అయోధ్య-ప్రాణప్రతిష్ఠ: ఈ నగరం ఇప్పుడెలా మారిపోయింది, స్థానికులు ఏమంటున్నారు?

జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మూలమూర్తిని ప్రతిష్ఠించే గర్భాలయంలో పనులు చకాచకా సాగుతున్నాయి.
ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని భావిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించే పనిలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బిజీగా ఉంది. ఓపక్క ఆలయలో పనులను, మరోపక్క ఆహ్వానాల విషయంలో ఈ కమిటీ బిజీగా కనిపిస్తోంది.
ఆలయంలో అర్చకుల ఎంపిక ప్రక్రియ కూడా మరోపక్క సాగుతోంది. మొదటి దశలో మొత్తం 300 దరఖాస్తులు రాగా వీటి నుంచి 21మందితో తుది జాబితా రూపొందించారు. వీరికి శిక్షణ కూడా మొదలుపెట్టారు. వీరి నుంచి అయోధ్య రామ మంది అర్చకుడిని ఎంపిక చేస్తారు.
‘‘శిక్షణ పూర్తయ్యాక, సనాతనధర్మం, వేదాలు, శాస్త్రాలపై వారి జ్ఞానాన్ని పరీక్షిస్తారు. కొంతమందికి మాత్రమే ఇక్కడ అవకాశం పొందుతారు. మిగిలినవారిని దేశంలోని ఇతర ఆలయాలకు పంపుతాం’’ అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బీబీసీకి చెప్పారు.
జనవరిలో జరిగే అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనోత్సవాని ఇద్దరు కాశీపండితులు నిర్వహిస్తారని ఇప్పటికే కమిటీ ప్రకటించింది.
‘‘అయోధ్యలో పూజాకార్యక్రమాలు చేసే బ్రాహ్మణులకు కూడా లక్ష్మికాంత్ దీక్షిత్, గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ గురించి తెలుసు. వీరంతా ఈ ఇద్దరిని తమ గురువులుగా భావిస్తుంటారు. కాశీ ఎప్పటి నుంచో పండితులకు ప్రసిద్ధి పొందింది. అదే సమయంలో ఈ విషయంలో అయోధ్య నిర్లక్ష్యానికి గురైంది’’ అని చంపత్ రాయ్ చెప్పారు.
‘‘అయోధ్యలో కూడా కాశీతరహాలో ఒకరిద్దరు పండితులు ఉండి ఉండవచ్చు. మేం దానిని ఖండించడంలేదు. కానీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, లక్ష్మికాంత్ దీక్షిత్‌తో చేయించాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.
‘‘వేలాది ఆలయాలు ఉన్న అయోధ్య నుంచి కాకుండా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాశీపండితులను ఎంపిక చేయడమేమిటి’’ అని కొంతమంది స్థానిక మహంతులు, పూజారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

1949లో రామవిగ్రహ ప్రతిష్ఠ
వివాదాస్పదస్థలంలో 1949లో బాబా అభిరామ్ దాస్ రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈయన అయోధ్యలోని హనుమాన్ ఘర్‌కు ప్రధాన మహంత్ అయిన మహంత్ ధర్మదాస్ కు గురువు. ధర్మదాస్ మాట్లాడుతూ ‘‘అర్చకులు వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తున్నారంటే వారు ఎలా చేస్తారో చూస్తాం. ఇందులో స్థానికులను భాగస్వామ్యులను చేసి ఉండాల్సింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.
‘‘ఇప్పుడు వాళ్లు ఆ పనిచేయడంలేదు. కాశీనుంచి వచ్చినవారు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. నిజానికి అక్కడ పెద్ద పనేమీ ఉండదు. అభిరామ్ దాస్ విగ్రహాన్ని ఎప్పుడో ప్రతిష్ఠించారు. సుప్రీం కోర్టు కూడా ఈ విగ్రహాన్నే కొనసాగించాలని చెప్పింది. కాబట్టి అక్కడ ప్రాణప్రతిష్ఠకు సంబంధించి పెద్ద పనేమీ ఉండదు. అయినా పర్వాలేదు. అంతా మంచిదే. మంచిగా జరగాలని కోరుకుందాం’’ అని చెప్పారు.
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత రామాలయ నిర్మాణం 2020లో మొదలైంది. 67 ఎకరాల ప్రాంగణాన్ని శుభ్రం చేశాకా, ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు.
కోట్లాదిరూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రామాలయ గర్భగుడి తుది దశకు చేరుకుంది. గడిచిన కొన్నినెలలుగా లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. వీరంతా స్వామికి నగదేకాకుండా వెండి,బంగారు కానుకలు సమర్పించుకుంటున్నారు. వీటిని లెక్కించడానికి ప్రత్యేకంగా బ్యాంకు సిబ్బందిని ఆలయ ప్రాంగణంలోనే నియమించారు.

అభివృద్ధి పేరుతో ఏం జరుగుతోంది?
రామమందిర నిర్మాణంతో అయోధ్యలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. సరయునది ఒడ్డున స్నానఘట్టాలను పునర్‌నిర్మిస్తున్నారు. కొత్త రహదారులు, మురుగునీటిపారుదల వ్యవస్థను నిర్మిస్తున్నారు. కొత్త విమానాశ్రయంలోనూ పనులు సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణానికి సమీపంలో 2500 ఇళ్ళను కూల్చివేశారు. వీరందరికీ పరిహారం చెల్లించారు.
కొత్తగా నిర్మిస్తున్న రామమందిర ఆలయ గేటు ఎదురుగా ఉన్న ఓ టీ స్నాక్స్ దుకాణం కూడా విస్తరణ పనులలో భాగంగా పోయింది. ప్రస్తుతం ఈ దుకాణదారుడు 39 ఏళ్ళ దుర్గాప్రసాద్ టీ, పకోడి బండి నిర్వహిస్తున్నాడు.
‘‘గతానికి, ఇప్పటికీ తేడా ఏమిటంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్డుపక్కన ఫుట్‌పాత్స్ కడుతున్నారు. రానున్న రోజులలో భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది. దీంతోపాటు అనేక సమస్యలు కూడా ఉన్నాయి. విస్తరణలో నా దుకాణం పోయింది. ప్రస్తుతం ఈ బండి ద్వారా నా జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. నా కుటుంబ అవసరాలు ఈ బండి ద్వారా తీర్చలేకపోతున్నాను’’ అని చెప్పారు.
అయోధ్యలో రూ. 30వేలకోట్లతో అభివృద్ధి పనులు మొదలుపెట్టినట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా భరిస్తాయని ఆయన చెప్పారు.
అయోధ్యనగరంలో ఇప్పుడు మిలామిలా మెరిసే హోటళ్ళు, రహదారులు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పటి నుంచో పురాతన అయోధ్యలో నివసిస్తున్నవారు మాత్రం ఇంకేదో కావాలని ఆశపడుతున్నారు.
అయోధ్యలో రామ్ ఘాట్ వద్ద 150 ఏళ్ళ పురాతన ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న ఆశీష్ కృష్ణ శాస్త్రి మాట్లాడుతూ‘‘హోటళ్ళ నిర్మాణాన్ని ఆపమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వారు బిల్డింగులు కడుతున్నారు. రహదారులు వేస్తున్నారు. ఇదంతా మంచిదే. కానీ అయోధ్యలోని పాత ఆలయాలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మేం ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెపుతాం’’ అని చెప్పారు.
అయోధ్య నిండా ఉన్న పురాతన ఆలయాలు, ధర్మశాలలను రామమందిర నిర్మాణం తనలో కలిపేసుకుంది.
సీతాకుండ్ సమీపంలోని రామ్ బిహారి గుడిలో గంటన్నరసేపు కీర్తనలు పాడి వచ్చిన పూజారి గోస్వామిజీని ‘‘ మీరుండే చోటుకు కూడా భక్తుల రాక పెరిగిందా’’? అని అడిగాం.
‘‘ఇది మీరు మొదటిసారి అడుగుతున్నారు. మమ్మల్నెవరూ ఇప్పటిదాకి దీని గురించి అడగలేదు. ఏం జరుగుతోంది. ఏదో మార్పు వచ్చింది. అయితే.. ఇంతకుముందుకు సాధువులకు పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆపేశారు. దరఖాస్తు చేసుకుంటే సాధువులుకు పెన్షన్ లేదని చెపుతున్నారు.. మరి వృద్ధులకు చేస్తున్న సాయం ఏమిటి’’? అని గోస్వామి అన్నారు.

రాముడి దర్శనానికి భారీగా భక్తులు
రామమందిర నిర్మాణం మొదలై, తాత్కాలిక ప్రదేశంలో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి భక్తులరాక పెరిగింది. నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించడానికి దిల్లీ నుంచి వచ్చిన నిర్మలకుమారితో బీబీసీ మాట్లాడింది.
‘‘చాలా ఆనందంగా ఉంది. మనసంతా నిండిపోయినట్టు ఉంది. నేను పిల్లలతో రాలేకపోయినందుకు బాధగా ఉంది. కానీ వారికి వీడియోకాల్స్ ద్వారా ఇక్కడి విశేషాలన్నింటినీ చూపించాం. మేమిక్కడ మట్టిని కూడా మాతోపాటు ఇంటికి తీసుకువెళుతున్నాం’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, PTI
ప్రధాని రాకపై చర్చ
మరోపక్క లౌకికదేశంలో ఓ ప్రధాని రామమందిర ప్రాణప్రతిష్ఠలాంటి కార్యక్రమానికి వెళ్ళొచ్చా అనే చర్చ కూడా సాగుతోంది. అనేక ప్రతిపక్షాలు ప్రధాని రాకను 2024 సార్వత్రిక ఎన్నికలకు ముడిపెడుతున్నాయి.
‘‘రాముడి పేరుతో భారతీయ జనతాపార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది’’ అని సమాజ్ వాది పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జైశంకర్ పాండే చెప్పారు.
‘‘ఈరోజు కాకపోతే రేపైనా ప్రజలు దీనిని అర్థం చేసుకుంటారు. సనాతన ధర్మం అందరికీ చెందుతుంది. మర్యాద పురుషోత్తముడైన రాముడు అందరివాడు. మహాత్మాగాంధీ కూడా రామరాజ్యాన్ని కలగన్నారు. కానీ రామాలయ నిర్మాణాన్ని తానే పూర్తిచేసినట్టుగా బీజేపీ చెప్పాలనుకుంటోంది. లక్షలాదిమంది హిందూ భక్తులు రాజకీయాలకు అతీతంగా ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు’’ అని పాండే తెలిపారు.
అయితే బ్రిటీషర్లనుంచి భారతదేశం 1947లో స్వాతంత్ర్యం సాధించుకున్నాక ఒకే అంశంపై ప్రధాని నెహ్రూకు, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు భిన్నాభిప్రాయాలు ఉండేవి.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో గుజరాత్‌లో సోమనాథ్ ఆలయ పునర్‌నిర్మాణం ప్రారంభమై, పూర్తయింది. అయితే అప్పటికే పటేల్ చనిపోయారు. అయితే నెహ్రూ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయోధ్య నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా ఈ ఆరోపణలను ఖండిస్తూ ‘‘ ప్రధాని ఎందుకు వస్తున్నారనేది ప్రశ్నే కాదు. అయోధ్యను ప్రపంచస్థాయి నగరంగా మార్చడం వలన పూర్వాంచల్ మొత్తం అభివృద్ధి అవుతుంది’’ అని తెలిపారు.
‘‘ప్రతి ఒక్కరు కాశీలో ఇప్పటికే ఈ మోడల్ డెవలప్‌మెంట్‌ను చూశారు. కాశీలోని వ్యాపారులందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడి నగరవీధులు ఎంతో శుభ్రంగా ఉన్నాయి. ప్రధానిగానీ, ముఖ్యమంత్రిగానీ రావడం వలన తమకు కలిగే ప్రయోజనాలేమిటో స్థానికులకు తెలుసు. ప్రతి విషయాన్ని తప్పుదోవపట్టించడమే ప్రతిపక్షాల పని. మంచి వాటిని కూడా చెడ్డవిగా చూపించే పనిచేస్తాయి’’ అని అన్నారు.
అయోధ్య వేగంగా మారుతోంది. పెట్టుబడులు వస్తున్నాయి. భక్తుల రాక పెరిగింది. కొత్త రామాలయాన్ని పూర్తిగా నిర్మించడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ మార్పు ఇక్కడి ప్రజలలో ఎలాంటి మార్పును తీసుకువచ్చిందో రికార్డు చేయడానికి చరిత్రకు కూడా సమయం పడుతుంది.

సుప్రీం తీర్పు: మసీదుకు 5 ఎకరాలస్థలం
ఆగస్టు 5, 2020న భారత ప్రధాని నరేంద్రమోదీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
1992లో బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. అలహాబాద్ హైకోర్టులోనూ, ఆ తరువాత సుప్రీం కోర్టులోనూ హిందూ,ముస్లింల మధ్య సుదీర్ఘమైన న్యాయపోరాటం జరిగింది. అంతిమంగా 2019 నవంబరులో సుప్రీం కోర్టు అయోధ్యలోని వివాదాస్పదస్థలంలో రామమందిరాన్ని నిర్మించుకోవచ్చవంటూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
అలాగే కొత్తగా మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అయోధ్య రామమందిరానికి 22 కిలోమీటర్ల దూరంలో మసీదు నిర్మాణానికి నిధుల విడుదల మొదలైంది. త్వరలోనే దీని నిర్మాణం ప్రారంభం కానుంది.

ఫొటో సోర్స్, AFP/MONEY SHARMA
రామమందిర నిర్మాణం పూర్తి ఇలా
రామమందిరం నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ఇంకా చేయాల్సిన పనులు ఏంటి? అనే వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఒక యానిమేషన్ వీడియో చూపిస్తోంది.
ఆ వీడియో ప్రకారం చూస్తే,
2021 జనవరిలో మందిర నిర్మాణం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు
2021 మార్చిలో తవ్వకం పనులు పూర్తయ్యాయి
2021 ఏప్రిల్‌లో ఫౌండేషన్ ఫిల్లింగ్ వర్క్ మొదలైంది
2021 సెప్టెంబర్‌లో ఫిల్లింగ్ వర్క్ ముగిసింది
2021 సెప్టెంబర్‌లో టవర్ క్రేన్ ఏర్పాటు చేశారు.
సెప్టెంబర్‌లోనే రాఫ్ట్ వర్క్ మొదలు పెట్టారు
నవంబర్‌లో రాఫ్ట్ వర్క్ పూర్తయింది
2021 నవంబర్‌లో శంకుస్థాపన పనులు ప్రారంభం అయ్యాయి
మార్చిలో శంకుస్థాపన పనులు ముగిశాయి
2022 జనవరిలో ఆలయ స్తంభాలను ఏర్పాటు చేసే పనులు మొదలుపెట్టారు
తర్వాత బీమ్‌ల కోసం రాళ్లు వేయడం మొదలుపెట్టారు
తర్వాత స్లాబ్ స్టోన్
మందిరం పైకప్పు, గోపురం పనులు 2023 ఆగస్టులో పూర్తయ్యాయి.
మందిరం ఎత్తును 141 అడుగుల నుంచి 161 అడుగులకు పెంచినట్లు అర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా తెలిపారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
అదనంగా మరో మూడు గోపురాలను జోడించారు. స్తంభాల సంఖ్యను 160 నుంచి 366కి పెంచారు.
జనవరి 22, 2024 ప్రాణప్రతిష్ఠ జరగనుంది.
ఇవి కూడా చదవండి :
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’
- Lizards: బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- కామారెడ్డి: ‘అప్పు కట్టాలన్నందుకే ఒకే కుటుంబంలో ఆరుగురిని చంపేశాడు. ఎవరి హత్యకు ఎలా పథకం వేశాడంటే..’
- బిగ్ బాస్ 7: పోటీదారులకు లక్షల మంది అభిమానులు ఎలా పుట్టుకొస్తున్నారు? రోడ్లపై ఈ విధ్వంసానికి కారణం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














