అయోధ్య రామ్ మందిర్: అడ్వాణీని ‘ప్రాణప్రతిష్ఠ’కు రావొద్దని ట్రస్ట్ ఎందుకు చెప్పింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పిలిచే ప్రముఖుల జాబితాను కూడా ఆలయ కమిటీ సిద్ధం చేసింది.
వివిధ రంగాలకు చెందిన అతిథులకు ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. అయితే రామమందిర ఉద్యమాన్ని 1990ల్లో ముందుండి నడిపించిన బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను వయోభారం కారణంగా ఈ కార్యక్రమానికి రావద్దని చెప్పినట్టు రామ మందిర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు.
‘‘అడ్వాణీ రాక ముఖ్యమైనదే. కానీ ఆయనను రావద్దని చెప్పాం. డాక్టర్ మురళీ మనోహర్ జోషితో నేరుగా మాట్లాడాను. ఆయనను కూడా రావద్దని పదేపదే చెప్పాను. కానీ ఆయన వస్తానని పట్టుబడుతున్నారు. వయోభారం కారణంగా రిస్కు తీసుకోవద్దని నేను కూడా పలుసార్లు చెప్పాను. పైగా ఆయనకు జలుబు ఉంది. ఇటీవలే మోకీలు మార్పిడి కూడా జరిగింది’’ అని చంపత్ రాయ్ చెప్పారు.
వీరిద్దరే కాకుండా ఉమాభారతి, సాధ్వీ రీతంబర, కల్యాణ్‌సింగ్, అశోక్ సింఘాల్ కూడా రామ మందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు.
2014లో నరేంద్ర మోదీ, అంతకుముందు ఏబీ వాజ్‌పేయి ప్రధాని కావడానికి తోడ్పడిన ముఖ్యమైన అంశాల్లో అయోధ్య రామ మందిర ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమం జనవరి 22తో ముగియనుంది.

ఫొటో సోర్స్, X/@NARENDRAMODI
అడ్వాణీ, జోషీ ఆరోగ్యం ఎలా ఉంది?
లాల్ కృష్ణ అడ్వాణీకి ఇప్పుడు 96 ఏళ్ళు. మురళీ మనోహర్ జోషి జనవరిలో 90వ సంవత్సరంలోకి అడుగుపెడతారు.
1990 దశకంలో అయోధ్య, కాశీ, మథుర ఆలయాలను విముక్తం చేయాలంటూ విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అప్పట్లో అడ్వాణీ సోమ్‌నాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర మొదలుపెట్టారు.
కానీ యాత్ర సమస్తీపుర్ చేరుకునేసరికి అప్పటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అడ్వాణీని అరెస్ట్ చేయించారు.
మసీదును పడగొట్టడానికి కుట్ర పన్నారనే అభియోగాలతో అడ్వాణీపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది నవంబర్ 8న అడ్వాణీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఆయన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మాజీ ఉప ప్రధాని, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌కే అడ్వాణీ ఇంటికి వెళ్ళి ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాను’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అడ్వాణీతో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
రామమందిర ఉద్యమంలో అడ్వాణీ తరువాత చురుకుగా పాల్గొన్న మరో అగ్రనేత మురళీ మనోహర్ జోషి.
1992 డిసెంబరు 6న వివాదాస్పద స్థలానికి ఆయన సమీపంలోనే ఉన్నారు. మసీదు గుమ్మటం పడిపోయిన తరువాత ఉమా భారతి ఆయనను హత్తుకున్నారు. మురళీ మనోహర్ జోషి .. వారణాసి, అలహాబాద్, కాన్పూర్ నియోజకవర్గాల నుంచి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఉమాభారతికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఉద్యమం
మూడు దశాబ్దాల కిందట రామమందిర ఉద్యమంలో ఉమాభారతి కూడా పాల్గొన్నారు. ఈ ఉద్యమం ద్వారానే ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ గుర్తింపు వచ్చింది.
మసీదును కూల్చివేసిన పదిరోజుల తరువాత ఈ సంఘటనపై విచారణ జరపడానికి లిబర్హాన్ కమిషన్ ఏర్పాటైంది. ఉమా భారతి గుంపును రెచ్చగొట్టారనే అభియోగాలు మోపారు. అయితే ఆమె వాటిని ఖండించారు.
కేంద్రంలో ఆమె వాజ్‌పేయీ, నరేంద్ర మోదీ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. 2003 నుంచి 2004 మధ్య ఉమాభారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
అయితే 2019 పార్లమెంటరీ ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. దీని తరువాత పార్టీలో ఆమెను పక్కన పెట్టేశారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన స్టార్ కాంపెయినర్ల జాబితాలో ఆమె పేరు లేదు. కానీ తాను పార్లమెంట్‌కు పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు ఆమె మధ్యప్రదేశ్ ఎన్నికల ముందు చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సాధ్వీ రీతంబర
సాధ్వీ రీతంబర ఒకనాడు హిందూత్వ అగ్గిబరాటా. ఆమెపై బాబ్రీ విధ్వంసానికి కుట్ర పన్నారనే అభియోగాలు మోపారు. రామమందిర ఉద్యమ సమయంలో ఆమె ఉద్వేగపూరిత ప్రసంగాలు దేశవ్యాప్తంగా వినిపిస్తుండేవి.
ఆమె తన వ్యతిరేకులను బాబర్ బిడ్డలు అంటూ సవాల్ చేస్తుండేవారు.
బృందావనంలో సాధ్వీరీతంబరకు వాత్సల్యాగ్రామ్ పేరుతో ఓ ఆశ్రమం ఉంది.
అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు ముందుగా ఆహ్వానం అందుకున్నవారిలో ఈమె కూడా ఉన్నారు.
కల్యాణ్ సింగ్
బాబ్రీ మసీదును కూల్చివేసిన సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ఉద్దేశపూర్వకంగా కరసేవకులను అడ్డుకోలేదనే అభియోగాన్ని ఆయన ఎదుర్కొన్నారు.
తరువాత కాలంలో ఆయన బీజేపీ నుంచి దూరం జరిగి రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు కానీ..కొద్దిరోజులకే తిరిగి బీజేపీ చెంతకు చేరారు. మసీదును పడగొట్టిన కేసులో పేర్కొన్న 13 మంది నిందితులలో కల్యాణ్ సింగ్ పేరు కూడా ఉంది.
కల్యాణ్ సింగ్ తన 89వ ఏట 2021 ఆగస్టులో మరణించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అశోక్ సింఘాల్
రామజన్మ భూమి ఉద్యమానికి ఊపిరిలూదినవారిలో అశోశ్ సింఘాల్ పేరు కూడా ఉంటుంది. ఆలయ నిర్మాణ ఉద్యమానికి ప్రజల మద్దతు కూడగట్టడంతో ఆయన కీలక పాత్ర పోషించారు.
రామమందిర నిర్మాణ ఉద్యమానికి ఆయనే శిల్పి అని చాలా మంది నమ్ముతుంటారు. 2011 వరకు ఆయన విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు.
కానీ తరువాత అనారోగ్య కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. 2015 నవంబర్ 17న అశోక్ సింఘాల్ మరణించారు.
వినయ్ కతియార్, ప్రవీణ్ తొగాడియా
రామ మందిర ఉద్యమం కోసం 1984లో బజరంగ్ దళ్ ఏర్పాటైంది. దీని నిర్వహణా బాధ్యత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అప్పగించాక, వినయ్ కతియార్ బజరంగ్ దళ్ మొదటి అధ్యక్షుడు అయ్యారు.
కతియార్ రాజకీయ స్థాయి పెరిగి, ఆయన కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ఫైజాబాద్ (అయోధ్య) నుంచి ఆయన మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయన రాజ్యసభ ఎంపీగానూ పనిచేశారు. అయితే 2018లో ఆయన పదవీ కాలం ముగిశాక, మరోసారి ఆయనకు టిక్కెట్ లభించలేదు.
అదే సమయంలో విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన మరో నాయకుడు ప్రవీణ్ తొగాడియా కూడా రామందిర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు.
కానీ ఆయన వీహెచ్‌పీ నుంచి వేరుపడి అంతర్జాతీయ హిందూ పరిషత్‌ను నెలకొల్పారు. రామ మందిర నిర్మాణానికి ముందు ఆయన ప్రధాని మోదీని అనేక సందర్భాలలో విమర్శించారు.
చంపత్ రాయ్ ఇంకా ఏం చెప్పారు?
రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ ప్రధాని దేవె గౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని వేసినట్టు చంపత్ రాయ్ చెప్పారు.
‘‘ఈ కార్యక్రమమానికి భిన్న సంప్రదాయాలకు చెందిన ఆరుగురు శంకరాచార్యులు, 150 మంది సాధువులను కూడా ఆహ్వానించాం. దాదాపు 4,000 మంది మతపెద్దలు, 2,200 మంది ఇతర అతిథులను కూడా ఆహ్వానించాం’’ అని ఆయన తెలిపారు.
దలైలామా, మాతా అమృంతానందమయి, యోగా గురు రామ్‌దేవ్, ప్రముఖ నటులు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, సినిమా దర్శకుడు మాధుర్ భండార్కర్, ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ప్రసిద్ధ చిత్రకారుడు వసుదేవ్ కామత్, ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్ సహా అనేక మంది ప్రముఖులను ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించినట్టు వివరించారు.
ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పూర్తయ్యాక జనవరి 24 నుంచి 48 రోజులపాటు మండల పూజ నిర్వహిస్తామని చంపత్ రాయ్ చెప్పారు. జనవరి 23 నుంచి రామమందిరం భక్తుల కోసం తెరుచుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం అయోధ్యతోపాటు మరో మూడుచోట్ల వసతి ఏర్పాట్లు చేస్తున్నట్టు చంపత్ రాయ్ తెలిపారు. దీంతోపాటు వివిధ మఠాలలో 600 గదులు సిద్ధం చేసినట్టు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
అడ్వాణీ, మనోహర్ జోషీలకు ఆహ్వానాలు
చంపత్ రాయ్ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే పలువురు వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతలు అడ్వాణీ, మనోహర్ జోషీలను వ్యక్తిగతంగా కలిసి అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు రావాలని ఆహ్వానించారు.
వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్, సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకులు రామ్ లాల్, కృష్ణ గోపాల్ వారిని కలిసి, ఆహ్వాన పత్రిక అందించిన ఫోటోలను వీహెచ్‌పీ విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
- మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి..
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
- పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














