తొలిప్రేమ ఎందుకంత మధురం?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, మాథ్యూ సయీద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రేమలో పడిపోయిన సంగతి కేట్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అది 1989. అప్పుడామె వయసు 17 ఏళ్ళు. తల్లితో కలిసి ఇంగ్లండ్ లోని డెవాన్‌కు విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైన అనుభవం ఆమెకు ఎదురైంది.
ఇక అతడు మరో రెండు నెలల్లో ఆర్ట్ స్కూల్లో జాయిన్ కాబోతున్నాడు. ఆ రోజు కడుపునిండా తినడానికి పబ్‌కు వెళ్ళాడు.
‘‘అక్కడే ఆమెను మొదటిసారి చూశాను. ఆమె నన్ను చూసి నవ్వినట్లు గమనించాను’’ అని గుంథర్ గుర్తు చేసుకున్నారు.
‘‘అప్పుడతను ఐస్‌క్రీమ్ తింటున్నాడు. నన్ను చూశాడు. కానీ, అతడి ధ్యాసంతా ఆ డసర్ట్‌ను పూర్తి చేయడంపైనే ఉంది’’ అని కేట్ గుర్తు చేసుకున్నారు.
గుంథర్ బవేరియా వాసి.
"ఆమె ఆ రోజు నల్లటి దుస్తులు వేసుకున్నట్లు నాకు గుర్తు. అసలు ఏం నవ్వది? నాకు మాటలు పడిపోయాయి. కాఫీకెళదామా అని అడిగాను’’ అన్నారు గుంథర్
"మరుసటి రోజు, మేము పైయర్ ( సముద్రంలోకి కొద్దిదూరం వరకు నిర్మించిన బ్రిడ్జిలాంటి కట్టడం) మీద నడుస్తున్నాం. అతను నా చేయి పట్టుకుని, నావైపు తిరిగి ముద్దు పెట్టుకున్నాడు. అది చాలా రొమాంటిక్‌గా, తీయగా ఉంది. అది నాకు మొదటి ముద్దు’’ అన్నారు కేట్.
"నేను ఆమెతో ప్రేమలో పడిపోయాను. కానీ, రెండు రోజుల తరువాత నేను జర్మనీకి తిరిగెళ్లాల్సి వచ్చింది." అని గుంథర్ వివరించారు.
కొన్ని గంటల వ్యవధిలోనే కేట్, గుంథర్ మధ్య దూరం 15 వందల కిలోమీటర్లకు పెరిగింది.
తాము చాలా క్లోజ్ అయ్యామని వారిద్దరికీ తెలుసు. కానీ, పరిస్థితులు నేటిలాగా లేవు. సెల్‌ఫోన్‌లు, ఈమెయిళ్లు, ఎస్సెమ్మెస్‌లు లేవు. కుదిరితే ల్యాండ్‌లైన్‌లు, ఫోన్‌బూత్‌లు, లేదంటే పోస్టల్ లెటర్స్. అప్పటికి అదే ప్రపంచం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొత్త సంవత్సరానికి కేట్‌తో కలిసి స్వాగతం పలికేందుకు గుంథర్ ఇంగ్లండ్ వచ్చాడు. మళ్లీ ఆమె 18వ పుట్టినరోజున తిరిగి వెళ్లిపోయాడు.
నాలుగు నెలల తర్వాత జర్మనీ వెళ్లే అవకాశం కేట్‌కు వచ్చింది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
‘‘మేమిద్దరం మంచం మీద పడుకుని ఉన్నాం. మనం కలిసుండే ఏర్పాట్లు చేసుకోవాలి. నువ్వు జర్మనీ వస్తావా’’ అని గుంథర్ అడిగారు.
అంతకుముందు ఇంగ్లండ్ వెళ్లడానికి గుంథర్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ, సక్సెస్ కాలేదు.
‘‘నేను రాలేను అని చెప్పడానికి అతనికి కాల్ చేశాను. అది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం. కానీ, కారణం ఏంటో నేను అతనికి ఎప్పుడూ చెప్పలేదు’’ అన్నారు కేట్.
‘‘నేను జర్మనీ వెళ్లడం మా అమ్మకు ఇష్టం లేదు. అదే సమయంలో నా కెరీర్ ఎలా ఉండాలో అప్పటికి నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు’’ అన్నారామె.
‘‘అది గుండెలు పిండేసే నిర్ణయం’’ అన్నారు కేట్.
"ఆమె నాకు తన శారీరక పరిమళంతో కూడిన కామిసోల్, అమ్మాయిలు ధరించే బనియన్ ఇచ్చింది. దానిని నేను చాలా సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడుకున్నాను. కానీ, తర్వాత దాని సువాసన మాయమైంది" అని బాధగా అన్నారు గుంథర్.
వారిద్దరూ చాలాకాలం లేఖలు రాసుకున్నారు. కానీ, 1993లో ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ ఆగిపోయింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కుర్ర మనసు
తొలి ప్రేమంత ఉద్వేగంగా మరేదీ ఉండదు. నిజమే.
మనం చాలామంది వ్యక్తులను ప్రేమించగలం. వారితో జీవితాలను పంచుకోగలం. కానీ, తొలి ప్రేమలో మాత్రం ఒక మాధుర్యం ఉంటుంది. అది కనుక్కోలేనంత లోతైన రహస్యంగా ఉంటుంది.
ఎంత సమయం గడిచిందో తెలియదు. కానీ, గడిచిన ప్రతిక్షణం కొత్తగా అనిపిస్తుంది.
మరి తొలిప్రేమ ఎందుకంత ప్రత్యేకమైంది? అది అర్ధం చేసుకోవాలంటే మన హృదయాలలోకే కాదు, మెదడులోకి కూడా వెళ్లి చూడాలి.
‘‘యవ్వనంలో తొలిసారి ప్రేమలో పడ్డవారికి అది జీవితాంతపు జ్ఞాపకంగా మారుతుందని నా రీసెర్చ్‌లో తేలింది’’ అని వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీలో న్యూరోసైకాలజీ ప్రొఫెసర్ కేథరీన్ లవ్ డే చెప్పారు.
‘‘నేను 80, 90 సంవత్సరాల వయసున్న వారిని చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. వారికి ముఖ్యమైజ జ్ఞాపకాలలో తొలినాళ్లలోని ప్రేమ వ్యవహారాలు ప్రధానంగా ఉన్నాయి’’అని కేథరీన్ చెప్పారు.
దీని వెనక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు.
‘‘ఆ వయసులో మన మెదడు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడిన స్మృతులు అంత త్వరగా చెరిగిపోవు’’ అన్నారామె.
"ముఖ్యంగా అత్యంత భావోద్వేగానికి గురిచేసే అంశాలను ఆ వయసులో మెదడు మెరుగ్గా రికార్డు చేసుకుంటుంది. తొలిసారి జరిగింది, బాగా బాధను కలిగించేది, ఎక్కువ సంతోషాన్ని కలిగించేది ఏదైనా ఎదురైతే, వాటిని బాగా గుర్తు పెట్టుకోవాలని మన మెదడు భావిస్తుంది. అందుకే తొలి ప్రేమ అనేది ఒక మరిచిపోలేని జ్ఞాపకంగా ఉంటుంది.’’ అన్నారు కేథరీన్.
‘‘మొదటిసారి ప్రేమలో పడటం అనేది చాలా ముఖ్యమైన అనుభవాలలో ఒకటి, ఎందుకంటే ఇది అప్పటి వరకు ఉన్న అనుభవాలకంటే భిన్నంగా ఉంటుంది’’ అంటూ వివరించారు కేథరీన్.

మెరుగైన కెమిస్ట్రీ
అత్యంత ఆనందమైనా, అత్యంత బాధయినా తొలి ప్రేమలో భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
శరీరాలు, మెదళ్ల కలయిక వల్ల పుట్టే కెమికల్ కాక్టెయిల్ ద్వారా మన యుక్తవయస్సులో అనేక లోతైన భావాలు ఏర్పడుతుంటాయి.
మొదట సెక్స్ హార్మోన్లయిన ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్‌ల వల్ల ఇతరుల మీద ఆకర్షణ పెరుగుతుంది. అలా ఒక రిలేషన్ మొదలైన తర్వాత సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి.
"ఈ విభిన్న రసాయనాలన్నీ ప్రేమలో పడటం, ప్రేమలో కొనసాగడం వల్ల ఏర్పడే అనుభవంలో భాగం. ఇది చాలా పవర్‌ఫుల్. ఒక కెమికల్ సూప్ వంటిది.’’ అంటారు కేథరీన్.
ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలామందిని ఆకర్షిస్తాయి. అప్పుడు ఏర్పడే జ్ఞాపకాలు ముందు ముందు కాలంలో ఒకరకమైన బెంచ్‌మార్క్‌గా నిలిచిపోతాయి.
తొలిప్రేమలు మన ఉనికిలో భాగమవుతాయి. వాటిని గుర్తుంచుకునే విధంగా మన నాడీమండలాలు ప్రోగ్రామ్ అయ్యి ఉంటాయి.
కానీ, కొన్నిసార్లు గుర్తుంచుకోవడం ఒక్కదానితోనే ఆగిపోదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో మీ ఫస్ట్ లవర్ పేరును రాసి, ఆమె లేదా అతనితో మళ్లీ కనెక్ట్ కావాలని కోరుకుంటారు. కానీ, అలా చేయాలనుకునే వారు మీరొక్కరే కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.
కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో డెవలప్‌మెంటల్ సైకాలజిస్ట్, ప్రొఫెసర్ ఎమెరిటస్ అయిన డా. నాన్సీ కలీష్, 15 సంవత్సరాల పాటు ఈ అంశంపై పరిశోధన చేశారు.
‘‘తిరిగి చిగురించే ప్రేమలు’’ అనే అంశంలో ఆమె నిపుణురాలు.
ఆమె ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మందితో ఒక సర్వే నిర్వహించారు. చాలాకాలంపాటు తాము ప్రేమించిన వ్యక్తులకు దూరంగా ఉండి, తిరిగి దగ్గరైన వారి అనుభవాలను సేకరించారు.
కొన్ని పరిస్థితులు అనుకూలిస్తే, ఇలా విడిపోయిన ప్రేమికులు మళ్లీ కలిసేందుకు అవకాశం ఉంటుందని ఆమె గుర్తించారు.
తిరిగి తాము మొదట ప్రేమించిన వ్యక్తులను చేరుకుంటున్న వారిలో ఎక్కువ మంది ఒంటరులు లేదా వితంతువులు. తాము ఒంటరిగా మారిన కొన్నివారాల్లోనే వారిలో చాలామంది తాము ప్రేమించిన వారితో కలిసిపోయారు. ఇలా కలుసుకున్న వారిలో 72% మంది పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.
ఈ సబ్జెక్టుపై మళ్లీ పరిశోధించాలని డాక్టర్ నాన్సీ కలీష్ 2004లో నిర్ణయించారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అప్పటికి ఇంటర్నెట్ విప్లవం నడుస్తోంది.
ఈసారి సర్వేలో పాల్గొన్న వారిలో 62% మంది తమ పాత ప్రేమికులతో ఎఫైర్ నడిపిస్తున్నారని తేలింది. కానీ, రీయూనియన్ సక్సెస్ రేటు 5 శాతానికి పడిపోయింది.
ఇంటర్నెట్ విప్లవం కారణంగా మాజీ ప్రేమికులు ఒకరినొకరు వెతకడం, పరిచయాలను పునరుద్ధరించుకోవడం సులభమైంది. కానీ, వారిలో నిబద్ధత తగ్గింది.

కొన్ని ప్రేమలు మరణించవు...
ఒకరితో ఒకరు కాంటాక్ట్ కోల్పోయిన మూడు దశాబ్ధాల తర్వాత కేట్ ఒకసారి అనుకోకుండా గుంథర్ రాసిన ఉత్తరాలను చదివారు. ఆమెలో జ్ఞాపకాలు తిరిగొచ్చాయి.
‘‘నేను ఏడ్చాను, చాలా చాలా ఏడ్చాను’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
‘‘నేను ఎవరి హృదయాన్ని బద్ధలు చేశానో ఆ అద్భుతమైన వ్యక్తి గురించి ఆలోచించాను’’ అన్నారామె.
గుంథర్ ఫ్యామిలీ బిజినెస్ అడ్రస్ కనుక్కుని, అతను రెస్పాండ్ అవుతాడో లేదోనన్న అనుమానంతోనే లెటర్ రాశారు.
“నవంబర్ 22న సరిగ్గా 12:36 కి నా ఫోన్ మోగింది. ఇది జర్మనీ నుంచి వచ్చిన కాల్ అని నాకు అర్ధమైంది. ఒక్కక్షణం నా గుండె కొట్టుకోవడం మానేసింది.”అని కేట్ గుర్తు చేసుకున్నారు.
తర్వాత వారిద్దరు గంటల తరబడి మాట్లాడుకున్నారు. కొన్నివారాల తర్వాత గుంథర్ ఆమెను కలవడానికి మాంచెస్టర్‌కు వెళ్లారు.
‘‘నేను ఆమెను మళ్లీ కలిశాను. మేం ఇప్పటికీ కలిసి ఉన్నామనే అనిపించింది’’ అన్నారు గుంథర్.
ఇప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 30 సంత్సరాల కిందట తాము తొలిసారి కలుసుకున్న కొండ మీద గుంథర్ ఆమెకు ప్రపోజ్ చేశారు.
‘‘చాలామందికి ఇలాంటి అవకాశాలు రెండోసారి రావు. జరిగినదానికి నేను చింతించడం లేదు. అలా జరిగిపోయింది’’ అన్నారు కేట్.
‘‘నేను ఆమెను ఎప్పటికీ వెళ్లనివ్వను’’ అన్నారు గుంథర్.
తొలి ప్రేమలు ఒక రకంగా టైమ్ మెషీన్‌లాంటివి.
మనల్ని ఒకరినొకరు పరిచయం చేసిన ప్రదేశమో, లేదంటే వాసన, సౌండ్ వంటి వాటివల్ల మన మెదళ్లు ప్రేరేపణకు గురైనప్పుడు మళ్లీ మనం మన పాత ప్రేమలోకి వెళ్లిపోతాం.
ఇవి కూడా చదవండి:
- వ్యూహం: 'నన్ను చంపడానికి పబ్లిగ్గా కాంటాక్ట్ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి' -డీజీపీకి రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
- అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది
- ‘డెవిల్’ రివ్యూ: నేతాజీతో మర్డర్ మిస్టరీని ముడిపెట్టిన ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














