పరువు పేరుతో ఇటలీలో కూతుర్ని చంపేసిన పాకిస్తానీ జంట.. వారికి కోర్టు ఏ శిక్ష వేసింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటలీలోని ఒక పాకిస్తానీ జంట తమ పద్దెనిమిదేళ్ల కూతురిని ‘పరువు’ పేరుతో చంపేసింది. ఈ ఘటనలో ఇటలీ కోర్టు ఆ జంటకు జీవితఖైదు శిక్ష ఖరారు చేసింది.
తాము కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో వారు కూతుర్ని హత్య చేశారు.
ఉత్తర ఇటలీలోని ఒక ఫాం హౌస్‌లో 2022 నవంబరులో పద్దెనిమిది నెలల నుంచీ కనిపించకుండా పోయిన సమాన్ అబ్బాస్ మృతదేహం దొరికింది. హత్య ఘటన తర్వాత ఇటలీ వదిలి వెళ్లిపోయిన సమాన్ తండ్రి షబ్బార్ అబ్బాస్‌ని పాకిస్తాన్‌లో అరెస్టు చేసి గత ఆగస్టు నెలలో ఇటలీకి తరలించి హత్య కేసులో విచారణ చేపట్టారు.
పరారీలో ఉన్న సమాన్ తల్లి నాజియా షహీన్‌కూ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆమె ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నారని అనుమానిస్తున్నారు.
కూతురిని చంపాలని జీవితంలో తానెప్పుడూ అనుకోలేదని సమాన్ తండ్రి షబ్బార్ అబ్బాస్ ఆవేశంగా కోర్టులో చెప్పారు.
హత్య ఘటనలో తన వంతు పాత్ర పోషించిన సమాన్ అంకుల్ దానిష్ హస్నేన్‌కూ ఇటలీ కోర్టు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించగాచ మరో ఇద్దరు కజిన్స్‌కు ఎలాంటి శిక్ష పడలేదు.
ఇటలీలో సమాన్ అబ్బాస్ పరువు హత్య ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన 2021 ఏప్రిల్ నెలలో జరిగింది.
ఆమె కనిపించకుండా పోయిన తర్వాత, ఇటలీలోని ముస్లిం సముదాయాల యూనియన్ ఒక ఫత్వా జారీ చేసింది. అందులో బలవంతపు పెళ్లిళ్లను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు.
తల్లిదండ్రులు సహా పాకిస్తాన్ నుంచి ఇటలీ వలస వచ్చిన సమాన్ కుటుంబం, 2016లో నోవెల్లారా పట్టణంలో స్థిరపడినట్లు కొన్ని ఇటాలియన్ మీడియా కథనాలు చెబుతున్నాయి.
పాకిస్తాన్ మూలాలున్న ఒక అబ్బాయితో సమాన్ డేటింగ్‌లో ఉండటం, వాళ్లు ప్రాంతీయ రాజధాని ప్రాంతం బొలోగ్నలోని ఒక వీధిలో ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు తల్లిదండ్రుల కంటపడటం, సమాన్‌పైన తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణమయ్యాయి.
అయితే 2020లో తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధం కోసం పాకిస్తాన్ వెళ్లాలని సమాన్‌పైన ఒత్తిడి చేశారంటూ ఇటలీ విచారణాధికారులు చెబుతున్నారు. కానీ సమాన్ అందుకు ఒప్పుకోలేదు.
తర్వాత 2020 అక్టోబరు నుంచీ ప్రభుత్వ సామాజిక సేవల విభాగం నిర్వహిస్తున్న కేర్ సెంటర్‌లో కొన్ని నెలలు గడిపారు సమాన్. తర్వాత 2021 ఏప్రిల్ నాటికి తిరిగి నోవెల్లారా పట్టణంలోని కుటుంబం దగ్గరకు చేరుకున్నారు. సమాన్ తల్లిదండ్రులు ఆమెకు మెసేజస్ చేస్తూనే ఉండటంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లారని ఇటలీ మీడియా కథనాలు కొన్ని చెబుతున్నాయి.
ఆమెను మభ్యపెట్టి ఇంటికి తిరిగి వచ్చేలా చేశారని, సరిగ్గా అప్పటి నుంచే ఆమె కనిపించకుండా పోయారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, CARABINIERI
పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో సమాన్ కుటుంబ సభ్యులు ముగ్గురు గడ్డపార, గునపం, నీలం రంగు బ్యాగు పట్టుకుని నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మరుసటి రోజు మరో ఫుటేజీలో తల్లిదండ్రులతో కలిసి సమాన్ బయటకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని నవంబరు నెలలో గుర్తించారు.
సమాన్ కుటుంబానికి చెందిన ఫాం హౌస్‌కు దగ్గరలోనే ఆమె శవం దొరికింది. ఆమెను ఎక్కడ పాతిపెట్టారో సమాన్ అంకుల్ పోలీసులకు వివరించారు.
విరిగిన మెడ ఎముకతో సమాన్ బాధపడినట్లు పోస్ట్‌మార్టమ్‌లో బయటపడింది. బహుశా ఆమె పీక నొక్కడం వలనే ఇలా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఆమె కనపడకుండా పోయిన వెంటనే సమాన్ తల్లిదండ్రులు ఇటలీ వదిలి పాకిస్తాన్ వెళ్లిపోయారు.
సమాన్ అంకుల్ దానిష్ హాస్నేన్, మరో ఇద్దరు సమాన్ కజిన్స్ ఫ్రాన్స్ వెళ్లారు. తర్వాత అక్కడి నుంచి స్పెయిన్ చేరుకున్నారు.
దానిష్‌ను 2021లో పారిస్‌లో పట్టుకున్నారు. సమాన్ తండ్రిని 2022లో పాకిస్తాన్‌లో అరెస్టు చేసి, ఈ ఏడాది అగస్టు 31న ఇటలీకి తరలించారు. ఆమె తల్లి నాజియా షహీన్ ఇంకా పరారీలోనే ఉన్నారు.
నాజియా ఇంకా దొరక్కపోయినా, ఉత్తర ఇటలీ నగరమైన రెజ్జియో ఎమీలియా నగర కోర్టు సమాన్ తల్లిదండ్రులిద్దరికీ శిక్ష ఖరారు చేసింది. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.
కోర్టులో మాట్లాడిన సమాన్ తండ్రి షబ్బార్ అబ్బాస్, తాను అమాయకుడినంటూ చెప్పుకొచ్చారు.
కూతురు సమాన్ కనపడకుండా పోయిన రాత్రి, షబ్బార్, నాజియాలు సమాన్‌ను ఫాలో అయ్యారని, రాత్రి ఆలస్యంగా బయటికెళ్తోందన్న కోపంతోనే సమాన్‌ను ఫాలో అయి ఎక్కడికెళ్తోందో తెల్సుకునే ప్రయత్నం చేశారని షబ్బార్ చెప్పుకొచ్చారు.
‘’ఈ విచారణ ఇంకా పూర్తికాలేదు. నా కూతురిని ఎవరు చంపారో తెలుసుకోవాలని నాక్కూడా ఉంది’’ అని షబ్బార్ అన్నట్టు ఇటలీ మీడియా చెబుతోంది.
‘పరువు హత్యలు’గా పిలిచే ఇలాంటి హత్యలకు ప్రధాన కారణాల్లో ఒకటి, తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధాలకు ఒప్పుకోకపోవడం. లేదా ఎవరైనా మహిళ లైంగిక దాడికి గురైనపుడు కూడా ‘పరువు’ పోయిందని భావించి బాధిత మహిళను హత్య చేస్తున్నారని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
అలానే ఆడపిల్లలు వేసుకునే బట్టలు సరిగా లేవని, వారి ప్రవర్తనా తీరు సరిగా లేదని, ధిక్కరించే ధోరణిలో వాళ్ల తీరు ఉందంటూ చేసిన హత్యా ఘటనలు కూడా ఉన్నాయి.
పాకిస్తాన్‌లో వందల మంది మహిళలను ఇలాంటి అనేక చిన్న చిన్న కారణాలతో హత్య చేస్తున్నారు. కొందరు మగవాళ్లు కూడా హత్యలకు గురైన ఘటనలున్నాయి.
గత నెలలో మారుమూల కొహిస్తాన్ జిల్లాలో పద్దెనిమిదేళ్ల మహిళను ఆమె తండ్రి, మరో సమీప బంధువు కలిసి కాల్చి చంపారు. ఈ హత్య గిరిజన పెద్దల ఆదేశాల ప్రకారమే జరిగింది. ఆ మహిళ వేరొక మగవాడితో కనిపించిన ఫోటో బయటపడటమే ఆమె హత్యకు కారణమైంది.
తర్వాత ఈ ఫోటో వైరల్ అయ్యింది. అయితే అందులో కొన్ని మార్పులు చేశారని గుర్తించారు.
బాధిత మహిళ తండ్రిని, ఆయన సమీప బంధువును అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’
- మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మాల్దీవులు: చైనాతో స్నేహం వల్లే ‘ఇండియా అవుట్’ అంటోందా? మోదీ ముందున్న మార్గాలేంటి...
- అమరావతి ఇప్పుడెలా ఉంది, రాజధానికి శంకుస్థాపన చేసిన తొమ్మిదేళ్లలో చేసిందేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














