ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు

ఫొటో సోర్స్, GETTYIMAGES

    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ కరస్పాడెంట్

ఇజ్రాయెల్‌లో పది వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించి హరియాణా ప్రభుత్వం దరఖాస్తులు కోరింది.

హరియాణా ప్రభుత్వ కంపెనీ అయిన ‘హరియాణా స్కిల్ ఎంప్లాయిమెంట్ కార్పొరేషన్’ రాష్ట్ర ప్రజలకు విదేశాలలో పనిచేసే అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి.

ఈ కంపెనీ తన వెబ్‌సైట్‌లో దుబాయ్‌లో సెక్యూరిటీ గార్డు పోస్టులు, యూకేలో స్టాఫ్ నర్సు పోస్టులు, ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగంలోని ఉద్యోగాలకు దరఖాస్తులు కోరింది.

ఈ మూడు దేశాలలో ఇజ్రాయెల్‌లో పదివేల ఉద్యోగాలుండగా, మిగిలి రెండు దేశాలలో కేవలం 170 ఉద్యోగాలు మాత్రమే ఉన్నట్టు కంపెనీ వెబ్‌సైట్ తెలిపింది. ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగంలో నాలుగు విభాగాలలో ఈ మొత్తం 10 వేల ఖాళీలున్నాయని పేర్కొంది.

అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తరువాత ఇజ్రాయెల్‌కు గాజా లక్ష్యంగా మారింది. హమాస్ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ ఇప్పటిదాకా 18 వేల మందికిపైగా చనిపోయారని పేర్కొంది. ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదు.

ఈ యుద్ధం కారణంగా పాలస్తీనీయుల వర్క్‌ పర్మిట్లను రద్దుచేయడంతో ఇజ్రాయెల్ మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది.

ఇజ్రాయెల్‌కు లక్ష మందికిపైగా కార్మికులు అవసరముందని ఓ అంచనా. ఇందుకోసం ఆ దేశం భారత్ వంక చూస్తోంది.

ఇజ్రాయెల్ అవసరాన్ని తీర్చేందుకు హరియాణా స్కిల్ ఎంప్లాయిమెంట్ కార్పొరేషన్ నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న కార్మికుల నుంచి దరఖాస్తులు కోరింది. కానీ ఇందులో కొన్ని ముఖ్యమైన షరతులు విధించింది.

అయితే వీటిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కాంట్రాక్టు ఎంత కాలం ఉంటుంది? అక్కడ భోజనం, వసతి సంగతేంటి? హరియాణా ప్రజలే దరఖాస్తు చేసుకోవాలా, పొరుగు రాష్ట్రాల వారు కూడా చేయవచ్చా? జీతం ఎంతిస్తారు? ఇజ్రాయెల్‌లో ఏ పని చేయాల్సి ఉంటుంది అనే సందేహాలు బోలెడు తలెత్తుతున్నాయి.

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు

ఫొటో సోర్స్, GETTYIMAGES

అర్హులు ఎవరు?

హరియాణా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేర్కొన్న వివరాల ప్రకారం ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో నాలుగు రకాలైన పనులు ఉన్నాయి. వీటిల్లో ‘ఫ్రేమ్‌వర్క్, కార్పెంటర్, ఐరన్ బెండింగ్, సెరామిక్ టైల్ ప్లాస్టరింగ్’ పనులు ఉన్నాయి.

ఫ్రేమ్‌వర్క్, కార్పెంటర్ పనులకు ఒకొక్కదానికి మూడేసి వేల మంది చొప్పున, ఐరన్ బెండింగ్, సెరామిక్ టైల్స్, ప్లాస్టింగ్ పనులకు ఒకొక్కదానికి 2 వేలమంది చొప్పున అవసరమవుతారని స్కిల్ ఎంప్లాయిమెంట్ కంపెనీ ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి కనీసం మూడేళ్ళ అనుభవంతోపాటు 10వ తరగతి వరకు చదువుకుని ఉండాలి. వయసు 25 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ఇజ్రాయెల్‌లో 5 ఏళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. కానీ వీరి వర్క్ పర్మిట్ వీసా ఏటా పొడిగిస్తుంటారు.

ఇక ఈ ఉద్యోగాలకు ఇంగ్లిష్ తప్పనిసరి కాదు.

హరియాణా స్కిల్ ఎంప్లాయిమెంట్ కార్పొరేషన్ కార్యదర్శి పల్లవి సందిర్ ప్రైవేటు, విదేశీ ఉద్యోగాల బాధ్యతలు చూస్తున్నారు.

‘‘విదేశాలలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌లో పనిచేస్తామంటూ 800 దరఖాస్తులు వచ్చాయి. యూకేలో పని కోసం 300, దుబాయ్‌లో సెక్యూరిటీ గార్డుల కోసం 700 దరఖాస్తులు వచ్చాయి’’ అని పల్లవి సందిర్ చెప్పారు.

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 20 చివరి తేదీ.

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు

ఫొటో సోర్స్, HKRNL.ITIHARYANA.GOV.IN

ఇజ్రాయెల్‌లో పనిచేస్తే ఎంతొస్తుంది?

ఇజ్రాయెల్‌లో పనిచేసేవారిని ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తామని హరియాణా స్కిల్ ఎంప్లాయిమెంట్ కార్పొరేషన్ పేర్కొంది. ఈ కంపెనీ ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు ఇజ్రాయెల్‌లో రోజుకు 9 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. నెలకు 26 రోజులు పనిచేయాలి. సెలవులు కావాలంటే ఇజ్రాయెల్ కంపెనీ అక్కడి కార్మిక చట్టాల ఆధారంగా మంజూరు చేస్తుంది.

ఇజ్రాయెల్‌లో పనికి ఎంపికైనవారికి నెలకు 6100 ఇజ్రాయెలీ న్యూ షెకెల్ కరెన్సీని ఇస్తారు. ఇది భారత్‌లో సుమారుగా లక్షా 38 వేల రూపాయలకు సమానం.

దీంతోపాటు అక్కడ పనిచేసేవారికి మెడికల్ ఇన్సురెన్స్, వసతి కూడా కల్పిస్తారు కానీ, వీటి ఖర్చును కార్మికులే భరించాల్సి ఉంటుంది.

మెడికల్ ఇన్సురెన్స్ కింద ఒక్కో వ్యక్తి 3 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వసతి కోసం 10 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ ప్రకటనలో తెలిపారు.

ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి నెలా జీతాన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని ఒకేసారి వడ్డీతో కలిపి ఇస్తారు. కాంట్రాక్టు పూర్తిచేసుకుని ఇజ్రాయెల్‌ వదిలి వెళ్ళేటప్పుడు ఈ మొత్తాన్ని ఇస్తారు.

అంటే దీనర్థం ఇజ్రాయెల్‌లో పనికి కుదిరిన వారికి ప్రతి నెలా జీతం చేతికి ఇవ్వరు. అక్కడ పనిచేసే వారు తమ ఫుడ్డు, బెడ్డు వారే చూసుకోవాల్సి ఉంటుంది.

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

హరియాణా ప్రజలకే ఈ ఉద్యోగాలు

2013 కంపెనీస్ యాక్ట్ కింద హరియాణా ప్రభుత్వం అక్టోబరు 13, 2021న హరియాణా స్కిల్ ఎంప్లాయిమెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది.

ఈ కంపెనీ ప్రభుత్వానికి, ప్రైవేటు రంగానికి కావాల్సిన మానవవనరులను పారదర్శకంగా అందిస్తుంటుంది.

‘‘ప్రభుత్వానికైనా, ప్రైవేటు కంపెనీకైనా వంద మంది కంప్యూటర్ ఆపరేటర్లో, సెక్యూరిటీ గార్డులో అవసరమైతే, ఆ విషయాన్ని మాకు తెలియజేస్తే, మేము వారి అవసరాలకు తగినట్టుగా మా పోర్టల్ ద్వారా నియామకాలు చేస్తాం’’ అని పల్లవి సందీర్ చెప్పారు.

‘‘ఉద్యోగికి, కంపెనీకి మధ్య కాంట్రాక్టర్ అనేవారు ఎవరూ ఉండకపోవడమే కీలకమైన విషయం. ఆసక్తికగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే, తరువాత మెరిట్ లిస్టును తయారుచేసి వారి పేర్లను పంపుతాం’’ అని తెలిపారు.

ఇజ్రాయెల్‌లో పనిచేయాలనుకునేవారికి తప్పనిసరిగా హరియాణా ఫ్యామిలీ కార్డు ఉండాలని, అప్పుడు మాత్రమే వారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.

‘‘అర్హులైనవారి జాబితాను కాంట్రాక్టు నియామకాల విధానం కింద రూపొందిస్తాం. ఇందులో వార్షిక ఆదాయం, అభ్యర్థి వయసు, సామాజిక, ఆర్థిక ప్రామాణికత, అనుభవం, గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైనా పనిచేసిన అనుభవం ఉంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవడం వంటివి చేస్తాం. వీటిల్లో ఒకో అంశానికి ఒక్కో విధమైన మార్కులు ఇస్తాం. దీని ఆధారంగా మెరిట్ లిస్టులో ఆ అభ్యర్థి పేరును ఎక్కడ ఉంచాలో నిర్ణయిస్తాం’’ అని ఆమె చెప్పారు.

ఈ విధానంలో హరియాణాలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.

హరియాణాలో నిరుద్యోగిత రేటు ఎంత?

2014 నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ హరియాణా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

2023 ఆగస్టులో నిరుద్యోగం గురించి అసెంబ్లీలో అడిగిన ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ 2015 నుంచి 2022 వరకు ఏటా 1.69 శాతం నిరుద్యోగ రేటును గమనించామని, ఉద్యోగాల కోసం ఎంప్లాయమెంట్ కార్యాలయాలలో లక్షల మంది నమోదు చేసుకుంటున్నారని తెలిపారు.

దీంతోపాటు భారత ప్రభుత్వం గణాంకశాఖ ప్రతి మూడు నెలలకోసారి లేబర్ ఫోర్స్ సర్వేను నిర్వహిస్తుంటుంది. దీని ద్వారా రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు ఎంత ఉందో తెలుస్తుంది.

జనవరి, మార్చి 2023కు సంబంధించి ఈ విభాగం చేసిన సర్వే మేరకు దేశంలో ఇది 6.8 శాతం కాగా, హరియాణాలో 8.8గా ఉంది.

2023 జులై 31వరకు 1,03,265 మంది పట్టభద్రులు, 29,888 పోస్టు గ్రాడ్యుయేట్లు, 21,569 ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్లు రాష్ట్రంలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో నమోదు చేసుకున్నారని హరియాణా ప్రభుత్వం తెలిపింది.

హరియాణా ప్రభుత్వం సాక్షం యువ యోజన కింద నిరుద్యోగ భృతిని అందిస్తోంది. దీని కింద పోస్టుగ్రాడ్యుయేట్స్‌కు 3000 రూపాయలు, డిగ్రీ హోల్డర్లకు 1500, ఇంటర్ పాసైనవారికి 1200 రూపాయలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)