స్వదేశానికి రికార్డు స్థాయిలో రూ. 5.53 లక్షల కోట్లు పంపించిన ప్రవాస భారతీయులు :ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది (2018) ప్రవాస భారతీయులు రికార్డు స్థాయిలో 7,900 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.53 లక్షల కోట్లు) నిధులు స్వదేశానికి పంపించారని, ప్రపంచంలో మరే దేశానికీ ప్రవాసుల నుంచి ఈ స్థాయిలో నిధులు అందలేదని, ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదికను ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి తెలిపింది.
భారత్ తర్వాత 6,700 కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది. మెక్సికో (3,600 కోట్ల డాలర్లు), ఫిలిప్పీన్స్ (3,400 కోట్ల డాలర్లు), ఈజిప్టు (2,900 కోట్ల డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
గత మూడేళ్ల నుంచి ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు పంపే నిధుల మొత్తం పెరుగుతూనే ఉంది.
2016లో 6,270 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ నిధుల మొత్తం, 2018 నాటికి 7,900 కోట్ల డాలర్లకు చేరింది.
2017తో పోలిస్తే 2018లో భారత్‌కు పంపిన నిధుల పరిమాణం 14 శాతం పెరిగింది. గత ఏడాది కేరళను వరదలు ముంచెత్తడంతో ప్రవాస మలయాళీలు పెద్ద ఎత్తున నిధులను తమ కుటుంబాలకు పంపించడం ఇందుకు ప్రధాన కారణం.
నల్లధనంపై కఠిన చర్యలు
ఎన్నికల్లో నల్లధనాన్ని వినియోగిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని భారత ఎన్నికల కమిషన్ దర్యాప్తు సంస్థలకు సూచించిందని 'ఈనాడు' తెలిపింది.
ప్రస్తుతం జరుగుతున్న ఆదాయపు పన్ను విభాగం దాడుల విషయమై ఎన్నికల కమిషన్ మంగళవారం కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌లతో చర్చించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను వేధించడానికి బీజేపీ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారిని పిలిపించి పరిస్థితిని వివరించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోడా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలతో రెవెన్యూ కార్యదర్శి ఎ.బి.పాండే, సీబీటీడీ ఛైర్మన్ పి.సి.మోదీలు సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, AFP
ఎన్నికల సమయంలో ఆయా సంస్థల సిబ్బంది వివక్షకు తావులేని విధంగా వ్యవహరించేలా చూడాలని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు ఈసీ సలహా ఇచ్చింది. ఈ ఆదేశాల అమలు తీరును అడిగి తెలుసుకొంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన అనంతరం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో ఆదాయపు పన్ను దాడులు జరిగాయి.
అక్రమంగా నగదు ఉన్నట్టు కచ్చితమైన సమాచారం అందుకున్న తరువాతనే ఆకస్మిక దాడులు చేస్తున్నట్టు ఆ ఉన్నతాధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి దిల్లీకి పెద్దఎత్తున లెక్కచూపని నగదును తరలిస్తారన్న పక్కా సమాచారం అందుకున్న తరువాతనే దాడులు చేశామని చెప్పారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లపై ఆదాయపు పన్ను విభాగం జరిపిన సోదాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని సీబీటీడీని కోరింది.
మోస్ట్‌వాంటెడ్ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీను అరెస్ట్
రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కండ్లుకప్పి అక్రమంగా క లపను తరలిస్తున్న మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీనును మంగళవారం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమస్తే తెలంగాణ తెలిపింది.
రామగుండం టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్, మంథని పోలీసులు పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం శివారులో తనిఖీలు చేపట్టి శ్రీనుతో పాటు మరో నలుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం, మంథని మండలం పోతారానికి చెందిన శ్రీనివాస్ 1999లో మంథనిలో ఫెర్టిలైజర్ వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో 2009లో కలప అక్రమ రవాణా మొదలుపెట్టాడు.
అటవీ సమీప ప్రాంతాల ప్రజలను ఆసరాగా చేసుకొని మా ఫియా తయారు చేసి.. వారి ద్వారా తన సా మ్రాజ్యాన్ని విస్తరించాడు. ఉమ్మడి కరీంనగ ర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ అతడికి నెట్‌వర్క్ ఉంది. శ్రీనుతోపాటు అతడి అనుచరులు కిషన్, మధుకర్, శ్రీనివాస్, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 10 టేకు దుంగలు, స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇతడికి సహకరించే వ్యాపారులు మరో 18 మందిని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. నిందితులపై త్వరలోనే పీడీ యాక్టు నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఎడ్ల శ్రీనుపై వివిధ స్టేషన్లలో 11 కేసులున్నాయి.
రజినికాంత్ కొత్త సినిమా'దర్బార్'
ప్రముఖ నటుడు రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు 'దర్బార్' పేరును ఖరారు చేసి మంగళవారం చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారని నవ తెలంగాణ తెలిపింది.
ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో నయనతార కథానాయిక. రజినీ కూతురిగా కీలక పాత్రలో నివేదా థామస్ కనిపిస్తారు.

ఫొటో సోర్స్, Twittter/@SantoshSivan
ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే ముంబయిలో ఓ భారీ సెట్ వేశారు.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో మహిళలు సురక్షితంగానే ఉన్నారా...
- లైట్ తీస్కోండి: చెవులు చిల్లులు పడుతున్నాయ్.. ఆపండి స్వామీ
- ఈమె అమ్మాయిల ముఖాలకు ముసుగేసి ఫొటోలు ఎందుకు తీస్తున్నారు
- Reality Check: నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
- లోక్‌సభ: పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యం.. తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








