అఫ్గానిస్తాన్‌లో పెను భూకంపం... 200 మందికి పైగా మృతి, వేల మందికి గాయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాచెల్ రసెల్
- హోదా, బీబీసీ న్యూస్
అఫ్గానిస్తాన్‌లో శనివారం సంభవించిన శక్తిమంతమైన భూకంపం కారణంగా 1,000 మందికి పైగా గాయపడ్డారు. 200 మందికి పైగా చనిపోయినట్లు స్థానిక వైద్య వర్గాలు తెలిపాయి.
ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని పశ్చిమ అఫ్గానిస్తాన్‌లో భూకంపం వచ్చింది.
స్థానిక కాలమానం ప్రకారం 11:00 గంటలకు హెరాత్ నగరానికి 40 కి.మీ దూరంలో 6.3 తీవత్రతో భూకంపం రావడంతో చాలా భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయారు.
మూడుసార్లు భూమి బలంగా కంపించినట్లు స్థానికులు చెప్పారు.
కార్యాలయ భవనాలు మొదట కంపించి, తర్వాత తమ చుట్టూ పడిపోయినట్లు భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు తెలిపారు.
‘‘మేం ఆఫీసుల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా బిల్డింగ్ ఊగడం మొదలైంది. ముందు గోడ ప్లాస్టర్ పడిపోయింది. తర్వాత గోడల్లో పగుళ్లు వచ్చాయి. కొన్ని గోడలతో పాటు ఆఫీస్ భవనం పాక్షికంగా కూలిపోయింది’’ అని వార్తా ఏజెన్సీ ఏఎఫ్‌పీతో హెరాత్ నివాసి బషీర్ అహ్మద్ చెప్పారు.
‘‘నా కుటుంబాన్ని సంప్రదించలేకపోతున్నా. ఫోన్ నెట్‌వర్క్ రావట్లేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇది చాలా భయంకరమైన భూకంపం’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు 1000 మందికి పైగా గాయపడినట్లు తమ రికార్డుల్లో నమోదైందని రిపోర్టర్లతో స్థానిక విపత్తు నిర్వహణ చీఫ్ మోసా అషారీ చెప్పారు.
‘‘గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. వెయ్యి మందికి పైగా గాయపడినట్లు, 120 మంది చనిపోయినట్లు మా రికార్డుల్లో నమోదు అయింది’’ అని ఆయన వెల్లడించారు.
భూకంపంలో మృతుల సంఖ్య 15 అని నిర్ధారిస్తూ ప్రాథమిక నివేదికలు వచ్చాయి.
అయితే, ఒక్కసారి విధ్వంసం స్థాయిని పూర్తిస్థాయిలో ఎమర్జెన్సీ వర్కర్లు నిర్ధరించిన తర్వాత మృతుల సంఖ్య ఎల్లప్పుడూ పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం మృతుల సంఖ్య 300 కంటే ఎక్కువ ఉందని అనధికారిక నివేదికల చెబుతున్నాయి.
హెరాత్ సెంట్రల్ ఆసుపత్రిలోని దృశ్యాలకు సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియోలో... ఆసుపత్రి ప్రధాన భవనం బయట ఉన్న టార్మాక్ మీద అనేక మంది పోర్టబుల్ ఇంట్రావీనస్ డ్రిప్స్‌తో చికిత్స తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
హెరాత్ ఇంజిల్ జిల్లాలో భూకంప విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకువచ్చాయి.
ధ్వంసమైన భవనాల శిథిలాలతో రహదారులు మూత పడినట్లు వాటిలో కనిపిస్తుంది. ఇది సహాయక ప్రయత్నాలకు ఆటంకంగా మారుతుంది.
‘‘పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు’’ అని వార్తాసంస్థ ఏఎఫ్‌పీతో విద్యార్థి ఇద్రీస్ అర్సాలా చెప్పారు.
భూకంపం మొదలైన తర్వాత తరగతి నుంచి సురక్షితంగా బయటపడిన చివరి వ్యక్తి అతను.
హెరాత్‌ను అఫ్గానిస్తాన్ సాంస్కృతిక రాజధానిగా పరిగణిస్తారు. ఇది ఇరాన్ సరిహద్దుకు తూర్పున 120 కి.మీ దూరంలో ఉంటుంది. 2019 వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం, ఈ ప్రావిన్సులో 19 లక్షల మంది నివసిస్తున్నట్లు అంచనా.
అఫ్గానిస్తాన్ తరచుగా భూకంపాల బారిన పడుతుంది. ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో తరచుగా సంభవిస్తాయి. యురేషియా, ఇండియన్ టెక్టోనిక్ ఫలకాల జంక్షన్‌కు ఇవి సమీపంగా ఉండటమే కారణం.
నిరుడు జూన్‌లో పక్టికా ప్రావిన్సులో 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 1,000 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా: ఐరన్ డోమ్ అంటే ఏమిటి.. ఇది ఉంటే శత్రు దాడుల నుంచి ప్రజల ప్రాణాలను 100 శాతం కాపాడొచ్చా
- ఇజ్రాయెల్‌పై 20 నిమిషాల్లో 5,000 రాకెట్లతో హమాస్ దాడి
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ఒక్కరోజులో గుండె ఆరుసార్లు ఆగిపోయింది, అయినా ఎలా బతికాడంటే..
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















