చైనా: గన్సు ప్రావిన్సులో భూకంపం,100 మందికి పైగా మృతి, 220 మందికి గాయాలు

చైనాలోని గన్సు ప్రావిన్సులో భూకంపం

ఫొటో సోర్స్, CCTV

    • రచయిత, క్రిస్టీ కూనీ
    • హోదా, బీబీసీ న్యూస్

చైనాలో సోమవారం సంభవించిన భూకంపం కారణంగా 111 మంది చనిపోయినట్లు, 220 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

గన్సు ప్రావిన్సులో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు భూకంపం రావడంతో ఆ ప్రాంతంలోని భవనాలతో పాటు పొరుగునే ఉన్న కింగై ప్రావిన్సులోని భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి.

భూకంప తీవ్రత 5.9 ఉన్నట్లు, భూమిలో 10 కి.మీ లోతున ఇది వాటిల్లినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) చెప్పింది.

మంగళవారం ఉదయం నుంచి సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

భూకంప శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటంలో, వెతకడంలో, గాయపడిన వారికి సరైన సమయంలో చికిత్స అందించడానికి, వీలైనంత తక్కువగా ప్రాణ నష్టం ఉండేలా చూడటానికి అన్ని రకాలుగా ప్రయత్నించాలని అధికారులను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించారు.

వీడియో క్యాప్షన్, తుర్కియే భూకంపంలో కనిపించని వారి కోసం బంధువుల గాలింపు

స్థానిక అత్యవసర సేవల సిబ్బందికి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయక బృందాలను పంపింది.

గన్సులో 100 మంది చనిపోయారని, 96 మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా జిన్హువా తెలిపింది. కింగైలో మృతుల సంఖ్య 11కు పైగా ఉందని, 124 మందికి గాయాలయ్యాయని వెల్లడించింది.

కూలిపోయిన భవనాల కింద, పాక్షికంగా పైకప్పులు కూలిన గదుల్లోని శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నట్లు అక్కడి ఫుటేజీలోని చిత్రాలు చూపిస్తున్నాయి.

రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

యూరేషియన్, ఇండియన్, పసిఫిక్ ఫలకాలు కలిసే చోట చైనా రీజియన్ ఉంటుంది. ఇది ప్రధానంగా భూకంప ప్రభావిత ప్రాంతం.

నిరుటి సెప్టెంబర్‌లో సిచువాన్‌ ప్రావిన్సులో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 60 మందికి పైగా మృతి చెందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)