‘నన్ను, నా చెల్లిని కాపాడబోయి మా నాన్న వరదలో కొట్టుకుపోయారు. కానీ...’

అన్సీ
ఫొటో క్యాప్షన్, అన్సీ
    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ తమిళ్

‘‘మా అమ్మను సురక్షితంగా ముందుకు పంపిన తర్వాత నేను, మా నాన్న, నా చెల్లి ముగ్గురం వర్షంలో నడుస్తూ వెళ్తున్నాం. అప్పటికప్పుడే పెద్ద వరద రావడం మొదలైంది. మమ్మల్ని కాపాడేందుకు ప్రయత్నించిన మా నాన్న వరద నీటిలో కొట్టుకుపోయారు.

మా చెల్లి కూడా నీళ్లలో పడిపోయింది. నీళ్లలో నుంచి ఆమెను బయటకు లాగి ఒక చెట్టు కొమ్మను పట్టుకొని రెండున్నర గంటల పాటు వరదలోనే నిల్చున్నా. నీళ్లలో పడినప్పుడే ఆమె చనిపోయిన సంగతి అప్పుడు నాకు తెలియదు’’ అని అన్సీ అనే యువతి చెప్పారు. ఆ తర్వాత ఆమె మాట్లాడలేకపోయారు.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో డిసెంబరు 17న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో అన్సీ తన తండ్రి అమలన్‌తోపాటు చెల్లెలు అక్షితను కోల్పోయారు.

కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు తమిళనాడులో దక్షిణాది జిల్లాలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నడుము లోతు వరకు నీరు నిలిచిపోయి ఉంది. వరదల కారణంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

వరదలతో ట్యుటికోరిన్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. అక్కడి నుంచి దిగ్భ్రాంతికర వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితి, వరద ప్రభావం గురించి తెలుసుకునేందుకు బీబీసీ బృందం తూత్తుకుడి జిల్లా వ్యాప్తంగా పర్యటించింది. అమలన్, ఆయన కూతురు అక్షితకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు మేం వారి ఇంటికి వెళ్లాం.

అక్షిత, అమలన్
ఫొటో క్యాప్షన్, అన్సీ చెల్లెలు అక్షిత, తండ్రి అమలన్

‘‘క్షణాల్లో అంతా అయిపోయింది’’

ట్యుటికోరిన్ జిల్లాలోని ముత్తమ్మల్ కాలనీలో అమలన్ కుటుంబం నివసిస్తుంది. ఆయన ఒక ఎలక్ట్రీషియన్. అమలన్‌కు ఇద్దరు కుమార్తెలు అన్సీ, అక్షిత.

వారి కుటుంబం సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆదివారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది.

అప్పుడు ఏం జరిగిందో బీబీసీకి అమలన్ పెద్ద కూతురు అన్సీ వివరించారు.

‘‘ఆదివారం రాత్రి నాకు ట్యూషన్ విద్యార్థులు ఫోన్ చేశారు. భారీ వర్షం కురవడంతో పాటు వరదలు వస్తాయని చెప్పారు. మా ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో తమ ఇంటికి రమ్మని మమ్మల్ని పిలిచారు.

నా దగ్గరికి ట్యూషన్‌కు వచ్చే విద్యార్థి ఇల్లు కాస్త ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. వరద భయంతో నేను మా నాన్న, చెల్లి, అమ్మ గబగబా బయటకు వచ్చాం. ఇల్లుకు తాళం కూడా వేయకుండా ఏమీ తీసుకోకుండానే వాళ్లింటికి వెళ్లడానికి వేగంగా నడవడం మొదలుపెట్టాం. అప్పటికి వీధుల్లోకి వరద రాలేదు.

మా కంటే ముందు మా అమ్మ నడుస్తున్నారు. ఉన్నపళంగా వరద వచ్చింది. ఏం జరుగుతోందో మాకు అర్థం అయ్యే లోగానే వరద మమ్మల్ని ముంచెత్తింది. మా అమ్మ ముందుకు పరిగెత్తి ఒక సురక్షిత ప్రాంతంలో నిల్చుంది.

వరద నుంచి మమ్మల్ని కాపాడేందుకు మా నాన్న ప్రయత్నించారు. కానీ అప్పటికే వరద నీటి వేగం పెరిగింది. బలంగా నీరు రావడంతో మా నాన్న నీళ్లలో కొట్టుకుపోయారు.

నా చెల్లి కూడా నీటిలో మునిగిపోయింది. నేను ఆమెను నీటిలో నుంచి బయటకు లాగి ఒక చేత్తో పట్టుకున్నాను. మరో చేత్తో ఒక చెట్టు కొమ్మను పట్టుకొని నిల్చున్నా’’ అని అన్సీ తెలిపారు.

తమిళనాడు
ఫొటో క్యాప్షన్, ట్యుటికోరిన్‌లో అన్సీ ఇల్లు

‘నాన్న, నాన్న అంటూ మూడుసార్లు అరిచింది’

‘‘నా చెల్లెల్ని పైకి ఎత్తుకోమంటూ ఇళ్ల మీది నుంచి మమ్మల్ని చూస్తున్నవారు అరిచారు. చెట్టు కొమ్మను ఆసరాగా చేసుకొని ఆమెను నా భుజాలపైకి తీసుకున్నా. అప్పటికే ఆమె ముక్కులోకి చాలా నీరు వెళ్లింది. నాన్న నాన్న అంటూ ఆమె మూడుసార్లు అరవడం మాత్రమే నేను విన్నా. కానీ, నాకు మా నాన్న కనిపించలేదు’’ అని అన్సీ చెప్పారు.

ఆ తర్వాత దుఃఖంతో ఆమె గొంతు పెగల్లేదు.

‘‘చెట్టును పట్టుకొని భుజంపై నా చెల్లిని మోసుకుంటూ రెండున్నర గంటల పాటు వరదలోనే నిల్చున్నా. నా భుజంపై ఉన్న మా చెల్లి నుంచి ఎలాంటి స్పందన లేదు. దూరం నుంచి నిస్సహాయంగా మా అమ్మ ఏడుస్తూ నిల్చున్నారు. ఇళ్ల మీద ఉన్నవారు చీరల్ని తాడులా కట్టి కిందికి వదిలారు. వాటిని నేను పట్టుకున్నా.

తాళ్ల సహాయంతో మా ఇద్దరినీ వారు నీటిలో నుంచి పైకి లాగారు. అప్పటికి కూడా మా చెల్లి చనిపోయినట్లు మాకు తెలియదు. ఎవర్నీ సంప్రదించలేకపోయాం. అత్యవసర సేవల నంబర్లు కూడా పని చేయలేదు. పోలీసు, అంబులెన్స్ వంటి సహాయం మాకు అందలేదు.

మూడు గంటల తర్వాత ఒక పడవ వచ్చింది. పడవ సహాయంతో మెయిన్ రోడ్డుకు వెళ్లాం. అక్కడొక పాల వ్యాన్‌ను ఆపి అందులో మా చెల్లిని తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాం. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధరించారు. అప్పటికి ఆమె నీటిలో పడి నాలుగు గంటలు గడిచాయి’’ అని కన్నీరు పెడుతూ అన్సీ వెల్లడించారు.

తమిళనాడు
ఫొటో క్యాప్షన్, కుటుంబంలోని ఇద్దరు మరణించడంతో అన్సీ, ఆమె తల్లి కుంగిపోయారు

రెండు రోజుల తర్వాత తండ్రి మృతదేహం లభ్యం

వరదలో కొట్టుకుపోయిన రెండు రోజుల తర్వాత సమీప ప్రాంతంలో తన తండ్రి మృతదేహాన్ని గుర్తించినట్లు అన్సీ చెప్పారు.

వరద నీటి కారణంగా మృతదేహాన్ని వెలికి తీయడంలో ఆలస్యం జరిగిందని ఆమె అన్నారు.

తర్వాత అమలన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

‘‘మా నాన్న మృతదేహం అక్కడ ఉందని తెలిసిన తర్వాత రెండు రోజుల వరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు. ఏమీ చేయలేని స్థితిలో మిగిలిపోయాం. తర్వాత, ఇక్కడి వాళ్లే మా నాన్న మృతదేహాన్ని బయటకు తీశారు. ఎఫ్‌ఐఆర్ నమోదులో కూడా ఆలస్యం జరిగింది.

నాలుగు రోజులు గడిచినా మా నాన్న, చెల్లి మృతదేహాలను మాకు అప్పగించలేదు. ఒకేరోజు ఇద్దర్ని పొగొట్టుకొని మేం కుంగిపోయాం. వీలైనంత త్వరగా వారి శవాలను మాకు ఇవ్వండి’’ అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.

ముత్తమ్మల్ కాలనీలో బీబీసీ బృందం పర్యటించినప్పుడు అక్కడ చాలా ప్రాంతాలు ఇంకా నడుము లోతు నీటిలో మునిగిపోయి ఉన్నాయి.

తమిళనాడు

సాధారణ స్థితి ఇప్పట్లో కష్టమే

తిరునల్వేలి, తూత్తుకుడి చుట్టుపక్కల చాలా గ్రామాలు నీళ్లలో మునిగాయి. అక్కడి వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను పంపిణి చేశారు.

జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ కన్సల్టెంట్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర కమిటీ డిసెంబరు 20 బుధవారం వరద బాధిత ప్రాంతాలను, అక్కడ జరిగిన నష్టాన్ని పరిశీలించింది.

నిరంతర వర్షాల కారణంగా ట్యుటికోరిన్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

తిరునల్వేలీ నగరానికి రైలు సర్వీసులు, ట్యుటికోరిన్ ప్రాంతానికి విమాన సేవల పునరుద్ధరణ జరిగినప్పటికీ, ఆ ప్రాంతాలు సాధారణ స్థితికి రావడానికి ఇంకా చాలా రోజుల సమయం పట్టొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)