలో గరిష్టంగా 269 మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చారు.

నాగావ్ జిల్లాలో 165 మదర్సాలు, బార్‌పేటలో 158 మదర్సాలు ఇప్పుడు సాధారణ పాఠశాలల్లో విలీనం అయ్యాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)