జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ వ్యాప్తి తగ్గిపోయిందనుకున్నా ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇది మళ్లీ తెరపైకి వస్తోంది.
సింగపూర్, అమెరికా, చైనాలలో కొత్త సబ్‌వేరియంట్ జేఎన్1 కేసులు పెరుగుతున్నాయి.
తాజాగా కేరళలో వెలుగుచూపిన జేఎన్1 వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక జారీచేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది.
జేఎన్1 సోకితే లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ప్రమాదకరమా? దీనిని ఎదుర్కోవడంలో ఇప్పటికే ఉన్న వ్యాక్సీన్లు పనిచేస్తాయా?

ఫొటో సోర్స్, ANI
జేఎన్1: లక్షణాలు, జాగ్రత్తలు
జేఎన్1 లక్షణాల గురించి తిరుపతికి చెందిన పల్మనాలజిస్ట్ సి. భాస్కరబాబు బీబీసీతో మాట్లాడుతూ- ఇది సోకినవారికి జలుబు తీవ్రంగా ఉంటుందన్నారు. విపరీతమైన దగ్గు, ఆయాసం వస్తుందని చెప్పారు. జ్వరంతో ఈ లక్షణాలు మొదలవుతాయన్నారు. పిల్లికూతలు కూడా వస్తాయని తెలిపారు. న్యుమోనియా తరహా లక్షణాలకు దగ్గరగా తీసుకువెళుతుందని, కానీ ఆ దశకు చేరుకోకపోవచ్చని చెప్పారు.
ఈ లక్షణాలు పూర్తిగా తగ్గడానికి రెండు నుంచి మూడువారాలు పడుతుందని ఆయన తెలిపారు. డాక్టర్లు సూచించిన యాంటిబయాటిక్స్ వాడాలని చెప్పారు. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడం ద్వారా త్వరగా దీని నుంచి కోలుకోవచ్చన్నారు.
ఇది కోవిడ్ 19 సెకండ్ వేవ్ అంత ప్రమాదకరం కాదని, కొన్ని జాగ్రత్తలతో జేఎన్1 బారిన పడకుండా ఉండొచ్చని డాక్టర్ భాస్కరబాబు సూచించారు. దీని గురించి కంగారుపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఎదుర్కోవచ్చని ఆయన చెప్పారు.
‘‘ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్క్ ధరించాలి. ప్రజలందరూ మాస్కులు ధరించడం ద్వారా దీని బారినపడకుండా ఉండవచ్చు. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. చల్లటి పదార్థాలు తినకూడదు. సిగరెట్లు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. దగ్గేటప్పుడు కచ్చితంగా చేతినికానీ, చేతి రుమాలునుకానీ అడ్డుపెట్టుకోవాలి’’ అని సూచించారు.
ఒకవేళ జేఎన్1 సోకినట్టు గుర్తిస్తే మొదట నాలుగైదు రోజులు వైద్యులు సూచించిన విధంగా మందులు వాడటంతోపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ భాస్కరబాబు చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌లో పరిస్థితేంటి?
కోవిడ్ జేఎన్1 రకాన్ని కేరళలో 79 ఏళ్ళ వృద్ధురాలిలో కనుగొన్నారు. అయితే ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గోవా నుంచి సేకరించిన నమూనాలలో జేఎన్1 వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
కేరళలో ఈ కొత్తవేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో 115 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్ తెలిపింది. కర్ణాటకలో 10 కేసులు నమోదయ్యాని పేర్కొంది. కర్ణాటకలో ఒకరు చనిపోయినట్టు చెప్పింది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కిందటి రోజుతో పోల్చుకుంటే మొత్తం 142కు పెరిగిందని, డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 145గా ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలన్న కేంద్రం
జేఎన్1 సోకినప్పుడు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా దీనిని కనిపెట్టవచ్చని రాష్ట్రాలకు జారీచేసిన అడ్వైజరీలో పేర్కొంది. గతంలో జారీచేసిన కోవిడ్ 19 మార్గదర్శకాలనే అమలు చేయాలని కోరింది.
ముఖ్యంగా ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలని కోరింది. కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలని కోరింది.
ఇక జిల్లాల వారీగా కేసుల తీవ్రతపై దృష్టిసారించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించాలని చెప్పింది.
జిల్లాల వారీగా ఆస్పత్రులకు వచ్చే ఐఎల్‌ఐ (ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్), సారి (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్) రోగులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది.
ఈ వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాలని, కేసుల పెరుగుదలను తొలి దశలోనే గమనించాలని చెప్పింది.
కోవిడ్-19 పరీక్ష మార్గదర్శకాల ప్రకారం.. అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలి. అందులో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం ఆర్‌టీపీసీఆర్, యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది.
వరుసగా పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
జేఎన్1ను ఎదుర్కోవడానికి కోవిడ్‌కు అనుమతించిన అన్నిరకాల టీకాలు వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సింగపూర్‌లో వారంలోనే 20 వేలకు పైగా కేసులు
సింగపూర్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ ఒకప్రకటన విడుదల చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది.
డిసెంబరు 3 నుంచి 9వ తేదీ మధ్యన 56,043 కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇది అంతకుముందు వారం నమోదైన 32,035 కేసుల కన్నా 24,008 కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
సింగపూర్‌లో ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువైనట్టు తెలిపింది. గత వారం 225 మంది ఆస్పత్రిలో చేరితే తాజా వారంలో ఈ సంఖ్య 350కు పెరిగిందని పేర్కొంది.
కోవిడ్ 19 వాక్సిన్ తీసుకున్నవారి కంటే తీసుకోనివారే ఎక్కువగా ఆస్పత్రులలో చేరుతున్నట్టు గమనించామని సింగపూర్ ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
- పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















