పాకిస్తాన్: ‘భారత్‌లో ఉన్న మా ఆయన్ను కలుసుకోవాలని ఉంది’ అంటున్న పాకిస్తానీ యువతి, అసలు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
- రచయిత, భార్గవ పారిఖ్
- హోదా, బీబీసీ కోసం
"పాకిస్తాన్‌లో ఉన్న నా భార్యను భారత్‌కు తీసుకొద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నాను. మూడేళ్లుగా నేను తనని కలుసుకోలేదు.
నేను పాకిస్తాన్‌కు వెళ్దామని ప్రయత్నిస్తున్నా వీసా దొరకడం లేదు. నా భార్య ఇక్కడికి రావడానికి ఆమెకూ వీసా లభించడం లేదు.
నా భార్యను ఎప్పుడు కలుసుకుంటానో నాకు తెలీడంలేదు" అహ్మదాబాద్‌కు చెందిన జునెద్ ఛావన్వాలా మాటలివి.
పాకిస్తాన్ దేశస్తురాలైన కురాత్‌ను ఆన్‌లైన్‌లో వివాహం చేసుకున్నారు జునెద్.
మూడేళ్లుగా ఆమెను భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అసలు ఇంతకీ ఏంటి వీళ్ల కథ?

ఫొటో సోర్స్, Getty Images
ఎలా కలుసుకున్నారు?
పాకిస్తాన్‌లో ఉండే జునెద్‌కు అత్త వరుసయ్యే జెతాని 2016లో చికిత్స నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఆమె కుమార్తె కురాత్‌ను తొలిసారి అప్పుడే కలుసుకున్నట్లు జునెద్ చెప్పారు.
కురాత్‌ను ఆనీ అనే ముద్దుపేరుతో పిలుస్తానని బీబీసీకీ చెప్పారు జునెద్.
“కురాత్ తొలిసారి ఇండియాకు వచ్చినప్పుడే మేం తొలిసారి కలుసుకున్నాం. ఆ సమయాన మేం స్నేహితులమయ్యాం. సరదాగా బయటకు వెళ్లేవాళ్లం. అప్పుడు మా మాధ్య పెళ్లి గురించిన ఆలోచనేమీ రాలేదు. వారు తిరిగి పాకిస్తాన్ వెళ్లాక, నేను ఆనీకి వీడియో కాల్స్ చేసి, జెతాని ఆరోగ్యం గురించి అడిగేవాడిని” అని చెప్పారు.
జునెద్ మాట్లాడుతూ, “రోజులు గడిచేకొద్దీ మేం దగ్గరయ్యాం. ప్రేమలో పడ్డాం. తరచూ వీడియోకాల్స్ చేసుకునేవాళ్లం. 2018లో పాకిస్తాన్‌లో ఉండే మా బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు నా తల్లి సఫూరా పాకిస్తాన్‌కు వెళ్లారు. మేం ప్రేమించుకుంటున్న సంగతి తెలిసి, కురాత్ కుటుంబంతో మాట్లాడారు. నన్ను పెళ్లిచేసుకునేందుకు కురాత్ కూడా ఒప్పుకుంది” అని చెప్పారు.
కురాత్ గురించి జునెద్ మాట్లాడుతున్న సమయంలో జునెద్ తల్లి సఫూరా కూడా అక్కడే ఉన్నారు. ఆమె మాట్లాడుతూ, “నేను పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు నా సోదరి నాతో ఆ విషయం చెప్పింది.
తన మేనకోడలు కురాత్ నా కొడుకుతో ప్రేమలో ఉన్నట్లు ఆమె ద్వారా తెలుసుకున్నాను. కురాత్ నన్ను వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో ‘నా కొడుకంటే ఇష్టమా? పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగితే, అవునని సమాధానం చెప్పింది.
ఇద్దరూ ఇష్టపడటంతో వారి ప్రేమను ఆమోదించాలని అనుకున్నాను. పాకిస్తాన్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నాం.
కురాత్‌కు 18 ఏళ్లు వచ్చాక ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం” అని చెప్పారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
వివాహమెప్పుడు జరిగింది?
జునెద్ మాట్లాడుతూ, “మా అమ్మ భారత్‌కు తిరిగొచ్చాక నిశ్చితార్థం విషయం చెప్పారు. నాకూ సంతోషం కలిగింది.
ఆ తరువాత నుంచి మేం రోజూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకునేవాళ్లం.
2020లో కురాత్‌కు పద్దెనిదేళ్లు నిండాయి, కానీ, అదే సమయంలో కరోనా వ్యాప్తి మొదలైంది” అని చెప్పారు.
‘అలా జరుగుతుందని ఊహించలేదు’
‘మీ పెళ్లి ఎలా జరిగింది?’ అన్న ప్రశ్నకు జునెద్ బదులిస్తూ, “కురాత్‌కు 18 ఏళ్లు వచ్చాక వివాహ ప్రతిపాదన చేశారు. కానీ, మేం ఒకరినొకరు కలుసుకుండానే వివాహమెలా చేసుకోగలం? అందుకని నేను వీసా కోసం కన్సల్టెంట్‌ను సంప్రదించాను.
తనను త్వరగా భారత్‌కు తీసుకురావాలంటే వివాహం ఒక మార్గమని, వివాహం చేసుకుంటే, విజిటర్ వీసా త్వరగా వచ్చే అవకాశం ఉందని వారు చెప్పారు.
తనను త్వరగా భారత్‌కు తీసుకురావాలని ఉంది నాకు. అందుకే మౌల్వి, ఖాజీలను సంప్రదించాం. ఇరు దేశాల్లోనూ పెద్దలు ఒప్పుకున్నారు.
కానీ, కరోనా వల్ల అంతా ఆలస్యమైంది. అంతలోనే రెండోసారి కరోనా వ్యాప్తి వలన అనుకున్నవేమీ జరగలేదు.
జనవరి 2022న ఆన్‌లైన్‌లో మా పెళ్లి జరిగింది” అని చెప్పారు.
ఒకరి కోసం ఒకరు...
జునెద్ వివాహం తరువాత చోటు చేసుకున్న పరిస్థితుల గురించి వివరిస్తూ “వివాహం తరువాత కురాత్‌కు అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం వివాహ ధ్రువీకరణ పత్రం అందించింది.
అంతా బాగుందనుకున్న సమయంలో, భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో పరిస్థితి మొదటికొచ్చింది.
భారత ప్రభుత్వం పాకిస్తానీయులకు వీసా జారీచేసే ప్రక్రియను కఠినతరం చేసింది” అని చెప్పారు.
“నేను కురాత్ వీసా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. తను పాకిస్తాన్ దేశస్తురాలు కావడంతో స్పాన్సర్లెవరూ ముందుకు రావడం లేదు. పోనీ నేనైనా అక్కడికి వెళ్దామంటే, నాకు వీసా దొరకడం లేదు. ఏం చేయాలో తెలీడం లేదు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
‘నా భర్తను కలుసుకోవాలని ఉంది’
వీడియో కాల్ ద్వారా పాకిస్తాన్‌లో ఉన్న కురాత్‌తో బీబీసీ మాట్లాడింది.
ఆమె మాట్లాడుతూ, “కరోనా తరువాత వివాహం చేసుకుంటున్నానని చదువు ఆపేశాను. నా భర్త మెకానిక్‌గా పనులు చేస్తాడు, నేనూ ఆర్థికంగా తోడుగా నిలవాలన్న ఉద్దేశంతో బ్యూటీపార్లర్ కోర్సు పూర్తి చేశాను.” అని చెప్పారు.
“నా భర్తతో కలిసి ఉంటూ, బ్యూటీపార్లర్ పెట్టుకుని, సంపాదిస్తూ, సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను. కానీ అది సాధ్యం కాలేదు. ఇక్కడ నేను బ్యూటీపార్లర్ నడుపుతున్నాను. ఒకవేళ నా భర్తకు వీసా దొరికి పాకిస్తాన్‌కు వచ్చేస్తే, పరిస్థితులు మారతాయని, ఆలోగా ఇంకాస్త ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో, బ్యూటీపార్లర్‌లో కూడా పని చేస్తూ, డబ్బు పొదుపు చేస్తున్నాను” అని చెప్పారు కురాత్.
స్పాన్సర్‌షిప్ ఆమోదం పొంది కురాత్ పాకిస్తాన్ నుంచి అహ్మదాబాద్ రావాలని జునేద్ ఎంతో కోరుకుంటున్నారు.
భౌతికంగా ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ వారు వీడియో కాల్స్ ద్వారా రోజూ కలుసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
- క్రికెట్: ధోనీతో యువ ఆటగాడైన రాబిన్ మింజ్‌ను ఎందుకు పోల్చుతున్నారు? ఐపీఎల్లో తొలి గిరిజన ఆటగాడు ఈయనేనా
- ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- Herpes: ఈ సుఖ వ్యాధి ఎందుకొస్తుంది, యువతలో ఎక్కువగా వస్తోంది ఎందుకు
- అయోధ్య-ప్రాణప్రతిష్ఠ: ఈ నగరం ఇప్పుడెలా మారిపోయింది, స్థానికులు ఏమంటున్నారు?
- పగడాల వరాలు: చదివింది ఎం.కామ్, బతుకు దెరువు కోసం శవాలకు పోస్టుమార్టం...తన జాబ్ గురించి ఆమె ఏం చెప్పారు?
- వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్, 81 మంది విద్యార్థినుల సస్పెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














