సిక్కు వేర్పాటువాద నేత పన్నూ హత్యకు కుట్ర: అమెరికా ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన మోదీ.. ఆయన ఏమన్నారు?

ఫొటో సోర్స్, PIB
సిక్కు వేర్పాటువాద నేత గురు పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత పౌరుడు యత్నించారన్న అమెరికా ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.
ఆధారాలను పరిశీలిస్తామని, అయితే, ఈ ఘటనను భారత్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టి చూడొద్దని ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు.
ఇటీవల నిఖిల్ గుప్తా అనే పేరుగల భారత పౌరుడు న్యూయార్క్‌లో ఉన్న పన్నూను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి రూ.83 లక్షలు సుపారీ ఇచ్చినట్లుగా అమెరికా ఆరోపించింది.
ఈ మేరకు అమెరికా న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన పత్రాల్లో, “నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఆదేశాలు అందాయి” అని పేర్కొంది.
దీనిపై భారత ప్రభుత్వం అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, విచారణ ప్రారంభించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది.

ఫొటో సోర్స్, Social Media
వేర్పాటువాద సంస్థలు హింసను ప్రేరేపిస్తున్నాయి: మోదీ
“ఒకవేళ మాకు ఎవరైనా సమాచారం ఇస్తే, దానిని తప్పకుండా పరిశీలిస్తాం. ఒకవేళ మా పౌరులెవరైనా మంచిపనులు చేసినా, లేదా తప్పు చేసినా సరే, వాటిని పరిశీలించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. చట్టాలను మేం గౌరవిస్తాం” అని మోదీ చెప్పారు.
‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే సంస్థ వ్యవస్థాపకుడు పన్నూ. ఈ సంస్థను భారత ప్రభుత్వం ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించింది.
వేర్పాటువాద సంస్థలు భారత్ వెలుపల చేపడుతున్న కార్యకాలాపాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు.
“స్వేచ్ఛ పేరుతో వేర్పాటువాద సంస్థలు హింసను ప్రేరేపిస్తున్నాయి” అన్నారు.
అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని తెలిపారు.
“కొన్ని సంఘటనలను ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరికాదు” అని ఆయన చెప్పారు.
నిఖిల్ గుప్తా ఎవరు?
అమెరికా న్యాయస్థానంలో దాఖలు చేసిన పత్రాల్లో నిఖిల్ గుప్తా వివరాలను పొందుపరిచారు.
నిఖిల్ గుప్తాపై గుజరాత్‌లో ఒక క్రిమినల్ కేసు ఉందని, అందులో నుంచి బయటపడేసేందుకు ఒక భారతీయ అధికారి సాయం చేస్తానని హామీ ఇచ్చారని, అందుకు బదులుగా న్యూయార్క్‌లో ఒకరి హత్యకు అతను అంగీకరించినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.
నేరారోపణల నేపథ్యంలో అమెరికా అభ్యర్థన మేరకు 2023 జూన్ 30న నిఖాల్ గుప్తాను చెక్ రిపబ్లిక్‌లో అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ గురు పత్వంత్ సింగ్ పన్ను?
గురు పత్వంత్ సింగ్ పన్నూ వృత్తిరీత్యా లాయర్. తొలుత పంజాబ్‌లోని నాథు చక్ గ్రామంలో నివాసం ఉండేవారు.
ఆ తరువాత పన్నూ కుటుంబం అమృత్‌సర్ సమీపంలోని ఖాన్‌కోట్‌కి మకాం మార్చింది. పన్నూ తండ్రి మహిందర్ సింగ్ పంజాబ్ మార్కెటింగ్ బోర్డు సెక్రటరీ.
పన్నూకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. ఆయన లూధియానాలో చదువుకున్నారు. 1990లలో పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా చేశారు. కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు పన్నూ.
1991-92లో అమెరికా వెళ్లారు. కనెక్టికట్ యూనివర్సిటీలో ఎంబీఏ (ఫైనాన్స్) పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు.
చదువు పూర్తయ్యాక న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో 2014 వరకూ సిస్టమ్ అనలిస్ట్‌గా పని చేస్తూనే, అటు రాజకీయంగానూ చురుగ్గా ఉంటూ వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్ విముక్తి కోసం ‘రెఫరెండం 2020’
'సిక్స్ ఫర్ జస్టిస్' అనే సంస్థను 2007లో స్థాపించారు పన్నూ.
అమెరికాలోని వాషింగ్టన్‌లో సంస్థ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేశారు.
ఈ సంస్థ భారత్ నుంచి పంజాబ్‌కి విముక్తి కావాలంటూ 'రెఫరెండం 2020' పేరుతో ఒక ప్రచారం ప్రారంభించింది.
పంజాబీలకు స్వతంత్రం కావాలంటూ ఖలిస్తాన్ నినాదమిచ్చింది.
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఖలిస్తాన్‌కు మద్దతుగా పంజాబ్‌లోని సిక్కులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఆన్‌లైన్ ద్వారా ఓటు వేయాలని కోరింది.
అయితే, ఈ ఓటింగ్‌కు ముందే సిక్స్ ఫర్ జస్టిస్ సహా ఖలిస్తాన్‌కు అనుకూలమైనవని చెబుతున్న 40 వెబ్‌సైట్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.
తమది మానవ హక్కుల సంఘంగా ఆ సంస్థ చెబుతోంది. భారత్ ఆ సంస్థను టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, EPA
భారత్, అమెరికాల మధ్య బలమైన సంబంధాలు
గత కొన్నేళ్లుగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడుతూ వస్తున్నాయి.
ఈ ఏడాది జూన్‌లో మోదీ అమెరికా సందర్శనకు వెళ్లిన సమయంలోనూ అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో మోదీ కోసం విందు ఏర్పాటు చేశారు.
ఆ తరువాత భారత్‌లో జరిగే జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు బైడెన్. మరోవైపు చైనాతో కూడా అమెరికా సంబంధాలను కొనసాగిస్తోంది.
అయితే, గత కొన్నేళ్లుగా భారత్, అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు మెరుగయ్యాయి.
గత పదేళ్లలో ఇరుదేశాల మధ్య వ్యాపారం రెట్టింపైందని ఈ ఏడాది జూన్‌లో బైడెన్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’
- మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మాల్దీవులు: చైనాతో స్నేహం వల్లే ‘ఇండియా అవుట్’ అంటోందా? మోదీ ముందున్న మార్గాలేంటి...
- అమరావతి ఇప్పుడెలా ఉంది, రాజధానికి శంకుస్థాపన చేసిన తొమ్మిదేళ్లలో చేసిందేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














