దావూద్ ఇబ్రహీం: పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు?

ఫొటో సోర్స్, OTHER
- రచయిత, అమృత దూర్వే
- హోదా, బీబీసీ ప్రతినిధి
దావూద్ ఇబ్రహీం. వివాదాలకు, చర్చలకు కేంద్రబిందువుగా మారిన ముంబయి అండర్‌వరల్డ్ డాన్. మాఫియా ముఠా నేతగా జీవితం ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అతని పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది.
కరాచీలో ఉంటున్న ఆయనపై విషప్రయోగం జరిగిందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, దానిని ఏ అధికార సంస్థగానీ, దావూద్ కు సంబంధించిన మాఫియ సంస్థలు గానీ ధృవీకరించ లేదు.
నేర ఘటనల నుంచి సినిమా కథల వరకు తరచూ వార్తల్లో కనిపించే ఈ మాఫియా ముఠా నేత నేర జీవితం ఎలా ప్రారంభమైంది అన్నది ఆసక్తికరమైన విషయం
ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకైన దావూద్, 1980లలో ముంబయి అండర్‌వరల్డ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు.
దావూద్ తండ్రి ఇబ్రహీం కాస్కర్ ముంబయి పోలీసు డిపార్టుమెంటులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయనకు డోంగ్రీ – నాగ్పాడా ప్రాంతంలో మంచి పేరుంది. ఇబ్రహీం, అమీనా కాస్కర్ దంపతులకు 12 మంది సంతానంలో దావూద్ కూడా ఒకరు.
ఏడవ తరగతిలో స్కూల్‌కి వెళ్లడం మానేసిన దావూద్, నేరాలు చేయడం మొదలుపెట్టాడు. చిన్నస్థాయి దొంగతనాలు, చైన్ స్నాచింగ్, జేబులు కొట్టేయడం, దాడులు చేయడం వంటి వాటిలో పాల్గొన్నాడు.
దావూద్ టీనేజీ వయసులో ఉండగా, కొందరు యువకులను పోగుచేసి ఒక గ్యాంగుని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. 20 ఏళ్ల వయసులో డోంగ్రీ ప్రాంతంలోని పఠాన్ గ్యాంగుని సవాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే డోంగ్రీ గల్లీల్లో దావూద్ గ్యాంగ్ కుర్రాళ్లు యాక్టివ్‌గా ఉన్నారు. ఏడవ తరగతిలో చదువు మానేసిన దావూద్ క్రమంగా ముంబయి డాన్‌గా ఆ తర్వాత ఇండియాకే డాన్‌గా మారాడు.
సోదరుడు షబ్బీర్‌తో కలిసి దావూద్ నేరాలు చేయడం మొదలు పెట్టాడు. వీళ్ల కంపెనీకి మీడియా డీ-కంపెనీ అని పేరు పెట్టింది. అంటే దావూద్ కంపెనీ అని అర్థం. ప్రస్తుతం డీ-కంపెనీ వ్యవహారాలను దావూద్ సోదరుడు అనీస్ చూసుకుంటున్నాడని భావిస్తున్నారు.
దావూద్ పందొమ్మిదేళ్ల వయసులో తన సోదరుడు షబ్బీర్, మరి కొందరు గ్యాంగ్ సభ్యులతో కలిసి ముంబయి బుందేర్ ప్రాంతంలోని బ్యాంకులో దోపిడీ చేశారు. దాంతో ముంబయి నేర ప్రపంచంతో పాటు ముంబయి వార్తా పత్రిక్రల దృష్టి దావూద్‌పై పడింది.
ఆ బ్యాంకులోని డబ్బు హాజీ మస్తాన్‌కు చెందిన డబ్బుగా భావించి దావూద్ ఈ దోపిడీ చేశాడు. కానీ ఆ డబ్బు మెట్రోపాలిటన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకి చెందింది. అప్పటికి దశాబ్ద కాలంగా జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీ ఘటన ఇదే. దాంతో దావూద్ నేర ప్రవృత్తిని తెలుసుకున్న తండ్రి ఇబ్రహీం కాస్కర్ షాక్‌కు గురయ్యారు.

ఫొటో సోర్స్, NIA
ముంబయి సీనియర్ జర్నలిస్ట్ ఎస్.హుస్సేన్ జైదీ, దావూద్‌పైన ‘డోంగ్రీ టు ముంబయి’ అనే పుస్తకం రాశారు. బ్యాంకు దోపిడీ గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. దావూద్ తండ్రి ఇబ్రహీంకు తనదైన నెట్‌వర్క్ , స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారని, వారి సాయంతో ఇద్దరు కొడుకులనీ వెతికే ప్రయత్నం చేశారని ఆ పుస్తకంలో రాశారు.
ఆ పుస్తకంలో రాసిన వివరాల ప్రకారం...కొన్ని రోజుల గాలింపు తర్వాత బైకుల్లా ప్రాంతంలోని స్నేహితుడి ఇంట్లో ఇద్దరు కొడుకులూ దాక్కున్నారని దావూద్ తండ్రికి తెలిసింది. అక్కడి నుంచి వాళ్లిద్దరినీ తిరిగి ఇంటికి తీసుకొచ్చారు ఇబ్రహీం. అప్పటికే వాళ్ల అమ్మ కొడుకులను తిడుతోంది. ఇబ్రహీం ఇంట్లోకి వెళ్లి స్టీలు కప్ బోర్డులోని లెదర్ బెల్టు తీసుకుని కిందకొచ్చారు. క్రైం బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆ బెల్టుని వాడేవారు ఇబ్రహీం.
ఆగ్రహంతో ఇబ్రహీం ఇద్దరు కొడుకులనీ చితకబాదారు. దెబ్బలు తిన్న వాళ్లిద్దరికి భయమేసింది. కొందరు మధ్యలో కల్పించుకుని ఇబ్రహీంను ఆపి బెల్టుని లాక్కోవడంతో దెబ్బలు ఆగాయి.
ఇబ్రహీం తన ఇద్దరు కొడుకులకూ టాక్సీలో ఎక్కించి ముంబయి క్రైం బ్రాంచ్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
కొడుకులిద్దరినీ అధికారుల కాళ్ల మీద పడేసిన ఇబ్రహీం, చేతులెత్తి మొక్కుతూ బోరున విలపించారు. తన బిడ్డలు చేసిన నేరానికి క్షమించాలంటూ అధికారులను వేడుకున్నారు. దావూద్, షబ్బీర్‌ల దుస్థితినీ, ఇబ్రహీం నిజాయితీని చూసిన క్రైం బ్రాంచ్ అధికారులు వాళ్లను వదిలేశారు.
ఇలా అనేక ఇతర సందర్బాల్లోనూ దావూద్‌కు మినహాయింపులు దక్కాయి. తన ఇంటి వద్ద జరిగిన ఆ 15 నిమిషాల ఘటన, దాని వల్ల వచ్చిన పబ్లిసిటీని చూసి దావూద్ ఇబ్రహీంకు ఆశ్చర్యం కలిగింది. బహుశా ఈ ఘటన నుంచే దావూద్ ఇబ్రహీం డాన్‌గా ఎదగడం మొదలై ఉండొచ్చు.
ముంబయి అండర్‌వరల్డ్‌లోకి అడుగు పెట్టిన దావూద్, ఆనాటికే నేర ప్రపంచంలోని శక్తిమంతమైన వ్యక్తుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ గ్యాంగ్ వార్లకు, రక్తపాతానికి కారణమయ్యాడు. ఒక కొత్త నేర శకాన్ని ప్రారంభించాడు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ముంబయి దాడుల్లో సూత్రధారిగా దావూద్
దావూద్ తండ్రి ఇబ్రహీం కాస్కర్‌ను ఒక పెట్రోల్ పంపు దగ్గర పఠాన్ గ్యాంగు హత్య చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకున్నాడు దావూద్. కరీం లాలా మేనల్లుడు సమాద్ ఖాన్‌ను 1986లో దావూద్ హత్య చేశాడు.
తర్వాత ఇండియా నుంచి పారిపోయిన దావూద్, దుబాయ్ కేంద్రంగా డీ-కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టాడు. తర్వాత డీ గ్యాంగ్ ఆపరేషన్స్ ఇండియాలోనూ, దేశం బయటా విస్తరించాయి.
ముంబయిలో జరిగిన 1993 వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం అంటూ ఆరోపణలొచ్చాయి. ఈ దాడుల్లో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మంది గాయపడ్డారు.
బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ముంబయిలో మత ఘర్షణలు చెలరేగాయి. చాలా మంది ముస్లింలను ఈ అల్లర్లలో చంపేశారు.
ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దావూద్, పాకిస్తానీ ఐఎస్ఐ సాయంతో బాంబులను, ఆయుధాలను అక్రమంగా ఇండియాలోకి తరలించి, 1993 మార్చి 12న ముంబయి వరుస బాంబు పేలుళ్లకు కారణమయ్యాడు.
మాజీ ముంబయి పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా రాసుకున్న ఆత్మకథలో – ‘ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి’ అంటూ మొదలుపెట్టి, ‘’బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత. ముంబయిలోని ముస్లింలు దావూద్ సాయం కోరారు. అయితే దావూద్ ఎలాంటి సాయం చేయడానికి ముందుకు రాలేదని మేము విన్నాం. కొందరు ముస్లిం మహిళలు దావూద్‌కు గాజులు పంపించారు,’’ అని పేర్కొన్నారు.
డీ-గ్యాంగ్‌లో సభ్యులైన చోటా షకీల్, టైగర్ మెమన్, యాకూబ్ మెమన్, అబూ సలేంలు, 1993 ముంబయి పేలుళ్లకు సంబంధించి అనేక కేసులలో నిందితులుగా ఉన్నారు. వీరిలో అబూ సలేంకు జీవితఖైదు శిక్ష పడింది. యాకూబ్ మెమన్‌కు మరణ శిక్ష ఖరారైంది.
దావూద్‌కు లష్కర్-ఎ-తొయిబా, ఒసామా బిన్ లాడెన్‌కు చెందిన అల్-ఖైదా సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి.
అమెరికాలోని 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల్లోనూ దావూద్ ఇబ్రహీం పాత్ర ఉందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.
దాంతో దావూద్‌ను ప్రత్యేకంగా గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ వేర్వేరు దేశాల్లోని దావూద్ ఆస్తులను జప్తు చేయాలని ఐక్యరాజ్య సమితిని అమెరికా డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, PTI
దావూద్ ఇప్పుడెక్కడ?
దావూద్ కొద్ది కాలానికి దుబాయ్ నుంచి మకాం మార్చాడు. పాకిస్తాన్ దావూద్‌కు ఆశ్రయం కల్పిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, దావూద్‌కు సాయం చేస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అతను కరాచీలో ఉంటున్నాడని కూడా చెబుతోంది. కానీ అతను, అతని కుటుంబం తమ దేశంలో లేరని పాకిస్తాన్ పదే పదే అంటోంది.
పాకిస్తాన్‌లో తీవ్రవాదులుగా లేదా తీవ్రవాద సంస్థలుగా గుర్తించిన 88 మంది లేదా సంస్థలపైన 2020 అగస్టు 22న ఆంక్షలు విధించారు. ఈ జాబితాలో దావూద్ ఇబ్రహీంను కూడా చేర్చడంతో దావూద్ తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ పరోక్షంగా అంగీకరించినట్టైంది.
అయితే దావూద్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తన చివరి దశలో ఉన్నాడని చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ ఐఏఎన్‌ఎస్ వార్తా ఏజెన్సీతో మాట్లాడిన దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం, దావూద్, అతని కుటుంబం బాగానే ఉన్నారని ధృవీకరించాడు.
దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని, అతని కూతురు మాహ్‌రుఖ్‌కి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకుతో వివాహమైందని ద క్వింట్ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది.
మరోవైపు దావూద్ తన సోదరులతో కలిసి డీ-కంపెనీ ద్వారా యూఏఈ, పాకిస్తాన్‌లలో కొన్ని లగ్జరీ హోటళ్లను, కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాడని అనీస్ స్పష్టం చేశాడు.
ద క్వింట్ వార్తా సంస్థ 2019లో చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ, దావూద్ ఎక్కడున్నాడనే ప్రశ్నకు స్పందిస్తూ, ‘’ఏజెన్సీలకు దావూద్ ఎక్కడున్నాడో కచ్చితమైన వివరాలతో తెలుసు. అతను ఏ వీధిలో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉంటున్నాడో కూడా తెలుసు. ఒక ఇంటెలిజెన్స్ అధికారి నాతో చెప్పిన విషయం ఏంటంటే, దావూద్ కొడుకు మోయిన్ ఇప్పుడు పెద్ద గడ్డంతో ఉన్నాడని, మతం పట్ల బాగా ఆసక్తి పెంచుకున్నాడని చెప్పారు’’ అని అన్నారు.
ఆ అధికారితో మాట్లాడుతోన్న హుస్సేన్ జైదీ, ‘’దావూద్ గురించి మీకిన్ని విషయాలు తెలిస్తే దావూద్ ఎక్కడున్నాడో కూడా మీకు తెలిసే ఉంటుంది. అతని కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడు? లండన్‌లో దావూద్ కూతురు చదువుతున్న కాలేజీ వివరాలు మీకు తెలుసు. మరి దావూద్‌ని తిరిగి ఇండియాకు మీరెందుకు తీసురాకూడదు? దావూద్‌ని ఇండియాకు తీసుకురావాలన్న ఆలోచన వాళ్లకు లేదు. అతన్ని తీసుకావడానికి అవసరమైన రాజకీయ సంకల్పం కొరవడింది,’’ అని జైదీ అన్నారు.
దావూద్‌తో ఉన్న ఇబ్బంది ఏంటంటే, అతన్ని ఇండియాకో, లేదా ఇండియాలోని ముంబయికో తీసుకొస్తే, అతనితో సంబంధాలున్న రాజకీయ నాయకుల వివరాలు బయటకొస్తాయి. వీళ్లతో దావూద్‌కున్న సంబంధాలు బయట పడతాయి. కాబట్టి అతన్ని ఇండియాకు రాకుండా ఉంచడమే అందరికీ మంచిదనే అభిప్రాయం ఉంది.

ఫొటో సోర్స్, AFP
దావూద్ అండ్ బాలీవుడ్
నేర ప్రపంచ కథలు బాలీవుడ్‌ను ఎప్పుడూ ఆకర్షిస్తాయి. నేరాలు, అండర్‌వరల్డ్ చుట్టూ అల్లుకున్న కథలతో బాలీవుడ్ కేంద్రంగా చాలా సినిమాలొచ్చాయి. ఈ ట్రెండ్ కొన్నేళ్లపాటు కొనసాగింది.
అలాంటి సినిమాల్లో ప్రముఖంగా కంపెనీ, షూటౌట్ ఎట్ లోఖాండ్‌వాలా, షూటౌట్ ఎట్ వాదాలా, వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబయి, బ్లాక్ ఫ్రైడే వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ముంబయి నేర ప్రపంచం చుట్టూ అల్లిన కథలున్న సినిమాలు. వీటిలోని కొన్ని సినిమాల్లో దావూద్ ఇబ్రహీం పాత్ర కూడా కనిపిస్తుంది.
దుబాయ్‌లో 1990ల్లో దావూద్ ఇచ్చిన పార్టీలకు చాలా మంది బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఆ వీడియోలు ఈరోజుకీ అందుబాటులో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మరణించిన బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ రాసుకున్న ఆత్మకథ ‘ఖుల్లం ఖుల్లా’లో దావూద్ ఇబ్రహీంను రెండుసార్లు కలిసినట్టు చెప్పారు.
ఇక సంచలనం రేపిన మరో ఘటన, టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య. అబూ సలేం, డీ-గ్యాంగ్ ఈ హత్య వెనుక ఉన్నారని భావిస్తారు. మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, 1993 ముంబయి బాంబు దాడులకు సంబంధిన నేర అభియోగంతో కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. తన ఇంటికి వచ్చి అబూ సలేం ఆయుధం ఇచ్చినట్టు సంజయ్ దత్ వాంగ్మూలం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
దావూద్ అండ్ క్రికెట్
షార్జా క్రికెట్ స్టేడియంలో బాక్స్‌లో కూర్చుని దావూద్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ, 1987లో జరిగిన మ్యాచ్ సమయంలో దావూద్ ఇబ్రహీం డ్రస్సింగ్ రూంలోకి వచ్చి భారత క్రికెట్ జట్టు సభ్యులకు టయోటా కార్ ఆఫర్ చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని కొంత కాలం తర్వాత ఇండియాటుడేతో మాట్లాడిన కపిల్ దేవ్ కూడా ధృవీకరించారు.
‘’మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్స్‌తో మాట్లాడేందుకు ఒక వ్యక్తి డ్రస్సింగ్ రూంలోకి వచ్చారు. అది చూసిన నేను, బయటివాళ్లు లోపలికి రాకూడదని చెప్పి ఆ వ్యక్తిని బయటకు వెళ్లాలని అడిగాను. పూర్తిగా విని ఏమీ మాట్లాడకుండా అతను వెళ్లిపోయాడు,’’ అని ఇండియాటుడే ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ చెప్పారు.
తర్వాత డ్రస్సింగ్ రూంలోకి వచ్చిన వ్యక్తే ముంబయి నుంచి వచ్చిన దావూద్ ఇబ్రహీం అని తెలిసిందని కపిల్ అన్నారు.
ఈ సంఘటనను బీసీసీఐ సెక్రటరీగా పని చేసిన జయవంత్ లెలె కూడా తన పుస్తకంలో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
వార్తల్లో దావూద్
దావూద్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. నిజానికి దావూద్‌కు చెందిన కొత్త ఫోటో ఏదీ కూడా ఇన్నేళ్లలో బయటకు రాలేదు. దావూద్‌ను చూపించే ఫోటోగానీ, వీడియోగానీ అందుబాటులో లేవు. గడిచిన కొన్నేళ్లలో చోటుచేసుకున్న నేరాల్లోనూ దావూద్ ప్రస్తావన లేదు. అయినా కూడా దావూద్ పేరు వార్తల్లో నిలుస్తోంది.
ఈ అంశంపైన మాట్లాడిన ముంబయి క్రైం రిపోర్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సుధాకర్ కశ్యప్, ‘’దావూద్ వార్తల్లో ఉండటానికి కారణం అతనికి సంబంధించిన వార్తలకు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉండటమే. భారతీయ మీడియాకు ఇది చాలా ముఖ్యమైన వార్త అవుతుంది. అతని వార్త రాగానే మిగిలిన వార్తలు ఆటోమేటిక్‌గా పక్కకు వెళ్లిపోతాయి,’’ అని అన్నారు.
వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు మహారాష్ట్రలో మొదటిసారిగా రూపొందించిన ఎమ్ కోకా (MCOCA) చట్టం వచ్చిన తర్వాతి పదేళ్లలో గ్యాంగ్ వార్లను కట్టడి చేశారు. ప్రస్తుతం ముంబయిలో గ్యాంగ్ వార్లు లేవు. క్రిమినల్ గ్యాంగులు లేవు. భయం గుప్పిట్లోంచి ప్రజలు బయటికొచ్చారు. కానీ దావూద్‌కు సంబంధించిన వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
సారా-సహారా కేసు 2002-2003 మధ్యలో వార్తల్లో నిలిచింది. ఈ సందర్బంలో దావూద్ పేరు బయటికొచ్చింది. ముంబయి 1993 బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్‌గా మారిన దావూద్ పేరు మరే ఇతర నేరాల్లోనూ వినపడలేదు. అయినా తరచుగా దావూద్ పేరు వార్తల్లో వస్తూనే ఉంది.
ముంబయి కేంద్రంగా పనిచేసే ‘దిల్లీ జైకా’ రెస్టారెంట్‌ను 2015లో వేలం వేశారు. దావూద్‌ని ఈ రెస్టారెంట్ యజమానిగా కొందరు చెబుతారు. దాంతో అప్పట్లో దావూద్ పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
హూస్సేన్ జైదీకి ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చిన దావూద్
సీనియర్ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ, దావూద్ ఇబ్రహీంను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. దీన్ని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక 1997 సెప్టెంబర్ నెలలో మొదటి పేజీలో ప్రచురించింది. తర్వాత 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హుస్సేన్ జైదీ ఆనాటి దావూద్ ఇంటర్వ్యూ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
‘’నాకున్న పరిచయాల ద్వారా, కొన్ని సోర్సుల ద్వారా దావూద్‌ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను. దక్షిణ ముంబయిలోని కొందరు వ్యక్తులకు దావుద్ పరిచయస్తులు కొందరు తెలుసు. కానీ వాళ్లు దావూద్‌ను చేరుకునేలా, లేదా అతనితో ఇంటర్వ్యూకి దారి తీసేలా ఎలాంటి లీడ్‌ను నాకు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు,’’ అని హుస్సేన్ జైదీ చెప్పారు.
‘’వాళ్లు ఆ పని చేస్తే పోలీసుల కన్ను వాళ్లపైన పడి వాళ్లను వేధిస్తారని భయపడ్డారు. కాబట్టి దావూద్‌తో నాకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి వాళ్లను ఎప్పుడూ సంప్రదించకూడదని హామీ తీసుకున్నారు. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వాళ్లు నాకు వార్తలు అందించే మంచి సోర్సెస్. వాళ్లను మళ్లీ కాంటాక్ట్ చేయలేను కాబట్టి తర్వాత బాధపడ్డాను. వాళ్లు వార్తలకు సంబంధించి నాకు చాలా లీడ్స్ ఇచ్చారు. కానీ దావూద్‌తో ఇంటర్వ్యూ వస్తుంది కాబట్టి వాళ్లను కోల్పోవడం వల్ల కలిగే నష్టానికి నేను సిద్ధపడ్డాను. నా తరపున వాళ్లు దావూద్‌కు ఒక సందేశం పంపించారు. కొన్ని రోజుల తర్వాత నా పేజర్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఒక నంబరుకి కాల్ చేయమని అందులో ఉంది’’ అని హుస్సేన్ జైదీ వివరించారు.
‘’ఆ మెసేజ్ వచ్చినపుడు నేనొక రిక్షాలో వెళ్తున్నాను. వెంటనే రిక్షాలోంచి దిగిపోయి కలీనా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌లోకి వెళ్లి మెసేజ్‌లో ఉన్న నంబరుకి ఫోన్ చేశాను. అదొక లోకల్ టెలీఫోన్‌బూత్ నంబరులా ఉంది. ఆ ఫోన్‌బూత్ నన్ను కారాచీలో ఉన్న దావూద్‌తో ఫోన్‌లో కలిపింది. ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. నేను మీతో కాదు దావూద్ ఇబ్రహీంతో మాట్లాడాలి అని చెప్పాను. అందుకతను చెప్పిన సమాధానం – నేను దావూద్ ఇబ్రహీంనే మాట్లాడుతున్నాను’’ అని హుస్సేన్ జైదీ గుర్తు చేసుకున్నారు.
‘’అప్పటి వరకూ గ్యాంగ్‌స్టర్‌లతో మాట్లాడిన నా అనుభవం వేరుగా ఉంది. వాళ్లు సాధారణంగా నాగరిక భాషలో మర్యాదగా మాట్లాడరు. వాళ్ల మాటలు కఠినంగా ఉంటాయి. సంభాషణల్లో తరచుగా బూతులు మాట్లాడతారు. కానీ దావూద్ నాతో చాలా నిరాడంబరంగా, అచ్చమైన ఉర్దూ భాషలో మాట్లాడాడు. గ్యాంగ్‌స్టర్‌లా కాకుండా పరిణతి చెందిన ఒక వ్యాపారవేత్తలా మాట్లాడాడు’’ అని హుస్సేన్ జైదీ అన్నారు.
‘’ఇంటర్వ్యూ మొత్తం అతనొక జెంటిల్‌మెన్‌లా మాట్లాడాడు. మొత్తం మా ఫోన్ సంభాషణలో ఒక్క ప్రశ్నకు మాత్రం అతను కొద్దిగా ఇబ్బంది పడినట్టు అనిపించింది. మాదకద్రవ్యాల వ్యవహారాల్లో అతని పాత్ర గురించి అడిగాను. అందుకు అతను, మిస్టర్ జైదీ, మిమ్మల్ని నేను గౌరవిస్తాను. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడేమీ అనను. ఇంకెవ్వరూ కూడా నన్ను ఈ ప్రశ్న అడిగే సాహసం చేయరు. నేను డ్రగ్స్ వ్యవహారాలతో డీల్ చేయను’’ అని దావూద్‌తో జరిగిన సంభాషణ గురించి జైదీ వివరించారు.
‘‘మా మధ్య జరిగిన సంభాషణ తర్వాత కూడా నేను షాక్‌లోనే ఉన్నాను. దావూద్ ఇబ్రహీంతో మాట్లాడానని నమ్మలేకపోయాను. బహుశా అతని వ్యాపారం కోసం గ్యాంగ్‌స్టర్ మాస్కుని తగిలించుకున్నాడో మరేదైనా కారణమో నాకు తెలీదు కానీ నిజమైన దావూద్ ఇబ్రహీం ఎవరనేది నాకు అర్థం కాలేదు.’’ అని హుస్సేన్ జైదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
హుస్సేన్ జైదీ రాసిన ‘డోంగ్రీ టు దుబాయ్’ పుస్తక ఆరంభంలోనే దావూద్ ఇంటర్వ్యూని ప్రచురించారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
- పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














