అయోధ్య రామమందిరం ట్రస్ట్‌పై భూ కుంభకోణం ఆరోపణలు: ‘2 కోట్ల భూమిని కొన్ని నిమిషాల తర్వాత 18.5 కోట్లకు కొన్నారు’

రామమందిరం నమూనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

అయోధ్యలో రామమందిరం భూమి కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం, అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

భూమి కొనుగోలు వ్యవహారంలో రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తేజ్‌నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండే, ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.

రెండు కోట్ల రూపాయలకు ఇద్దరు రియల్ ఎస్టేట్ డీలర్లు కొన్న భూమిని కొన్ని నిమిషాల తర్వాత రామ జన్మభూమి ట్రస్ట్ 18.5కోట్లకు ఆ భూమిని వారి నుంచి కొనుగోలు చేసిందని పవన్ పాండే అన్నారు.

2 కోట్లకు సేల్ డీడ్ చేసుకున్న రోజే.. ఆ భూమిని 18.5 కోట్లకు కొనేందుకు రామ జన్మభూమి ట్రస్ట్ ఒప్పందం కుదుర్చుకుందని సమాజ్‌వాదీ పార్టీ నేత పవన్ పాండే ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలు నిరాధారమని, రాజకీయ ప్రేరేపితమని రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తోసిపుచ్చారు.

రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమంతా బహిరంగ మార్కెట్‌ ధర కంటే తక్కువకే కొనుగోలు చేసిందని ఆయన స్పష్టం చేశారు.

రామజన్మభూమి

ఫొటో సోర్స్, SHAMIM A AARZOO

పవన్ పాండే ఏమన్నారు?

ఇద్దరు రియల్ ఎస్టేట్ డీలర్లు ఒక వ్యక్తి నుంచి ఆ భూమిని రెండు కోట్లకు కొన్నారని, కొన్ని నిమిషాల తర్వాత వారు ఆ భూమిని 18.5 కోట్లకు రామ జన్మభూమి ట్రస్ట్‌కు విక్రయించారని పవన్ పాండే ఆరోపించారు.

"2021 మార్చి 18న ఈ లావాదేవీలు జరిగాయని, అగ్రిమెంట్, సేల్ డీడ్‌లో ట్రస్టీ అనిల్ మిశ్రా, మేయర్ రుషీకేష్ ఉపాధ్యాయ్ సాక్ష్యులుగా ఉన్నారు" అని ఆయన చెప్పారు.

"రామజన్మభూమి పక్కనే ఉన్న ఒక భూమిని పూజారి హరీష్ పాఠక్, ఆయన భార్య మార్చి 18న సాయంత్రం సుల్తాన్ అన్సారీ, రవి మోహన్‌కు రూ.2 కోట్లకు అమ్మారు. అదే భూమిని కొన్ని నిమిషాల తర్వాత రామజన్మభూమి ట్రస్ట్ తరఫున చంపత్ రాయ్ 18.5 కోట్లకు కొనుగోలు చేశారు" అని పవన్ పాండే ఆరోపించారు.

వాటికి సంబంధించిన రిజిస్ట్రార్ దస్తావేజులను ఆయన మీడియాకు చూపించారు. కొన్ని నిమిషాల్లోనే రూ.2 కోట్ల భూమి ధర 18.5 కోట్లు ఎలా అయ్యిందని పవన్ పాండే ప్రశ్నించారు.

రామమందిరం పేరున భూమి కొనుగోళ్ల సాకుతో రామభక్తులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మొత్తం భూమి కొనుగోళ్ల గురించి మేయర్‌కు, ట్రస్టీకి తెలుసని కూడా పవన్ పాండేయ్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

రామజన్మభూమి

ఫొటో సోర్స్, SHAMIM A AARZOO

భూ కొనుగోళ్లలో అవినీతి జరిగింది: ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ

రామమందిరం పేరున కొనుగోలు చేస్తున్న భూమి విషయంలో అవినీతి జరిగిందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా లఖ్‌నవూలో ఆరోపించారు.

"భూమి ధర ప్రతి సెకనుకూ దాదాపు 5.5 లక్షలు పెరిగిపోయింది. భారతదేశంలో ఎక్కడా ఏ భూమి ఒక సెకనులో ఇన్ని రెట్లు ధర పలకదేమో. ఈ వ్యవహారంలో తక్షణం ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. అవినీతికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా" అని ఆయన అన్నారు.

రామమందిరం భూమి కొనుగోలులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీపక్ సింగ్ కూడా ఆరోపించారు. సీబీఐ దర్యాప్తునకు ఆయన డిమాండ్ చేశారు.

చంపత్ రాయ్

ఆరోపణలు నిరాధారం: రామజన్మభూమి ట్రస్ట్

మరోవైపు ఈ ఆరోపణలు నిరాధారమని, రాజకీయ ప్రేరేపితమని రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ అన్నారు. దీనిపై ఆదివారం సాయంత్రం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

"శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఎంత భూమి కొనుగోలు చేసిందో, అదంతా బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ప్రస్తుత విక్రేతలు ఈ భూమి కొనుగోలు కోసం కొన్నేళ్ల క్రితం ఎంతకు ఒప్పందం చేసుకున్నారో, ఆ ధరకు 2021 మార్చి 18న సేల్ డీడ్ చేసుకున్నారు. తర్వాత వారు ట్రస్టుతో అగ్రిమెంట్ చేసుకున్నారు" అని చెప్పారు.

ఈ భూ కొనుగోళ్ల గురించి మాట్లాడ్డానికి విశ్వహిందూ పరిషత్ నిరాకరించింది. ఆరోపణలకు సంబంధించిన అన్ని దస్తావేజులూ పరిశీలించి, అసలు నిజాలేంటో తెలుసుకుంటామని వీహెచ్‌పీ పదాధికారులు చెబుతున్నారు.

రామజన్మభూమి

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

"సంస్థ ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది నిజమేనని తేలితే దీనిపై ఆందోళనకు దిగుతాం" అని పేరు రాయవద్దనే షరతుతో వీహెచ్‌పీకి చెందిన ఒక పదాధికారి బీబీసీకి చెప్పారు.

శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల సన్నాహాలను సమీక్షించడానికి ఆదివారం అయోధ్యలో ట్రస్ట్ సమావేశం కూడా జరిగింది.

ట్రస్ట్ మీద భూ కుంభకోణం ఆరోపణలకు ముందు చంపత్ రాయ్ వాటి గురించి మాట్లాడ్డానికి అసలు ఒప్పుకోలేదు. కానీ ఆదివారం సాయంత్రానికి ఆయన పత్రికా ప్రకటన ద్వారా దీనిపై తన వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)