Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం - 1,000మందికి పైగా మృతి, 1500 మందికి గాయాలు

ఫొటో సోర్స్, EPA
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం వచ్చింది. కనీసం 1,000 మంది మరణించినట్లు పక్తికా ప్రావిన్స్ సమాచార శాఖ అధికారి మొహమ్మద్ అమీన్ హజీఫీ వెల్లడించారు. సుమారు 1500మంది గాయపడినట్లు ఆయన చెప్పారు.
అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
మారుమూల ప్రాంతాలలోకి హెలీకాప్టర్లు వెళ్లి బాధితులను ఆసుపత్రులకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి.
మరణాల సంఖ్య పెరగొచ్చని అంతకు ముందే స్థానిక అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. వందల ఇళ్లు కూలిపోయాయని, మృతుల సంఖ్య పెరగొచ్చని తాలిబన్ నేత హిబతుల్లా అఖుండ్‌జాదా అన్నారు.
గత రెండు దశాబ్దాల్లో ఇది అత్యంత ఘోరమైన భూకంపమని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిప్యూటీ మినిస్టర్ షరాఫుద్దీన్ ముస్లిం అన్నారు.
‘‘ఏ వీధిలోకి వెళ్లినా భూకంప బాధితులు ఏడుస్తూ కనిపిస్తున్నారు. చాలా ఇళ్లు కూలిపోయాయి’’ అని పక్తికా ప్రావిన్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టు ఒకరు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
అఫ్గానిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో ఉండే ఖోస్త్ నగరానికి 44 కిలోమీట్ల దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉంది.
భూకంప కేంద్రం నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రకంపనలు వచ్చాయి. పాకిస్తాన్, భారత్, అఫ్గానిస్తాన్ దేశాలలోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు నమోదయ్యాయి.
500 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించిదని యూరోపియన్ మెడిటేరియన్ సెస్మోలాజికల్ సెంటర్ తెలిపినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, AFGHAN GOVERNMENT NEWS AGENCY
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌తో పాటు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
శిథిలాలలో చిక్కుకున్నవారి ఫొటోలు, వీడియోలు పెద్దసంఖ్యలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
'పక్తికా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో రాత్రి భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో వందల మంది మా దేశ పౌరులు చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి.' అని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి బిలాల్ కరీమీ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, @ALHAM24992157
భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ బృందాలను పంపించాలని బిలాల్ అంతర్జాతీయ ఏజెన్సీలను కోరారు.
కాగా అఫ్గానిస్తాన్‌లో వేకువజామున ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
భూఉపరితలం నుంచి 51 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు ఈ సంస్థ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- క్లర్క్ నుంచి రాష్ట్రపతి పదవికి పోటీ వరకు.. గిరిజన నేత ప్రస్థానం
- ఆంధ్రప్రదేశ్: తెలుగు మీడియం తెరమరుగు, 175 ఏళ్ల ఇంగ్లిష్ కల సాకారం కానుందా
- ఆంధ్రప్రదేశ్: డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మూడేళ్లుగా ఎందుకు ఆగిపోయింది? రైతులకు ప్రభుత్వ సమాధానం ఏంటి?
- సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?
- తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













