'యువగళం-నవశకం' సభ: పదేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, పవన్.. పొత్తుపై వారు ఏమన్నారు?

ఫొటో సోర్స్, TDP
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ‘యువగళం-నవశకం’ పేరుతో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభలో దాదాపు పదేళ్ల తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు.
ఈ ఏడాది జనవరిలో కుప్పంలో ‘యువగళం’ పేరుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్ర 226 రోజుల పాటు, 3,132 కిలోమీటర్ల మేర, 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగి, విశాఖలో ముగిసింది.
ఆ పాదయాత్ర ముగింపు సభను ‘యువగళం-నవశకం’ పేరుతో టీడీపీ భారీ ఎత్తున నిర్వహించింది.
సభకు టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా టీడీపీ, జనసేన జెండాలు కనిపించాయి.
టీడీపీ, జనసేన పొత్తు కొనసాగాలని, దానిని అంతా అర్థం చేసుకోవాలంటూ ముఖ్య నాయకులంతా కార్యకర్తలను కోరారు.

ఫొటో సోర్స్, TDP
ఈ పొత్తు పార్టీల కోసం కాదు: చంద్రబాబు
బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, “యువతకు తెలుగుదేశం, జనసేన అండగా ఉంటూ భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత తీసుకుంటాయి. జనసేన, టీడీపీ పొత్తు పార్టీల కోసం కాదు, భావితరాల కోసం” అన్నారు.
త్వరలోనే టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫేస్టో విడుదల చేస్తామని ఆయన సభా వేదికపై నుంచి ప్రకటించారు.
“యువతకు ఉద్యోగాలు, రాష్ట్ర భవిష్యత్తు బాధ్యతలను జనసేన, టీడీపీ ఉమ్మడిగా తీసుకుంటాయి. జనసేన, టీడీపీ పొత్తు సూపర్ హిట్. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పొత్తు. జనసేన, టీడీపీ కార్యకర్తలు కలిసి పని చేయాలి” అని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, TeluguDesamPartyOfficial/YT
“అమరావతిని నేను రాజధానిగా ప్రతిపాదన చేసినప్పుడు అమరావతి రాజధానిగా ఉంటుందని, విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని చెప్తే, ఆనాడు అందుకు మద్దతు ఇచ్చి, ఇప్పుడు రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతున్నారు” అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని చంద్రబాబు విమర్శించారు.

ఫొటో సోర్స్, TeluguDesamPartyOfficial/YT

ఫొటో సోర్స్, TDP
ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వడం లేదు: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, పొత్తుపై మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ తనని బాధించిందన్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
“ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. కానీ, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, సీఎంని” అని పవన్ అన్నారు.
“జగన్‌ను కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జైల్లో పెడితే, ఆ కక్ష చంద్రబాబుపై చూపారు. ఇది అవివేకం. చంద్రబాబును జైలుకు పంపడం బాధని కలిగించింది. కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని అనుకున్నా. అంతేకానీ ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదు.
2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. జగన్‌ను ఇంటికి పంపుతాం. టీడీపీ, జనసేన పొత్తు చాలా కాలం కొనసాగాలి” అని వ్యాఖ్యానించారు.
“రాష్ట్ర భవిష్యత్తు కోసం విభజన తరువాత టీడీపీ సంకీర్ణానికి మద్దతు ఇచ్చాను. దశాబ్ద కాలం పాటు అండగా నిలుద్దామని భావించాను. కానీ, దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో ముందుకు తీసుకెళ్లలేకపోయాను. ఆ లోటు తాలూకు ఫలితమే జగన్ ప్రభుత్వం వచ్చింది” అన్నారు.
“2024లో మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం, మార్పు తెస్తున్నాం, జగన్‌ను ఇంటికి పంపిద్దాం” అని పవన్ చెప్పారు.
“బీజేపీని మోసం చేశానంటూ వైసీపీ నేతలు నన్ను విమర్శించారు. పరిస్థితులను వివరించి, టీడీపీ-జనసేన పొత్తుకు మద్దతు కావాలని బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు తెలియజేశాను. వారు ఎంతవరకు ఒప్పుకుంటారో తెలియదు. నేను మాటకు, మైత్రికి చాలా విలువ ఇస్తాను. టీడీపీ-జనసేన మైత్రికి బీజేపీ అధినాయకత్వం మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

ఫొటో సోర్స్, TeluguDesamPartyOfficial/YT
పాదయాత్ర అనుభవాలతో ఎంతో నేర్చుకున్నా: లోకేశ్
పాదయాత్ర ద్వారా ఎదురైన అనుభవాల నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు లోకేశ్ తన ప్రసంగంలో చెప్పారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నానన్నారు.
“జగన్‌కు రెండు బటన్లు ఉన్నాయి. ఒకటి అందరికీ కనిపించే బులుగు బటన్, రెండోది కనిపించని ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కితే రూ. 10 అకౌంట్లో పడితే, ఎర్ర బటన్ నొక్కితే రూ.100 రూపాయలు అకౌంట్ నుంచి పోతుంది” అంటూ విమర్శించారు.
చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతూ- “కష్టకాలంలో పవన్ అన్న ఫోన్ చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న’’ అని చెప్పారు.
ప్రజల కోసం టీడీపీ, జనసేన కలిసి పోరాడుతున్నాయని లోకేశ్ చెప్పారు.
‘‘రెడ్ బుక్‌లో అవినీతి అధికారుల పేర్లు ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే చట్టాలను ఉల్లంఘించిన అధికారులపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం” అని తన చేతిలో ఉన్న ఎర్ర పుస్తకాన్ని చూపిస్తూ లోకేశ్ చెప్పారు.
యువగళం పాదయాత్రపై బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్‌తో సీనియర్ జర్నలిస్ట్ గోపి దారా మాట్లాడుతూ- 400 రోజులు 4,000 కిమీ అని ప్రారంభించినప్పటికీ లోకేశ్ ఆ మార్క్ పూర్తి చేయలేదన్నారు.
‘‘వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ ఈ ముగ్గురి పాదయాత్రలతో పోలిస్తే లోకేశ్ యాత్రలో ఎక్కువ సమూహాలను కలవలేదు. దానికి తోడు రెండో దశ పాదయాత్రలో ఒకే రోజు రెండేసి నియోజకవర్గాలను కవర్ చేశారు. అర్బన్ అయితే ఓకే కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే రోజు రెండేసి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ యాత్ర ముగించి టూర్లు, మీటింగులపై శ్రద్ధ పెట్టాలి అని వారు అనుకున్నారేమో’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, TDP
పవన్, నేనూ ముక్కుసూటిగా మాట్లాడతాం: బాలకృష్ణ
సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ- తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఎంత గొప్పగా నడిపించారో, ఇప్పుడు చంద్రబాబు అదే విధంగా నడిపిస్తున్నారని చెప్పారు.
పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, “2014 నుంచి ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారు. నాకు, పవన్ కళ్యాణ్ కు చాలా పోలికలు ఉన్నాయి. మేం ఇద్దరమూ ముక్కుసూటిగా మాట్లాడతాం. తప్పనిపిస్తే దానిని ఎదిరించడానికి ఎంత దూరమైనా వెళ్తాం” అన్నారు.
“ప్రజలు ఉచిత పథకాల మాయలో పడి, భవిష్యత్తును పాడుచేసుకోవద్దు” అన్నారు.

ఫొటో సోర్స్, TDP
చంద్రబాబు వ్యూహాత్మకంగా మాట్లాడారా?
యువగళం-నవశకం సభలో చంద్రబాబు, పవన్, లోకేశ్‌ల ప్రసంగాల తీరుపై గోపి దారా మాట్లాడుతూ- ‘‘ చంద్రబాబు తన ప్రసంగంతో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ్టి చంద్రబాబు ప్రసంగంతో ఆయన ఎన్నికలు ప్రచారం, ఎన్నికలు ప్రసంగం మొదలుపెట్టినట్టే. ఎన్నికల నిమిత్తం తాను గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేశారు.
భవిష్యత్తులో టీడీపీ ఎలా పనిచేయబోతోంది, జనసేనతో కలసి ఎలా వెళ్లబోతోందో ఆయన చెప్పారు. అలాగే తన ప్రసంగంలో ప్రతి చోటా పవన్ కళ్యాణ్‌ను కలుపుకుని మాట్లాడారు. ఒక రకంగా పవన్ మళ్లీ పొత్తులో నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేసే వ్యూహంతో మాట్లాడారు’’ అని అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ తన సహజ ధోరణిలో ఆవేశపూరితంగా కాకుండా కాస్త తగ్గి మాట్లాడారని గోపి బీబీసీతో చెప్పారు.
లోకేశ్ ప్రసంగం రోజూ వారీ యాత్రలో ఆయనిచ్చే ప్రసంగంలానే సాగిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’
- మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మాల్దీవులు: చైనాతో స్నేహం వల్లే ‘ఇండియా అవుట్’ అంటోందా? మోదీ ముందున్న మార్గాలేంటి...
- అమరావతి ఇప్పుడెలా ఉంది, రాజధానికి శంకుస్థాపన చేసిన తొమ్మిదేళ్లలో చేసిందేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














