‘15 నెలల నా పాప కోసం పాలు కొని రెండు నెలలైంది.. ఆకలితో ఏడుస్తుంటే ‘స్లీప్ మెడిసిన్’ ఇచ్చి పడుకోబెడతాను’

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, BBC/AAMIR PEERZADA

ఫొటో క్యాప్షన్, కేవలం టీతోనే రోజూ సోహైలా తన కుమార్తె కడుపును నింపుతున్నారు
    • రచయిత, యోగితా లిమాయే
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘చివరిసారి నా పాప కోసం పాలు కొన్నది రెండు నెలల కిందట. సాధారణంగా పాల డబ్బాలో నేను టీని నింపుతున్నాను. లేదా టీలో రొట్టెను ముంచి తనకు తినిపిస్తున్నాను’’ అని సోహైలా నియాజీ చెప్పారు. తూర్పు కాబూల్‌లోని ఒక కొండ ప్రాంతంలో తన మట్టి ఇంటిలో నేలపై కూర్చొని ఆమె మాతో మాట్లాడారు.

ఆమె ఇంటికి చేరుకోవడానికి ఎలాంటి రోడ్డూ లేదు. సన్నని మట్టి మార్గంపై నడుస్తూ అక్కడికి చేరుకోవాలి. ఆ మార్గానికి రెండు వైపులా మురుగు నీరు ప్రవహిస్తోంది.

సోహైలా ఒక వితంతువు. ఆమెకు ఆరుగురు పిల్లలున్నారు. వీరిలో చిన్న పాప పేరు హుస్నా ఫకీరి. ఆమె వయసు 15 నెలలు. సోహైలా చెబుతున్న ‘టీ’ని అఫ్గానిస్తాన్‌లో చాలా మంది తాగుతారు. పచ్చటి ఆకులను, వేడి నీటిలో కలిపి దీన్ని తయారుచేస్తారు. పాలు లేదా పంచదార దీనిలో ఉండవు. దీని ద్వారా ఆ పాపకు ఎలాంటి పోషకాలూ అందవు.

యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (యూఎఫ్‌పీ) అత్యవసర ఆహార సాయాన్ని అందుకునే దాదాపు కోటి మంది ప్రజల్లో సోహైలా కూడా ఒకరు. అయితే, నిధుల్లో కోత వల్ల ఏడాది నుంచి ఆమెకు సాయం అందడం లేదు.

అఫ్గానిస్తాన్‌లో మహిళల నేతృత్వంలో నడిచే కుటుంబాలకు ఇది దెబ్బ మీద దెబ్బ లాంటి పరిణామం.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, BBC/AAMIR PEERZADA

తాలిబాన్ల పాలనలో తను బయటకు వెళ్లి పనిచేసి, తన కుటుంబం కడుపు నింపడం సాధ్యపడటంలేదని ఆమె అన్నారు.

‘‘కొన్ని రాత్రులు మేం అసలు ఏమీ తినకుండానే పడుకోవాల్సి వస్తోంది. ఇంత రాత్రిపూట అడుక్కోవడానికి ఎక్కడికి వెళ్లమంటారు? అని పిల్లలనే పశ్నించాల్సి వస్తోంది. దీంతో వారు ఆకలితోనే పడుకుంటున్నారు. నేను మాత్రం వారు నిద్రలేవగానే ఏం చేయాలని ఆలోచిస్తుంటాను. ఇరుగుపొరుగువారు ఎవరైనా కొంచెం ఆహారం తీసుకొస్తే.. ‘నాకు ఇవ్వు.. నాకు ఇవ్వు’ అని పిల్లలు కొట్టుకుంటారు. అందుకే గొడవలు జరగకుండా నేను దాన్ని భాగాలు విభజిస్తాను’’ అని ఆమె చెప్పారు.

తన పాప ఆకలితో ఏడిస్తే, ‘స్లీప్ మెడిసిన్’ ఇచ్చి పడుకోపెడతానని సోహైలా చెప్పారు.

‘‘దాన్ని ఇస్తే, మధ్యలో తను లేవదు. పాలు కూడా అడగదు. ఆమె అడిగినా ఇవ్వడానికి మా దగ్గర పాలు లేవు. ఒకసారి ఆ మందు ఇస్తే, మళ్లీ మరుసటి రోజు ఉదయమే తను లేస్తుంది. ఒక్కోసారి మధ్యమధ్యలో తను బతికుందో లేదో నేనే చూస్తుంటాను’’ అని సోహైలా చెప్పారు.

తన కుమార్తెకు సొహైలా ఇస్తున్న ఆ మందు ఏమిటో తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం. దీంతో యాంటీ-అలర్జీ డ్రగ్‌ను ఆమె ఇస్తున్నట్లు తేలింది. ఇక్కడ నిద్ర అనేది ఆ డ్రగ్ సైడ్‌ఎఫెక్ట్ మాత్రమే.

యాంటీ-డిప్రెసెంట్లు, ట్రాంక్విలైజర్ల కంటే ఇది కాస్త తక్కువ ప్రమాదకరమైనది. నిజానికి అఫ్గాన్‌లో చాలా మంది ఆకలితో ఏడ్చే చిన్నారులకు యాంటీ-డిప్రెసెంట్లు, ట్రాంక్విలైజర్లు కూడా ఇస్తుంటారు. వీటి డోస్ పెరిగితే శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతుంది.

2022లో పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న కాల్పుల్లో సాధారణ పౌరుడైన తన భర్త మరణించారని సోహైలా చెప్పారు. ఆయన మరణం తర్వాత, డబ్ల్యూఎఫ్‌పీ ఇచ్చే పిండి, నూనె, బీన్స్‌పైనే ఆమె ఎక్కువగా ఆధారపడేవారు.

అయితే, ఇప్పుడు కేవలం 30 లక్షల మందికి మాత్రమే తాము ఆహార పదార్థాలను అందించగలమని డబ్ల్యూఎఫ్‌పీ చెబుతోంది. అంటే ఆకలితో బాధపడుతున్న మొత్తం అఫ్గాన్ ప్రజల్లో ఇది నాలుగో వంతు మాత్రమే.

ప్రస్తుతం బంధువులు లేదా ఇరుగుపొరుగువారు ఇచ్చే సాయంపైనే సోహైలా ఆధారపడి జీవిస్తున్నారు.

మేం అక్కడున్న సమయంలో పాప హుస్నా చురుగ్గా కనిపించలేదు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, BBC/AAMIR PEERZADA

ఫొటో క్యాప్షన్, తల్లి తండ్రులు మరణించిన మహ్మమద్‌ను నాన్నమ్మే చూసుకుంటున్నారు

ఆ పాప పోషకాహార లోపంతో బాధపడుతోంది. ఇలా అఫ్గాన్‌లో 30 లక్షల మంది చిన్నారులు జీవిస్తున్నట్లు యూనిసెఫ్ సమాచారం చెబుతోంది. వీరిలో నాలుగో వంతు కంటే ఎక్కువమంది తీవ్రమైన అక్యూట్ మాల్‌న్యూట్రిషన్‌తో జీవిస్తున్నారు. అఫ్గాన్‌లో పరిస్థితి ఇంత స్థాయికి ముందెన్నడూ దిగజారలేదని ఐరాస చెబుతోంది.

ఒక పక్క పోషకాహార లోపం చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తుంటే, మరోవైపు ఆరోగ్య సదుపాయాలను దెబ్బతినకుండా కాపాడిన విదేశీ సాయం కూడా ప్రస్తుతం నిలిచిపోయింది.

ఇక్కడ 30 వరకూ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ (ఐసీఆర్‌సీ) ఆరోగ్య సిబ్బందికి జీతాలు ఇచ్చేది, మందులు, ఆహార పదార్థాలను సమకూర్చేది. అయితే, 2021లో తాలిబాన్లు అధికారంలోకి రావడంతో ఆ వెసులుబాటు కూడా నిలిచిపోయింది.

ప్రస్తుతం ఐసీఆర్‌సీని నిధుల కొరత వేధిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో సాయాన్ని నిలిపివేశారు. వీటిలో అఫ్గానిస్తాన్‌లోని ఏకైక పిల్లల ఆసుపత్రి ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో కూడా ఉంది.

‘‘ప్రస్తుతం డాక్టర్లు, నర్సులకు జీతాలను ప్రభుత్వం ఇస్తోంది. అందరికీ జీతాల్లో కోతలు పెట్టారు. సగం జీతం మాత్రమే ఇస్తున్నారు’’ అని తాలిబాన్ నియమించిన ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా.మహమ్మద్ ఇక్బాల్ సాదిక్ చెప్పారు.

ప్రస్తుతం అవుట్ పేషెంట్ విభాగాన్ని ఆసుపత్రి మూసివేసింది. కేవలం ఆసుపత్రిలో చేర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చే చిన్నారులకు మాత్రమే ఇక్కడ సేవలు అందిస్తున్నారు.

ఇక్కడ పోషకాహార లోపం వార్డు నిండిపోయింది. ఒక్కో పరుపుపై ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తున్నారు.

ఒక బెడ్డు మూల సుమాయా కూర్చొని కనిపించింది. 14 నెలల వయసున్నప్పటికీ తన బరువు అప్పుడే పుట్టిన పాపంతే ఉంది. ఆమె మొహంలో వృద్ధుల తరహాలో మడతలు కనిపిస్తున్నాయి.

ఆమె పక్కనే మహమ్మద్ షఫీ ఉన్నాడు. 18 నెలల వయసులో ఉండాల్సిన బరువులో సగం మాత్రమే తను ఉన్నాడు. అతడి తండ్రి ఒక తాలిబాన్ ఫైటర్. అయితే, రోడ్డు ప్రమాదంలో అతడు మరణించారు. షఫీ తల్లి కూడా అనారోగ్యంతో మరణించారు.

తన పక్క నుంచి మేం వెళ్లేటప్పుడు అతడి నాన్నమ్మ హయత్ బీబీ మావైపు దీనంగా చూశారు. తన ఆవేదనను మాతో పంచుకోవాలని ఆమె ఎదురుచూస్తున్నారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, BBC/AAMIR PEERZADA

ఫొటో క్యాప్షన్, వీధుల్లో పళ్లు, కూరగాయలు అమ్మేందుకు అనుమతించకపోతే పిల్లలకు ఎలా భోజనం పెట్టాలని ఈ వితంతువు ప్రశ్నిస్తున్నారు

తన మనమడిని హాస్పిటల్‌కు తీసుకురావడానికి తాలిబాన్లు సాయం చేశారని ఆమె చెప్పారు. ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడతామో తెలియడం లేదని ఆమె అన్నారు.

‘‘నేను దేవుడి దయపైనే ఆధారపడుతున్నాను. వెళ్లడానికి చోటంటూ లేదు. సర్వం కోల్పోయాను’’ అని హయత్ బీబీ ఏడుస్తూ చెప్పారు. ‘‘నా ఆరోగ్యం కూడా బాలేదు. తల విపరీతమైన నొప్పి వస్తోంది. ఒక్కోసారి తల పేలిపోతుందేమో అనిపిస్తుంది’’ అని ఆమె అన్నారు.

మరింత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని అంతర్జాతీయ సంస్థలను కోరేందుకు ఏం చేస్తున్నారని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ను మేం ప్రశ్నించాం.

‘‘మాకు విరాళాలు అందించే దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం సరిగా లేవు. మొదట కోవిడ్-19, ఆ తర్వాత యుక్రెయిన్ సంక్షోభంతో పరిస్థితులు దిగజారాయి. కాబట్టి వారి నుంచి మనం సాయాన్ని ఆశించలేం. మనం మాట్లాడినంత మాత్రాన వారు సాయం పంపిస్తారని అనుకోకూడదు’’ అని ఆయన అన్నారు.

‘‘మన కాళ్లపై మనమే నిలబడాలి. ప్రస్తుతం మా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా స్థిరపడుతోంది. కొత్తగా మైనింగ్ కాంట్రాక్టులు ఇస్తున్నాం. దీంతో వేల కొద్దీ ఉద్యోగాలు వస్తాయి. అయితే, ప్రస్తుతం సాయం వద్దని నేను అనడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.

ఈ సమస్యకు తాలిబాన్లు కూడా ఒక కారణమని ఆయన అంగీకరించారా? ఎందుకంటే మహిళలపై తాలిబాన్లు ఆంక్షలు విధించడంతో చాలా దేశాలు సాయాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

‘‘సాయాన్ని మాపై ఒత్తిడి చేయడానికి ఒక అస్త్రంగా ఉపయోగిస్తే, ఇస్లామిక్ ఎమిరేట్‌ కూడా అదే మార్గంలో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే విలువలు కాపాడుకొనేందుకు అఫ్గాన్ ప్రజలు ఇదివరకు చాలా త్యాగాలు చేశారు. కావాలంటే విదేశీ విరాళాల కోతలను కూడా వారు తట్టుకుంటారు’’ అని ముజాహిద్ అన్నారు.

అయితే, ఆయన మాటలు చాలా మంది అఫ్గాన్ ప్రజలను ఓదార్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే దేశంలో మూడింట రెండొంతుల మంది ప్రజలు తమ తర్వాత భోజనం ఎక్కడి నుంచి వస్తోందో అని ఎదురుచూస్తున్నారు.

కాబూల్‌లోని ఒక వీధిలో కాస్త తడిగా కనిపిస్తున్న ఒకే గది ఇంట్లో ఒక మహిళను మేం కలిశాం. పళ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలు వీధుల్లో అమ్మకుండా తాలిబాన్లు ఆమెను అడ్డుకుంటున్నారు. తనను కూడా ఒకసారి అదుపులోకి తీసుకున్నారని ఆమె చెప్పారు. యుద్ధం సమయంలో తన భర్త చనిపోయారు. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. ఆమె తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.

తన పరిస్థితి గురించి చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘కనీసం మమ్మల్ని పనిచేసుకోవడానికి వారు అనుమతించాలి. నేను దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను.. అసలు చెడు పనులు చేయను. నా పిల్లలు కడుపు నింపేందుకు నేను పనిచేయాలి అనుకుంటున్నాను. కానీ, మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు’’ అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, ఓ వైపు ఎముకలు కొరికే చలి... మరోవైపు ఆకలితో మలమల మాడే కడుపులు

పూట గడవడం కష్టం కావడంతో తన 12 ఏళ్ల కొడుకుని ఆమె బడి మాన్పించారు.

‘‘నేను సంపాదించకపోతే, పిల్లలకు ఎలా భోజనం పెట్టగలనని ఒక తాలిబాన్ సోదరుడిని అడిగాను. విషం పెట్టు, కానీ, ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన అన్నారు. రెండుసార్లు తాలిబాన్ ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చింది. కానీ, అది దేనికీ సరిపోలేదు’’ అని ఆమె చెప్పారు.

తాలిబాన్లు ఇక్కడ అధికారంలోకి వచ్చే ముందు, నాలుగింట మూడొంతుల ప్రజా ధనం నేరుగా విదేశీ విరాళాల రూపంలో వచ్చేది. అయితే, 2021 ఆగస్టులో ఇది స్తంభించిపోయింది.

ఆ తర్వాత కొంతవరకూ అంతర్జాతీయ సహాయక సంస్థలు సాయం చేసేందుకు ముందు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ సాయం కూడా నిలిచిపోయింది.

ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. గత ఏడాది నుంచీ మళ్లీమళ్లీ ఇవే పరిస్థితులు ఇక్కడ పునరావృతం అవుతున్నాయి.

ఎండు రొట్టెలు, నీరు తాగి చాలా మంది జీవిస్తున్నారు. కొంతమంది ఈ శీతాకాలం దాటుకుని బతికుతారో లేదో కూడా తెలియడం లేదు.

(అదనపు రిపోర్టింగ్: ఇమోజెన్ ఆండెర్సన్, ఫోటోస్: ఆమిర్ పీర్‌జాదా )

వీడియో క్యాప్షన్, పాడైపోయిన రొట్టె ముక్కలు తిని బతుకుతున్న అఫ్గాన్ ప్రజలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)