ఒమెగల్: అపరిచితులతో వీడియో చాట్ లైంగిక వేధింపుల వరకు వెళ్లి.. ఈ వెబ్‌సైట్ ఎలా మూతపడింది?

అభి బీ యూట్యూబర్

ఫొటో సోర్స్, Abhi bee/YT

ఫొటో క్యాప్షన్, ఒమెగల్‌ వెబ్‌సైట్ వల్ల పాపులర్ అయిన చాలా మందిలో అభినవ్ రెడ్డి అనే యూట్యూబర్‌ ఒకరు. ఆయన 'అభి బీ' పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు.

అపరిచితులతో టెక్ట్స్, వీడియో చాట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో రూపుదిద్దుకున్న ఒమిగల్ వెబ్‌సైట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది.

ఈ వేదికతో చాలా మంది పాపులర్ అయ్యారు. ఉదాహరణకు అభినవ్ రెడ్డి అనే యూట్యూబర్‌ 'అభి బీ' పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌కు 9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.34 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఒమెగల్‌లో తనతో కనెక్ట్ అయ్యే వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు ఈ యూట్యూబర్. వారి స్కెచ్‌లను అప్పటికప్పుడు గీసినట్లుగా వారి చిత్రాలను చూపి, ఆ స్పందనలను రికార్డు చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

ఇలాంటి యూట్యూబర్ల సంఖ్య, ముఖ్యంగా కోవిడ్ సమయంలో విపరీతంగా పెరిగింది.

ఈ వెబ్‌సెట్ సాయంతో చాలా మందే సోషల్ మీడియాలో యూట్యూబర్లుగా పేరుపొందారు.

వీరంతా అపరిచితులతో వీడియో చాట్‌తో కనెక్టయి సరదాగా మాట్లాడటం, ఏవో ప్రశ్నలు వేయడం, ఆ సంభాషణలను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం చేశారు.

సెమ్రష్ సంస్థ లెక్కల ప్రకారం ఈ వెబ్‌సైట్‌కు భారతదేశం నుంచే ఎక్కవ సంఖ్యలో యూజర్లు ఉన్నారు.

ఇదంతా నాణేనికి ఒక వైపు.

అపరిచితులతో సరదాగా కనెక్టయ్యేందుకు రూపొందించిన ఒమెగల్ వెబ్‌సైట్‌ తక్కువ కాలంలోనే బాగా ఆదరణ పొందింది. అయితే 14 ఏళ్ల పాటు అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వెబ్‌సైట్‌పై ఆరోపణలూ, విమర్శలూ అదే స్థాయిలో వచ్చాయి.

ఇదే వెబ్‌సైట్ వల్ల బాలికలు, మహిళలు లెక్కకు మించి వేధింపులకు గురవుతున్నారని, చాలా కాలంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఒమెగల్ వీడియో చాట్ కారణంగా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైన బాలిక, పదేళ్ల తరువాత దీనిపై న్యాయ పోరాటానికి దిగారు. దీంతో చివరకు దీనిని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు లీఫ్ బ్రూక్స్.

ఎంతో ఆదరణ పొందిన ఒమెగల్, చివరకు అపఖ్యాతి పాలై, ఎలా మూతబడింది?

ఒమెగల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒమెగల్‌కు భారత్‌ నుంచే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారని సెమ్రష్ సంస్థ తెలిపింది.

యూజర్లలో అత్యధికులు భారతీయులే

2009లో 18 ఏళ్ల లీఫ్ బ్రూక్స్ ఒమెగల్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వీడియో చాట్స్ ద్వారా అపరిచితులతో మాట్లాడే సదుపాయం కల్పించేందుకు దీనిని ప్రారంభించినట్లు లీఫ్ బ్రూక్స్ చెప్పారు.

తక్కువ కాలంలోనే ఒమెగల్‌ పాపులరైంది. సెమ్రష్ సంస్థ లెక్కల ప్రకారం, ఈ వెబ్‌సైట్‌కు నెలవారీ యూజర్ల సంఖ్య 73 మిలియన్లు.

వీరిలో ఎక్కువ శాతం మంది భారత్ నుంచి ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో అమెరికా, యూకే, మెక్సికో, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి.

ఇలాంటి వీడియోచాట్ సైట్‌ల విషయంలో మోడరేషన్లు, వయో పరిమితిని నిర్ధరించే నిబంధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఒమెగల్‌ మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించింది.

ఏజ్ వెరిఫికేషన్ లేకుండా, సాధారణ స్థాయి మోడరేషన్‌తో లైంగిక వేధింపులు, అసభ్యకరమైన చర్యలకు తావిచ్చే వేదికగా మారింది ఒమెగల్.

కొన్నేళ్లపాటు వచ్చిన ఆరోపణలు, లైంగిక వేధింపుల కేసుల నమోదు తరువాత వెబ్‌సైట్ హోం పేజీలో ‘ప్రెడేటర్లు ఈ వెబ్‌సైట్‌ను వినియోగించొచ్చు’ అన్న హెచ్చరికను మాత్రమే జోడించారు. కానీ, ఇదేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. మరెలాంటి చర్యలూ తీసుకోలేదు.

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఒమెగల్‌కు ఆదరణ పెరిగింది.

మైనర్లు, కొంత మంది పురుషులు లైంగిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ప్రవర్తించడం, బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆ సమయంలో బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. మరీ ముఖ్యంగా పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది.

తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అలీస్

వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని కోర్టు ఏం చేసింది?

తన 11 ఏళ్ల వయసులో ఒమెగల్‌లో వీడియో చాట్ చేసిన సమయంలో ర్యాన్ అనే వ్యక్తి చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలిక, పదేళ్ల తరువాత, 2021లో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. ర్యాన్, బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తని ఆమె చెప్పారు.

ఒమెగల్ కారణంగానే తాను ఈ వేధింపులకు గురైనట్లు, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ యువతి న్యాయస్థానాన్ని కోరారు.

2021నవంబర్‌లో కేసు నమోదై, వాదనలు మొదలయ్యాయి. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించి, శిక్షించింది న్యాయస్థానం.

అయితే, ఒమెగల్ లీగల్ టీం ఈ కేసులో తమ వాదనను వినిపించింది. జరిగిన ఘటనకు తమని బాధ్యులను చేయొద్దని కోరింది.

బాలలపై, ఇతరులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి తాము వేదికగా మారామనే ఆరోపణలను అంగీకరించట్లేదంటూ వాదనలు వినిపించింది.

చివరకు, న్యాయస్థానం బయటే ఈ కేసు విషయంలో ఒమెగల్ రాజీ కుదుర్చుకుంది.

ఒమెగల్ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నట్లు వ్యవస్థాపకుడు లీఫ్ బ్రూక్స్ ప్రకటించారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితురాలు కోర్టు పత్రాల్లో తన పేరును అలీస్ లేదా ఎ.ఎమ్(అసలు పేరు కాదు)గా పేర్కొన్నారు.

వెబ్‌సైట్ మూసివేత నిర్ణయంపై ఆమె స్పందిస్తూ, తన పోరాటం ఫలితాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఒమెగల్‌ చాట్‌లో అలీస్‌తో కనెక్టయిన ర్యాన్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలీస్‌కు సంబంధించిన 220కి పైగా ఫొటోలు, వీడియోలను సేకరించి మూడేళ్లపాటు వేధించాడు. అలీస్‌తోపాటు మరో ఐదుగురిపైనా ఇదే విధంగా వేధింపులకు పాల్పడ్డాడు.

అలీస్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ర్యాన్‌ను దోషిగా తేల్చుతూ ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఆ తరువాత వేధింపులకు వేదికైన ఒమెగల్‌పై న్యాయపోరాటం కొనసాగించారు అలీస్.

“న్యాయస్థానం ద్వారా వెబ్‌సైట్‌ను మూసివేయించలేకపోయినా, ఆ ఫలితాన్ని నేను బయట సాధించగలిగాను” అన్నారామె.

లీఫ్ బ్రూక్స్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, ఒమెగల్ వెబ్‌సైట్ ఫౌండర్ లీఫ్ బ్రూక్స్

ఒమెగల్ మూసివేతపై లీఫ్ బ్రూక్స్ ఏమన్నారు?

ఈ ఏడాది నవంబర్ 9న ఒమెగల్ కార్యకలాపాలను నిలివేస్తున్నానంటూ లీఫ్ బ్రూక్స్, సుదీర్ఘమైన సందేశాన్ని వెబ్‌సైట్ హోం పేజీలో ఉంచారు.

“వెబ్‌సైట్ నిర్వహణ ఇకపై ఆర్థికంగా సాధ్యం కాదు. ఒమెగల్‌ను కొంత మంది దుర్వినియోగం చేశారనీ చెప్పలేం. అలాగే, నిజాయతీని అందరికీ తెలిసేలా చూపించడం కూడా సాధ్యం కాదు. పరిస్థితులు మరోలా ఉంటాయని నేను ఆశించాను. కానీ, ప్రస్తుతమున్న ఒత్తిడి, ఒమెగల్ నిర్వహణ ఖర్చులు, దుర్వినియోగానికి వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటం చాలా వ్యయంతో కూడుకున్నది. నిజానికి, 30 ఏళ్లకే గుండెపోటు బారిన పడాలని నేను కోరుకోవడం లేదు” అని ఆయన రాసుకొచ్చారు.

“ఒమెగల్ వల్ల మనిషి జీవితం ఎంత నాశనమవుతుందో నాకు తెలియజెప్పి, నా కళ్లు తెరిపించిన ఏఎమ్‌కు ధన్యవాదాలు” అంటూ లీఫ్ బ్రూక్స్ ముగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)