వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్, 81 మంది విద్యార్థినుల సస్పెన్షన్

కాకతీయ యూనివర్సిటీ
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ ఘటనలో 81 మంది విద్యార్థినులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు.

సస్పెండ్ అయిన విద్యార్థులంతా కామర్స్, జువాలజీ, ఎకనామిక్స్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు.

సీనియర్ వేధింపులు తాళలేక 2023 ఫిబ్రవరిలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

దీంతో తాజాగా కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ర్యాగింగ్ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.

కాకతీయ వర్సిటీ చరిత్రలోనే ర్యాగింగ్ అంశంలో ఇంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.

కాకతీయ వర్సిటీ

అసలేం జరిగింది?

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలలోని 473 అనుబంధ కాలేజీలు ఉన్నాయి.

27 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ , పీహెచ్‌డీ కోర్సులను వర్సిటీ అందిస్తోంది.

ఇటీవల కామర్స్, జువాలజీ, ఎకనామిక్స్ పీజీ విద్యార్థుల పరిచయ కార్యక్రమాలు క్లాస్ రూమ్‌లలో జరిగాయి.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఉమెన్స్ హాస్టల్‌లో సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.

జూనియర్ల నుంచి అందిన ఫిర్యాదులపై వర్సిటీ అధికారులు విచారణ చేపట్టారు. ర్యాగింగ్ నిజమని తేలడంతో 81 మంది విద్యార్థినులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.

ప్రొఫెసర్ తాటికొండ రమేష్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విద్యార్థినుల సస్పెన్షన్ జనవరి 2 వరకు కొనసాగుతుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ తెలిపారు.

విచారణ జరిపి సస్పెండ్ చేశాం: వైస్ చాన్స్‌లర్

ర్యాగింగ్ ఘటనపై కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ బీబీసీతో మాట్లాడారు.

“డిసెంబర్ 18న ఆ డిపార్ట్‌మెంట్లలోని తరగతి గదుల్లో జూనియర్, సీనియర్ విద్యార్థుల ‘పరిచయం’ జరిగింది. అదే రోజు రాత్రి కొంతమంది సీనియర్ విద్యార్థినులు క్యాంపస్‌లోని పద్మాక్షి వుమెన్స్ హాస్టల్‌లో జూనియర్లను పాటలు పాడమని, డ్యాన్స్ చేయాలంటూ వేధించినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన అనంతరం, యాంటీ ర్యాగింగ్ కమిటీ సిఫార్సు మేరకు మొత్తం 81 మంది విద్యార్థినులను వారం రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేశాం’’ అని ఆయన అన్నారు.

విద్యార్థినుల సస్పెన్షన్ జనవరి 2 వరకు కొనసాగుతుందని వీసీ తెలిపారు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో క్రిస్మస్ సెలవులు కొనసాగుతున్నాయి.

‘’మా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందే విద్యార్థుల్లో మెజార్టీ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులే. ఇలాంటి ర్యాగింగ్ ఘటనలను మొగ్గ దశలోనే తుంచేయాలనే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నాం. వర్సిటీలో క్లాస్ రూమ్, కాలేజ్, క్యాంపస్ స్థాయిల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నాయి. మితిమీరిన ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయి. ర్యాగింగ్ అంశంపై నిరంతరం కౌన్సిలింగ్ ఇస్తున్నాం” అని వీసీ అన్నారు.

‘’సస్పెండ్ అయిన వారిలో చాలామంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, వారి కుటుంబాల్లోనే మొదటిసారి పీజీ చదువుతున్న అమ్మాయిలు ఉన్నారు. వారి కెరీర్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు హాజరయ్యేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఏ రూపంలో నైనా ర్యాగింగ్ ఎదుర్కొనే విద్యార్థులు అకడమిక్ ర్యాగింగ్ కమిటీ డీన్‌ను నేరుగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. కాకతీయ యూనివర్సిటీలో ర్యాంగింగ్ అంశంపై జీరో టోలరెన్స్‌తో వర్సిటీ యంత్రాంగం ఉంది’ అని వీసీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)