సలార్ రివ్యూ: ప్రభాస్ క‌టౌట్‌కి తగిన హిట్ కథ దొరికిందా?

ప్రభాస్

ఫొటో సోర్స్, Instagram/prabhas

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

చేతిలో ఆయుధం ఉంటే స‌రిపోదు. దాన్ని ఎక్కడ, ఎలా వాడాలో తెలియాలి. ప్రభాస్ కూడా ఓ వెప‌న్‌ లాంటి హీరో.

త‌న ప‌దును తెలియాలంటే బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాలు కావాలి. ప్రభాస్ మాత్రమే మోయ‌గ‌లిగే పాత్రలు ద‌క్కాలి.

బాహుబలి తర్వాత ప్రభాస్ క‌టౌట్‌కి త‌గిన క‌థ దొర‌క‌డం లేద‌ని ఆయన అభిమానులు బాధ ప‌డిపోతున్నారు. ప్రశాంత్ నీల్‌కు ప్రభాస్ లాంటి హీరో దొరికితే అద్భుత సినిమా తెరకెక్కుతుందని అభిమానులు ఆశించారు.

ఇన్ని అంచ‌నాల మ‌ధ్య స‌లార్‌ వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ప్రభాస్ క‌టౌట్‌కి త‌గిన క‌థ దొరికిందా? ఈసారైనా ప్రభాస్ అభిమానులు సంతృప్తిగా థియేటర్ల నుంచి బయటకు వస్తారా?

సలార్

ఫొటో సోర్స్, Twitter/HombaleFilms

ఒకే ఒక్కడు... దేవా

ఆద్య (శ్రుతిహాస‌న్‌) విదేశాల నుంచి ఇండియా వ‌స్తుంది. ఆమె ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన వెంటనే ఓ ముఠా ఆమెను వెంబ‌డిస్తుంది. ఎవ‌రూ ఆమెను ర‌క్షించ‌లేర‌నుకున్న ద‌శ‌లో దేవా (ప్రభాస్) తెర‌పైకి వ‌స్తాడు.

ఆద్యని కాపాడే శ‌క్తి సామ‌ర్థ్యాలు దేవాకు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ దేవా ఎక్కడో అస్సాంలోని టిన్ సుకియా అనే ఓ మారుమూల గ్రామంలో త‌ల్లి (ఈశ్వరీ రావు)తో కలిసి జీవిస్తుంటాడు.

అత‌నో నివురు గ‌ప్పిన నిప్పు. త‌న ముందు ఎంత అన్యాయం జ‌రుగుతున్నా త‌ల్లికి ఇచ్చిన మాట కోసం ఆవేశాన్ని త‌న‌లోనే అణుచుకుంటాడు.

మ‌రి అలాంటి దేవా, ఆద్యని ర‌క్షించ‌గ‌లిగాడా? అస‌లు ఆద్యకు వ‌చ్చిన ముప్పేమిటి? దేవాకు ఖాన్సార్ అనే ప్రపంచంలోని వ‌ర‌ద (పృథ్వీరాజ్ సుకుమారన్‌)కు ఉన్న స్నేహం ఏమిటి? అది శ‌త్రుత్వంగా ఎలా మారింది? ఈ ప్రశ్నలకు స‌మాధాన‌మే `స‌లార్‌`.

సలార్

ఫొటో సోర్స్, Twitter/HombaleFilms

చిన్నారి స్నేహ‌మా..

ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. అత‌ను మంచి నెరేట‌ర్‌. కేజీఎఫ్‌లో అత‌ని మేకింగ్ స్టైల్ అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేసింది.

స‌లార్ క‌థ‌ని మొద‌లుపెట్టిన తీరు, విశ్రాంతి కార్డు దగ్గర ఇచ్చిన హైప్, ప‌తాక స‌న్నివేశాల్లో క‌థ‌ని మ‌లుపు తిప్పిన విధానం ఇవ‌న్నీ ప్రశాంత్ నీల్ స్టైల్‌ని ఆవిష్కరించాయి.

దేవా, వ‌ర‌ద‌ల స్నేహాన్ని ఎలివేట్ చేస్తూ కథను ప్రారంభించిన ప్రశాంత్, ఓ భారీకాయుడిని నూనూగు మీసాలు కూడా స‌రిగా మొల‌వ‌ని ఓ కుర్రాడు ప‌డ‌గొట్టడం అనే ఎపిసోడ్‌తో క‌థ‌లోకి లాక్కెళ్లాడు. ఆ సీన్ చూస్తున్నప్పుడు ఓ వ‌స్తాదును చిన్న పిల్లాడు ఎలా ఓడించాడ‌న్న ఆలోచ‌న రాదు.

సలార్

ఫొటో సోర్స్, Twitter/HombaleFilms

అక్కడే ప్రశాంత్ ఫుల్ మార్కులు కొట్టేస్తాడు. దేవా కోసం వ‌ర‌ద చేసిన త్యాగం, వారిద్దరూ విడిపోవ‌డం ఇదంతా తొలి ప‌ది నిమిషాల్లోనే చ‌క చ‌క సాగిపోతాయి.

దేవా, వ‌ర‌ద మ‌ళ్లీ ఎప్పుడు క‌లుస్తారు? క‌లిస్తే ఏమ‌వుతుంది? అనే ప్రశ్నలతో ఈ కథ‌కు స‌రైన టేకాఫ్ ఇవ్వగలిగాడు. ఆద్యకు ప్రమాదం పొంచి ఉండ‌టం, ఆ క‌థ‌ని దేవాతో ముడిపెట్టడం కూడా మంచి క‌మ‌ర్షియ‌ల్ బిగినింగే!

ఈ క‌థ‌ని న‌డిపించ‌డంలో రాజ‌మౌళి టెక్నిక్‌ని ప్రశాంత్ ఫాలో అయ్యాడ‌నిపిస్తుంటుంది. దేవా పాత్రని ప్రారంభంలో నివురు గ‌ప్పిన నిప్పులా ఉంచాడు.

ఆ పాత్ర అగ్నిపర్వతంలా బద్దలయ్యే స‌న్నివేశం కోసం ప్రేక్షకుల్ని ఎదురు చూసేలా చేశాడు. ఇంటర్వెల్ సీన్‌లో ఇచ్చిన ఎలివేష‌న్లలో ప్రశాంత్ నీల్ మార్క్ స్పష్టంగా క‌నిపిస్తుంది. అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారు.

సలార్

ఫొటో సోర్స్, Twitter/HombaleFilms

ఖాన్సార్ ప్రపంచం ఎలా ఉంది?

ద్వితీయార్థంలో ప్రేక్షకుల్ని ఖాన్సార్ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. అక్కడి మ‌నుషులు, వాళ్ల రాజ్యాంగం, క‌ట్టుబాట్లు, కుర్చీలాట ముఖ్యంగా సీజ్‌ ఫైర్ కాన్సెప్ట్ గంద‌ర‌గోళం క్రియేట్ చేస్తాయి.

ఇక్కడే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ప్రభావం నుంచి బ‌య‌ట‌కు రాలేద‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది. ద్వితీయార్థంలో ప్రతీ స‌న్నివేశం సుదీర్ఘంగా న‌డుస్తుంటుంది.

ఇక్కడ కూడా సినిమాని నిల‌బెట్టిందంటే అది హీరోయిజ‌మే. దేవాకి ఇచ్చే ఎలివేష‌న్లు, త‌న‌పై డిజైన్ చేసిన యాక్షన్ దృశ్యాలూ మాస్ ఫీస్ట్‌లా ఉంటాయి. యాక్షన్‌కు ముందు ఎమోష‌న్ పండించిన విధానం కూడా ప్రేక్షకులకు న‌చ్చుతుంది.

క్లైమాక్స్ జాంబీ కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. అక్కడ ర‌క్తపాతం శ్రుతిమించింది. అయితే దేవా, వ‌ర‌ద‌ ఇద్దరూ స‌ర‌దాగా మాట్లాడుకుంటూ శ‌త్రు సంహారం చేయ‌డం రిలీఫ్ ఇస్తుంది. చివ‌ర్లో ఇచ్చిన ట్విస్ట్ పార్ట్ 2కి గ‌ట్టి పునాది. ఈ క‌థ‌లో అదో కొత్త మ‌లుపు.

ఖాన్సర్

ఫొటో సోర్స్, Twitter/HombaleFilms

ఈ ప్రశ్నలకు స‌మాధానం ఏది?

ప్రశాంత్ నీల్ క‌థ‌ల్లో లెక్కలేనన్ని పాత్రలు కనిపిస్తాయి. ఈ సినిమాలోనూ అంతే. ఏ పాత్ర ఏమిటి? అనేది రిజిస్టర్ అవ్వడానిక కాస్త టైమ్ పడుతుంది.

స‌లార్ ప్రారంభంలోనే చాలా ప్రశ్నలు వస్తాయి. ఆద్య ఎవ‌రు? ఆమెకున్న ముప్పేమిటి? ఆద్య తండ్రి ఏం చేశాడు? ఆ సీజ్ సింబల్ వెనుక క‌థేమిటి? ఓబుల‌మ్మ (ఝాన్సీ) క‌థేమిటి? అస‌లు దేవా, వ‌ర‌ద ఇద్దరూ ఎందుకు విడిపోయారు?

ఇవన్నీ సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే బుర్రను తొలుస్తుంటాయి. వీటికి క‌నీసం క్లైమాక్స్‌లో అయినా స‌మాధానం చెప్పాల్సింది. లేదు స‌రి క‌దా, క్లైమాక్స్ లో ఇంకొన్ని కొత్త డౌట్లు వ‌స్తాయి. పార్ట్ 2 కోసం అవ‌న్నీ దాచేశాడు ద‌ర్శకుడు.

సలార్

ఫొటో సోర్స్, Twitter/HombaleFilms

హీమాన్‌ ప్రభాస్

హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసే ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ను అభిమానుల‌కు న‌చ్చేట్టు చూపించాడు.

అయితే తొలి సగంలో అండ‌ర్ ప్లే చేయ‌డం, ఒక‌ట్రెండు ఎపిసోడ్లలో తప్పా ప్రభాస్‌లోని మాస్‌ని వాడుకోక‌పోవ‌డం లోటే. శ్రుతిహాస‌న్‌ది రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర కాదు.

కానీ క‌థ‌లో ఆమె చాలా కీల‌కం. ద్వితీయార్థంలో ఆమె పాత్రకు మ‌రింత స్కోప్ ఉండే అవ‌కాశం ఉంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌ట‌న బాగుంది. జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వరీరావు ఆకట్టుకుంటారు.

అమ్మ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రశాంత్ నీల్ ఈసారి ఈశ్వరీ రావు రూపంలో మ‌రో శ‌క్తిమంత‌మైన స్త్రీ పాత్రను సృష్టించాడు. ఝాన్సీని ఈ త‌ర‌హాలో చూడ‌టం కొత్తగా ఉంటుంది.

సలార్

ఫొటో సోర్స్, Twitter/HombaleFilms

క‌ల‌ర్ మారింది

స‌లార్ విజువ‌ల్స్ కొత్తగా అనిపించాయి. క‌ల‌ర్ గ్రేడింగ్‌, విజువ‌లైజేష‌న్ ఇవ‌న్నీ స‌లార్‌ని ప్రత్యేకంగా నిల‌బెట్టాయి. ఏ షాట్ చూసినా వంద‌ల‌మంది క‌నిపిస్తూనే ఉంటారు.

వాళ్ల వేషభాషలు కూడా విభిన్నంగా ఉంటాయి. పాట‌ల‌కు స్కోప్ లేదు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డానికే పాటల్ని వాడుకున్నారు. కొన్ని సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. ఇంకొన్ని డైలాగులు అర్థం కావు.

తొలి సగంలో ఫ్యాన్స్ కి ఏం కావాలో అది ఇచ్చేశాడు దర్శకుడు. అయితే, ద్వితీయార్థంలో ఖాన్సార్ ప్రపంచం అందరికీ అర్థమయ్యేది కాదు. దాన్ని ఫాలో అవ్వడం కూడా కష్టమే.

రెండో భాగంలో ఈ లోటు పాట్లని దర్శకుడు స‌రిదిద్దుకోవాలి. ఇప్పటికైతే బాక్సాఫీసు ద‌గ్గర పాస్ మార్కులు మాత్రమే ద‌క్కించుకుంటుంది. మ‌రి ఈ లోపాల్ని పార్ట్ 2లో భ‌ర్తీ చేస్తారేమో చూడాలి.

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)

వీడియో క్యాప్షన్, సలార్ రివ్యూ చూశారా? ప్రభాస్ అభిమానులను ప్రశాంత్ నీల్ మెప్పించాడా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)