హషాషిన్: వందల ఏళ్ల క్రితం పట్టపగలే శత్రువులను గొంతు కోసి చంపిన ముస్లిం ‘రాడికల్’ వర్గం

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అస్సాసిన్స్ అనేది సుశిక్షితులైన, తెలివైన వ్యక్తుల సమూహం
    • రచయిత, జువాన్ ఫ్రాన్సిస్కో అలొన్సో
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

“ఒక వృద్ధుడు ఒక ప్రభువును చంపాలనుకున్నప్పుడు, అతను బాగా ధైర్యవంతులైన కొంత మంది యువకుల దగ్గరకు వెళ్తాడు. ఆ ప్రభువును చంపితే మీకు స్వర్గంలో స్థానం లభిస్తుందని చెప్పి యువకుల్ని అతన్ని చంపడానికి పంపిస్తాడు.’’

కొన్ని శతాబ్దాల క్రితం మధ్యప్రాచ్యంలోని క్రైస్తవులు, మొహమ్మద్ ప్రవక్త అనుచరుల్లో భయాందోళనలు వ్యాప్తి చేసిన ఒక ముస్లిం వర్గం లేదా తెగ గురించి ఈ విధంగా ‘‘బుక్ ఆఫ్ వండర్స్’’ అనే పుస్తకంలో మార్కోపోలో అభివర్ణించారు.

ఈ సమూహాన్ని ‘‘ద అస్సాసిన్స్ లేదా హషాషిన్’’ అని పిలుస్తారు.

దీన్నుంచే ఆంగ్ల భాషలోని అసాసిన్ అనే పదం వచ్చింది. అసాసిన్ అంటే హంతకుడు అని అర్థం.

ఈ 'హషాషిన్'‌లు పన్నెండో శతాబ్దానికి చెందినవారు.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అస్సాసిన్స్ క్రీడ్ అనే వీడియో గేమ్ చాలా పాపులర్

టైర్ నగరం: ఆ హంతకులను ఎవరు పంపించారు?

అది 1192 ఏప్రిల్ 28. మూడో క్రూసేడ్‌ కీలక నాయకుల్లో ఒకరైన ఇటాలియన్ ప్రముఖుడు ‘కాన్రాడ్ ఆఫ్ మోంట్‌ఫెరాట్‌’ అప్పుడే జెరూసలెంకు రాజుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను పురస్కరించుకొని ఆ రోజున టైర్ (ప్రస్తుతం లెబనాన్‌లో ఉంది) నగరంలో వేడుకను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు కాన్రాడ్ ఆఫ్ మోంట్‌ఫెరాట్‌.

అయితే, ఆ వేడుక జరుగలేదు.

ఇద్దరు దూతలు అతని వద్దకు సందేశంతో వచ్చారని, ఆ సందేశాన్ని కాన్రాడ్ ఆఫ్ మోంట్‌ఫెరాట్‌ చదువుతుండగా వారు తమ బాకులు తీసి అతని కడుపులో పొడిచారని నాటి రికార్డులు తెలుపుతున్నాయి. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారని చెబుతున్నాయి.

అయితే, ఈ హంతకులను ఎవరు పంపించారనేది ఇంతవరకు తెలియలేదు. కానీ, వారు 'హషాషిన్' వర్గానికి చెందిన హంతకులని మాత్రం తెలిసింది.

ఇప్పటి వరకు ఈ హషాషిన్ శాఖపై ఎన్నో సినిమాలు, కథలు వచ్చాయి. అస్సాస్సిన్ క్రీడ్ అనే వీడియో గేమ్ కూడా ఉంది.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ప్రవక్త అనుచరుల్లో తలెత్తిన విభేదాలు హషాషిన్ పుట్టుకకు దారితీశాయని చరిత్ర చెబుతోంది.

మొహమ్మద్ ప్రవక్త అనుచరుల మధ్య విభేదాలు, 'హషాషిన్' పుట్టుక

హషాషిన్ గురించి బీబీసీకి యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్‌లో అరబ్, ఇస్లామిక్ అధ్యయనాల ప్రొఫెసర్ ఇగ్నాసియో గుటిరెజ్ డి టెరాన్ అధికారిక సమాచారం ఇచ్చారు.

మొహమ్మద్ ప్రవక్త మరణానంతరం ఆయన వారసుడు ఎవరనే అంశంపై ప్రవక్త అనుచరుల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా ఈ శాఖ ఉద్భవించిందని చెబుతారు.

దీన్నుంచి ఇస్లాం మతంలో షియా, సున్నీ అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి.

9వ శతాబ్దం నాటికి షియా వర్గం గణనీయంగా విస్తరించింది. కానీ, ఈ శాఖకు నాయకుడు ఎవరు అనే అంశంపై వివాదాలు తలెత్తాయి. ఇమామ్ ఇస్మాయిల్ ఇబ్న్ జఫర్ గౌరవార్థం ‘‘ఇస్మాయిలిస్’’ అనే ఒక సమూహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమూహానికి ఎవరు నాయకత్వం వహించాలనే విషయంలో కూడా చీలిక ఏర్పడింది. వారిలో కొందరు నిజార్ అనే యువరాజు పక్షం వహించారు. ఈ యువరాజు అలెగ్జాండ్రియా(ఈజిప్ట్)లో అధికారాన్ని ఏర్పాటు చేశారు. కైరోను పాలించిన అతని తమ్ముని అనుచరుల చేతిలో నిజార్‌ హత్యకు గురయ్యారు.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పన్నెండో శతాబ్దంలో హసన్-ఎ-సబా ఈ శాఖను స్థాపించారు

కొత్త నాయకత్వాన్ని అంగీకరించని నిజార్ అనుచరులు

కానీ, నిజార్ అనుచరులు కొత్త నాయకత్వాన్ని అంగీకరించేందుకు బదులుగా పర్షియా (ప్రస్తుతం ఇరాన్)కి వలస వెళ్లారు. అక్కడ తమ వర్గాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించారు.

నిజార్ వర్గీయులు ఇస్లాంను ఆచరిస్తూ అందులో గ్రీకు తత్వం, రహస్యవాదం అనే అంశాలను చేర్చారు.

ఇది షియాలు, సున్నీలకు నచ్చలేదు.

హింస నుంచి తప్పించుకోవడానికి నిజార్ వర్గీయులు మిషనరీల రహస్య నెట్‌వర్క్‌ను సృష్టించారు. ఈ మిషనరీల్లోని మత పెద్దలు ప్రతీ ప్రదేశానికి వెళ్లి తమ శాఖను వ్యాప్తి చేసేవారు. ఈ మత బోధకుల్లో ఒకరు, హసన్-ఎ-సబా అనే ఒక పర్షియన్ పిల్లాడిని గుర్తించారు. అతని మతాన్ని మార్చి అతని పేరుతో ఒక రహస్య శాఖ ‘ద హషాషిన్స్’ను స్థాపించారు.

స్పెయిన్‌లోని సెవిల్లే విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ అధ్యయనాల ప్రొఫెసర్ ఎమిలియో గొంజాలెజ్ బీబీసీతో మాట్లాడుతూ, "అరబ్బులు సాగిస్తున్న వలసవాదానికి ప్రతిస్పందనగా నిజారీ శాఖ ఏర్పడింది.

నిజారీల్లో హషాషిన్లు ఒక రాడికల్ వర్గం’’ అని చెప్పారు.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అస్సాసిన్ శాఖ ఉపయోగించే ప్రముఖ ఆయుధాల్లో డాగర్ ఒకటి

హసన్-ఎ-సబా ఏం చేసేవారు?

నిజారీలు తమ సొంత, ప్రత్యేక రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. హసన్-ఎ-సబా అప్పుడు ఇరాన్ పర్వతాల్లో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఇర్బుజ్ పర్వతాల్లో శత్రు దుర్భేద్యమైన అలముత్ కోటను స్వాధీనం చేసుకున్నారు.

"ఈ కోట గోడలు బలంగా ఉండేవి. దాని రక్షణ గోడ ఇప్పుడు సిరియా-లెబనాన్ వరకు చేరుకుంది. కోటలో కూర్చొని, ఆ రహస్య శాఖ సంస్థాపకుడు వివిధ ఇస్లామిక్ రాజ్యాల్లోని రాజకీయాల గమనాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. తర్వాతి కాలంలో ఆయన ‘‘ద ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ద మౌంటెన్’’ గా గుర్తింపు పొందారు’’ అని గుటిరెజ్ చెప్పారు.

హసన్-ఎ-సబా తన లక్ష్యాలను సాధించడానికి అత్యున్నత స్థాయిలో శిక్షణ పొందిన సైన్యాన్ని రూపొందించుకున్నారు. ఈ సైనికులను ముస్లిం రాజ్యాల్లోని నిర్దిష్ట లక్ష్యాలు, రాజవంశాలు, క్రూసేడర్ ప్రదేశాల్లో దాడి చేయడానికి ఉపయోగించారు.

“అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లేనప్పుడు, దాన్ని నియంత్రించే వీల్లేకుండా పోయినప్పుడు వారు సర్జికల్ స్ట్రైక్స్ చేసేవారు. అంటే తాము సజీవంగా తిరిగొచ్చే అవకాశం ఉందా, లేదా అనేది పట్టించుకోకుండా వెళ్లి లక్ష్యంగా చేసుకున్నవారిని చంపేసేవారు’’ అని గొంజాలెజ్ చెప్పారు.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లోని పర్వతాలపై ఇప్పటికీ అలముత్ కోట శిథిలాలు కనిపిస్తాయి

‘హషాషిన్’ అనే గుర్తింపు ఎందుకు వచ్చింది?

హసన్-ఎ-సబా చేసిన ఉద్యమం ప్రజాదరణ పొందలేదని, అది సామూహిక ఉద్యమం కాదని ఆయన అన్నారు. కానీ, మతం పేరుతో చేసిన ప్రణాళికాబద్ధమైన, తెలివైన ప్రచారమని ఆయన చెప్పారు.

ఈ తిరుగుబాటు సైన్యం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ముస్లిం గ్రంథాలు, సాహిత్యంలో ఈ సైన్యం సభ్యులను 'ఫిదాయీన్' అనే పేరుతో వర్ణించారు. 'ఫిదాయీన్' అంటే ఆత్మత్యాగం. హషీష్ (ఒక రకమైన మందు) తీసుకునే వ్యక్తులను హషాషిన్‌ అని పిలుస్తారు.

వారికి హషాషిన్లుగా ఎందుకు గుర్తింపు వచ్చింది అనే అంశం గురించి గుటెరిజ్ వివరించారు.

‘‘హసన్-ఎ-సబా తన తిరుగుబాటు సైన్యానికి శిక్షణ ఇస్తున్నప్పుడు స్వర్గం గురించి చెప్పేవాడు. ఆ తర్వాత వారికి మత్తు కలిగించే ఆకులను ఆహారం, పానీయం లేదా ఏదో ఒక రూపంలో వారి శరీరంలోకి పంపించేవారు. ఆ తర్వాత వారికి ఎవర్ని చంపాలో ఆదేశించేవారు అని నమ్ముతారు’’ అని గుటిరెజ్ చెప్పారు.

కానీ, ఈ కథను గొంజాలెజ్ నమ్మలేదు. ఇదంతా కట్టుకథ అని ఆయన భావిస్తారు. ఆ శాఖ సైనికులు అనుసరించిన వ్యూహాలపై అవగాహన లేకపోవడంతోపాటు, వారిని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కథలు పుట్టుకొచ్చాయని ఆయన అన్నారు.

నల్లమందు లేదా గంజాయి తాగిన ఎవరైనా మైకంలో ఒకరిని చంపడం గురించి ఆలోచించలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

'హషాషిన్' లేదా 'హస్సాసిన్' అనే పదాన్ని 'రాడికలిస్ట్' అనే అర్థంలో కూడా వాడొచ్చని ఆయన అన్నారు.

బుక్ ఆఫ్ వండరర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెనిస్ యాత్రికుడు మార్కోపోలో

పేద రైతుల పిల్లలను కొని సైన్యంలోకి..

పేద రైతుల పిల్లలను కొనుగోలు చేయడం లేదా కిడ్నాప్ చేయడం ద్వారా వారు తమ సైన్యంలో పిల్లల్ని చేర్చుకునేవారు.

సైన్యంలో చేరిన తర్వాత వారికి యుద్ధం, పోరాట కళల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు పని చేయాల్సిన ప్రదేశంలోని భాష, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలపై కూడా శిక్షణ ఇచ్చేవారు.

"వారు ప్రజల్లో కలిసిపోయే యోధులు. అందుకే వారిని గుర్తించడం కష్టం" అని గొంజాలెజ్ అన్నారు.

గుటిరెజ్ డి టెరాన్ ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.

ఈ యోధుల గురించి గుటిరెజ్ వివరిస్తూ, “ప్రవర్తన ప్రకారం చూస్తే వారు చాలా గొప్పవారు, జ్ఞానవంతులు, సంస్కారవంతులుగా కనిపించారు. వారు దాడి చేయబోయే ప్రాంతంలోని స్థానిక ఆచారాలు, అలవాట్లను వారు తెలుసుకోవాలి. వారి జ్ఞానం, సామర్థ్యం, నేర్పు, హత్యలు చేసే తీరు కారణంగా ప్రజలు వారిని చూసి భయపడేవారు. ఈ విధంగా వారి వర్గం బాగా ప్రసిద్ధి చెందింది’’ అని అన్నారు.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హసన్-ఎ-సబా స్థాపించిన శాఖలోని సభ్యుడొకరు చంపేందుకు ప్రయత్నించగా ఇంగ్లండ్ రాజు ఎడ్వర్డ్ 1 తృటిలో తప్పించుకున్నారు.

గొంజాలెజ్: ‘చరిత్రలో తొలి ఉగ్రవాదులు వీరే’

14వ శతాబ్దపు చరిత్రకారుడు బెర్నార్డ్ లూయిస్ తన పుస్తకం 'ది అసాసిన్: రాడికల్ సెక్ట్ ఆఫ్ ఇస్లాం'లో ఇలా వ్రాశారు. ‘‘ఈ హంతకులకు భయం లేదు. వారిది రక్త దాహం. డబ్బు కోసం కోసం అమాయకులను చంపేస్తున్నారు. వారిని శపించండి. వారి నుంచి దూరంగా పారిపోండి. వారికి చావు, ముక్తి గురించి ఎలాంటి భయం లేదు.

వారు దేవదూతల రూపంలో వచ్చిన దయ్యాలు అని నాకు బ్రాడ్కస్ అనే పూజారి చెప్పారు. వారు అనేక భాషలు మాట్లాడగలరు. వివిధ రకాల దుస్తులు ధరించగలరు, వివిధ ప్రాంతాల ఆచారాలను పాటించగలరు. గొర్రెల రూపంలో ఉన్న తోడేళ్ళు వాళ్లు. వారిని గుర్తు పట్టిన వాళ్లను చంపేస్తారు’’ అని పుస్తకంలో రాశారు.

ప్రపంచ చరిత్రలో వీరే తొలి ఉగ్రవాదులు అని గొంజాలెజ్ చెప్పారు.

‘‘ఎందుకంటే వారు అనేక పనుల్ని రాత్రిపూట కాకుండా పట్టపగలు, బహిరంగ ప్రదేశాల్లో చేశారు. ప్రజల మనస్సుల్లో భయాన్ని కలిగించడమే వారి లక్ష్యం. ఏదైనా ఒక ప్రాంతంలోని పాలకుడు తన అంగరక్షకులతో మార్కెట్‌కి వెళితే, ఎక్కడి నుండో ఒక హసాసిన్ వచ్చి, తన కత్తి తీసి, అందరి ముందు ఆ పాలకుడి గొంతు కోసి చంపేస్తాడు. తాము సజీవంగా బయటపడతామా, లేదా అనేది వారు ఆలోచించరు’’ అని గొంజాలెజ్ వివరించారు.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శత్రువుల ప్రాంతంలోకి చొచ్చుకెళ్లే అస్సాసిన్ల నైపుణ్యాలు, సామర్థ్యాలను జపాన్ నింజాలతో పోల్చుతారు

ఆ తోటలో ఏం జరిగేది?

ఈ హంతకులు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనుకడుగు వేయకపోవడానికి కారణం హసన్-ఎ-సబా ఇచ్చిన కఠిన మతపరమైన శిక్షణ.

అలముత్ కోటను ఇలాంటి మత బోధనల కోసం నిర్మించారని మార్కోపోలో తన పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘హసన్-ఎ-సబా రెండు పర్వతాల మధ్య లోయలో చాలా అందమైన తోటను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ పండ్ల చెట్లను అక్కడ నాటారు. తోట మధ్యలో ఒక ఫౌంటెన్ ఉండేది. దానికి అమర్చిన వివిధ పైప్‌ల నుంచి వైన్, పాలు, తేనె, నీరు వచ్చేవి.

ప్రపంచంలోని అందగత్తెలను అక్కడికి తీసుకొచ్చేవారు. వారికి అన్ని రకాల వాయిద్యాలను వాయించడం, మధురంగా పాడటం తెలుసు. సైనికులు ఇదే స్వర్గం అని భావించేలా హసన్-ఎ-సబా నమ్మించాడు’’ అని ఆ పుస్తకంలో రాశారు.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంగోలులు ధ్వంసం చేసేంత వరకు అలముత్ కోట నిజారీ నియంత్రణలోనే ఉంది

హంతకునిగా మారడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి తప్ప మరెవరూ ఈ తోటలోకి ప్రవేశించలేరు అని మార్కోపోలో పుస్తకంలో ప్రస్తావించారు.

తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్న సైనికులు అన్ని రకాల ఆనందాలను అనుభవించేలా ఈ తోటను హసన్ సిద్ధం చేశారని మార్కోపోలో రాశారు.

ఎవర్నైనా చంపాల్సి వచ్చినప్పుడు ఈ సైనికుల్లో ఒకర్ని ఎంపిక చేసి అతనికి డ్రగ్స్ ఇచ్చేవారు. మత్తులోకి చేరిన తర్వాత అతన్ని తోట నుంచి బయటకు తీసుకొచ్చి, ‘స్వర్గానికి’ తిరిగి రావాలనుకొంటే ఈ పని పూర్తిచేయాలని చెప్పేవారు.

అస్సాసిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెరుసలెంను జయించిన సుల్తాన్ సలాదిన్‌ను నిజారీలు లక్ష్యంగా చేసుకున్నారు

తుద ముట్టించిన మంగోలులు

నిజారీ పాలన దాదాపు 166 ఏళ్లు సాగింది. మంగోలులు వారిని తుదముట్టించారు.

"మంగోలులు చాలా భయంకరులు. క్రూసేడర్ల సంఖ్య కంటే మంగోలుల సంఖ్య వందల రెట్లు ఎక్కువ. వీళ్లు మరింత క్రూరులు. వారితో సంధి చేసుకునేందుకు నిజారీలు ప్రయత్నించారు, కానీ వారు విజయవంతం కాలేదు” అని గుటిరెజ్ డి టెరాన్ చెప్పారు.

చెంఘిజ్ ఖాన్ మనువడు హులగు ఖాన్, దుర్భేద్యమైన అలముత్ కోటలోకి ప్రవేశించి దాన్ని నేలకూల్చాడు. కొన్ని కథనాల ప్రకారం, తన మేనమామల్లో ఒకర్ని నిజారీలు చంపినట్లు హులగు ఖాన్ నమ్మారు.

కానీ, ఇదంతా జరగకముందే నిజారీల చేతుల్లో చాలా మంది ముస్లింలు, క్రైస్తవ పెద్దలు, పూజారులు, ఉమ్రా-చీఫ్‌లను చంపారు.

నిజారీలకు లక్ష్యంగా మారి, వారి నుంచి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి సుల్తాన్ సలాదిన్. 12వ శతాబ్దంలో ముస్లింల కోసం జెరూసలెంను జయించిన వ్యక్తిగా ఇస్లాం ప్రముఖుల్లో సుల్తాన్‌కు చోటు దక్కింది.

“సుల్తాన్ సలాదిన్‌ను చంపేందుకు సైనికుల్లా మారువేషంలో హసాసిన్లు అతని గుడారంలోకి ప్రవేశించారు. కానీ, వారి నుంచి అతను తప్పించుకున్నారు’’ అని గుటిరెజ్ చెప్పారు.

1272లో ఇంగ్లండ్ రాజు ఎడ్వర్డ్ I కూడా నిజారీ ఫిదాయీన్ బారి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తొమ్మిదో క్రూసేడ్‌లో ఎడ్వర్డ్ పాల్గొన్నారు.

ఆ తర్వాత కాలక్రమంలో నిజారీలకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని ఎవరినైనా చంపేస్తారనే పేరు వచ్చింది. డబ్బు తీసుకొని ముస్లింలు, క్రైస్తవుల కోసం వారు పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)