'బాబ్రీ మసీదును కూల్చడం ఒక కుట్రే... కోర్టు తీర్పు నా విచారణకు భిన్నంగా ఉంది' -జస్టిస్ లిబర్హాన్

జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్
ఫొటో క్యాప్షన్, జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్
    • రచయిత, అరవింద్ ఛాబ్డా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిందితులందరూ నిర్దోషులని తీర్పు ఇచ్చింది.

కానీ, లిబర్హాన్ కమిషన్ 2009లో బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అప్పటి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ‘ఒక పథకం ప్రకారం చేసిన చర్య’ అని చెప్పింది.

1992 డిసెంబర్ 6న ఒక గుంపు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసింది. ఆ తర్వాత 10 రోజులకు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు.

డిసెంబర్ 6న జరిగిన ఘటనాక్రమంపై దర్యాప్తు పూర్తి చేసి, వీలైనంత త్వరగా నివేదిక అందించే బాధ్యతలను ఆ సమయంలో పంజాబ్, హరియాణా హైకోర్ట్ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ మన్‌మోహన్ సింగ్ లిబర్హాన్‌కు అప్పగించారు.

ప్రభుత్వం తరఫున జారీ అయిన ఒక నోటిఫికేషన్‌లో ఈ కమిషన్ మూడు నెలల్లోపు నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. కానీ లిబర్హాన్ కమిషన్ దర్యాప్తు పూర్తి కావడానికి 17 ఏళ్లు పట్టింది. ప్రభుత్వం 48 సార్లు కమిషన్‌కు గడువు పొడిగించింది.

బాబ్రీ మసీదు కూల్చివేతను ‘పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర’గా లిబర్హాన్ కమిషన్ తమ నివేదికలో చెప్పింది.

బాబ్రీ మసీదు

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ అధికారం కోసం మతాన్ని ఉపయోగించుకోవడాన్ని అడ్డుకునేందుకు శిక్ష విధించే ప్రొవిజన్ కూడా ఉండాలని ఆయన తన నివేదికలో సిఫారసు చేశారు.

బాబ్రీ మసీదుపై ప్రత్యేక కోర్టు తీర్పుపై బీబీసీతో మాట్లాడిన జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్ తన అభిప్రాయాలు చెప్పారు.

బీబీసీ:ఈ కేసులో మీరు చాలా పరిశోధన చేశారు. ఎవరు కూలగొట్టారో స్పష్టంగా చెప్పారు. కానీ వచ్చిన తీర్పుపై మీరు బాధపడుతున్నారా ?

లిబర్హాన్‌: నేనెందుకు బాధపడాలి. నాకు తీర్పు విషయంలో ఎలాంటి విచారం లేదు, సంతోషం లేదు. నేను ఒక న్యాయమూర్తిగా నా విధులను నిర్వహించాను.

బీబీసీ: సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించలేకపోయింది. దీని గురించి మీకేమనిపిస్తోంది.

లిబర్హాన్‌: సీబీఐ సాక్ష్యాలు సేకరించలేకపోయిందని నేను అనను. సీబీఐ ఏ సాక్ష్యాధారాలు తెచ్చింది, ఏవి తీసుకురాలేదు అన్నది నాకు పెద్దగా తెలియదు. నా అభిప్రాయాలకు భిన్నంగా కోర్టు వాటిని ఎందుకు నమ్మిందో కూడా తెలియదు. అది కోర్టు నిర్ణయం.

బీబీసీ: మీరు చాలా పరిశోధన చేశారు. అది ఒక కుట్ర ప్రకారం జరిగిందని చెప్పారు. కానీ కోర్టు తీర్పు మాత్రం అది ముందస్తు ప్రణాళిక కాదు అంది.

లిబర్హాన్‌: మా దర్యాప్తులో అది కుట్ర అని తెలిసింది.. దాన్ని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను.

బీబీసీ: ఇది కుట్ర అనడానికి ఇన్ని సాక్ష్యాధారాలున్నా ఈ కేసు ఎందుకు నిరూపణ కాలేదు.

లిబర్హాన్‌: కచ్చితంగా, ఇది అందరి పరస్పర అంగీకారంతోనే జరిగింది. ఇరు వర్గాల మధ్య అంగీకారంతో జరిగింది కుట్ర కాకపోతే, కుట్ర అని దేనిని అంటారో నాకు తెలియదు.

నా ముందుకు వచ్చిన అంశాలను పరిశీలించాక ఇది కుట్ర అని నేను నమ్మాను. అది కుట్రేనని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను.

బీబీసీ: ఇందులో కుట్రేమీ లేదని సీబీఐ చెప్పింది. దీనినిబట్టి మీరు చేసిన విచారణ అంతా కొట్టిపారేసినట్టేనా..?

లిబర్హాన్‌: నా విచారణకు ఇది పూర్తిగా భిన్నమైన తీర్పు. భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండే హక్కు కోర్టుకు ఎప్పుడూ ఉంటుంది. న్యాయస్థానం భిన్నమైన తీర్పు చెప్పింది. దానికి నేనేమీ చేయలేను.

బీబీసీ: అయితే మీకు ఏమనిపిస్తోంది, సీబీఐ దర్యాప్తులో ఎక్కడ లోపం ఉంది.

లిబర్హాన్‌: ఏం లోపించిందో నేను ఏదీ చెప్పలేను. వారందరూ నా ఎదుట హాజరయ్యారు. నేను ఏది తెలుసుకున్నానో, అది చెప్పాను. నా దర్యాప్తు ముమ్మాటికి సరైనదేనని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. అది ఎలాంటి భయం లేకుండా నిజాయితీగా చేశాం.

నేను జడ్జి లేదా కోర్టుపై ఎలాంటి కామెంట్ చేయాలనుకోవడం లేదు. దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తాలనుకోవడం లేదు. అందరూ తమ పనిని నిజాయితీగానే చేసుంటారని నేను నమ్ముతున్నాను.

వీడియో క్యాప్షన్, 'బాబ్రీ మసీదు కూల్చివేతపై నిర్భయంగా, నిజాయితీగా నివేదిక ఇచ్చాం' -జస్టిస్ లిబర్హాన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)