కువైట్ ప్రభుత్వం భారతీయులను వెనక్కి పంపుతుందా? అక్కడి తెలుగు వాళ్లు ఏమంటున్నారు?

ముప్పాళ్ల జ్యోత్స్న
ఫొటో క్యాప్షన్, ముప్పాళ్ల జ్యోత్స్న
    • రచయిత, అబినాష్ కంది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కువైట్‌లో రూపొందుతున్న ఓ చట్టం ఇప్పుడు అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయుల్లో కొందరికి ఆందోళన కలిగిస్తోంది.

ఆ దేశం నుంచి తమను వెళ్లిపొమ్మంటారేమోనని వారు భయపడుతున్నారు.

కువైట్‌లో వలసదారుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ దేశంలో ఉంటున్నవారిలో దాదాపు 70 శాతం మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లే.

అయితే, విదేశీయుల జనాభాను గణనీయంగా తగ్గించుకునేందుకు కువైట్ దేశ జాతీయ అసెంబ్లీలోని న్యాయ, శాసన కమిటీ తాజాగా ఓ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.

దేశ జనాభాలో విదేశీయుల కోటాను 30 శాతానికి తగ్గించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.

వలసదారుల్లో ఆందోళనకు ఇదే కారణం.

అయితే, ఈ బిల్లు చట్టంగా మారి అమలు కావడానికి అనేక కమిటీలను దాటుకుని వెళ్లాలని, ఇప్పుడప్పుడే ఇది జరిగే పని కాదని కొందరు ప్రవాసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కోడూరి వెంకట్
ఫొటో క్యాప్షన్, కోడూరి వెంకట్

ఎక్కువ మంది భారతీయులే

కువైట్‌ మొత్తం జనాభా సుమారు 45 లక్షలు. వారిలో కువైట్ పౌరులు 30 శాతం కాగా, విదేశీయులు 70 శాతం.

ఇప్పుడు కువైట్ ప్రభుత్వంలోని కొందరు ఈ సమీకరణాన్ని తిరగరాయలనుకుంటున్నారు.

జనాభాలో స్వదేశీయుల సంఖ్యను 70 శాతం, విదేశీయుల సంఖ్యను 30 శాతంగా మార్చాలని అనుకుంటున్నారు.

కువైట్‌లో అత్యధిక సంఖ్యలో ఉన్న విదేశీయులు భారతీయులే. దాదాపు పది లక్షల మంది అక్కడ నివసిస్తున్నారు.

ఈ బిల్లులో భారతీయులను కువైట్ జనాభాలో 15 శాతానికి పరిమితం చేయాలని ప్రతిపాదించారు.

భారత్ కాకుండా ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల నుంచి కూడా కువైట్‌కు వలసలు ఎక్కువే. ఆయా దేశాల నుంచి వచ్చినవారు కువైట్‌లో మరో 21.5-22 లక్షల దాకా ఉంటారు. వీరికి కూడా కోటాలు వర్తిస్తాయి.

ఒకవేళ కోటా అమలైతే, కువైట్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో 8 నుంచి 8.5 లక్షల మంది వరకూ స్వదేశానికి రావాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కువైట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలకు చెందినవారు రెండు లక్షల మంది దాకా ఉన్నారు.

వంట మనుషులుగా, ఇళ్లలో సహాయకులుగా, డ్రైవర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజినీర్లుగా, వ్యాపారులుగా... ఇలా రకరకాల పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ జీవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కువైట్‌లో ఉంటున్న తెలుగువారిలో కొందరితో బీబీసీ మాట్లాడింది.

ఈ కోటా చట్టం గురించి వాళ్ల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది.

ముత్యాల వినయ్
ఫొటో క్యాప్షన్, ముత్యాల వినయ్

‘ఆందోళన అక్కర్లేదు’

కోటా విధానం గురించి కువైట్‌లో ఉంటున్న భారతీయులకు ఆందోళన అక్కర్లేదని అక్కడి తెలుగు కళా సమితి మాజీ అధ్యక్షురాలు జ్యోత్స్న ముప్పాళ్ల అన్నారు.

ఎనిమిది లక్షల మంది ప్రవాస భారతీయులను వెనక్కిపంపిస్తారనడం విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘ఎనిమిది లక్షల మందిని తిప్పి పంపే పరిస్థితి ఉండదు. ప్రవాసులను వెనక్కిపంపడం గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నారు. ఇది కొత్త విషయం కాదు’’ అని జ్యోత్స్న అన్నారు.

కువైట్‌లో బిల్లు ఆమోదం పొందడానికి, చట్టంగా మారి అమల్లోకి రావడానికి చాలా తేడా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘ఒకవేళ అమల్లోకి వస్తే, చట్ట విరుద్ధంగా ఉండేవారిపై, నైపుణ్యాలు అవసరం లేని ఉద్యోగాల్లో ఉండేవారిపై ప్రభావం ఉండొచ్చు. కువైట్‌లో ఒక్కో ఇంట్లో నలుగురు సహాయకులను నియమించుకునేందుకు అనుమతిస్తారు. దాన్ని ముగ్గురికి పరిమితం చేయడం లాంటి నిర్ణయాలు ఉండొచ్చు. ఈ దేశానికి పెట్రోలియం రంగం ఆధారం. అందులో పనిచేసే ఇంజినీర్ల ఉద్యోగాలకు ఏ ప్రమాదమూ ఉండకపోవచ్చు’’ అని జ్యోత్స్న చెప్పారు.

కువైట్ ప్రభుత్ గణాంకాల ప్రకారం భారతీయుల్లో దాదాపు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నారు. వారి మీద ఆధారపడ్డవారు మరో 1.16 లక్షల మంది వరకూ ఉన్నారు.

కువైట్ జాతీయ చమురు సంస్థల్లో ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఆసుపత్రుల్లో నర్సులుగా దాదాపు 28 వేల మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు.

‘కువైట్‌కు భారతీయులు అవసరం ఉంది’

కువైట్‌ భారీ అభివృద్ధి ప్రణాళికలతో ముందుకువెళ్తోందని, వాటిని అమలు చేసేందుకు ఆ దేశానికి భారతీయ మానవ వనరుల అవసరం చాలా ఉందని కువైట్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ముత్యాల వినయ్ అభిప్రాయపడ్డారు.

‘‘అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా మారాలన్న లక్ష్యంతో కువైట్ విజన్-2035 కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం భారీ పెట్టుబడులతో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నారు. దీని వల్ల దాదాపు పదేళ్లపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి దొరకుతుంది’’ అని వినయ్ అన్నారు.

దేశంలోని పవర్ ప్లాంట్లు, చమురు రిఫైనరీలు, చమురు రంగంలోని ఇతర పరిశ్రమలు, పరిపాలనా విభాగం... ఇలా ఎన్నో రంగాల్లో మానవ వనరుల అవసరం ఉందని ఆయన అన్నారు.

కువైట్‌లో భారతీయ కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

‘‘భారత్‌లాంటి దేశంలోని మానవవనరులు కువైట్‌కు చాలా అవసరం. ఒకవేళ ప్రభుత్వం కోటా లాంటి నిర్ణయాలు తీసుకుంటే నైపుణ్యాలు లేని ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చు’’ అని వినయ్ చెప్పారు.

కువైట్ అభివృద్ధిలో ప్రవాసులందరూ భాగస్వాములుగా ఉన్నారని, కువైట్ ప్రభుత్వం అన్ని అంశాలూ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.

‘‘కువైట్‌కు నైపుణ్యాలు అవసరమైన చోట్ల మనకు అవకాశాలు ఉంటాయి. దేశీయంగా వనరులు అందుబాటులో ఉన్న చోట్ల, వారినే వినియోగించుకోవచ్చు. ఎనిమిది లక్షల మందిని వెనక్కిపంపే పరిస్థితైతే ఉండదు’’ అని వినయ్ అన్నారు.

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భారతీయులు ఎక్కువ మందే ఉన్నారని, ఇళ్లలో సహాయకులుగా, డ్రైవర్లుగా చాలా మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు.

‘‘అసంఘటిత రంగంలోని వారి అవసరం కూడా కువైట్ ప్రజలకు ఉంది. ఒకవేళ ఇక్కడి వారు ఆ పనులు చేసుకోగలిగితే, మంచిదే. తక్షణ ప్రభావం చూపించేలా నిర్ణయాలైతే ఉండవు. ’’ అని వినయ్ వ్యాఖ్యానించారు.

‘కరోనా సంక్షోభం కారణమై ఉండొచ్చు’

కువైట్ ప్రభుత్వం జనాభాలో విదేశీయుల నిష్పత్తిని తగ్గించడంపై దృష్టి సారించడానికి కరోనావైరస్ సంక్షోభం ఓ కారణమై ఉండొచ్చని అక్కడి యునైటెడ్ తెలుగు ఫోరమ్ కన్వీనర్ కోడూరి వెంకట్ అభిప్రాయపడ్డారు.

‘‘కరోనావైరస్ సంక్షోభం ఆర్థికంగా అన్ని దేశాలపైనా ప్రభావం చూపింది. భారత ప్రధాని మోదీ కూడా ఈ నేపథ్యంలోనే ‘ఆత్మ నిర్భర భారత్‌’ పిలుపునిచ్చారు. జనాభాలో విదేశీయుల నిష్పత్తిని, జనసాంద్రతను తగ్గించుకుంటే భవిష్యతులో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడం సులభం అవుతుందని కువైట్ ఆలోచించి ఉండొచ్చు’’ అని ఆయన అన్నారు.

అయితే, కువైట్‌ జనాభాలో 1975 నుంచి విదేశీయులు 70 శాతం ఉంటున్నారని వెంకట్ చెప్పారు.

గత ఏడాది కువైట్ నుంచి ప్రవాస భారతీయులు 4.8 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్‌కు పంపారని, ఇలాంటి పరిస్థితుల్లో కోటా ప్రతిపాదనపై ఆందోళన తలెత్తడం సహజమేనని ఆయన అన్నారు.

‘‘సహాయకులు, డ్రైవర్లు, వైద్యం, భవన నిర్మాణాలు, చమురు, గ్యాస్ ఇలా వివిధ రంగాల్లో భారతీయులు చాలా మంది పనిచేస్తున్నారు. ఇప్పటికిప్పడు భారతీయులను తీసేస్తే, వీటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి, కోటాను తీసుకువచ్చినా, దీర్ఘకాలిక పద్ధతిలో అమలు చేయొచ్చు’’ అని వెంకట్ అభిప్రాయపడ్డారు.

ఒకవేళ కోటా అమలు చేస్తే, భారత్‌తోపాటు ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలవారిపైనా ప్రభావం అధికంగానే ఉంటుందని ఆయన అన్నారు.

‘‘కువైట్ నుంచైనా, మరో దేశం నుంచైనా తిరిగి వచ్చే భారతీయులకు స్వదేశంలో అవకాశాలు ఉండాలి. అవసరమైనవారికి ఉద్యోగాలు కల్పించాలి. పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టాలనుకునేవారికి తోడ్పాటు అందించాలి’’ అని ఆయన భారత ప్రభుత్వానికి సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)