గ్లిన్ సిమన్స్: చేయని హత్యకు 48 ఏళ్ల జైలు జీవితం, చివరకు ఎలా బయటపడ్డారంటే..

గ్లిన్ సిమన్స్

ఫొటో సోర్స్, NEWS9, OKLAHOMA CITY KWTV

ఫొటో క్యాప్షన్, సిమన్స్ 48 సంవత్సరాల ఒక నెల 18 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు.
    • రచయిత, మాడెలైన్ హాల్పెర్ట్
    • హోదా, బీబీసీ న్యూస్

చేయని హత్యకు 48 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని అమెరికాలోని ఓక్లహోమా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

కొత్తగా మళ్లీ విచారణ జరపాలని ప్రాసిక్యూషన్ కోరగా, తగిన సాక్ష్యం లేదని న్యాయమూర్తి అమీ పాలంబో డిసెంబరు 18 సోమవారం ప్రకటించారు. ఆయన నిర్దోషి అని ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

నిర్దోషిగా కోర్టు ప్రకటించిన గ్లిన్ సిమన్స్‌ వయసు 70 సంవత్సరాలు.

ఈ కేసులో దోషిగా నిర్దరణ అయి, జైలు శిక్ష అనుభవిస్తున్న సిమన్స్, నిజానికి నేరం చేయలేదని స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యాధారాలతో కోర్టు తెలుసుకుందని తీర్పులో పేర్కొంది.

"వెనుదిరగకుండా పట్టుదలతో నిలబడాలని ఈ అనుభవం చెబుతుంది. మీరనుకున్నది జరగదని ఎవరు చెప్పినా పట్టించుకోకండి, అది జరిగి తీరుతుంది'' అని సిమన్స్ మీడియాతో వ్యాఖ్యానించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అసలేంటీ కేసు?

1974లో అమెరికాలోని ఓక్లహోమా సిటీ శివారులో మద్యం దుకాణంలో జరిగిన దోపిడీ సమయంలో కరోలిన్ స్యూ రోజర్స్‌ అనే వ్యక్తిని హత్య చేశారనే ఆరోపణలను సిమన్స్ ఎదుర్కొన్నారు. 22 ఏళ్ల సిమన్స్‌తో పాటు డాన్ రాబర్ట్స్‌ అనే వ్యక్తిని 1975లో కోర్టు దోషులుగా నిర్ధరించింది.

దీంతో సిమన్స్ 48 సంవత్సరాల ఒక నెల 18 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. అయితే, అక్కడి సుప్రీంకోర్టు మరణశిక్షల విధింపుపై రివ్యూ చేయడంతో ఇరువురి శిక్ష జీవిత ఖైదుగా మారింది.

అయితే, ఏ తప్పూ చేయలేదని, అమాయకుడినని సిమన్స్ వాదిస్తూనే ఉన్నారు, హత్య జరిగిన సమయంలో సొంత రాష్ట్రమైన లూసియానాలోనే ఉన్నానని చెప్పారు.

తల వెనుక భాగంలో కాల్పులకు గురైన యువతి సాక్ష్యం ఆధారంగా సిమన్స్, రాబర్ట్స్‌ను దోషులుగా తేల్చారు.

నిందితులను గుర్తించే సమయంలో ఆ యువతి మరికొంతమందిపై కూడా అనుమానం వ్యక్తం చేశారని, అంతకుముందు చెప్పిన సాక్ష్యానికి ఇది విరుద్దంగా ఉందని నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఎక్సోనరేషన్స్ తెలిపింది.

అయితే, ఈ కేసులో సాక్షి ఇతర అనుమానితులను గుర్తించడం, ఇతర కీలక సాక్ష్యాలకు సంబంధించిన వివరాలను సిమన్స్ తరఫు లాయర్లకు ప్రాసిక్యూటర్లు అందించలేదు.

ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కోర్టు 2023 జులైలో సిమన్స్ శిక్షను రద్దు చేసింది.

ఓక్లహోమాలో చేయని తప్పుకు దోషిగా నిరూపణ అయి, శిక్ష అనుభవిస్తే వారికి రూ.1.45 కోట్లు ($175,000) వరకు పరిహారం ఇస్తారు.

సిమన్స్ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు, దీంతో ఆయన జీవించడానికి, కీమోథెరపీ కోసం వేల డాలర్లను 'గోఫండ్‌మీ' అనే సంస్థ సేకరించింది.

ఈ కేసులో రాబర్ట్స్ 2008లోనే పెరోల్‌పై విడుదలయ్యారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)