బిగ్ బాస్ 7: పోటీదారులకు లక్షల మంది అభిమానులు ఎలా పుట్టుకొస్తున్నారు? రోడ్లపై ఈ విధ్వంసానికి కారణం ఏమిటి?

ఫొటో సోర్స్, Stra Maa/BiggBoss/UGC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిగ్ బాస్ పోటీదారులకు అకస్మాత్తుగా లక్షల మంది అభిమానులు ఎలా పుట్టుకొస్తున్నారు? అది కూడా రోడ్లపైనే విధ్వంసం సృష్టించే స్థాయికి పరిస్థితులు ఎలా దిగజారుతున్నాయి?
ఇదంతా స్వచ్ఛందంగా జరుగుతోందా? లేక దాని వెనుక మార్కెటింగ్ సృష్టి ఉందా?
ఆదివారం బిగ్ బాస్ ఫలితం ప్రకటించిన తరువాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆ స్టూడియో ఉన్న ప్రాంతంలో వేల మంది అభిమానులు గుమిగూడారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు సమస్యగా మారింది.
వచ్చిన అభిమానులు కేవలం ఒక వ్యక్తిని చూసి చేతులూపి వెళ్లిపోతే వేరు. కానీ ఆ బిగ్ బాస్ పోటీదార్ల అభిమానుల మధ్య పరస్పర వ్యతిరేక నినాదాలు, ఇతర పోటీదార్ల కార్ల మీద దాడుల వరకూ వ్యవహారం వెళ్లింది.

ఫొటో సోర్స్, UGC
ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ అక్కడ అభిమానులుగా చెబుతున్న వారితో మాట్లాడకుండా ఆయన్ను త్వరగా పంపడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. పోలీసులు తొందరగా వెళ్లమంటే, ‘‘రైతు బిడ్డకు ఇదేనా గౌరవం’’ అంటూ మాట్లాడారు ప్రశాంత్.
స్వయంగా ఆ స్టూడియో ఉన్న ప్రాంత డీసీపీ అంటే జిల్లా ఎస్పీ స్థాయి అధికారికీ, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కీ మధ్య సంభాషణ ఇదీ..
డీసీపీ: నీ వల్లే ఇష్యూ అవుతోంది. నీ వల్లే ఇదంతా జరుగుతోంది.
ప్రశాంత్: నా తప్పా, సర్. ఒక రైతు బిడ్డ గెలిచిండు. నేను ఒక్క మాట మాట్లాడలేదు, సర్.
డీసీపీ: ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ప్రశాంత్: నేను మాట్లాడవద్దా? మాట్లాడే అధికారం లేదా?
మరో పోలీస్ అధికారి: ఎక్కడైనా షో చేసుకో. కానీ ముందు వెళ్లు ఇక్కడ నుంచి..
ప్రశాంత్: నేనేం తప్పు మాట్లాడలేదు. షో చేయలేదు.
డీసీపీ: ఇది కరెక్టు కాదు.
మరో పోలీస్ అధికారి: రాళ్లు పడుతున్నాయి. ముందు కారు అద్దాలు ఎత్తు.
అయినా ప్రశాంత్ వాహనం ముందుకు చాలా నెమ్మదిగానే వెళ్తోంది. మరోవైపు అభిమానులు వస్తుంటే వారికి కారులో నుంచే చేయి చాపారు ప్రశాంత్. ప్రశాంత్‌కు హ్యాండ్‌షేక్ ఇవ్వబోయి జనంలో చిక్కుకున్న అమ్మాయి గట్టిగా అరిచారు. ఆలోపు పోలీసులు మళ్లీ కారు దగ్గరకు వచ్చారు. అప్పుడు జరిగిన సంభాషణ ఇది.
డీసీపీ: అరె.. ప్లీజ్ డోంట్ మేక్ ఇష్యూ.
డీసీపీ: డ్రైవర్ వెళ్లు.
ప్రశాంత్: నేను ఇంటికే పోతున్నా, సర్.
డీసీపీ: డ్రైవర్.. ప్రాణాలు పోతాయి చెప్తున్న. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, చెప్తున్నా.
ప్రశాంత్: రైతు బిడ్డకు ఇంత విలువ ఇవ్వడం లేదు..
మరో పోలీస్ అధికారి: నువ్వు పో, స్వామీ.
ఈ సంభాషణ తరువాత పల్లవి ప్రశాంత్ కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ఆ ఘటనకు ముందు, తరువాత కూడా అక్కడ చాలా అలజడి జరిగింది.
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ప్రశాంత్‌తోపాటు ఉన్న అమర్‌దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.
ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా అభిమానులు దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు.
మొత్తం రెండు కేసులు పెట్టగా ఒక దాంట్లో పల్లవి ప్రశాంత్ పేరు కూడా చేర్చారు. ‘‘అభిమానులను పిలవద్దన్నప్పటికీ వారిని గుమిగూడేలా చేసినందుకు’’ ఆయనపై కేసు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు ప్రశాంత్ మీద నమోదు అయింది. అది నాన్ బెయిలబుల్ కేసు.

ఫొటో సోర్స్, UGC
అభిమానం పేరుతో పిచ్చిచేష్టలు మంచిది కాదన్న సజ్జనార్
ఆర్టీసీ బస్సులపై బిగ్ బాస్ అభిమానులు దాడి చేయడంపై ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఇదేం అభిమానం’’ అంటూ ప్రశ్నించారు.
‘‘దాడిలో 6 బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి పనుల విషయంలో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని సజ్జనార్ అన్నారు.
ఈ ఘటనపై పోలీసు అధికారులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఫొటో సోర్స్, Stra Maa/BiggBoss
బిగ్ బాస్‌ను నిషేధించాలన్న నారాయణ
ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఏంటి? ఏళ్ల తరబడి సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్ద నటుల తరహా క్రేజ్ బిగ్ బాస్ స్టార్లకు అకస్మాత్తుగా రావడం అనేది సహజంగానే జరుగుతోందా? యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫాలోయర్లే నిజంగా వస్తున్నారా లేకపోతే ఇది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీయా అన్న చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ పోటీదారుల అభిమానుల మధ్య ‘పోరాటాలు’ గతంలోనూ జరిగాయి. ఈ రియాలిటీ షోలో గెలుపు ఓటములకు ప్రేక్షకుల ఓట్లు కీలకం కావడం దీనికి ఒక కారణంగా కనిపిస్తోంది.
కౌశిక్ అనే నటుడుకు సంబంధించి అప్పట్లో కౌశిక్ ఆర్మీ అనే ఒక బృందం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు ఇతర పోటీదారులను ట్రోల్ చేసి విమర్శలు ఎదుర్కొంది. ప్రముఖ హ్యూమనిస్టు గోగినేని బాబు అప్పట్లో కౌశిక్ ఆర్మీపై నిరంతరం విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే అప్పట్లో ఇలా భౌతిక దాడుల వరకూ వెళ్లలేదు.
తాజా గొడవలో పల్లవి ప్రశాంత్, ‘రైతు బిడ్డ’ అనే మాటను తనకు అనుకూలంగా ఎక్కువగానే వాడారు. ‘‘ప్రశాంత్ రైతు బిడ్డ అనే ట్యాగ్‌ను చాలా విస్తృతంగా వాడుతున్నారు’’ అని తోటి పోటీదారు అమర్ దీప్ వ్యాఖ్యానించారు కూడా.
సోషల్ మీడియా స్టార్లకు ఇంత మంది ఫాన్స్ పుట్టుకు రావడం పట్ల మాత్రం పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిగ్ బాస్‌నే బ్యాన్ చేయాలని సీపీఐ సీనియర్ నాయకుడు కె.నారాయణ డిమాండ్ చేశారు. ఆయన ముందు నుంచీ బిగ్ బాస్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు.
‘‘ఆ షో ఆపేయాలి. దానికి అనుమతి ఇవ్వడమే సరికాదు. ఆర్టీసీ బస్సులు పగలగొట్టినందుకు కాదు.. అసలు మొత్తం షోనే ఉండకూడదు. నేను పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేస్తే కోర్టుకు వెళ్లమన్నారు. గ్రామీణ ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రశాంత్ అనే అబ్బాయికి ప్రైజ్ ఇచ్చారు’’ అని నారాయణ అభిప్రాయపడ్డారు.
బాధ్యులు ఎవరు?
ఇలాంటి ఘటనలు జరగకుండా నిర్వాహకులకు కఠిన నిబంధనలు పెట్టాలని సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ మురళీధర్ బీబీసీతో అన్నారు.
బిగ్ బాస్ యాజమాన్యానికీ దీనికి సంబంధం ఉండదని మరికొందరు సీనియర్ జర్నలిస్టులు అన్నారు.
‘‘వాస్తవానికి బిగ్ బాస్ ఒక మంచి వేదికను కల్పిస్తోంది. ఈ సీజన్ బాగా నడిచింది. ఉల్టా పల్టా వంటి వాటితో మంచి ఎమోషన్స్ పండాయి. చిన్న తెరపై అద్భుతమైన ఎమోషన్స్ పండించిన వేదికగా బిగ్ బాస్ నిలిచింది. బిగ్ బాస్ ప్రోగ్రాంను కొందరు విమర్శించినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను.. తెరపై ఎమోషన్స్ పండించడంలో ఈ షో, ముఖ్యంగా ఈ సీజన్ ప్రత్యేకంగా, విభిన్నంగా నిలిచింది. బయటి వారు చేసిన దానికి కార్యక్రమ నిర్వాహకులు బాధ్యులు కారు’’ అని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ప్రభు అభిప్రాయపడ్డారు.
‘‘బిగ్ బాస్ వల్ల చాలా మంది తలరాత మారుతుంది. ఇందులో గెలిస్తే ఎన్నో అవకాశాలు, విదేశీ ప్రోగ్రాముల చాన్సులు వస్తున్నాయి. అందుకోసం బిగ్ బాస్ పోటీదార్లు తమను తాము బాగా మార్కెట్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో స్వచ్ఛందంగా వారిని చూడ్డానికి వచ్చే వారు వందల్లో ఉంటే, తాము మొబిలైజ్ చేసి తీసుకువచ్చే వారు ఎక్కువ ఉంటున్నారు. ఇలా మొబిలైజ్ చేసి తీసుకువచ్చే వారితోనే గొడవలు జరుగుతున్నాయి. మా వాడికే.. ఫలానా వాడికే ప్రైజ్ ఇవ్వండి అంటూ డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. అలా ప్రైజ్ రాని వారి అభిమానులు ఆరోపణలు చేస్తూ గొడవలకు దిగుతున్నారు’’ అని ఆయన చెప్పారు.
‘కఠిన నిబంధనలు విధించాలి’
ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా నిర్వాహకులకు కఠిన నిబంధనలు విధించాలని మురళీధర్ అన్నారు.
‘‘ప్రస్తుతం విధ్వంసం ఆస్తుల వరకే ఆగింది. మనుషులకు ఏమైనా జరిగితే? – ఇలాంటివి జరగకుండా నిర్వాహకులకు కఠిన నిబంధనలు విధించాలి. గతంలో ఎన్టీఆర్ హయాంలో గొడవలు అయినప్పటి నుంచీ సినిమా ఈవెంట్ల పర్మిషన్లకు సెక్యూరిటీ డిపాజిట్లు భారీగా పెడుతున్నారు. దానివల్ల ఈవెంట్ మేనేజర్ బాధ్యత తీసుకుని ఇటువంటి గొడవలు జరగకుండా చూస్తున్నారు. డిపాజిట్ భారీగా ఉంటే, అప్పుడు ఈవెంట్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తారు’’ అని మురళీధర్ చెప్పారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫాన్లుగా చెప్పుకుంటోన్న వారి ప్రవర్తనను తప్పు పడుతున్నారు పలువురు సినీ జర్నలిస్టులు.
‘‘ఇదొక ఉన్మాదంలా తయారయింది. ఎవర్నైనా, కుటుంబ సభ్యులు సహా బూతులు తిడుతున్నారు. దిగజారి ప్రవర్తిస్తున్నారు. అభిమానం వెర్రితలలు వేస్తోంది. పోలీసుల మాట కూడా వినలేదు. అభిమానులే కాదు. అందులో పోటీ పడ్డ వారిని బయటకు రావద్దు అన్నా.. వచ్చి ఈ గొడవలు రేగడానికి కారణం అయ్యారు’’ అని వ్యాఖ్యానించారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ప్రభు.
‘‘స్టార్ హీరోల విషయంలోనే ఇలాంటి కొట్లాటలు కాలేదు. థియేటర్ల దగ్గర గొడవలు అయినా అవి రోడ్లపైకి వెళ్ళి హింసాత్మకంగా మారలేదు. కానీ ఇక్కడ మాత్రం ఇదొక ఉన్మాదంలా అయింది. షో స్టార్ట్ అయ్యే నాటికి ఎవరో తెలియని వారు ఈ స్థాయికి వెళ్లి, బీభత్సం చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
- పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















