Lebanon - Migration: ప్రజల్ని విదేశాలకు పంపిస్తారు.. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్లే తమ దేశాన్ని బలోపేతం చేస్తారు.. ఎలాగంటే..

వీడియో క్యాప్షన్, లెబనాన్: విదేశాల్లో ఉద్యోగాలతో స్వదేశంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రవాసులు

ప్రపంచంలో చాలా చోట్ల ఆర్థిక పరిస్థితులు గడ్డుగా ఉన్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రత్యేకించి లెబనాన్ పరిస్థితి ఇంకా దిగజారుతోందని.. బీబీసీ అరబిక్ తరఫున 'అరబ్ బారోమీటర్' నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. లెబనాన్‌ ఇప్పుడు విదేశాల్లో పనిచేస్తున్న తమ దేశస్తులు వారి కుటుంబాల కోసం పంపించే డబ్బు మీద ఆధారపడుతోంది. ఇలా ప్రవాసులు పపించే డబ్బు ప్రస్తుతం లెబనాన్ ఆర్థిక వ్యవస్థలో 30 శాతం వరకూ ఉంది. విదేశాల్లో ఉద్యోగం వెతుక్కోవాలనే తపన ఇప్పుడు లెబనాన్ అంతటా వ్యాపించి ఉంది. బీబీసీ ప్రతినిధి కారీన్ టోర్బీ అందిస్తున్న కథనం.

లెబనాన్‌లో ఈ వేసవిలో చాలా అంచనాలు ఉన్నాయి.

పది లక్షల మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా.

వారిలో చాలా మంది లెబనాన్ ప్రవాసులే.

అలా తిరిగివచ్చిన వారిలో ఇసబెల్ ఒకరు.

ఆమె సరిగ్గా ఏడాది కిందట ఉద్యోగ రీత్యా లైబీరియా వెళ్లారు.

ఆమె తిరిగి వచ్చిన వెంటనే ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు. ఇంకా తన, తన కుటుంబ అవసరాలు తీర్చగల స్తోమత ఇప్పుడామెకు ఉంది. ఎందుకంటే ఆమె విదేశాల్లో పనిచేస్తున్నారు.

''నేను ప్రతి నెలా మా అమ్మానాన్నలకు డబ్బులు పంపిస్తుంటాను. ఈ సంక్షోభానికి ముందు ప్రవాసులు తమ కుటుంబాలకు ఐదొందల డాలర్లో, వెయ్యి డాలర్లో పంపించేవారు. ఇప్పుడు తమ తల్లిదండ్రులకు ఓ రెండొందల డాలర్లు, తమ ఆంటీ, అంకుల్, అన్న, అక్క వంటి వారికి కూడా కొంత పంపిస్తున్నారు. కరెన్సీ విలువ పతనమవటంతో విదేశాల్లో ఉన్నవారు మరింత ఎక్కువ మందికి సాయపడగలుతున్నారు. నిజమే, ఇంటి మీద బెంగ ఉంటుంది. కష్టంగానే ఉంటుంది'' అని ఇసబెల్ చెప్పారు.

లెబనాన్ వాసుల సామూహిక వలసలు కొత్త కాదు.

ప్రవాసులు పంపే డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది.

ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటంతో ప్రవాసులు పంపించే డబ్బు ఈ దేశానికి, ఇక్కడ నివసించే ఎంతో మంది జనానికి జీవనాధారంగా మారింది.

''ప్రవాసులు పింపించే డబ్బుల వల్లే కొంతవరకు ఇక్కడ ఆర్థికవ్యవస్థ నిలబడి ఉంది. వారు లేకపోతే స్థానిక కరెన్సీ విలువ మరింతగా క్షీణించిపోయేది. కానీ దీనికి మరో కోణం కూడా ఉంది. గత ముప్పై సంవత్సరాలుగా ఇలాగే జరుగుతోంది. మిగతా ఆర్థిక రంగాలన్నిటినీ విస్మరిస్తూ.. జనాన్ని వలస పంపించటం, వారు దేశానికి డబ్బులు పంపించటం ఒక విధమైన ఆర్థిక వ్యూహంగా మారిపోయింది'' అని ఆర్థిక నిపుణుడు మైక్ అజార్ తెలిపారు.

సెలవులకు ఇళ్లకు తిరిగివస్తున్న ప్రవాసులకు స్వాగతం పలుకుతూ వీధుల్లో పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.

'మీ రాక మాకు ఆనందదాయకం' అనే మాటలు వీటిలో ఉన్నాయి.

కానీ వాటి అంతర్లీన సందేశం 'మీరు ఖర్చు చేయటం మాకు సంతోషం' అని.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)